1983 సంవత్సరం నుండి ఆర్‌ఎస్‌ఎస్ సమరసత అనే పదాన్ని ఉపయోగిస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్, గొప్ప సిద్ధాంత కర్త అయిన కీ.శే. దత్తోపంత్ ఠేంగ్డేజీ మొదటిసారిగా సామాజిక దృష్టితో ‘సామాజిక సమరసత’ పదబంధాన్ని ఉపయోగించారు. ఆర్‌ఎస్‌ఎస్ నుండి స్ఫూర్తి పొంది సామాజిక సమరసత వేదిక ఏర్పాటయింది. మహారాష్ట్రలో ముందుగా పని ప్రారంభమైంది. సమరసత లేకుండా సమాజంలో సమానత్వం అసాధ్యం అనే విషయాన్ని వివిధ పౌరసభల ద్వారా ప్రజలలోకి తీసుకెళ్ళడం ప్రారంభమైంది.
ముందుగా మనం సమానత్వం గురించి ఆలోచిద్దాం. మన రాజ్యాంగం అందరికీ సమానత్వం, స్వేచ్ఛను ఇచ్చింది. దీనిని రక్షించడానికి చట్టముంది. కాని అందరికి సమానత్వం, స్వేచ్ఛ ఉంటుందని చట్టం హామీ ఇవ్వలేదు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘సమాజంలో సౌభాతృత్వం ఉన్నట్లయితే సామాజిక జీవితంలోని స్వేచ్ఛ, సమానత్వం అనుభవంలోకి వస్తాయి’ అన్నారు. సౌభాతృత్వం ఒక నియమం కాదు. కాని సమానత్వం, స్వేచ్ఛను కల్పించే హామీని ఇస్తుంది.
అసలు సౌభాతృత్వం అంటే ఏమిటి ? దీనిని చట్టం ద్వారా ఎందుకు ఇవ్వలేం ? సౌభాతృత్వం అనేది ఒక మానసిక స్థితి. ఒక మనిషి మానసిక స్థితిని మార్చడానికి ఏ పార్లమెంటు చట్టం చేయలేదు. ఒకవేళ అలాంటి చట్టం చేసినా అది నిరుపయోగం. సమాజంలో సౌభాతృత్వ భావాన్ని ఏవిధంగా సృష్టించగలం ? సౌభాతృత్వం అనేది మానసిక భావన, దానికి భావావేశం అవసరం. కుటుంబంలో రక్తసంబంధం సౌభాతృత్వాన్ని సృష్టిస్తుంది. కుటుంబంలో పుస్తకంలో వ్రాయని ఎన్నో నియమాలు అమలులో ఉంటాయి. అటువంటి నియమాలన్నింటిని కుటుంబంలో ఒకరి కోసం మరొకరు ఏమాత్రం సంకోచం లేకుండా పాటిస్తూనే ఉంటారు. ఈ కుటుంబంలో ఉన్నవాళ్ళంతా నా వాళ్ళు అనే భావనే కుటుంబాన్ని ఆ విధంగా నడిపిస్తుంది. కుటుంబ ములో ఇవి సహజంగానే జరిగిపోతుంటాయి.
నా తమ్ముడు నాకు బరువు కాడు
మహాత్మాగాంధీ జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒకరోజు గాంధీజీ తన సహాయకుడితో కలిసి ఉదయపు నడకకు బయలుదేరారు. వారిద్దరు ఒక చిన్న కొండపైకి నడుస్తున్నారు. ఇంతలో వారి ముందు ఒక అమ్మాయి తన తమ్ముడిని తన వీపుపై ఎత్తుకొని వారిముందు నడుస్తూ కనిపించింది. గాంధీజీ సహాయకుడు ఆ అమ్మాయిని పలకరించి ఎక్కడికి వెడుతున్నావు అని అడిగాడు. దానికా అమ్మాయి నేను కొండపైకి వెళ్తున్నాను అంది. మరి వీపుపై అంత బరువును ఎందుకు మోసుకువెళ్తున్నావు అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి బదులిస్తూ ‘అతడు నా తమ్ముడు నాకు బరువు ఎలా అవుతాడు?’ అని ప్రశ్నించింది.
నా తమ్ముడు నాకు బరువు కానే కాడు నేను అతడికి కొండపైన ఉన్న చక్కటి దృశ్యాలను చూపించాలని ఇలా ఎత్తుకొని వెళ్తున్నాని ఆనందంగా చెప్పింది. ఈ జవాబు వినగానే గాంధీజీ ఆశ్చర్య పోయారు. దాయాదిత్వం యొక్క జ్ఞానం అది. ఇది మదిలో ఉన్నపుడు తమ్ముడు బరువుగా అనిపించడు. ఎవరు కూడా మరొకరిని వేరుగా భావించరు. అందరినీ తన వారిగానే భావిస్తారు. అతడి కొరకు పాటుపడిన శ్రమ శ్రమలా తోచదు. నేటికీ తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు ఒకరికొకరు పాటుపడటం చూస్తూనే ఉంటాము. దాయాదిత్వం (సోదర భావం) యొక్క జ్ఞానం సౌభాతృత్వాన్ని చిక్క బరుస్తుంది. భారతీయ చట్టంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ఉన్నాయి. సామాజిక జీవనంలో ఈ మూడింటి సాకారాన్ని చూడాలంటే సమాజంలో తీవ్రమైన దాయాదిత్వం పరిఢవిల్లాలి.
హిందూ సమాజంలోని ప్రతి వ్యక్తిలో ఇలాంటి బంధుత్వ భావనను సృష్టించడానికి ఆర్‌ఎస్‌ఎస్ పని చేస్తోంది. సంఘం అంతిమ లక్ష్యం హిందువులను సంఘటిత పరచడమే. ఏ హిందువులను? ఏ హిందువులైతే వేల కులాలుగా విడిపోయారో; వేల భాషలలో, వేల తెగలుగా విడిపోయారో, వారందరిని ఒక్కటిగా చేయడం.
ఒకప్పుడు హిందువులను సంఘటిత పరచడానికి చాతుర్వర్ణ వ్యవస్థ ఉపయోగపడింది. నేడది అక్కరలేనిదిగా మారిపోయింది. అసమానత్వం మీద ఆధారపడి ఉన్న హిందూ సమాజాన్ని సంఘటిత పరచడం సంభవం కాదు. విశ్వజనీన సమానత్వమే నేటి సంఘటనకు పునాది అవుతుంది. సమాజంలో సమానత్వం లేకుండా సంఘటన జరుగదు.
సమానత్వాన్ని ఎలా స్థాపిద్దాం? దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకుందాము? ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభ సమయంలో సంఘాన్ని ఇబ్బంది పెట్టిన ప్రశ్నలివే. ఆ రోజుల్లో నలుగురు హిందువులు ఒకే దిశలో నడుస్తున్నారంటే తప్పకుండా వారి భుజాల మీద ఒక హిందువు శవం ఉండి తీరాల్సిందే. అటువంటి స్థితి. అలాంటి హిందూ సమాజాన్ని ఏకతాటి మీదకు తీసుకురావడమంటే దుర్భరమైన కార్యమే. కాని ఆర్‌ఎస్‌ఎస్ ఆ పని చేసి చూపించింది. ఎందుంటే ఆర్‌ఎస్‌ఎస్ దాయాదిత్వం (సోదర భావం) యొక్క జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకుంది కాబట్టే సంఘటన చేయగలిగింది.
అతడి జీవితమే అతడి సందేశం
డా||హెడ్గేవార్ దీనికై ఆదర్శాన్ని స్థాపించారు. డా||హెడ్గేవార్ సనాతన భావాలు కలిగిన సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన ఇంటిలో వాతావరణం అలాగే ఉండేది. సంఘకార్యం దృష్ట్యా డా||హెడ్గేవార్ చాలా మంది ఇళ్ళకు వెళ్తుండేవారు. కొన్ని సమయాలలో ఆయా ఇళ్ళలో భోజనాలు చేసేవారు. చాలా మంది ఇళ్ళల్లో తేనీరు త్రాగేవారు. డా||హెడ్గేవార్ జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆయనని కలచివేసింది. డా|| హెడ్గేవార్‌కు అప్పటికి తేనీరు త్రాగే అలవాటు లేదు. సంఘకార్యం దృష్ట్యా ఒకమారు ఒక బీద వ్యక్తి ఇంటికి వెళ్ళి కలిసారు. ఆ వ్యక్తి డా||హెడ్గేవార్‌కు తేనీరు ఇవ్వబోయాడు. తేనీరు అలవాటు లేనందువలన డా||హెడ్గేవార్ సున్నితంగా తిరస్కరించారు. ఆ వ్యక్తి కడు బీదవాడు. అతడు తేనీరు మినహా మరేమి ఇచ్చే స్థితిలో లేడు. ఆ ఇంట్లో ఏమీ తీసుకోకుండానే డా||హెడ్గేవార్ ఇంటికి తిరిగి వచ్చారు. వచ్చిన అతిథికి ఏమీ ఇవ్వలేకాపోయాననే ఆ వ్యక్తి బాధపడుతున్న ముఖం డా||హెడ్గేవార్‌కి పదే పదే కనబడింది. డా||హెడ్గేవార్ అలా అన్యమనస్కంగా ఎంతోసేపు గడిపారు. ఇక ఇంట్లో ఉండలేక పోయారు. రాత్రి అయింది. అయినా సరే మరికొందరు కార్యకర్తలను వెంట తీసుకొని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అతడిని నిద్ర లేపి, అతనితోమళ్ళీ తేనీరు పెట్టించుకొని త్రాగి, ఇంటికి వచ్చారు. అపుడు కాని డా|| హెడ్గేవార్‌కి మనశ్శాంతి లభించలేదు. ఆ విధంగా డా||హెడ్గేవార్‌కు తేనీరు త్రాగడం అలవాటయింది. ఈ సోదరభావమే సంఘానికి ఆత్మగా మారింది.
డా||హెడ్గేవార్ జీవితంలో ఇలాంటి వాత్సల్య పూర్ణ సంఘటనలెన్నో ఉన్నాయి. ఆయనతో కలిసి పనిచేసిన అప్పాజీ జోషి, యాదవరావ్ జోషి, బాలాసాహెబ్ దేవరస్, శ్రీగురూజీ, దాదారావు పరమార్థ్ అందరూ ఆయన వాత్సల్యాన్ని చవిచూసిన వారే. అది ‘ఈ సమాజం అంతా నాదే’ అన్న భావనలోంచి వచ్చిన దాయాదిత్వం. అంటరాని తనానికి ముగింపు పలకాలని కుల వ్యవస్థను తొలగించాలని డా||హెడ్గేవార్ ఎన్నడూ ఉపన్యాసాలు ఇవ్వలేదు.
ఎందుకంటే ఎవరూ తమ తమ కులాలను వదులుకోలేరు. ఉపన్యాసాలు విని అంటరానితనం పాటించకూడదంటే వినేవారు తక్కువే. విన్నా ఆచరణలో ఉండకపోవచ్చు. దీనిని అభ్యాసం చేయాలి. మనందరి మాతృమూర్తి భరతమాత. మనమందరం ఆమె సంతానం. ఈ విధంగా మనందరి అమ్మ ఒక్కతే అయినపుడు మనమధ్య తారతమ్యాలు ఎందుకుంటాయి? ఈ భావంతోనే చాలామంది జీవించారు. జాతికొరకు సజీవ అనుభూతిని కలిగించే దాని పేరే సమరసత అని అంటారు డా||హెడ్గేవార్.
నాగపూర్‌లో బచ్చ్‌రాజ్‌వ్యాస్ అనే స్వయంసేవక్ ఉండేవాడు. అతడు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. మరొక కులంవారి పక్కన కూచుని భోజనం చేయడమంటే ఆ వ్యక్తిని వెలివేయటమే అన్న నియమం కల కుటుంబం. నగరంలో ఆర్‌ఎస్‌ఎస్ శిబిరం జరుగుతోంది. బచ్చ్‌రాజ్‌వ్యాస్ ఆ శిబిరంలో పాల్గొన్నాడు. శిబిరంలో పాల్గొన్నవారందరూ భోజన సమయంలో ఒకే పంక్తిలో కూచుని భోజనం చేస్తారు.
ఆ పంక్తులలో కూర్చోకూడదని నిర్ణయించుకుని, డాక్టర్జీని అడుగుతాడు. దానికి డాక్టర్జీ ‘నీ ఇష్టం. నీకు నచ్చకపోతే నీ వంట నీవు చేసుకోవచ్చు, నీ వెక్కడైనా కూచుని భోజనం చేయవచ్చు’ అని అతడికి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఒకరోజు గడిచి పోయింది. మరుసటి రోజు బచ్చ్‌రాజ్‌వ్యాస్ అందరితో కలిసి భోజనం చేయడానికి వచ్చేశాడు. డాక్టర్జీ బచ్చ్‌రాజ్‌వ్యాస్‌కు అంటరానితనం పైనగాని, కుల వ్యవస్థపైన గాని ఎలాంటి ఉపన్యాసం ఇవ్వలేదు. కానీ ఆ స్వయంసేవక్‌లో మార్పు తేగలిగారు.
అలాంటి ఒక శిబిరంలో ఒకసారి కొందరు స్వయంసేవకులు ‘మేము ఫలాన కులం వారితో కూర్చుని భోజనం చేయం అని, వేరే పంక్తిలో కూర్చుని భోంచేస్తాం’ అని అన్నారు. దానికి డాక్టర్జీ ‘సరే అలానే కానివ్వండి, కాని నేను మాత్రం మీరు కాదనుకున్న పంక్తిలోనే కూర్చుని భోజనం చేస్తాను’ అన్నారు. మరుసటి రోజు ఆ స్వయంసేవకులు అందరితో కలిసి భోజనానికి కూర్చున్నారు.
సమరసత ప్రతిరూపం శ్రీ గురూజీ
మన రాజ్యాంగంలోని సెక్షన్ 17 ద్వారా అంటరానితనాన్ని రద్దు చేశారు. రాజ్యం అంటరానితనాన్ని పాటించదు. ఎవరైనా పాటిస్తే వారు శిక్షార్హులవుతారు. ఈ విధంగా చట్టం రూపొందించన తరువాత కూడా ప్రజాజీవితంలో అంటరానితనం సమసిపోలేదు. అంటరానితనానికి మతంతో ఉన్న ఆధారాన్ని తీసివేయాలి. ఈ దిశలో శ్రీ గురూజీ పని ప్రారంభించారు. 1967లో ప్రయాగలో విశ్వ హిందూపరిషత్ సమ్మేళనం జరిగింది. ఆ సమ్మేళనంలో శంకరాచార్య స్వయంగా ‘అంటరానితనం హిందూమతంలోని భాగం కాదని’ తేల్చి చెప్పారు. అసలు హిందువు అనేవాడు ‘పతితుడు’ కానేకాడని సమావేశం తీర్మానించింది. కర్ణాటకలోని ఉడిపిలో 1969 సంవత్సరంలో ధర్మాచార్యుల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో ‘హిందువులందరు సోదరులే’ అనే నినాదం ఇచ్చారు. జగద్గురువు మరియు మిగతా ఆచార్యులందరు కలిసి ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. అందులో హిందువులందరు అంటరానితనం వదిలివేయాలని కోరారు. డా||బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశించిన దానిని కార్యరూపం తేవడానికి శ్రీగురూజీ తన శక్తినంతా ధారపోశారు.
శ్రీగురూజీ సమరసతకు సజీవరూపమని చెప్పవచ్చు. సమాజంలోని వేదనలను చూడగానే ఆయన కంట నీరు ఉబికేది. శ్రీగురూజీ వారి బాధలను చూడలేక పోయేవారు.
శ్రీగురూజీ చాలా బాధపడ్డారు. ఒకమారు రైల్వేస్టేషన్ నుండి బయటకు వచ్చినపుడు ఒక రైల్వేకూలీ సామానుల నెత్తుకొని ఆ రద్దీలో ఇబ్బంది పడుతు ముందుకు వెళ్తుంటే శ్రీగురూజీ ముందుకు వెళ్లి ఆ కూలీకి దారి ఇవ్వండని ప్రయాణీకులను అభ్యర్థించారు. ఆ సమయంలో సంస్కృతంలో ఉన్న ఒక శ్లోకం అర్థం చదివి వినిపించారు. గర్భవతికి, రాజుకు, బుద్ధిజీవులకు మరియు కూలీలకు ముందుగా దారి వదలాలని దాని భావం.
శ్రీగురూజీ ఒక పూటే భోజనం చేసేవారు. ‘అలా ఎందుకు’ అని ఒకసారి ఒక కార్యకర్త అడిగితే ‘ఈ దేశంలో అనేక కోట్ల మంది ప్రజలు రోజుకు ఒక ముద్ద కూడా తినని వారున్నారు. వారందరి ముఖాలు నా కళ్ళముందు కదలాడుతుంటాయి. అందుకే మూడుపూటలు తినడానికి నాకు మనసొప్పదు’ అని జవాబిచ్చారు.
శ్రీగురూజీ జీవితమంతా జాతిజీవనంతోనే మమేకమైంది. చైనా మనదేశ ఉత్తర సరిహద్దుల్లో దాడికి దిగుతుందని ముందుగానే హెచ్చరించారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలియదు. గురూజీ మీకీ విషయం ఎలా తెలిసింది అని అడిగితే ‘గత కొద్ది రోజులుగా నా కుడి భాగం అదురుతూ ఉంది. నా శరీరం కూడ అసహనంగా ఉంది. దాని వల్ల తెలుసుకోగలిగాను’ అన్నారు. హేతువాదులు ఈ మాటలు నమ్మకపోవచ్చు. కాని శ్రీగురూజీ జీవితాన్ని దగ్గరగా చూసిన వారికి శ్రీగురూజీ చెప్పిన దాంట్లో సత్యమే గోచరిస్తుంది.
బాలాసాహెబ్ దేవరస్ సమయంలో సమరసతకు అధిక ప్రేరణ లభించింది. స్వయంసేవకులు విద్య, ఆరోగ్యం, ఉద్యోగకల్పన, గ్రామీణ అభివృద్ధి, ప్రకృతి రక్షణ, త్రాగునీటి సరఫరా మొదలైన విభిన్న రంగాలలో పని ప్రారంభించి సమాజంలోని అన్ని వర్గాల వారికి విజయవంతంగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం దేశం మొత్తంలో ఇలాంటి సేవా ప్రకల్పాలు సుమారు ఒక లక్ష ఏభైవేలు జరుగుతున్నాయి. ఈ సేవా కార్యక్రమాలు గిరిజనులలో, జనజాతులలో, పట్టణాలలోని మురికివాడలలో, వీధులలో నివసించే బాలలు, కూలీ జనాల సముదాయాలలో జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా ప్రకృతి విపత్తులు సంభవించినా అక్కడి బాధితులను ఆదుకోవడానికి ముందుగా చేరుకునేది సంఘ స్వయంసేవకులే. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన తుఫాను కాని, కిల్లరిలో సంభవించిని భూకంపం, చక్రిదాద్రి వద్ద జరిగిన విమాన దుర్ఘటన, మరియు ఉత్తరాంచల్‌లో వచ్చిన వరదలు కాని ఎక్కడైనా, ఏ ఆపదైనా ఆదుకోవడానికి ముందుగా చేరేవారు సంఘ స్వయంసేవకులే.
ఇది నియమం కాదు.. ఆచరణ
సమానత్వం గురించి ఆలోచించినపుడు రాజ్యం చురుకైన పాత్ర పోషించాలి. వెనకబడినవారికి ఆరక్షణలు కల్పించాలి. బలహీనుడు బలవంతుడితో పోటీ పడలేడు. బలహీనులను రక్షించాలి. బలహీనులు ఎదగడానికి ఆరక్షణలు, ఫీజుల్లో రాయితీలు, ఆరోగ్యం కొరకు ఆర్థిక సహాయం అందించే ఏర్పాట్లు చేయాలి. సంఘం ఈ విషయంలో బాసటగా నిలుస్తుంది. ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని భావించినపుడు ఇవి ఎవరికి చెందాలో వారికే చెందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారి బాధలను అర్థం చేసుకోవాలి. మన మనస్సులలో వారి పట్ల దాయాదిత్వం పొడసూపినపుడు సమరసత దానంతట అదే వస్తుంది. అపుడు వారి పట్ల వ్యతిరేకత ఉండదు. సమరసత అనేది ఒక నియమం కాదు, అది ఆచరణ. నేను ఇతరులను నాతో సమానంగా ఎందుకు ఆదరించాలి ? అనే ప్రశ్నకు జవాబు సమరసత. వారి స్వేచ్ఛను నేనెందుకు అడ్డుకోవాలి ? వారిని సోదరులుగా ఎందుకు ఆదరించాలి ? వారు నేను వేరు కాదు. ఇది శ్రీగురూజీ జీవితం ఇచ్చిన మంత్రం. ఈ మంత్రానికి ఎంత విశాలమైన అర్థం ఉందంటే ఇది వివరించ డానికి ఒక పుస్తకమే వ్రాయవలసి ఉంటుంది. మనమందరం ఒక అనంతమైన సత్యం యొక్క వ్యక్తీకరణం. మనందరిలో ఉన్న శక్తి ఒక్కటే. భేదభావం చూపడానికి ఆస్కారమే లేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దీనిని మన నిత్య జీవితంలో ఆచరించాలి. సంఘం ఈ విషయంలో ఉపన్యాసాలు ఇవ్వదు. సంఘం సమానత్వం యొక్క అనుభవాలను. సౌభాతృత్వం యొక్క ఉదాహరణలను మన ముందుంచుతుంది. మనము దాయాదిత్వ భావనతో ఎలా జీవించాలో నేర్పే పాఠశాల ఆర్‌ఎస్‌ఎస్. మరొకరి దుఃఖంలో మమేకం కావడమే సమరసత. ఆర్‌ఎస్‌ఎస్ భావం అదే.
– రమేశ్ పతంగే
(జాగృతి సౌజన్యం తో)