Home Telugu Articles సంస్కర్తలకు పద్మాసనం, నూతన ఒరవడికి శ్రీకారం

సంస్కర్తలకు పద్మాసనం, నూతన ఒరవడికి శ్రీకారం

0
SHARE

ఇక్కడ… ఎవరి నికర విలువను వాళ్లే నిర్ణయించుకోవాలి. జీవన ప్రవాహ వెల్లువలో పడి కొట్టుకుపోకుండా, సమాజంపై అర్థవంతమైన ముద్ర వేసినవారే విజేతలు! తరచి చూస్తే ఇలాంటి నిస్వార్థ కథానాయకులకు దేశంలో కొదవలేదు. ప్రభుత్వాల గుర్తింపునకూ, ప్రసార మాధ్యమాల ప్రచారానికీ నోచుకోని ఈ సేవామూర్తులకు ప్రజాహృదయాల్లో శాశ్వత స్థానం ఉంది. ప్రతిఫలం ఆశించకుండా జీవితపు క్షణక్షణాన్నీ జనంకోసమే ఖర్చు చేస్తున్న ఈ మట్టిమనుషులను ప్రభుత్వాలేనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. నక్క వినయాలు, తోడేలు జిత్తులు, డబ్బు సంచులు, రాజకీయ లాలూచీల బారినపడి ప్రభుత్వ పురస్కారాలు అంగడి సరకుగా మారాయన్న విమర్శలు యూపీఏ జమానాలో అదేపనిగా వినిపించాయి. లాలూచీలు, లాబీయింగులతో అవార్డులు దక్కించుకునే కాని కాలానికి చెల్లుచెప్పే సంస్కృతి- ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కొత్త రెక్కలతో విచ్చుకుంటుండటం శుభసూచకం. సామాజికాభ్యున్నతికి అహరహం శ్రమించిన 15మంది జాతి హీరోలను వెదికిపట్టుకుని, కైమోడ్పులతో దరిచేరి ప్రభుత్వం వారికి పద్మ పురస్కారాలు ప్రకటించడం ఈ మట్టిపట్ల ప్రతి ఒక్కరిలో మమకారం పెంచే చర్య. సిఫార్సులకు తావులేని రీతిలో సిసలైన సామర్థ్యానికే పెద్దపీట వేస్తూ ‘పద్మ’ అవార్డులను ప్రభుత్వం ప్రకటించిన వైనం… బహుధా ప్రశంసనీయం!

సేవామూర్తులు… స్ఫూర్తిప్రదాతలు!

దేశం విలువను సచిన్‌ తెందూల్కర్‌లు, ఐశ్వర్యా రాయ్‌లు మాత్రమే నిర్ణయిస్తారనుకుంటే పొరపాటు! ప్రతిక్షణం ప్రాణంకంటే మిన్నగా పర్యావరణాన్ని కాచుకుంటున్న దరిపల్లి రామయ్య, మొక్కవోని క్రమశిక్షణతో ఏడు దశాబ్దాలుగా కలరిపయట్టు యుద్ధ విద్యను ముందు తరాలకు అందిస్తున్న మీనాక్షి అమ్మ, అకుంఠిత సేవాదృక్పథంతో నలభై ఏళ్లుగా కోల్‌కతాలో అగ్ని ప్రమాదాలనుంచి ప్రజలను కాచుకుంటున్న బిపిన్‌ గణత్రా, అరవై ఎనిమిదేళ్లుగా అందరికీ ఉచిత ప్రసూతి వైద్యమందిస్తున్న ‘డాక్టరమ్మ’ భక్తి యాదవ్‌ వంటివాళ్లు ఈ దేశానికి తరగని సంపద. మేధస్సును రంగరించి, అధునాతన సాంకేతిక యంత్రాన్ని రూపొందించి పోచంపల్లి చేనేత మహిళల కష్టాలను పరిమార్చిన చింతకింది మల్లేశం; నాలుగు రాష్ట్రాల్లో రహదారి ప్రమాద బాధితులకు 24గంటలూ అందుబాటులో ఉంటూ తక్షణ వైద్యం అందిస్తున్న సుబ్రతో దాస్‌; మారుమూల పల్లెలను అనుసంధానిస్తూ తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితకర వంతెనలు నిర్మిస్తున్న గిరీశ్‌ భరద్వాజ్‌ భారతావనికి ఎనలేని పెట్టుబడులు! సొంత బైకునే అంబులెన్సుగా మార్చి గుజరాత్‌ ధలబరి జిల్లాలోని 20 గ్రామాల్లో సేవలందిస్తూ ఇప్పటివరకూ మూడు వేలమంది ప్రాణాలు కాపాడిన కరీముల్‌ హఖ్‌; పల్లెపట్టులలో బహిరంగ మలవిసర్జనను మాన్పించి పుణె చుట్టుపక్కల గ్రామాల్లో యాభైఏళ్లుగా శౌచాలయాల ఏర్పాటుకు పరితపిస్తున్న డాక్టర్‌ మపుస్కర్‌ వంటివారు యువతకు నిజమైన స్ఫూర్తిప్రదాతలు. పంజాబ్‌లో 160 కిలోమీటర్ల మేర గడ్డీగాదం, అశుద్ధం బారినపడి కుములుతున్న కాళీబెన్‌ నదిని స్థానికుల తోడ్పాటుతో పరిశుభ్రంగా తీర్చిదిద్దిన బల్బీర్‌ సింగ్‌ సీచెవాల్‌; కరవు కోరల చిక్కి దెబ్బతిన్న బనస్కంత జిల్లా రైతుల్లో చైతన్యం రేకెత్తించి, వారికి నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించి, దేశంలోనే ఆ జిల్లాను అత్యధిక దానిమ్మ పంట ఉత్పత్తి కేంద్రంగా మలచిన దివ్యాంగ రైతు గెనభాయ్‌ దర్గభాయ్‌ పటేల్‌లు జాతి భవితకు నిజమైన భరోసా పలికే స్ఫూర్తిప్రదాతలు. వీరే భావి భారతి ఆశల ప్రతీకలు, కొత్త తరం పతాకలు! ఇలాంటి మట్టిలో మాణిక్యాలను గుర్తించి ప్రభుత్వం వారిని పద్మ అవార్డులతో సత్కరించడమంటే… అది శ్రమకు విలువనివ్వడం, దేశాన్ని గౌరవించడం! యువతలో జాత్యాభిమానాన్ని, సమాజంపట్ల ప్రేమను, బాధ్యతను రగులుకొలిపేందుకు ప్రస్తుత సమాజంలో ఇంతకుమించిన ఆదర్శమూర్తులు లేరు. ఇలాంటి నిస్వార్థ కథానాయకుల విజయగాథలు వినడం, వారితో కదం కలిపి సామాజిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడమే ఇవ్వాళ్టి యువతకు నిజమైన దిశానిర్దేశం.

పొలం గట్టుపై చెట్టు నీడన కూర్చుని కూలీలకు ఆదేశాలిచ్చే తరహా దొరస్వామ్యానికి కాలం చెల్లింది. గట్టుదిగి పొలంలో కూలీలతోపాటు కలిసి తిరిగే ప్రభుత్వాలకే ప్రజల మద్దతు దక్కుతోందిప్పుడు. జనానికి దూరంగా ఉంటేనే ప్రభుత్వమన్నది బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ నమ్మి ఆచరించిన సిద్ధాంతం. పాత ఆలోచనలకు కొత్త రంగు పులిమి ప్రజలకు సుదూరంగా పాలన సాగించే ఆ తరహా విద్యలో మునుపటి ప్రభుత్వాలు తలపండిపోయాయి. అందుకే లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా, ఎన్‌.రాజా వంటి అవినీతిపరులే అప్పట్లో ఆరాధ్యులుగా చలామణీ అయ్యారు. పద్మ పురస్కారాలనూ ‘లాబీయింగ్‌’కు లోబడి కట్టబెట్టిన ఘనచరిత్ర కాంగ్రెస్‌ జమానాది! దిల్లీ కేంద్రంగా పలుకుబడిగలవారే 2005-2014 మధ్యకాలంలో ఏటా సగటున 24 పద్మ పురస్కారాలు సాధించుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. సేవ, సామర్థ్యాల కన్నా సంబంధీకులా కాదా అన్నదే ప్రామాణికంగా ఏటా అటుఇటుగా 120కి పైగా పద్మ అవార్డులు ప్రకటించే సంస్కృతికి మోదీ సర్కారు తెరదించింది. సమర్థత, ప్రజాసేవ, ప్రాంతీయ సమతుల్యతలను పక్కాగా దృష్టిలో పెట్టుకుని, అయిదారు అంచెల్లో నిష్పాక్షిక వడపోత చేపట్టి, దాఖలైన దాదాపు అయిదు వేలకుపైగా నామినేషన్లనుంచి 89మందిని మాత్రమే ఎంపిక చేయడమే అందుకు తార్కాణం. ఏదోరకంగా అవార్డులు దక్కించుకునే దిల్లీకి చెందిన ప్రముఖ వైద్యులకు ఈసారి జాబితాలో చోటు లభించలేదు. గ్రామాలు, పట్టణాల్లోనూ; జాతీయ రహదారులపైనా అనుక్షణం వైద్య సేవా యజ్ఞం చేస్తున్న వారిని వెదికి మరీ ఈసారి గౌరవించుకున్నారు. మొక్కవోని సామాజిక స్పృహతో దశాబ్దాలుగా సేవలందిస్తున్న దళిత, గిరిజన ఉద్యమకారులకూ పురస్కారాలు అందడం ప్రభుత్వాల దృక్కోణం మారుతోందనడానికే నిదర్శనం. దేశ జీవన విధానంలో ఉత్తమ విలువలు నింపిన సిసలైన సంస్కర్తలను సన్మానించడమంటే- వ్యవస్థాగత పునఃసమీక్ష సరైన పద్ధతిలో సాగుతోందనే అర్థం!

సామాజిక సేనాధిపతులు

నా శక్తినంతా ఈ దేశపు ధాన్యంగా, పంట చేలుగా, ఉద్యమ విద్యుత్తుగా మార్చేస్తానంటాడు ఓ కవి. ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన సంక్షేమ కార్యక్రమాలను వ్యక్తులే వ్యవస్థలుగా పరిణతి చెంది ముందుకు నడిపిస్తున్న తీరు చరిత్రాత్మకం. జీవిత మజిలీలో ఎదురయ్యే అనుభవాలనుంచే సత్యాలను గ్రహిస్తూ ముందుకు సాగడం మానవ నైజం. కానీ, సత్యం ఎక్కడ ఉన్నా దాన్ని స్వీకరించడమే లక్షణంగా మార్చుకున్నవారు అరుదు. సమాజోద్ధరణ కోసమే సమస్త జీవితాన్ని అంకితం చేసి పద్మ పురస్కారాలు అందుకున్న ఈ ఉద్యమకారులు రెండో కోవకు చెందినవారు. ప్రభుత్వాల మన్ననతో నిమిత్తం లేకుండా, అవార్డుల ఆలోచనే రాకుండా విశ్వసించిన సత్యంకోసం జీవితమంతా కృషి చేసిన ఈ మాననీయులు… ఏనాటికీ ఆదర్శప్రాయులు! ఏ నిరూపణ కోసమో, మరే కొలమానాలకు కట్టుబడో సామాజిక సేవాపథం తొక్కినవారు కాదు వీరు. జీవిత పరమార్థం తెలిసిన ఈ సామాజిక ఉద్యమకారుల హృదయాల్లో వ్యధార్థులకోసం నిరంతరం చెమ్మ వూరుతూనే ఉంటుంది. పేదలపక్షాన అవినీతి, అనారోగ్యం, కాలుష్యంపై ధర్మ యుద్ధం సాగిస్తున్న ఈ ఉద్యమశీలురే రేపటి తరానికి మార్గదర్శులు. ఎయిడ్స్‌ వ్యాధిపై దశాబ్దాల పోరాటం సలిపిన సునీతిసాల్మన్‌, 12వేల మందిని వ్యభిచార కూపంనుంచి బయటపడవేసిన సామాజిక ఉద్యమకారిణి అనురాధా కొయిరాలను మించిన దైవ ప్రతినిధులెవరు? జీవించడమెప్పుడూ ఓ గొప్ప కళ! కొందరు ఉన్నారా లేదా అన్న విషయం పక్కవాటాలోని వారికీ తెలియదు. ఇంకొందరి జీవన విధానం ప్రజల మేధస్సుకు చురుకుపుట్టిస్తుంది, హృదయాంతరాళాల్లో అలజడి సృష్టిస్తుంది, సమాజానికి కొత్త చూపు ప్రసాదిస్తుంది. పద్మ పురస్కార గ్రహీతలూ అలాంటి కొత్త బాటలు వేస్తున్నవారే! సాయుధ బలగాలు దేశ బాహ్య సరిహద్దులను రక్షిస్తాయేమో… కానీ, ఈ సామాజిక సేనాధిపతులు మాత్రం జాతి చిత్రం చీలికలు పేలికలు కాకుండా కాచుకుంటారు. అణువణువున మార్పు కాంక్ష రగులుతున్న ఈ సేన- చుట్టూ ఉన్న అవ్యవస్థతో పోరాడి, విలువల పునాదులపై దేశాన్ని పునః ప్రతిష్ఠిస్తుంది. ఈ దళం బలం, బలగం పెరిగే కొద్దీ అవినీతి గణాలు, నిరాశ నిండిన గళాలు పెళుసుబారిపోతాయి. సామాజిక ప్రధాన స్రవంతి విస్మరించిన ఈ నిక్కమైన కథానాయకులను గుర్తించి, పద్మ పురస్కారాలతో గౌరవించడమంటే జాతి అస్తిత్వాన్ని మరోమారు బలంగా ప్రకటించుకోవడమే!

– ఉల్చాల హరిప్రసాదరెడ్డి

(ఈనాడు సౌజన్యంతో)