Home News సమరసత సాధకడు శ్రీ రామానుజాచార్యులు

సమరసత సాధకడు శ్రీ రామానుజాచార్యులు

0
SHARE

శ్రీ రామానుజాచార్యులు తమిళనాడు లోని శ్రీ పెరంబుదుర్ తాలూకా లో శాలివాహన శకం 939 లో జన్మించారు.  ఆయన తండ్రి కేశవాచార్యులు, తల్లి కాంతిమతి . బాల్యం నుండే రామానుజాచార్యుల దృష్టి అత్యంత  సునిశితమైన ది. పదిహేనేళ్ల వయసుకే ఎన్నో శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

*ఆయన 16వ ఏట రక్షాంబతో వివాహం జరిగింది. 23 సంవత్సరాల వయసులో గృహస్థాశ్రమం వీడి శ్రీరంగం లోని యదిరాజ స్వాముల వద్ద సన్యాసాశ్రమం దీక్ష తీసుకున్నారు.

*శ్రీ రామానుజాచార్యులు ఆ కాలంలో ఉన్న అతి గొప్ప పండితుల్లో ఒకరు. ధైర్యశాలి మాత్రమే కాక ఉదార సామాజిక దృష్టికోణాన్ని కలిగి ఉన్న ధార్మికుడిగా ప్రసిద్ది పొందారు. ప్రఖ్యాత గ్రంధకర్త హూపర్ భక్తి గురించి మాట్లాడుతూ,   “రామానుజాచార్యుల కు ముందు ఉన్న ఆళ్వార్ లు భక్తి అనే సుందర క్షేత్రాన్ని సిద్దం చేసి ఉంచగా అక్కడ రామానుజులు భక్తికి పాదులు వేస్తూ  ప్రచారం చేస్తున్నారు ” అని పేర్కొన్నారు.

శ్రీ రామానుజాచార్యుల సామాజిక సామరస్యం.

* శ్రీ రామానుజాచార్యులు హిందూ సమాజంలోని వెనుకబడిన వర్గాల అణచివేత, ఆవేదన, వారి బహిష్కరణ లను స్వయంగా చూసి మనస్తాపం చెందారు  ఆ కాలంలో ఉన్న సామాజిక,ధార్మిక అనుష్టాన విధానాలలో చేయగలిగిన  మార్పులు చేసి , అన్ని వర్గాల వారికీ అనువైన కొత్త అనుష్టాన పద్ధతులను ప్రవేశపెట్టడం తక్షణ అవశ్యకత గా గుర్తించారు.

* జనాభిప్రాయం తో పనిలేకుండా , బ్రాహ్మణులు మొదలుకొని చండాలుర వరకు ఉన్న అన్ని జాతుల, వర్గాల  వారి కోసం కావలసిన ఆధ్యాత్మిక ఉపాసనా ద్వారాలను ఆయన తెరిచారు. ఈ పనిలో ఆయన ప్రతి చోటా ఎంతో వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది, కానీ ఆయన భయపడలేదు, బెదరలేదు. ఎక్కడా ఆగలేదు.

*శ్రీ రామానుజాచార్యులు, విలక్షణమైన సామాజిక దృషి కోణం కలిగి వర్ణ వ్యవస్థలోని ఎలాంటి అసమానతలను సహించేవారు కాదు. ఆయన శిష్యులలో చాలామంది తక్కువ కులాలని చెప్పబడిన జాతుల వారే. దేవుడి రథయాత్ర సమయంలో కూడా అక్కడ నిమ్న కులాలవారు అని చెప్పబడిన వారే ముందుగా రథాన్ని లాగేవారు. ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతోంది.

*ఆయన వైష్ణవ ధర్మ ప్రచారం కోసం దేశమంతటా పర్యటించే వారు.

*ఆయన శూద్ర గురువుల శిష్యరికం కూడా చేశారు. అలాగే చండాలుని చేతి భోజనాన్ని చేయడానికి కూడా ఎప్పుడూ సంకోచించలేదు.

*శ్రీ రామానుజాచార్యులు వృద్దులుగా ఉన్న దశలో, నది దగ్గర స్నానానికి వెడుతూ ఇద్దరు బ్రాహ్మణుల సహాయం తీసుకుని వెళ్ళేవారు. అలాగే తిరిగి  వచ్చేటపుడు ఇద్దరు చర్మకారుల భుజాల సహాయంతో వచ్చేవారు. ఎవరైనా ఈ విషయం లో అభ్యంతరం చెపితే ఆయన “ముందు మానసిక మాలిన్యం వదులుకోండి ” అనేవారు. ఆయన ఉద్దేశ్యంలో  “న జాతి కారణం లోకే గుణా కళ్యాణహేతవ ”
అంటే జాతి వర్ణాలు కాదు, గుణాలే మంచిని నిర్ణయిస్తాయి అని అర్థం.

*శ్రీ రామానుజాచార్యులు శ్రీ రంగపట్టణం లో ఉత్తరం వైపు, మెలుకోటే (దక్షిణ బదరికాశ్రమం) అనేచోట ఉన్న  తిరు నారాయణ పెరుమాళ్  వైష్ణవ మందిరం ద్వారాలను పంచముల (శూద్రుల కంటే కూడా కింది వారని భావించేవారు)  కోసం తెరిపించారు. ఆయన అభిప్రాయం లో అనాగరికులు, నిరాశ్రయులైన మానవులు కూడా వారి వారి భక్తి , సమర్పణ, జ్ఞాన భావాల సహాయంతో ఈశ్వరుడిని పొందగలరు.

*వారి ఈ విస్తృత భావమే సామాజిక సద్భావన, సమరసత లను నెలకొల్పి, కుల మత బేధాలు లేని ఆదర్శ సమాజ నిర్మాణం కోసం అందరూ పనిచేసేలా చేసింది.

శ్రీ రామానుజాచార్యుల ఏకత్వ అఖండ భావనలు.

* వారు రామేశ్వరం నుండి బద్రీనాథ్ వరకు ప్రయాణించారు. ఆళ్వార్ భక్తుల తీర్ధ స్థానాల యాత్ర, ఉత్తర భారత దేశం లోని కాశీ, అయోధ్య,  బద్రీనాథ్, కాశ్మీర్, జగన్నాథ పురి, ద్వారక ఇంకా అనేక ఇతర క్షేత్రాలలో తన ఆధ్యాత్మిక, సామాజిక ఆలోచనలను ప్రచారం చేస్తూ పర్యటించారు.

*శ్రీ రామానుజాచార్యులు జన జాగరణ కోసం భక్తి నే మార్గంగా ఎన్నుకొని , భక్తి ప్రచారం,ప్రసారం కోసం ఎంతో ప్రయత్నించారు. భక్తి జ్ఞాన మనే గంగను ప్రవహింప చేస్తూ, హిందూ సంసృతి యొక్క పునర్నిర్మాణం, సామాజిక జాగరణం అనే మహా కార్యాలను దిగ్విజయంగా నిర్వహించారు.

శ్రీ రామానుజాచార్యుల రచనలు. గ్రంధాలు, భాష్యాలు.

* మూలగ్రందం; బ్రహ్మ సూత్రాల పై భాష్యం. శ్రీ భాష్యం ‘,  ‘వేదార్థ సంగ్రహం ‘.

*గురువు గారి ఆదేశం మేరకు రామానుజుల వారు మూడు పనులు చేయాలని సంకల్పించారు. బ్రహ్మ సూత్రాలు, విష్ణు సహస్ర నామాలు, దివ్య ప్రబంధాలు వీటికి  భావార్థాలను  వ్రాయడం. తన శిష్యుడైన ‘ కురత్తాళ్వార్ ‘ ను తీసుకుని శ్రీనగర్ వెళ్లి, తిరిగి శ్రీరంగం వచ్చి శ్రీ భాష్యం వ్రాశారు.

*వారు వేదాంత దీపం, వేదాంత సారం, వేదార్ధ సంగ్రహం, గీతా భాష్యం, నిత్య గ్రంథం ఇంకా గద్యత్రయం (శరణాగతి గద్యం, శ్రీ రంగం గద్యం, శ్రీ వైకుంఠ గద్యం) అనే రచనలు చేశారు.

*విశిష్టాద్వైత దర్శనమ్: రామానుజాచార్యుల దర్శన గ్రంథాలలో పరమాత్మ యొక్క మూడు స్థాయిలను తెలియజేశారు. బ్రహ్మం అంటే ఈశ్వరుడు, చిత్తం అంటే ఆత్మ, అచిత్తం అంటే ప్రకృతి.

*రామానుజాచార్యుల వారి కాలంలో వేద శాస్త్రాలు, ఇతర ధార్మిక గ్రంధాలు అధ్యయనం చేయడం, వాటిని బోధించడం

.అన్ని జాతుల, వర్ణాల ప్రజలకు అందుబాటులో కి వచ్చింది.

* సామాజిక చైతన్యం అనే మహా కార్యం నిర్వహిస్తూ 120 సంవత్సరాల వయసులో శ్రీ రామానుజాచార్యులు పరమాత్మలో లీనమయ్యారు.