డా. బీరవోలు సురేంద్ర రెడ్డిగారు రచించిన “వికాస దిశలో చిట్యాల గ్రామం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం 24-10-2021 భాగ్యనగర్, హిమాయత్ లోని కేశవ మెమోరియల్ హైస్కూల్‌లో జరిగింది. ఈ పుస్తకావిష్కరణ సభకు ఆర్.ఎస్.ఎస్ తెలంగాణా ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు సభాధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా అఖిలభారత గ్రామ వికాస ప్రముఖ్ మననీయ డా. దినేష్ జీ, ముఖ్య వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ శ్రీ ఎక్కా చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. గ్రామభారతి గౌరవాధ్యక్షులు శ్రీ పాలది మోహనయ్యగారు, డా. రంగాచారి గారు (రాష్ట్ర ఆరోగ్యభారతి ఉపాధ్యక్షులు RSS ). శ్రీ రాజారెడ్డి గారు (గ్రామభారతి అధ్యక్షులు) పాల్గొన్నారు. శ్రీ జిన్నా సత్యనారాయణ గారు (ప్రాంత గ్రామ వికాస్ ప్రముఖ్) సభా నిర్వహణ చేశారు. ప్రాంత సేవా ప్రముఖ్ శ్రీ ఉసలమర్తి వాసు గారు పుస్తకపరిచయం చేశారు. డా. దినేష్ జీ చేతులమీదుగా పుస్తకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా డా. బీరవోలు సురేంద్ర రెడ్డిగారిని వేదిక పైన ఉన్న వారందరూ కలసి సన్మానించారు. శ్రీ ఆకుతోట రామారావు గారు రచించిన సన్మాన పత్రాన్ని వారికి బహూకరించారు.
ఈ సందర్భంగా గోసేవా ప్రముఖ్ శ్రీ ఆకుతోట రామారావు గారు మట్లాడుతూ సేవ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ సురేంద్ర రెడ్డి గారు, చిట్యాల గ్రామ వికాసం లో డా. సురేంద్ర రెడ్డిగారు ఎదుర్కొన్న సవాళ్ళను, ఆ సవాళ్ళను అధిగమించి వారు చిట్యాల గ్రామ వికాస దిశలో ముందుకు సాగిన క్రమాన్ని వివరించారు. అనంతరం శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు మాట్లాడుతూ మాటలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు చేసి చూపించేవారు కొందరే ఉంటారని. అలా తన జీవితమంతా చేసి చూపించడంలో శ్రీ సురేంద్ర రెడ్డి గడిపారు అని, వారి జీవితం సంఘ కార్యకర్తలందరికీ ఆదర్శమని, తమ ఆదర్శవంతమైన జీవితం ద్వారా ఎంత మార్పు తీసుకురావచ్చో ఆ పుస్తకంలో వారు వివరించారని అన్నారు. శ్రీ పొలాది మోహనయ్యగారు మాట్లాడుతూ వ్యక్తులకు చికిత్సచేయడం కాదు సమాజానికి చికిత్సచేయాలనే ఉద్దేశంతో డా. సురేంద్ర రెడ్డిగారు సేవాధర్మాన్ని స్వీకరించి చిట్యాల గ్రామాన్ని తీర్చి దిద్దారు అన్నారు. శరీరమాద్యం కలు ధర్మ సాధనం కాబట్టి సంఘంలో ఒక ఆరోగ్య ప్రముఖ్ ను కూడా ఏర్పాటు చేయాలని, గ్రామ వికాసం జరగాలంటే ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామంలో ఉన్న సంఘకార్యకర్తలకు ఇవ్వాలని డా. రంగాచారి గారు చెప్పారు. చిట్యాల గ్రామంలో డా. సురేంద్రరెడ్డిగారు చేసిన సేవలను చిట్యాల గ్రామస్థులు ఈ సందర్భంగా సభాముఖంగా గుర్తు చేసుకున్నారు.
డా. దినేష్ జీ మాట్లాడుతూ సురేంద్ర రెడ్డిగారిని ఆదర్శంగా తీసుకుని సంఘ కార్యకర్తలందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. 40 సంవత్సరాల క్రితం మనం మన గ్రామాలలోని చెరువులు, బావులు, కుంటలలో నీరు స్వచ్ఛంగా ఉండేవి వాటినే త్రాగు నీరు గా ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు నీళ్ళు కొనుక్కుని త్రాగుతున్నాం. మరలా అలాంటి పరిస్థితులు వచ్చి నప్పుడే మనగ్రామాలు బాగుపడినట్లు అన్నారు.
శ్రీ ఎక్కా చంద్రశేఖర్ జీ మాట్లాడుతూ తనకు డా. సురేంద్ర రెడ్డిగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. గ్రామవికాసమే కాకుండా అనేక విషయాలు సురేంద్రరెడ్డిగారి జీవితం నుండి ఆయన జీవిత సారంశమైన ఈ పుస్తకం ద్వారా నేర్చుకోవచ్చన్నారు. మన దేశంలోని 6 లక్షల గ్రామాలు బాగుపడితే దేశం బాగుపడుతుంది అని చెప్పారు. దేశభక్తి తో గ్రామాలలో పనిచేస్తే గ్రామం పని చేస్తుంది. గ్రామాలలోని సంస్కృతిని కాపాడితే గ్రామాలు బాగుపడుతాయని చెప్పారు.
డా. పురుషోత్తం గారు మాట్లాడుతూ సురేంద్ర రెడ్డిగారు వారి జీవితాన్ని వెచ్చించి మా జీవితాలను నిర్మాణం చేశారు. వారి ప్రేరణతోనే 80 మంది డాక్టర్లం కలిసి యజ్ఞ అనే సంస్థను స్థాపించి గ్రామాలలో వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. విజయ్ గణేష్ గారు వందన సమర్పణ చేశారు. అనంతరం డా. సురేంద్రరెడ్డి గారు మాట్లాడుతూ తనను సన్మానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డా. సురేంద్రరెడ్డి గారు మాట్లాడుతూ అందరి పట్ల ప్రేమను చూపిస్తే అందరూ మనపై ప్రేమను చూపిస్తారు అని చెప్పారు. తనను సన్మానించినందుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.