Home News చీకటి అధ్యాయానికి చిరునామా.. సందేశ్ ఖాలీ

చీకటి అధ్యాయానికి చిరునామా.. సందేశ్ ఖాలీ

0
SHARE
సందేశ్‌ఖాలీ.. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయానికి చిరునామా అది. మనుషులను పీక్కుతినే రాబందుల్లా మారిన ప్రజాప్రతినిధులకు అడ్డా అది. నాటి ముస్లీం పాలకుల సమయంలో జరిగిన ఘోర కలిని కళ్లకు కట్టిన ప్రాంతం అది. ఓ మహిళా ముఖ్యమంత్రి ఏలుతున్న రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ కరువైన నేల అది. సందేశ్ ఖాలీ.. 24 పరగణాల జిల్లాలో ఓ అసెంబ్లీ నియోజకవర్గం. హత్యలు, అత్యాచారాలు, లైంగికవేధింపులు, దోపిడీలు, కబ్జాలు, దుర్మార్గాలు నిత్యకృత్యాలు. సందేశ్ ఖాలీ ప్రాంతం రెండు బ్లాకుల్లో విభజించి ఉంటుంది. 2019 ప్రకారం మొత్తం జనాభా.. 2,14,421 మంది. ఇందులో హిందువులు 1,62,960 మంది కాగా, ముస్లింలు 51,461 మంది ఉన్నారు. హిందువుల్లో అత్యధికంగా ఉన్నది ఎస్సీ, ఎస్టీలే. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సందేశ్ ఖాలీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
 సందేశ్ ఖాలీ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం 16 గ్రామ పంచాయతీలు రెండు బ్లాకులుగా విభజించబడ్డాయి. డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, సందేశ్‌ఖాళీ అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ 123. ఇందులో బేమారి-1, కలిఘర్, సర్బారియా, అఘరాతి, బేమారి-2, నజత్-1, సెహ్రా రాధానగర్, హత్‌గాచా మరియు నజత్-2 గ్రామ పంచాయతీలు సందేశ్‌ఖాలీ ఒకటవ అగ్రిగేట్‌ డెవలప్‌మెంట్ బ్లాక్ కు చెందినవి. మరియు బర్మజూర్-1, దుర్గామండప్, మణిపూర్, బర్మజూర్-II, జిలైఖలి, కోర్కటి మరియు సందేశ్‌ఖాలీ గ్రామ పంచాయతీలు సందేశ్‌ఖాలీ రెండవ అగ్రీగేట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌కి చెందినవి. సందేశ్‌ఖాళీ అసెంబ్లీ నియోజకవర్గం బసిర్‌హత్ లోక్‌సభ నియోజకవర్గంలో ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుకుమార్ మహతో 2016 ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సుందర్‌బన్స్ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో సందేశ్‌ఖాళీ తొమ్మిది ద్వీపాలను కలిగి ఉంది.
  ఇక చరిత్రకెక్కిన “తెవగ ఉద్యమం” సందేశ్ ఖాలీ ప్రాంతంలోనే జరిగింది. ఇది వామపక్షాల ఆధ్వర్యంలో 50వ దశకంలో చోటు చేసుకుంది. ఈ ఉద్యమ పితామహుడిని హాజీ మహమ్మద్ దానేష్ అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ ఉద్యమం భారీ నష్టాన్ని మిగిల్చింది. తాజా ఉదంతంతో.. మరోసారి ప్రజలు ఆనాటి చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది మొదటి నుంచే సందేశ్ ఖాలీ ప్రాంతంలో నిరసనలు హోరెత్తాయి. ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ పై స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అసలు వివాదం ఎలా మొదలైందంటే.. రేషన్ బియ్యం, గోధుమల తరలింపులో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ ప్రస్తుతం జైల్లో ఉన్న ఆహారశాఖ మంత్రి జోతిప్రియ మల్లిక్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ సాగుతున్న సమయంలో మంత్రికి అనుచరుడిగా ఉన్న షేక్ షాజహాన్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లిన సమయంలో.. అక్కడ అధికారులపై దాడి జరిగింది. అలాగే మీడియా ప్రతినిధులను కూడా అడ్డుకుని దాడి చేశారు. దీంతో ఈ ఉదంతం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 అసలు షేక్ షాజహాన్ ఎవరు..? ప్రస్తుతం టీఎంసీ ముఖ్యనాయకుల్లో ఒకడిగా చెలామణిలో ఉన్న షేక్ షాజహాన్.. మొదట్లో సీపీఎం నాయకుడు. 2003 లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాజహాన్.. 2009 తర్వాత టీఎంసీలో చేరి తన ప్రాంతంలో గట్టి పట్టు సాధించాడు. అప్పటి నుంచి నేరాలకు కేరాఫ్ గా మారాడు. ఉత్తర 24 పరగణాల్లోని సందేశ్‌ఖాళీ నుండి దక్షిణ 24 పరగణాలలోని మలాంచ్ వరకు చట్టవిరుద్ధ కార్యకలాపాలతో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. గొర్రెలు, ఇటుక బట్టీలు, రవాణా మరియు కూరగాయల సిండికేట్‌లతో సహా వివిధ రంగాల్లో తన అనుచరులతో గూండారాజ్ గా మారాడు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆయనపై కేసులుండగా.. ప్రస్తుతం యావత్ దేశం అవాక్కైన సందేశ్ ఖాలీ ఘటనకు ప్రధాన నిందితుడు కూడా ఇతడే. ఆ ప్రాంతంలోని చాలా గ్రామాల్లో నిస్సహాయ ప్రజలను భయపెట్టి.. వారి భూమిని లాక్కోవడం, అడ్డొస్తే ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి.. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లేవారు. ఇక పంటలు పండే భూముల్లో చేపల పెంపకం చేపట్టేవారు. భూమి ఇవ్వకపోతే దాడులు చేసేవారు. షాజహాన్ తో పాటు.. షేక్ సిరాజ్ , అక్బర్ అలీ , ఉత్తమ్ సర్దర్ , షిబు హజ్రా, అజిత్ మైతీతో పాటు పలువురు.. ఈ దారుణాలకు పాల్పడేవారు. ఈ దుండగుల ముఠా గత మూడేళ్ల నుంచి.. గ్రామాల్లోని నిస్సహాయ ప్రజలను అణచివేస్తూ వస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా తృణమూల్ నాయకులు తమ రాజకీయ శక్తిని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం అండతో.. ప్రజలపై దాడులు కొనసాగిస్తున్నారు. చాలాకాలంగా అటవీశాఖకు చెందిన చెట్లను నరికి కోట్లాది రూపాయలకు విక్రయించగా, సందేశఖలి బ్లాక్-2 అధ్యక్షుడు, జిల్లా పరిషత్ సభ్యుడు ఆ సొమ్మును దోచుకున్నట్లు వెల్లడైంది.
 అయితే ఇటీవల జనవరి 5 న ఈడీ అధికారులపై దాడి ఘటనతో షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దీంతో షాజహాన్ బాధితులు పలువురు రోడ్డెక్కారు. అతడి ఆకృత్యాలు, తాము అనుభవించిన బాధలు బయటపెట్టారు. తమపై జరిగిన దారుణాలను ఒక్కొక్కటిగా చెబుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. పోలీసు అధికారులు కూడా షాజహాన్ కు తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో ఆందోళనకారులంతా షాజహాన్ అనుచరుడు శిబు హజ్రా ఇంట్లోకి వెళ్లినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు పోలీసుల ఎదుటే.. గ్రామస్తులపై తృణమూల్ నాయకుడు శిబు హజ్ర మారణాయుధాలతో దాడి చేయించాడు. దీంతో పలువురు స్థానికులు గాయపడ్డారు. అయినా పోలీసులను ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. బదులుగా.. పోలీసులు 15 మంది గ్రామస్తులను అరెస్టు చేశారు. 187 కేసులు నమోదు చేశారు. గాయపడ్డవారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు కోల్ కతాకు తరలించాల్సి వచ్చింది. అయినా.. స్థానికుల ఆందోళనలు ఆగలేదు కదా.. మరింత తీవ్రమయ్యాయి. తమ భూములు తమకు అప్పగించాలంటూ అధికారుల ఇళ్ల ముందు నిరసనలు చేపట్టారు.
 సందేశ్‌ఖాళీ అసెంబ్లీ నియోజకవర్గంలో గత లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం.. గిరిజనులు మరియు ఇతర వర్గాలకు పట్టా, బార్గా హక్కులు ఇచ్చింది. కానీ.. దీదీ హయాంలో.. ఆ లబ్దిదారులను భయపెట్టి వారి భూములు లాక్కున్నారు. గ్రామస్తులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంతజరుగుతున్నా అటవీశాఖ, బీడీఓ, పోలీసు-శాఖ మౌనంగా ఉన్నారు. అయితే నిరసనకారులపై పగబట్టిన టీఎంసీ దుర్మార్గులు.. ఏకంగా వారిపై దాడికి తెగించారు. దీంతో ఈ వార్త తెలిసిన స్థానికులు, మహిళలు తమను తాము రక్షించుకునేందుకు కర్రలు, చీపుర్లు పట్టుకుని  వీధుల్లోకి  వచ్చారు. తుష్ఖలీ, జెలియాఖలి, ఖుల్నా, హత్‌గాచా నుంచి సాయుధ దుండగులు.. సందేశ్‌ఖాలీలోని ఫెర్రీ ఘాట్ వద్ద గ్రామస్తులపై దాడికి దిగారు. పోలీసుల సమక్షంలోనే గ్రామస్తులపైకి గాజు సీసాలు, యాసిడ్ బాటిళ్లు విసిరారు. కొంతమంది గ్రామస్తులకు గాయాలయ్యాయి. అయితే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. సందేశ్‌ఖాలీ పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి నిరసనకు దిగారు. తృణమూల్‌ నాయకులు షాజహాన్‌, శిబు హజ్రా, ఉత్తమ్‌ సర్దార్‌, లాల్తు ఘోష్‌లను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు చేరుకుని.. పరిస్థితి అదుపు చేసే క్రమంలో.. దుకాణాలన్నీ మూసేశారు. నిస్సహాయ గ్రామస్తులపై పోలీసులు పాశవికంగా లాఠీచార్జి చేశారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది సాధారణ గ్రామస్తులలో మరింత అలజడిని కలిగించింది. సందేశ్‌ఖాలీ ఠాణా చుట్టూ నిరసనలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు ఉత్తమ్‌ సర్దార్‌తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మిగిలిన వారిని అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు.
 అయితే షాజహాన్ అనుచరుడు ఉత్తమ్ సర్దార్‌ను అరెస్టు చేయలేదన్న సంగతి తెలియడంతో.. గ్రామస్తులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. నిందితులను ప్రభుత్వమే రక్షిస్తోందని ఆరోపిస్తూ.. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దీంతో పరిస్థితి మళ్లీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో గిరిజన, ఎస్సీ, ఎస్టీ మహిళల నిరసనలకు లొంగిన సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం.. దుర్మార్గుల అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఫిబ్రవరి 11న జిల్లా పరిషత్‌ నాయకుడు ఉత్తమ్‌ సర్దార్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కానీ ఉత్తమ్ సర్దార్ కంటే ప్రమాదకరమైన, సంఘవిద్రోహి, స్త్రీలను అణచివేసిన, పేద గిరిజనుల భూమిని లాక్కున్న శిబు హజ్రా మాత్రం సందేశ్‌ఖాళీ లోనే ఉండటంతో ఉద్యమాన్ని మరింత పెంచారు. ఫిబ్రవరి 13న బీజేపీ రాజ్యసభ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఆపరేషన్‌లో, పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి, సామాన్య ప్రజలు మరియు బీజేపీ మద్దతుదారులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 11 మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. పలువురు నిరసనకారులు గాయపడ్డారు. వీరిలో చాలా మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో బీజేపీ ఎంపీకి కూడా గాయాలయ్యాయి. ఫిబ్రవరి 15న సామాన్య ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతిపక్ష నేత సువేందు అధికారి అక్కడికి వెళ్లగా.. 144 సెక్షన్‌ను ప్రయోగించి పోలీసులు అడ్డుకున్నారు.
 కానీ.. షిబు హజ్రా మరియు షేక్ షాజహాన్‌లను అరెస్టు చేయాలనే నిరంతర డిమాండ్ కారణంగా.. సందేశ్‌ఖాలీలో మళ్లీ మళ్లీ అలజడులు చెలరేగాయి. తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న మహిళలపై దుర్మార్గులు పోలీసుల సాయంతో దాడులకు పాల్పడ్డారు. రాత్రి వేళల్లో ఇళ్లపై పడి దౌర్జన్యానికి దిగారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడులు జరిగాయి. అయినా వెనక్కి తగ్గని ఆందోళనకారులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఫిబ్రవరి 17న పోలీసులు షిబు హజ్రను అరెస్టు చేయాల్సి వచ్చింది. అయితే ఈ సంఘ విద్రోహ శక్తులకు  అధినేత అయిన షేక్ షాజహాన్ అప్పటికి ఇంకా పరారీలో ఉన్నాడు. ముఖ్యంగా మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ ముస్లీంలతో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న షాజహాన్ వారి రక్షణలో సందేశ్ ఖాలీలో ఉన్నట్లు అనుమానించారు. గతంలో రోహింగ్యా ముస్లీం ల కోసం ప్రత్యేకంగా కాలనీలు ఏర్పాటు చేసి.. ఇళ్లను నిర్మించేవాడు. వారి ద్వారానే అతడు తన అసాంఘిక కార్యకలాపాలు, అనేక నేర కార్యకలాపాలు కొనసాగించాడు. ఈ రోహింగ్యా ముస్లింలను వివిధ గ్రామాలలో ఉంచి, గృహిణుల నుండి సామాన్య ప్రజల వరకు హింసించేవాడు. వీడి ఆగడాలకు చాలామంది అమాయక సామాన్య హిందూ ప్రజలు.. స్వస్థలాలను విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఫిబ్రవరి 29 న షాజహాన్ ను అరెస్ట్ చేయడంతో.. సందేశ్ ఖాలీలో పరిస్థితులు నెమ్మదిగా శాంతించాయి.
 ఒకప్పుడు సందేశ్‌ఖాలీ అంతటా.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలు విస్తృతంగా జరిగాయి. అయితే గత రెండు దశాబ్దాలలో.. ఈ షాజహాన్ లాంటి దుర్మార్గులు ఆవిర్భవించినప్పటి నుంచి.. RSS కార్యకలాపాలు క్రమంగా క్షీణించడం ప్రారంభించాయి. ఒకప్పుడు రోజువారీ శాఖలు పెద్ద సంఖ్యలో జరిగినా.. ఇప్పుడు ఆ శాఖలు దాదాపుగా మూతపడ్డాయి. అనుబంధ సంస్థల్లో బ్లాక్ నంబర్ 1లో విశ్వహిందూ పరిషత్ కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతున్నాయి. చాలా మంది స్వయం సేవకులు ఆ ప్రాంతంలో ఉన్నా.. షాజహాన్ మరియు అతడి అనుచరుల ఆగడాలకు తోడు.. వారికి సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోలేకపోతున్నారు. సందేశ్‌ఖాలీ అసెంబ్లీలోని కాళీనగర్ గ్రామ పంచాయతీలో.. విశ్వహిందూ పరిషత్‌కు ఒక స్థలం ఉంది. కానీ షాజహాన్ మరియు అనుచరులు.. దాన్ని కబ్జా చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా.. దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు.