Home News సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఉగ్రమృగాల సమర్థకులు..?

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ ఉగ్రమృగాల సమర్థకులు..?

0
SHARE

సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన పేలుళ్ల గురించి గురువారం రాజ్యసభలో జరిగిన ‘మాటల యుద్ధం’ వాస్తవాలను మరింతగా నిగ్గుతేల్చడానికి దోహదం చేయవచ్చు. ఈ ‘మాటల యుద్ధం’ గురించి మాధ్యమాలలో పెద్దగా ప్రచారం కాకపోవడం విచిత్రమైన వ్యవహారం. ఈ పేలుళ్లను పాకిస్తాన్ ప్రేరిత ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘సిమి’ అన్న బీభత్ససంస్థలు జరిపించినట్టు కొత్త సమాచారం వెలువడడం ఈ మాటల యుద్ధానికి కారణం. ఈ పేలుళ్లకు సంబంధించిన నేర పరిశోధన సందర్భంగా గతంలో ‘ఐక్య ప్రగతి కూటమి’- యుపిఏ- నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘హిందూ బీభత్సకాండ’ అన్న పదజాలాన్ని సృష్టించినట్టు భారతీయ జనతాపార్టీ సభ్యుడు శివప్రసాద్ శుక్లా సభలో పేర్కొనడం మాటల యుద్ధానికి కారణం. ఈ విషయమై వెలువడిన ఒక వీడియోలో ‘సిమి’, లష్కర్‌ల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ జరగడం మాటల యుద్ధానికి నేపథ్యం. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో 2007 ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన జరిగిన పేలుళ్ల ఫలితంగా అరవై ఎనిమిదిమంది మరణించారు. ఈ పేలుళ్లను జరిపించింది ‘హిందూ ఉగ్రవాదుల’న్న ప్రచారం దాదాపు పది ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ తథాకథిత ‘హిందూ బీభత్సకాండ’- హిందూ టెర్రరిజం- అన్న పదజాలాన్ని రూపొందించిన కాంగ్రెస్ నాయకత్వంలోని ‘ఐక్య ప్రగతి కూటమి’ ప్రభుత్వం 2014 వరకూ ఈ విచిత్ర అబద్ధాన్ని ప్రచారం చేసింది. ఇటీవల ఒక ‘దృశ్యమాధ్యమ స్రవంతి’- టెలివిజన్ ఛానల్- ప్రసారం చేసిన దృశ్యమాలిక- వీడియో- ద్వారా వెల్లడైన సమాచారం ప్రాతిపదికగా ఈ తథాకథిత- సోకాల్డ్- ‘హిందూ ఉగ్రవాదుల’పై అన్యాయంగా అభియోగాన్ని బనాయించారన్నది భాజపా సభ్యులు రాజ్యసభలో చేసిన ప్రస్తావనలోని ధ్వని. ఎందుకంటే సఫ్దార్ నాగోరి అనే ‘సిమి’ ఉగ్రవాది ఈ పేలుళ్లకు పాకిస్తాన్ సూత్రధారి అని వివరించడం ఆ వీడియోలో ప్రధానాంశం. సఫ్దార్ నాగోరి చెప్పింది నిజమైతే ఈ నేరానికి సంబంధించి 2007 నుంచి జరిగిన దర్యాప్తు, విచారణ అబద్ధాల ప్రాతిపదికగా కొనసాగినట్టు భావించవలసి వస్తుంది. అభియోగ గ్రస్తులైన తథాకథిత ‘హిందూ ఉగ్రవాదులు’ నిరపరాధులన్న నిజం నిగ్గు తేలుతుంది! ఈ వీడియోకు సంబంధించిన నిజానిజాలను సభకు తెలియచేయాలన్నది భాజపా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సభలో చేసిన వినతి. దీనిపై కాంగ్రెస్ సభ్యులు ప్రధానంగా దిగ్విజయ్ సింగ్ వంటివారు మండిపడడం సహజం. ఎందుకంటే వీడియోలోని వివరణ వాస్తవమైతే అది 2014 వరకూ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ అబద్ధాల గుట్టుకు ‘రట్టు’ కాగలదు!

బీభత్సకారులు- టెర్రిరిస్టులు, ఉగ్రవాదులు- మిలిటెంట్స్, దేశ విద్రోహులు- ఇన్‌సర్‌జెంట్స్- తీవ్రవాదులు- ఎక్స్‌ట్రిమిస్ట్స్- ఇంకా ఇలాంటి హంతక ముఠాల వారు ఏదో ఒక మతంలో పుట్టి ఉండడం సహజం. కానీ ఆయా హంతకుల కలాపాలకు, దేశద్రోహ చర్యలకు ఆయా మతాలతో సంబంధం లేదు. మన దేశంలో కొందరు అవినీతిపరులున్నందున దేశంలోని ప్రజలందరూ అవినీతిపరులు కాదు. అలాంటి అవినీతిపరులను శిక్షించడం మన దేశానికి వ్యతిరేకం కాదు, మన జాతీయతకు వ్యతిరేకం కాదు. మొత్తం మన ప్రజలను శిక్షించినట్టు కాదు. అనాదిగా మన దేశపు వౌలిక జాతీయత హిందుత్వం, భారతీయత.. ఈ సహజ న్యాయసూత్రం మతాలకు కూడ అన్వయం అవుతుంది. ఇస్లాం జిహాదీలు శతాబ్దుల తరబడి ఇస్లామేతర మతాల వారిని హత్య చేయిస్తున్న అమానవీయ స్వభావులు, పైశాచిక బీభత్సకారులు, రాక్షసులు.. ప్రపంచంలోని అన్ని ఇతర మతాల వారిని నిర్మూలించి ‘ఇస్లాం’ను ఏకైక మతంగా స్థాపించడం జిహాదీల లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం జిహాదీలు ఎంచుకున్న మార్గం బీభత్సకాండ! ఇస్లామేతర మతాల వారిని చంపడం, తరిమివేయడం, లైంగిక అత్యాచారాలకు గురిచేయడం, మతం మార్చడం వంటివి ఈ బీభత్సకాండలో భాగమన్నది శతాబ్దుల చరిత్ర నిరూపించిన వాస్తవం. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత మన దేశంలో జిహాదీలు సాగిస్తున్న బీభత్సకాండను పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉగ్రవాదులను తయారుచేసి మన దేశంపైకి ఉసిగొల్పుతోంది. మన దేశంలో కూడ పాకిస్తాన్ తొత్తులైన వేలాదిమంది జిహాదీ ఉగ్రవాదులుగా రూపొంది మన ప్రజలను హత్య చేస్తున్నారు. ‘సిమి’, ఇండియన్ ముజాహిదీన్, హజ్‌బుల్ ముజాహిదీన్, హురియత్, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటి ముఠాలు ఇందుకు సాక్ష్యం.

కానీ ఈ జిహాదీ ఉగ్రవాదంతో మన దేశంలోని సాధారణ ముస్లిం పౌరులకు సంబంధం లేదు. మిగిలిన మతాల వారి వలెనే ఇస్లాం మతస్థులు కూడ జాతీయ జీవనంలో సమాన భాగస్వాములు, జిహాదీలను పట్టుకొనడం, విచారించడం, శిక్షించడం ఇస్లాం మతస్థులకు వ్యతిరేకమైన చర్య కాదు. దేశద్రోహులైన, ప్రజావ్యతిరేకులైన జిహాదీ ఉగ్రవాదులను- పాకిస్తాన్ తొత్తులను- శిక్షించినప్పుడు మన దేశంలోని అన్ని మతాల ప్రజల వలె ఇస్లాం మతస్థులు కూడ ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు. కానీ అధికారమే పరమావధిగా మన దేశంలో పదవీ స్వామ్య రాజకీయాలను నిర్వహిస్తున్నవారు మాత్రం- ‘జి హాదీలను, పాకిస్తాన్ తొ త్తులను దండించినట్టయతే ఈ దేశంలోని ఇస్లాం మతస్థులు బాధపడతార’ని భావిస్తున్నారు. అందువల్ల ఇస్లాం మతస్థులు తమ ‘పార్టీ’లకు వోట్లు వేయరన్నది ఈ రాజకీయ వేత్తల భయం లేదా భ్రాంతి. ఇలాంటి నికృష్టపు ఆలోచన రీతిని అవలంబిస్తున్న రాజకీయ వేత్తలు నిజానికి ఇస్లాం మతానికి చెందిన దేశభక్తులైన, రాజ్యాంగ బద్ధులైన సాధారణ ప్రజలను అవమానిస్తున్నారు. ఎందుకంటే జిహాదీలను శిక్షించడం ఇస్లాం ప్రజలను శిక్షించడమని భావించడం ద్వారా ఈ రాజకీయవేత్తలు జిహాదీ ఉగ్రవాదులను, సాధారణ ముస్లింలను ఒకే సముదాయంగా చిత్రీకరిస్తునట్టవుతోంది…

ఈ చిత్రీకరణలో భాగంగానే పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ బీభత్సకాండ తీవ్రతను తగ్గించడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వం 2004- 2014 సంత్సరాల మధ్య కృషి చేసింది. మాలేగావ్ వంటి చోట్ల జరిగిన పేలుళ్లకు పాకిస్తాన్ ఉసిగొల్పిన జిహాదీ ఉగ్రవాదులు కారణమని ధ్రువపడింది. కానీ ప్రజ్ఞాసాథ్వి, అసీమానంద స్వామి వంటివారిని ఈ నేరంలో ఇరికించడం ద్వారా ‘హిందూ బీభత్సకాండ’ అన్న కృత్రిమ పదజాలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. జాతిని అవమానించింది. ఇప్పుడు సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన పేలుళ్లకు పాకిస్తాన్ ప్రభుత్వమే సూత్రధారి అన్న వాస్తవం ధ్రువపడుతోంది. అబ్దుల్ రజాక్ అనే పాకిస్తానీ తొత్తు ‘సంఝౌతా’ పేలుళ్లను జరిపించాడని సఫ్దార్ నాగోరి వెల్లడించాడట! ఏమైనప్పటికీ నిజాన్ని నిగ్గుతేల్చవలసింది ప్రస్తుతం ఈ నేరాన్ని విచారిస్తున్న న్యాయస్థానం..

(ఆంధ్రభూమి సౌజన్యం తో )