జాతీయ పతాకం కోసం బలిదానం చేసిన సామా జగన్మోహన్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చురుకైన కార్యకర్త. కాకతీయ విశ్వవిద్యాలయం నడిబొడ్డున జాతీయ పతాకానికి జరిగిన అవమానాన్ని ఎదిరించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి జాతి గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో ప్రాణాలర్పించిన యువకిశోరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి జాతీయవాది సామా జగన్మోహన్ రెడ్డి.
1980వ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున కాకతీయ విశ్వవిద్యాలయంలో వైస్‌ఛాన్సలర్, ప్రొఫెసర్ల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా RSU కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ దేశద్రోహాన్ని సహించలేక సామా జగన్మోహన్ రెడ్డి RSU కార్యకర్తల చేతిలో నుంచి జాతీయ పతాకాన్ని లాక్కొని ఎగురవేశాడు. ‘వందేమాతరం’, ‘భారత్‌మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశాడు.
ఈ ఘటనలో RSU కార్యకర్తలపై చర్యలకు జస్టిస్ రాములు నేతృత్వంలోని ఒక కమిటీ సిఫారసు చేసింది. ఆ సంఘటనను ఎంతో మంది చూసినప్పటికీ కేసులో ప్రధాన సాక్షిగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. కోర్టులో కేసు విచారణ రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. 1982 సంవత్సరం ఏప్రిల్ 29న కోర్టు కేసుకు హాజరై వస్తున్న జగన్మోహన్ రెడ్డిని హనుమకొండ ప్రధాన రహదారిపై అత్యంత క్రూరంగా నక్సలైట్లు హత్య చేశారు. జాతీయ పతాక గౌరవాన్ని వినువీధుల్లో నిలబెట్టి ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి అమరుడైయ్యాడు. దేశభక్తుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచాడు. జగన్మోహన్ రెడ్డి బలిదానం భావితరాలకు స్ఫూర్తిదాయకం.