ఈరోజు విజయవాడలో శ్రీ బోయిభీమన్న గుర్రం జాషువా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక విజయవాడ విభాగ్ సంయోజక్ శ్రీ కొత్త రాము ఆధ్వర్యంలో గాంధీనగర్లోని పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సామాజిక సమరసతా వేదిక సమాజంలో సమరసత నిర్మాణం కోసం కృషి చేస్తున్నదని శ్రీ రాము తెలిపారు. బోయి భీమన్న, గుర్రం జాషువా లు అట్టడుగు బలహీన సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ సమాజంలో సమరసత కోసం, దేశభక్తి నిర్మాణం కోసం అనేక రచనలు చేశారు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి వెనుక బడిన వర్గాల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి. శివ నారాయణ గారు మాట్లాడుతూ గుర్రం జాషువా గారు తన రచనలతో సమాజానికి ఎనలేని ప్రేరణ కల్పించారన్నారు. మనం నిత్యం వింటుండే సత్య హరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు వారు రచించినవేయని గుర్తు చేశారు.
స్వదేశీ జాగరణ్ మంచ్ ప్రతినిధి శ్రీ బోయపాటి నాని మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగాలని, దానికి వీరి రచనలు ఎంతో దోహదం చేస్తాయని, ఈ విషయాన్ని సామాజిక సమరసతా వేదిక ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలోకి తీసుకొని రావడం చాలా ఆనందదాయకం అని కొనియాడారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ్ కార్యవాహ శ్రీ రావూరి రామారావు గారు మాట్లాడుతూ ఏ సమాజమైనా అభివృద్ధి చెందటానికి ఆ సమాజంలో సమరసత అనివార్యమని, కులాల మధ్య హెచ్చుతగ్గులు తొలగిపోయి ప్రజలందరూ ఒకే భరతమాత సంతానం అనే భావన పెంపొందించడానికి బోయి భీమన్న, శ్రీ గుర్రం జాషువా వంటి కవులు విశేష ప్రయత్నం చేశారని వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు. సామాజిక సమరసతా వేదిక ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనందదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చెప్పులు కుట్టే వృత్తి పని చేసుకునే ఇరువురు సోదరులు శ్రీ లక్ష్మణరావు శ్రీ శ్యామ్ లకు ఘనంగా సన్మానం చేశారు. సామాజిక సమరసతా వేదిక నిర్వహించిన కార్యక్రమం చూసిన సోదరులిద్దరూ మహదానంద భారితులయ్యారు. భవిష్యత్తులో సామాజిక సమరసతా వేదిక నిర్వహించే అన్ని కార్యకరమాలలో తామూ పాలుపంచుకుంటామని, భాగాస్వాములమవుతామని సోదరులిద్దరూ తెలిపారు.
Source : VSK ANDHRA