
ఫాని తుఫాను మూలంగా ఒడిశ తీరప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. పూరీ, భువనేశ్వర్, కటక్ వంటి నగరాలతోపాటు ఖోర్ధ, జగతసింహపుర్, జాజ్పూర్ జిల్లాల్లోని గ్రామాలు కూడా బాగా ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది. ప్రజానీకానికి భోజనం, తాగునీరుకు కూడా సమస్యగా మారింది. కొన్ని చోట్ల ఇల్లు పూర్తిగా పడిపోవడంతో జనం ఆరుబయటనే కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యవసర సామగ్రిని బాధితులకు అందించేందుకు స్వయంసేవకులు, ఉత్కల్ విపత్తు సహాయ సమితి కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు.
బాధితులకు అవసరమైన ఆర్ధిక సహాయం చేయవలసిందిగా ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి ప్రజలను కోరారు.
ఉత్కళ సమితి ద్వారా జరుగుతున్న సహాయ కార్యక్రమాలు
మే 3న వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికలు జారీచేసిన తరువాత లోతట్టు ప్రాంతాల ప్రజానీకాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి నివాసం, భోజనం వంటి సదుపాయాలు కల్పించారు. తుఫాను బాధితులకు సామగ్రి అందించేందుకు ఏడు ప్రదేశాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి రోజునే సమితి ద్వారా 10 క్వింటాళ్ళ అటుకులు, 5 క్వింటాళ్ళ బెల్లం, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, 10లక్షల నీళ్ళ బాటిళ్ళు పంపిణీ చేసింది.





