భారతదేశ అభివృద్ధి చరిత్రలో సహకార వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. సహకార ఉద్యమం 1904లో ప్రారంభమైంది. ఈ ఉద్యమం దినదిన ప్రవర్ధమానంగా ప్రగతి పథంలో పయనించింది. సహకార వ్యవస్థ మూల సిద్ధాంతం ‘వ్యక్తి సమష్టి కొరకు..సమష్టి వ్యక్తి కొరకు.. (Each for All and All for Each) సమాజ వ్యవస్థను కూలంకషంగా గుర్తించిన మన పెద్దలు ఈ వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల సమాజంలో ఐక్యతాభావం, సేవాభావం ఏ విధంగా వృద్ధి చేయవచ్చో అనుభ వంతో మనకు చూపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సహకార విభాగం పునాది వంటిది. ప్రజలను ప్రభుత్వ విధానాల్లో భాగస్వాములను చేసి వారిని చైతన్యపరచి తద్వారా ఆర్జించిన సమిష్టి ఫలాలను వ్యక్తులకు పంచడం సహకార సంఘాల ముఖ్య ఉద్దేశం. మనదేశం వ్యవసాయ రంగంపై ఆధారపడిన దేశం. అందుకే ముందుగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, రైతులను కాపాడటానికి సహకార వ్యవసాయ పరపతి విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ విధానం రైతులకు సంఘం ద్వారా తక్కువ వడ్డీపై ఋణాలు అందించి, ఆర్థిక స్థోమతను పెంచుటకు దోహదపడింది. తదుపరి రైతులకు వ్యవసాయానికి అవసరమయ్యే అన్ని రకాల ఎరువులు, పురుగుమందులు ఇత్యాదిగా అందించి అధిక దిగుబడులు పెంచుటకు ప్రోత్సహిం చింది. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహకార సంఘాల ద్వారా వారి ప్రయోజనాలు కాపాడటానికి చట్టాలను రూపొందించారు. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటానికి వినియోగదారుల సంఘం, (Consumer Coopsters) మార్కెటింగ్ అవసరాలు తీర్చడానికి, (Marketing Cooperative Societes) పారిశ్రామికుల ప్రయోజనాలు కాపాడటానికి అనేక రకాల పారిశ్రామిక సంఘాలను ఏర్పాటు చేశారు. అలాంటి వాటిలో చేనేత రంగం ప్రధానమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలకు విభిన్న వృత్తుల నైపుణ్యాన్ని పెంచడానికి, ఆర్థిక స్వావలంబన కలిగించడానికి అనేక రకాల సంఘాలు ఏర్పాటు అయ్యాయి.
సహకార సంఘాలు చాలా కాలం వరకు పనిచేసిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. నైతిక బాధ్యతతో పనిచేసిన అనేక సంఘాలు తెలంగాణ ప్రాంతంలో కోట్ల రూపాయల సమష్టి ఆస్తులు ఆర్జించాయి. అలాంటి వాటిలో గ్రామీణ బ్యాంకు ముల్కనూరు, రూరల్ బ్యాంక్ ముల్కనూర్, చేనేత కార్మిక సంఘం చెన్నూరు, సూపర్‌బజార్, మంచిర్యాల ఉన్నాయి.
మారుతున్న సమాజ స్థితిగతులకు అనుగుణంగా సహకార వ్యవస్థను బలోపేతం చేయాలంటే నిస్వార్థంగా సేవాభావంతో పనిచేయవలసి ఉంటుంది. అలాంటి వ్యక్తుల ద్వారా మాత్రమే సహకార వ్యవస్థ నిలబడుతుంది. ఈ మధ్యే చట్టంలో సవరణలు చేసి సహకార సంఘాలకు స్వాతంత్య్ర ప్రతిపత్తిని కల్పించారు. సమష్టి బాధ్యతలతో ప్రజలకు సహకార వ్యవస్థల ద్వారా సేవలందించేందుకు అనేక విభాగాల ద్వారా ప్రభుత్వం ముందుకువెళ్తోంది. అలాంటి విభాగాల ద్వారా ప్రగతి మార్గానికి బాటలు వేసుకోవాల్సిన బాధ్యత ప్రజలచే ఏర్పరుచుకున్న సంఘాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రజల్లో, ప్రజలు ఎన్నుకున్న కార్యవర్గాల్లో సేవాభావం లేకపోతే, వారు ‘వ్యక్తి సమష్టి కొరకు.. సమష్టి వ్యక్తి కొరకు…’ అని గ్రహించలేకపోతే సహకార రంగాల్లో ఆశించిన ఫలితాలను సాధించలేం. మన జీవనమే పరస్పర సహకారం. మనిషి జీవించడానికి అనేక విభాగాల సహకారం ఎంత అవసరమో సమాజ పురోభివృద్దికి సహకార సంఘాలు అంతే అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా అనేక శాఖలలో సహకార విధానం ప్రముఖ పాత్ర వహిస్తుందని భావించాల్సి ఉంటుంది.
సహకార శాస్త్రం ప్రకారం ధనిక, పేద అనే తారతమ్యాలు లేకుండా సంఘం ద్వారా లభించిన లాభాలను అందరూ సమానంగా పంచుకోవడాన్నే సహకార సంఘాలంటారు. సమసమాజ నిర్మాణమే సహకార సంఘాల మూల సిద్ధాంతం.
– మహావాది సుధాకర్‌రావు
(జాగృతి సౌజన్యం తో)