సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో సమరసత సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ అరవింద్ కుమార్, మున్సిపల్ DE లక్ష్మణ్ పాల్గొన్నారు. ముఖ్య వక్తగా అప్పల ప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు 150 మందికి సన్మానంతో పాటు కార్మికుల ఆర్థిక కుటుంబ పరిస్థితుల పై సర్వే జరిగింది
ముఖ్య వక్త అప్పల ప్రసాద్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల బతుకులు మెరుగుపరిచితేనే నవభారత నిర్మాణం అవుతుందన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు వీధులు శుభ్రపరుస్తూన్న నిమ్న వర్గాల జీవితాలను మెరుగు పరచడం వల్లనే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. విద్య వైద్యంతో పాటు కనీస అవసరాలు సదుపాయాలు కల్పించి పారిశుద్ధ కార్మికుల ఆర్థిక సామాజిక స్థితిగతుల్లో మార్పు తేవడంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగాయని అందువల్ల మురుగు కాలువల శుభ్రత కోసం ఆధునిక యంత్రాలను ఉపయోగించి కార్మికుల శ్రమను సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు .
తన చివరి పూర్తి జీవితాన్ని వీధుల్లో శుభ్రపరచడంలోనే గడపాలని ఉందంటూ స్వామి వివేకానంద వ్యాఖ్యానిస్తూ సమాజం శుచి, శుభ్రతతో ఉండడానికి కీలకపాత్ర పోషిస్తున్నవారు పారిశుద్ధ కార్మికులు అన్న విషయం మరువలేనిదన్నారు. సామాజిక సమరసతా వేదిక దేశంలోని అన్ని పురపాలక సంఘాల్లో పనిచేస్తూ, పారిశుద్ధ కార్మికుల ఆర్థిక సామాజిక పరిస్థితులపై సర్వే నిర్వహించి వారిని ఆత్మీయంగా పలకరించే పనికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు తెలంగాణలో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, పాలమూర్, సిరిసిల్ల, ఆదిలాబాద్ పురపాలక సంఘాల్లో పని చేస్తున్న రెండు వేల మంది కార్మికులను సత్కరించి, సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఆర్థిక సమానత్వంతో పాటు సామాజికంగా సమాజంలోని ప్రజలతో సమానంగా గౌరవం అందించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న సామాజిక సమరసతా వేదికకు అన్ని వర్గాలు చేయూతను అందించాలి అన్నారు.
ముఖ్య అతిథి డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల శ్రమను ప్రతి ఒక్కరు గౌరవించాలని, వారి సేవలు చాలా విలువైనవని అన్నారు.
డి. లక్ష్మణ్ మాట్లాడుతూ పారిశుద్దం విషయంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర చాలా ముఖ్యమైనది అన్నారు స్వచ్ఛత విషయంలో సిద్దిపేట పట్టణాన్ని ముందుంచడంలో కార్మికుల శ్రమ దాగి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు ఉప్పరి రత్నం, రికార్డ్ విజయభాస్కర్, ఎస్ఐ వీరారెడ్డి ప్రముఖ న్యాయవాది శివాజీ, బత్తుల నారాయణ ,రాజశేఖర్ రెడ్డి ,భాస్కర్ రెడ్డి ,సంతోష్ పలువురు పాల్గొన్నారు