రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ “కార్యకర్త వికాస వర్గ-2” ప్రారంభం
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ “కార్యకర్త వికాసవర్గ-2” కార్యక్రమం నాగ్‌పూర్‍లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర ప్రాంగణంలోని మహర్షి వ్యాస్ సభామందిరంలో మే 17వ తేదీన ప్రారంభమైంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో వర్గ సర్వాధికారి ఇక్బాల్ సింగ్ జీ, సహ సర్‌కార్యవాహ డాక్టర్ కృష్ణ గోపాల్‌జీ, అఖిల భారతీయ సేవా ప్రముఖ్ – వర్గ పాలక అధికారి పరాగ్‌జీ అభ్యంకర్ భారతమాత విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహ సర్‌కార్యవాహలు ముకుంద్ జీ, రామ్ దత్ చక్రధర్ జీ పాల్గొన్నారు. వర్గలో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన 936 మంది శిక్షార్ధులు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా పరాగ్‌జీ అభ్యంకర్ స్వయంసేవకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ… నాగ్‌పూర్‌లో సంఘ కార్యం గురించి తెలుసుకోవడం, దానిని ఆచరించడం ఒక సౌభాగ్యం అనే భావన స్వయంసేవకులలో ఉంటుందన్నారు. సంఘ కార్యమే జీవన కార్యమనే భావన కూడా స్వయంసేవకుల మనస్సులో చోటు చేసుకుంటుందన్నారు. ఈ భూమి డాక్టర్ హెడ్గేవార్, శ్రీ గురూజీల తపోస్థలమని ప్రస్తుతించారు.
సంఘ కార్యంలో శిక్షావర్గ అత్యంత విశిష్టమైనది. ఈ మహత్తర కార్యం దినదినాభివృద్ధి చెందుతూ పలు ప్రాంతాలలోనూ జరుగుతూ వస్తోంది. స్వాతంత్ర్యానికి ముందు సంఘం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. దేశ స్వాతంత్ర్యోద్యమం కోసం సంఘం ఎన్నో సేవలు చేసింది. అటవీ సత్యాగ్రహంలో స్వయంగా డాక్టర్ హెడ్గేవార్ క్రియాశీలక పాత్ర పోషించారు. అత్యవసర పరిస్థితి, కరోనా కాలంలో తప్ప మరెప్పుడూ సంఘ శిక్షావర్గకి ఆటంకం కలుగలేదు. కాలానుగుణంగా శిక్షావర్గ శిక్షణ సమయం, అభ్యాసక్రమంలో మార్పులు చోటు చేసుకున్నాయి. కార్యకర్తల ఆలోచనా సరళి ఏ విధంగా ఉండాలి.. వారికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి.. తదితరాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత వ్యవస్థలలో అవసరమైన మార్పులు చేశారు. వర్గ ప్రారంభ కాలంలో శిక్షార్ధులకు శారీరక శిక్షణతో పాటుగా వారిలో ధైర్యసాహసాలు పెంపొందే విధంగా శిక్షణ ఉండేది. ఇప్పుడు సవాళ్లలో మార్పులు వచ్చినందున వీటి గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ సవాళ్లకు దీటుగా ప్రతిస్పందించేందుకు గాని వీటికి సంబంధించిన అంశాలపై కూడా ఈ వర్గలో దృష్టి సారిస్తారు.
సంఘటిత హిందూ సమాజంలో విశ్వవ్యాప్త దృష్టికోణాన్ని పెంపొందించే రీతిలో ఈ వర్గ రూపకల్పన జరిగింది. సమాజంలోని సజ్జనశక్తిని ఏకం చేసి మన శక్తిని ఏ విధంగా పెంచుకోవాలో తెలియజేసేలా శిక్షార్ధులకు ఈ వర్గలో ఆచరణాత్మక శిక్షణ (వ్యవహారిక ప్రశిక్షణ) కూడా ఉంటుంది.
భారత దేశవ్యాప్తంగా ఈ ప్రశిక్షణ కోసం వచ్చే శిక్షార్ధులైన స్వయంసేవకులలో జాతీయ ఏకాత్మతా భావం విస్తరిస్తుంది. హిందుత్వ ఏకతా అనుభూతి కూడా అనుభవంలోకి వస్తుంది. ఈ వర్గ సమాపనోత్సవం జూన్ 10వ తేదీన జరుగుతుంది.