Home Interviews సామాజిక సమానత్వం ఒక నిశ్చయం

సామాజిక సమానత్వం ఒక నిశ్చయం

0
SHARE

‘ఒకే దేవాలయం, ఒకే స్మశానం, ఒకే నీటి వసతి’ ద్వారా సామాజిక సమానత్వం, సమరసతలను సాధించడానికి ఒక చక్కని కార్యాచరణను ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘచాలక్‌ శ్రీ మోహన్‌ భాగవత్‌ మన ముందుంచారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం లేనివాళ్ళు కూడా ఈ చొరవను మెచ్చుకుంటున్నారు. ఈ సామాజిక సంస్కరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ తృతీయ సర్‌సంఘచాలక్‌ శ్రీ బాలాసాహెబ్‌జీ బీజం వేస్తే, ఇప్పుడు శ్రీ మోహన్‌ భాగవత్‌ దానిని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. సామాజిక సమరసత గురించి, బాలాసాహెబ్‌ దేవరస్‌ ఆలోచన గురించి మోహన భాగవత్‌ తన అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారుః

1925లో ప్రారంభమైన నాటి నుండి సామాజిక సమరసత ఆర్‌ఎస్‌ఎస్‌ మౌలిక స్వభావమైంది. ఆ తరువాత బాలాసాహెబ్‌ దేవరస్‌ దానికి మరింత ప్రాధాన్యత నిచ్చారు. ఈ విషయంలో వారి ఆలోచన గురించి మీరేమంటారు?

సమరసత సాధించనిదే హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం సాధ్యం కాదు. అందువల్ల వివక్షలేని విధానం, ఆచరణ తప్పనిసరి. ఇవి ఆర్‌ఎస్‌ఎస్‌కు మొదట నుండీ తెలుసు. సమరసతతో కూడిన వ్యవహారం ఆర్‌ఎస్‌ఎస్‌లో మొదటి నుంచీ ఉంది. బాలాసాహెబ్‌జీ సర్‌సంఘచాలక్‌ అయిన సమయానికి సమాజంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల గౌరవం, శ్రద్ధ కొంత పెరిగాయి. సంఘని అనుసరించడానికి, సంఘ చెపుతున్న విషయాలను ఆచరించేందుకు సమాజం కాస్త ముందుకు వచ్చింది. సంఘలోని మానవీయ విలువలు సమాజానికి చాలా అవసరమయ్యాయి. అందుకనే సర్‌సంఘచాలక్‌ బాధ్యత చేపట్టిన వెంటనే బాలాసాహెబ్‌జీ ‘సామాజిక చొరవ’ను సంఘ ప్రధాన కార్యాచరణ అంశంగా ప్రకటించారు. ఈ విషయంపట్ల ఇటు స్వయంసేవకులు, అటు మిగిలిన సమాజానికి అవగాహన కల్పించడం కోసం ఆయన వసంతవ్యాఖ్యానమాల ఉపన్యాసం(8 మే, 1974 పూనా) ఇచ్చారు. ఆ ఉపన్యాసాన్ని నెలల తరబడి జాగ్రత్తగా ఆలోచించి తయారు చేసుకున్నారు. అప్పటికే సంఘలో ఆచరణలో ఉన్న సమరసత సాధన వెనుక ఉన్న ఆలోచనను స్వయంసేవకులతోపాటు మొత్తం సమాజం ముందు ఆయన ఉంచారు.

సమరసత సాధన అవసరాన్ని నొక్కిచెప్పడం వల్ల సమాజంపై ఎలాంటి ప్రభావం పడింది?

హిందుత్వం పట్ల సంఘకు ఉన్న విశ్వాసం అందరికీ తెలిసినదే. ‘హిందుత్వం’తో ముడిపడిన కుల వ్యవస్థపట్ల సంఘ ఆలోచన ఏమిటనే ప్రశ్న వస్తుంది. సంఘ కులవ్యవస్థను సమర్థించాలని లేదా కుల ఆధారిత వివక్షకు మద్దతునివ్వాలని భావించే కొందరు సమాజంలో ఉన్నారు. సంఘ అలాంటి మద్దతునిస్తుందని భావించి, ప్రచారం చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఈ అభిప్రాయాల ఆధారంగా సంఘపై అనుచితమైన విమర్శలు చేస్తున్నవారు మరికొందరు. కానీ ‘అంటరానితనాన్ని సమూలంగా పెకిలించి వేయాల్సిందే’నని బాలాసాహెబ్‌జీ అన్నప్పుడు ఈ ప్రచారాలు, అభిప్రాయాలకు తెరపడింది. దీనితో తాము అనుకుంటున్నది సమాజం ముందు ఉంచే ధైర్యం కూడా స్వయంసేవకులకు వచ్చింది. అప్పటివరకు స్వయంసేవకులు సమరసతను పాటిస్తున్నప్పటికీ వారికి దాని వెనుక ఉన్న సైద్ధాంతిక భూమిక పూర్తిగా తెలియదు. బాలాసాహెబ్‌జీ ఉపన్యాసంతో ఆ లోటు కూడా తీరిపోయింది. అంతేకాదు తాము చేస్తున్న పని పట్ల, సమాజంలో ఆ పనికి ఉన్న స్థానంపట్ల విశ్వాసం, ధైర్యం వారికి కలిగాయి. చాలామందికి సంఘపట్ల ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. సమాజంలో వివక్ష పట్ల కచ్చితమైన ధోరణిని అవలంబించలేని స్థితిలో చాలామంది ఉన్నప్పుడు స్వయంసేవకులు బాధితులకు అండగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

వసంతవ్యాఖ్యానమాలలో బాలాసాహెబ్‌జీ ఉపన్యాసం తరువాత సంఘకార్యంలో కొత్త మార్పులు ఏమి వచ్చాయి?

సామాజిక వివక్షకు గురైన సమూహాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటన్న విషయంపై మథనం మొదలైంది. వాళ్ళు మిగతా సమాజం గురించి ఏమనుకుంటున్నారు? వారికి, మిగతా సమాజానికి మధ్య ఏర్పడిన పెద్ద అగాధాన్ని పూడ్చడం ఎలా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఈ సందర్భంలోనే సామాజిక సమరసత మంచ్‌ ప్రారంభమైంది. వివిధ సామాజిక సమూహాలతో సత్సంబందాలు ఏర్పరచుకునేందుకు, వారిని శాఖ కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయడానికి విశేష ప్రయత్నం మొదలైంది. ముఖ్యంగా వివక్షకు గురై తమను తాము హిందువులమని చెప్పుకునేందుకు కూడా సంకోచిస్తున్న వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీనివల్ల సమాజంలో గౌరవాదరాల కోసం ఎదురుచూస్తున్న వివిధ సమూహాలకు ఒక పెద్ద హిందూ సంస్థ బలం తోడైంది.

సామాజిక వివక్షను రూపుమాపడానికి మీరు సూచించే పరిష్కారాలు ఏమిటి?

మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తి, సామాజిక జీవనంలో అన్ని రకాలైన వివక్షను మొట్టమొదట తిరస్కరించాలి. ఇది నిరంతర ప్రక్రియ. దీనికోసం మనం మన అలవాట్లను మార్చుకోవలసి రావచ్చును. ఉదాహరణకు అనేక సామెతలు ఉపయోగిస్తుంటాం. అందులో కొన్ని సమూహాలు, వర్గాల్ని కించపరచే, అవమానించేవి కూడా ఉంటాయి. ఇలాంటి సామెతల్ని బుద్ధిపూర్వకంగా వదిలిపెట్టాలి. సమాజ ఐక్యత అవసరాన్ని గుర్తించినా, కొన్నిసార్లు మన అలవాట్లు అందుకు భిన్నంగా ఉంటాయి. అలాంటి అలవాట్లను కూడా మార్చుకోవాలి. ఏ సమూహాలు, వర్గాల్ని సమాజంలో భాగం చేయడం ద్వారా వివక్షలేని వ్యవస్థను నిర్మాణం చేయాలనుకుంటున్నామో ఆ సమూహాలు, వర్గాలు నిజంగా మారామో లేదోనని మనల్ని పదేపదే పరీక్షించవచ్చును. సాధారణ, నిత్య వ్యవహారంలో కూడా వివక్షకు తావులేని మానవీయ విలువలు ప్రతిబింబించాలి. ఉదాహరణకు, నేనొక ఇంటికి వెళ్ళాననుకోండి. అడగకపోయినా ఆ ఇంట్లో వాళ్ళు నీళ్ళిచ్చారనుకోండి. దాహంగా లేదు కాబట్టి నేను నీళ్ళు తీసుకోడానికి నిరాకరించాననుకోండి. అప్పుడు కూడా అవతలివారికి నా ఉద్దేశ్యంపట్ల సందేహాలు కలిగే అవకాశం ఉంది. ఎలాంటి దురుద్దేశ్యం లేకపోయినా నేను కావాలనే అలా నీళ్ళు తీసుకోకుండా నిరాకరిస్తున్నానని పొరబడే అవకాశం ఉంది. శ్రీ గురూజీ ఇలాంటి సందర్భంలోనే ఎంత చక్కగా వ్యవహరించారో చూడండి. ఒకసారి ఒక స్వయంసేవక్‌ శ్రీ గురూజీని టీకి ఆహ్వానించాడు. అతను చాలా పేదకుటుంబానికి చెందినవాడు, చిన్న గుడిసెలో ఉండేవాడు. గురూజీ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆయనతోపాటు కొద్దిమంది కూడా ఉన్నారు. ఆ గుడిసె ఎంత చిన్నగా ఉందంటే స్వయంసేవక్‌ తల్లి టీ తయారుచేయడం కనిపిస్తోంది. గిన్నెలు శుభ్రంగా లేవు. టీ వడగట్టేందుకు ఉపయోగించిన బట్ట కూడా శుభ్రంగా లేదు. చివరికి టీ వచ్చేసరికి కొద్దిమంది తమకు టీ తాగే అలవాటే లేదన్నారు. మరికొందరు అప్పటికే చాలాచోట్ల టీ తాగి వచ్చామన్నారు. కానీ గురూజీ మాత్రం సంకోచించకుండా, సంతోషంగా టీ తాగారు. తిరిగి వెళుతున్నప్పుడు ఆయనతో ఉన్న స్వయంసేవకులు ‘మీరు ఆ టీ ఎలా తాగగలిగారు’ అని అడిగారు. ‘మీరు టీని, అది తయారు చేసిన పద్ధతినే చూశారు. నేను మాత్రం ఆ స్వయంసేవక్‌ ప్రేమ, ఆప్యాయతల్ని చూశాను, అందుకే అది సంతోషంగా తాగగలిగాను’ అని సమాధానం చెప్పారు. అటువంటి ధోరణి, వ్యవహారశైలి అవసరం. సమాజానికి గౌరవం, ప్రేమ కావాలి. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడేవిధంగా మన వ్యవహారశైలి ఉండాలి. మనకు అది అలవాటు కావాలి.

రెండవ విషయం, కులాంతర వివాహాలు మొదలైనవి సమాజంలో జరుగుతూ ఉంటాయి. అలాంటి సంస్కరణ పద్ధతులపట్ల సానుకూలమైన ధోరణితో వ్యవహరించాలని స్వయంసేవకులకు చెపుతాం. ఇవి సహజంగా జరుగుతాయి. అలాగే జరగాలి కూడా. ఒక సర్వే నిర్వహిస్తే కులాంతర వివాహాలు చేసుకునేది ఎక్కువగా స్వయంసేవకులేనని స్పష్టమవుతుంది కూడా. మహారాష్ట్రలో జరిగిన మొట్టమొదటి బహిరంగ కులాంతర వివాహ సందర్భంగా డా. అంబేడ్కర్‌, శ్రీ గురూజీలు విడివిడిగా సందేశాలు పంపారు. శారీరికమైన ఆకర్షణ కోసం కాకుండా, కులవ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసేందుకు వివాహం చేసుకుంటున్నవారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ శ్రీ గురూజీ తన సందేశంలో తెలిపారు. ఈ సందేశాన్ని స్వయంసేవకులందరికీ తెలియజేశారు కూడా. సంఘ స్వయంసేవకులు ఇతరుల అభిప్రాయానికి, అహంకారానికి ప్రభావితం కాకుండా ఇటువంటి స్వతంత్రమైన ధోరణిని అవలంబించగలగాలి. సమాజపు ఐక్యత, సమరసతలను దృష్టిలో పెట్టుకుని స్వయంసేవకులు అటువంటి నిర్భయపూర్వకమైన పాత్రను నిర్వహించాలి.

సమరసత సాధనలో వచ్చే ప్రధాన అడ్డంకులు ఏమిటి?

నేను ఇంతకుముందే చెప్పినట్లుగా మన అలవాట్లు, మన అభిప్రాయాలే ప్రధాన అడ్డంకులు. మనం రెండు వేల సంవత్సరాలుగా ధర్మం పేరుతో అధర్మపరమైన విషయాలను పాటిస్తూ వచ్చాం. పాతది అంతా మంచి అనే అభిప్రాయాన్ని మార్చుకోకపోతే పరిస్థితిని మార్చలేం. సత్యానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే బాలాసాహెబ్‌జీ చెప్పినట్లు ‘సమూలమైన మార్పు’ తీసుకురాగలుగుతాం.

సామాజిక వివక్ష అనగానే ప్రాచీన బ్రాహ్మణ వ్యవస్థ మూలంగా జరిగిన అన్యాయం గుర్తుకువస్తుంది. మన పూర్వీకులను అహంకారులు, స్వార్థపరులు అని ఎవరైనా అంటే వెంటనే వారిని సమర్థించడానికి సిద్ధమవుతాం. నిజానికి అలా అంటున్న వ్యక్తి వేలసంవత్సరాలుగా తాను గురవుతున్న అమానవీయమైన వివక్ష గురించి మాట్లాడుతున్నాడని గుర్తించం. నిజానికి అతని నిజమైన కోపాన్ని, ఆక్రోశాన్ని గుర్తించి, సమానత్వం కోసం అతని కోరికకు మద్దతు తెలుపాలి. మన పూర్వీకులు, సంప్రదాయాలు నిజంగా గొప్పవే అయితే వాటి గొప్పదనం ఏ కొద్దిమంది విమర్శలు, ఆరోపణలతో తగ్గిపోదు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే దానిని వ్యతిరేకించాలి. ఒకసారి ఒక కార్యక్రమంలో సంఘ కార్యకర్తను ఎవరో ఇలా ప్రశ్నించారు- ‘హిందువులకు శ్రీరాముడు ఆరాధ్యపురుషుడని నువ్వు నమ్ముతావా? అలా నమ్మితే ఆయన శంబూకుడిని వధించడం నీవు సమర్థిస్తావా?’ ఇలాంటి ప్రశ్న సాధారణ హిందువును గందరగోళానికి గురిచేస్తుంది. ఎందుకంటే రాముడిని సమర్థించాలంటే శంబూకవధను ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకవేళ శంబూకవధను వ్యతిరేకిస్తే రాముడిపట్ల అగౌరవం చూపినట్లవుతుంది. కానీ సంఘ స్వయంసేవక్‌ తెలివిగా, ధైర్యంగా సమాధానమిచ్చాడు. ‘నిన్ను ఇక్కడికి ఎవరు పంపారో నాకు తెలుసు. నువ్వు కూడా బాగా తయారై వచ్చినట్లున్నావు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమైంది. నీ ప్రశ్న ద్వారా నువ్వు మా చరిత్రలో రాముడు అనే వ్యక్తి ఉన్నాడని ఒప్పుకున్నావు. అది చాలు. ఇక శంబూకవధ విషయానికి వస్తే అసలు ఆ ఉదంతం జరిగిందా లేదా అన్నది ఇప్పటి వరకూ తేలలేదు. ఎందుకంటే ఉత్తర రామాయణంలోని ఈ అధ్యాయమంతా ప్రక్షిప్తం (కల్పితం) అనే అభిప్రాయం ఉంది. మేము పూజించే రాముడు అన్యాయపూరితుడైన రాక్షసరాజును సంహరించాడు. రాముడు శంబూకుడిని వధించాడన్న విషయం మాకు సమ్మతనీయం కాదు. ఒకవేళ ఎప్పుడైనా రాముడు శంబూకుడిని వధించాడని ఋజువైతే అప్పుడు మేం ఆ విషయాన్ని ఖండిస్తాం.’ ఇలాంటి స్పష్టమైన సమాధానం చెప్పగలగాలి. ఇందులో మన పూర్వీకులను అవమానించామని బాధపడాల్సిన పనిలేదు. ‘దురుద్దేశ్యంతో పూర్వీకుల్ని నిందించకు. వాళ్ళ చేసిన తప్పుల్ని మాత్రం గౌరవపూర్వకంగా తిరస్కరించు’ అని సావర్కర్‌ చెప్పారు. ఇది చెప్పడం చాలా సులభం కానీ ఆచరించడం కష్టం. ఎందుకంటే దీనివల్ల వ్యతిరేకత, నిరసన వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మనకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుందని తెలిసినా న్యాయానికి నిలబడాలి. కొన్నిసార్లు సామాజిక వ్యతిరేకత, ప్రతిక్రియను కూడా ఎదుర్కొవలసి వస్తుంది. అలాంటివాటిని ఎలా ఎదుర్కొవాలి, ఎలా నిలబడాలన్నది మనకు తెలియాలి. అందుకు తగిన ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేలసంవత్సరాల వివక్ష మూలంగా కోపం, ఆక్రోశం, కొన్నిసార్లు ద్వేషం కూడా కలగవచ్చును. అయినా స్నేహవారధులను నిర్మించడానికే ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. కోపం తగ్గిన వెంటనే ద్వేషభావం కూడా దూరమవుతుందనే విశ్వాసం ఉండాలి. అయితే వాతావరణాన్ని విషతుల్యం చేయడం ద్వారా స్వప్రయోజనాలు సాధించుకోవాలనుకునే శక్తులు కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కోవాలి. కనుక ప్రేమ, గౌరవాలతో మనం ప్రతి వర్గంలోనివారిని ఐక్యత సాధనకోసం సిద్ధం చేయాలి. ఇదే ప్రస్తుత అవసరం. ఇది ఒక నిరంతర ప్రక్రియ.

సమరసత సాధన ఒక నిరంత ప్రక్రియ అని మీరు చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలు ఈ ప్రక్రియలో ఎలాంటి పాత్ర పోషించాలని మీరు భావిస్తారు?

పండిత దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. గోతిలో ఉన్న వ్యక్తి బయటకు రావాలంటే లోపల ఉన్న వాడు కాళ్ళు, చేతులు పైకి ఎత్తితే సరిపోదు. బయట ఉన్నవాడు కూడా ముందుకు వంగాలి. ఇప్పుడు ఇదే జరగాలి. పైన ఉన్నవాళ్ళు కిందికి వంగడానికి సిద్ధపడాలి. ఇతరులకు సహాయం చేయడానికి మన చేతిని చాపాలి. రెండవది, మన ఆలోచన, మాట, వ్యవహారం శాంతియుతంగా, సంతులనంగా ఉండాలి. సమాజంలో అంటరానితనం, అన్యాయం స్పష్టంగా కనిపిస్తున్నాయని బాలాసాహెబ్‌జీ తన ఉపన్యాసంలో చెప్పారు. మనమంతా ఒకే సమాజం. కనుక అందులో సామరస్యాన్ని నెలకొల్పడం మనందరి కర్తవ్యం. అంటరానితనం పాటించేవారు, దానివల్ల బాధపడేవారు ఉన్నంతకాలం సామరస్యం సాధ్యంకాదు. అంతరాలు తగ్గాలన్నా, శాంతిసామరస్యాలు వెల్లివిరియాలన్నా రెండు వైపుల నుంచి దూషణలు, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే మాటలు కట్టిపెట్టాలి. వేలాది సంవత్సరాల కోపం బయటకు వస్తున్నందువల్ల తాము కూడా అదే రీతిలో ప్రతిస్పందించకూడదని ఒకవైపువారు గుర్తించాలి. అలాగే మరోవైపువారు సమాజంలో అంతరాలు, ఉద్రిక్తతలను తగ్గించడం కోసం తమ కోపాన్ని వ్యక్తీకరించే సమయంలో కాస్త భాషను సరిచూసుకోవాలి. అన్యాయంపట్ల మన అభిప్రాయాల్ని గౌరవపూర్వకంగా, శాంతియుతంగా వెల్లడించవచ్చును. భవిష్యత్తులో ఎలాంటి అన్యాయపూరితమైన చర్యలకు తావులేని వ్యవస్థను రూపొందించుకునే ప్రయత్నం సాగాలి. ఇదంతా సమాజాన్ని ఐక్యపరచే ఉద్దేశ్యంతో చేయాలి. మానవీయ విలువల్ని కాపాడుకునే ఏర్పాటు వ్యవస్థలోనే ఉండాలి. అందుకు కొత్త సలహాలను స్వీకరించగలగాలి. ప్రతి ఒక్కరినీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. ఇతరుల కోసం ఎదురుచూడకుండా ఎవరికి వారు ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటే అప్పుడు లక్ష్యాన్ని త్వరగా, సురక్షితంగా చేరుకోగలుగుతాం.

సామాజిక మార్పులో ఆర్‌ఎస్‌ఎస్‌ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?

చిత్తశుద్ధితో కూడిన చర్యల ద్వారా సమాజంలో అందరినీ కలపడమే సంఘ ప్రాధమిక ప్రణాళిక. బాహ్య వాతావరణం ఎలాగైనా ఉండనివ్వండి సమాజంలో అన్ని వర్గాలవారు స్నేహపూర్వకంగా మెలగాలి. సాధారణంగా ఒక సమూహానికి చెందినవారి మధ్య స్నేహం, సత్సంబంధాలు ఉంటాయి. అది సహజం. కానీ ఆన్ని సమూహాల మధ్య అలాంటి సంబంధాలు ఉండాలి. ఆ దిశగా సాగే ప్రయత్నాలను మన సమర్థించాలి, ప్రోత్సహించాలి. అదే మన పని. అన్యాయానికి గురైనవారికి సాధ్యమైనంత త్వరగా న్యాయం జరగాలి. సమానత్వ భావన అంతటా వ్యాపించాలి. అందుకోసమే ఈ విషయాలపై సర్వేలు, సద్భావన సమావేశాలు ఏర్పాటు చేయాలి. కొత్త కార్యక్రమాలను రూపొందించాలి.

ఇటీవల మీరు ‘ఒకే దేవాలయం, ఒకే స్మశానం, ఒకే నీటి వనరు’ అనే పిలుపునిచ్చారు. దీనికి వివిధ పంథాలు, మత పెద్దల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తోంది?

దాదాపుగా అంతా సానుకూలంగానే స్పందిస్తున్నారు. దీని వెనుక ఉద్దేశ్యాన్ని అంతా ఆమోదిస్తున్నారు. కానీ సంఘ అంటే ఏమిటో అర్థం కానివారు, సంఘాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు మాత్రం ఇప్పుడెందుకు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని విమర్శిస్తున్నారు. కాబట్టి ఈ పిలుపును పూర్తిగా వ్యతిరేకించకపోయినా, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది వట్టి నినాదమని అంటున్నారు. కానీ సమాజంలో చాలామంది సంతోషం వ్యక్తం చేసున్నారు. వివక్షకు గురైనవారు ఇది ఒక ఆశాకిరణంగా భావిస్తున్నారు. ఈ పిలుపు వెనుక ఒక సంఘటన ఉంది. ఒక ఏడాది విజయదశమికి ముందు నేను తెలంగాణాలోని పాలమూర్‌కు వెళ్ళాను. అక్కడ వెనుకబడినవిగా చెప్పే వర్గాలకు చెందిన వారు ఎక్కువ. అప్పుడు నేను సర్‌కార్యవాహ. సభాకార్యక్రమంలో నాతోపాటు వేదికపై ఒక వామపక్ష భావాలు కలిగిన ‘దళిత నాయకుడు’ కూడా ఉన్నాడు. నేను మొదట మాట్లాడాను. సామాజిక సమరసత గురించి మాట్లాడాను. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ సంఘ కులతత్వం నిండిన సంస్థ అనుకున్నానని కానీ ఇక్కడ తన కులానికి చెందినవాళ్ళు పూర్తిసమయ కార్యకర్తలుగా (ప్రచారక్‌లు) పనిచేయడం చూస్తున్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. సంఘ ప్రధాన కార్యదర్శి బహిరంగంగా ఇలాంటి అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తారనుకోలేదని, వీటికి ఆర్‌ఎస్‌ఎస్‌ కట్టుబడి ఉంటుందని ఆశిస్తానని అన్నాడు. ఆ తరువాత వ్యక్తిగత సంభాషణల్లో సంఘ సామాజిక సమరసతకు కట్టుబడి ఉందని, అదే సంస్థ ఉద్దేశ్యమని నేను ఆయనతోచెప్పాను. తరువాత అతను నాతోనూ, ఇతర సంఘ కార్యకర్తలతో చాలాసార్లు మాట్లాడారు. దేవాలయం, స్మశానం, నీరు పట్టుకునే చోటు అనేవి నిత్యజీవనానికి సంబంధించినవి. అందుకే వాటి గురించి మాట్లాడానని చెప్పాను. మీరు ఈ విషయాల్ని బహిరంగ సభలో చెపుతారా అని ప్రశ్నించాడు. అందుకు విజయదశమి ఉపన్యాసం వినమని చెప్పాను. నేను నిజంగా ఆ మాటలు చెపుతానో, లేదో చూడటానికి ఆయన నాగపూర్‌ విజయదశమి కార్యక్రమానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనే స్వయంగా తన కులస్థులకు సంఘ అభిప్రాయాన్ని, కార్యక్రమాన్ని గురించి చెపుతున్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌ను వ్యతిరేకించవద్దని సలహా ఇస్తున్నాడు. ఇలా రాజకీయ ప్రయోజనాల ఊబిలో కూరుకుపోని, దళితుల మంచిని కోరే నాయకులకు సంఘ ఉద్దేశ్యం అర్థమవుతోంది.

సమరసత కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో రాజకీయ అనుకూల వాతావరణం ఎంతవరకూ తోడ్పడుతుంది?

రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సమరసతను సాధించాలనుకుంటే ఈ అనుకూల వాతావరణం బాగా ఉపయోగపడుతుంది. సామాజిక సమానత్వంపట్ల నమ్మకం ఉన్న ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా షెడ్యూల్‌ కులాలు, జాతులకు సంబంధించి రాజ్యాంగపు, చట్టపరమైన నిబంధనల్ని కఠినంగా అమలుచేయడానికి ప్రయత్నిస్తుంది. కేటాయించాల్సిన నిధుల్ని సక్రమంగా, సమయానికి విడుదల చేసి, సరైన వారిని సరైన పనులకు నియమించగలిగితే ప్రభుత్వం చాలా సాధించినట్లే. దీనివల్ల 50శాతం పాలనాపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఈ వర్గాల రక్షణకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కానీ వాటిని మనం సక్రమంగా అమలు చేయాలి.

సామాజిక సమరసత, సామరస్యాల్ని నిర్మించడానికి మన ముందున్న ఆదర్శం, స్ఫూర్తి ఏమిటి?

మన సంస్కృతే మనకు నిజమైన స్ఫూర్తి. సత్యం, సంవేదన, స్వచ్ఛత, పవిత్రత అనేవి ధర్మానికి నాలుగు స్తంభాలు. సత్యం అంటే ఏమిటి? ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ ఉన్నాడని, ప్రతిఒక్కరూ పరమాత్మ స్వరూపులన్నది మనం విశ్వసించే సత్యం. ఎవరూ ఎక్కువకాదు, ఎవరూ తక్కువకాదు. అంతా మనవారే. ఈ ఆలోచన ఉంటే సహజంగానే సంవేదనశీలత, ఆదరభావం కలుగుతాయి. ధర్మమంటే సమాజాన్ని కట్టిఉంచే కొన్ని సూత్రాలు. వాటిలో ముఖ్యమైనవి ‘అంతా నా వాళ్ళు, అందరిలో నేను ఉన్నాను’ అనేవి. అలాంటి వ్యవస్థలో అసంతృప్తి, అసహనానికి ఎక్కడా అవకాశం లేదు. ఇలా స్వచ్ఛమైన మనస్సు కలిగినవాళ్ళు ఉంటే సమాజానికి మేలు జరుగుతుంది. అదే ధర్మపథం.

కనుక నాలుగు సూత్రాలతో కూడిన ధర్మం ఈ సమాజాన్ని ఒకటిగా ఉంచుతోంది. అదే మన సంస్కృతికి మూలం. భగద్గీత, భాగవత పురాణం, శివపురాణం, బుద్ధుని సందేశం కూడా ఇదే విషయాన్ని మనకు చెపుతాయి. భారతీయ సంప్రదాయాలన్నింటిలో పైపై తేడాలు కొన్ని కనిపించినా మూలతత్వం, మన వ్యవహారశైలిని తీర్చిదిద్దే అంశాలు మాత్రం ఒకటే. వాటిని అనేకమంది తమ జీవితాల్లో ఆచరించి చూపారు. ప్రాచీన ఋషులేకాదు ఆధునిక కాలపు సాధుసంతులు కూడా ఇవే విషయాలను మన ముందుంచారు. వరాహనగర్‌ మఠ్‌లో స్వామీ వివేకానంద కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ‘మానవసేవే మాధవ సేవ’ అనే సందేశాన్నిచ్చారు. అంటరానితనపు బాధను స్వయంగా అనుభవించేందుకు గడగే బాబా రోడ్డుపక్కన బావి దగ్గర నిలబడి నీళ్ళు పోయమని అడిగేవారు. రైతు చెపితే నీటిని స్వయంగా తీసుకువచ్చేవారు. కులం ఏమిటో చెప్పడానికి నిరాకరించి దెబ్బలు తినేవారు కూడా. డా. అంబేడ్కర్‌ స్వయంగా అనేకసార్లు ఇలా చేశారు. సామాజిక సామరస్యత కోసం అలాంటివారు చేసిన త్యాగాల్ని మనం అనుసరించాలి. ఇది నా సమాజం, నా జాతి అనే భావన ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. నా ప్రజలే హీన, దీన స్థితిలో పడి ఉండే ఇక నాకు పేరుప్రతిష్టలు ఎందుకు? ఇతర దేశాలకు వెళితే ఈ కులవివక్ష ఎవరికైనా అవమానకరమైన విషయమే అవుతుందికానీ గర్వంగా చెప్పుకోదగినది మాత్రం కాదు. సమాజం, జాతి, సంస్కృతులపట్ల నిష్టను పెంపొందించాలి.

భిన్నత్వమున్నా అంతర్గత ఏకత్వం హిందూ సమాజపు పెద్ద బలం. కానీ సమాజంలో చీలికలు తీసుకురావడానికి చాలామంది పోటీపడుతుండటానికి కారణం ఏమిటి?

తామేమిటో మరచిపోవడంవల్లనే కొందరు అలా ప్రవర్తిస్తున్నారు. ఒకసారి ఒక వర్గాన్ని శత్రువుగా పరిగణిస్తే ఇక జీవితాంతం అలాగే వ్యవహరిస్తాం. అంతేకాదు ఆ శత్రువును సాధించేందుకు బయటనుండి సమాజం మొత్తానికి చేటు చేసే మరో పెద్ద శత్రువును ఆహ్వానించిన సందర్భాలు కూడా మన చరిత్రలో ఉన్నాయి. రాజ్యాంగసభ సమావేశాల్లో డా. అంబేడ్కర్‌ ఇలాంటి ధోరణుల గురించి హెచ్చరించారు. ఏ విదేశస్తుడు తనంతతాను భారతదేశాన్ని గెలవలేడని, మనలో ఉన్న అంతఃకలహాలవల్ల, కొందరు మనవారే మనల్ని మోసగించడంవల్ల ఓడిపోయామని ఆయన అన్నారు. అలాంటి చరిత్రను పునరావృతం కానివ్వకూడదు. కాబట్టి ఐక్యతకు దారితీసే ప్రాథమిక సూత్రాలను పునరుద్ధరించుకోవాలి. స్వార్థ ప్రయోజనాలతో సమాజంలో చీలికలు సృష్టించడానికి చాలా శక్తులు పనిచేస్తున్నమాట నిజం. ఆ శక్తులతో పదేపదే తలపడేకంటే ఐక్యతాభావాన్ని మరింత పటిష్టవంతం చేసుకునే ప్రయత్నం చేయాలి.

మీరు దేశమంతా పర్యటిస్తున్నారు. సమరసత గురించి పదేపదే చెపుతున్నారు. అంతిమఫలితం ఎలా ఉంటుంద నుకుంటున్నారు?

సమరసత అవసరాన్ని గురించి అందరికీ తెలియజెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. కొంతకాలానికి మా ప్రయత్నం సఫలమవుతుందని, మొత్తం సమాజం అంగీకరిస్తుందని భావిస్తున్నాం. విఘటన శక్తుల పని అయిపోయింది. కొద్దిమంది తమ ధోరణిని సరిచేసుకుని సమరసత మార్గానికి వస్తున్నారు. సత్యాన్ని చెప్పేవారికి మద్దతునిస్తే అప్పుడు సమాజం మొత్తం వారిని అనుసరిస్తుంది. గతంలో కూడా వివక్ష లేని, శోషణలేని సమాజాన్ని రూపొందించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని డా. అంబేడ్కర్‌ అనేవారు. అందుకోసం చాలామంది తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారు. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితం మనం త్వరలోనే చూస్తాం. వివక్షకు తావులేని సమాజం ఏర్పడుతుంది.