కోయంబత్తూరు ప్రాంతంలో తిరుప్పూర్ అనే గ్రామం ఉంది. నిజానికి అదొక గ్రామ సముదాయం. పక్కన ఉన్న కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలంతా కొనుగోలు చేసే మంగళసూత్రం అక్కడ ఒక్కచోటే తయారవుతుంది. కేవలం కుటీర పరిశ్రమ అల్లిక పరిశ్రమకు ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. ఇదంతా కూడా కలసికట్టుగా, తామంతా ఒక్కటే అన్న భావన కారణంగా జరిగిన వ్యాపార వృద్ధి.
సామాజిక నిధి అనే మరొక పద్ధతి కూడా భారతదేశంలో చాలా చోట్ల కనిపిస్తుంది. దీని నుంచి అవసరమైన వారికి డబ్బులు ఇచ్చి వ్యాపారం కోసం సహకరిస్తారు. ఆఖరికి 2001లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన అభివృద్ధి నివేదికలో ఈ సామాజిక నిధి గురించి ప్రస్తావించింది. భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా సాగడానికి కారణం కూడా ఇదేనని ఆ నివేదిక వెల్లడించింది. తిరుప్పూర్ అభివృద్ధికి కీలకం ఇదే. 1985 వరకు దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ ప్రాంతం నుంచి జరిగిన ఎగుమతుల విలువ రూ. 15 కోట్లు. ఇవాళ అక్కడ నుంచి జరుగుతున్న ఎగుమతుల విలువ రూ. 35,000 కోట్లు. అల్లిక పరిశ్రమకు సంబంధించి భారత రాజధాని ఏదీ అంటే తిరుప్పూరు పేరే చెప్పాలి. చాలా సాధారణమైన మనుషులు ఈ వ్యాపారం సాగిస్తున్నారు. దేశం నుంచి ఎగుమతి అవుతున్న అల్లిక బట్టలలో 45 శాతం ఇక్కడి నుంచే వెళుతున్నాయి. స్విట్జర్లాండ్, ఇటలీలకు కూడా అల్లిక దుస్తుల ఎగుమతిలో, జౌళి ఉత్పత్తులలో పేరుంది. కానీ తిరుప్పూరు దుస్తులు చవక.
ఇదెలా సాధ్యమైందో తెలుసుకోవడానికి ఒక దశాబ్దం క్రితం ఇద్దరు అమెరికా ప్రొఫెసర్లు వచ్చారు. వారికి ఒక వింత వాస్తవం తెలిసింది. అక్కడ పెట్టుబడి అంతా నమ్మకంతోను, చుట్టరికాలతోను వస్తోంది. ఒక వ్యక్తి తాను అల్లిక దుస్తుల వ్యాపారం ప్రారంభించడానికి తన బంధువు లేదా తెలిసిన వ్యక్తి దగ్గర అప్పు తెస్తాడు. బ్యాంకుకు వెళ్లడం వల్ల బాగా ఆలస్యమవుతుంది. మొదటిసారి ఇచ్చిన రుణానికి ఆ బంధువు లేదా తెలిసిన వ్యక్తి వడ్డీ తీసుకోడు. దీనితో వస్తువులు తక్కువ ధరతో ఉత్పత్తి అవుతాయి. ఈ విధానం వల్ల సామాజిక బంధం బలపడుతుంది. తరువాత ఎప్పుడు ఇతరులకు అవసరం పడ్డా రుణాలు తీసుకున్నవారు ఇచ్చినవారిని ఆదుకోవాలి. భారతీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండడానికి కారణం కూడా ఇలాంటి సామాజిక, సాంస్కృతిక బంధమే. ఏడు దశాబ్దాల క్రితం భారత్ ఎంతో పేద దేశం. ఇప్పుడు ఎంతో పురోగమించింది. దీనికి ఇక్కడి ఆర్థిక చరిత్ర, సామాజిక విశ్వాసాలే కారణం.
దేశం ఆర్థికంగా పురోగమించాలంటే దేశీయమైన ఆలోచనలు, పంథాలు నాశనం కావాలని చాలామంది పాశ్చాత్య మేధావులు చెప్పారు. అది మనం కూడా నమ్మాం. కానీ అది ఎంతో కాలం సాగలేదు. 1950లో ఐక్య రాజ్య సమితి కూడా ఒక తీర్మానం చేసింది. ఒక దేశం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే, సొంత సంస్కృతిని ధ్వంసం చేయాలి అన్నదే ఆ తీర్మానం సారాంశం. కానీ 2008 ప్రపంచ మాంద్యం వాళ్ల కళ్లు తెరిపించింది. మొత్తం ప్రపంచం ఆలోచనను కూడా మార్చింది. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి తన పూర్వ వైఖరికి పూర్తి విరుద్ధమైన ప్రకటన ఇచ్చింది. దేశీయమైన సంస్కృతి, జీవనం ఆర్థిక వ్యవస్థల పురోభివృద్ధికి దోహదపడతాయని చెప్పింది. ఇదెలాగో, దాని క్రమం ఏమిటో కూడా తెలుసుకోవాలి. ఆర్థిక వ్యవస్థను పాలన గాడిలో పెడుతుంది. సేద్యం అందులో ప్రధానమైనది. ఆర్థిక వ్యవస్థకు మూలం అక్కడి సమాజాలు. పాలకులనీ, పాలితులనీ, సేద్యాన్నీ ప్రభావితం చేసేది సంస్కృతి. అందుకే అర్థశాస్త్రాన్ని జీవన విధానంలో భాగంగానే చూడాలి తప్ప, వేరొక పాయగా భావించరాదు.
‘శాస్త్ర’ విశ్వవిద్యాలయం ఆచార్యులు కనగ సభాపతి హైదరాబాద్‌లో ఇచ్చిన ప్రసంగం నుంచి..