Home News సంఘటిత శక్తిలో సంక్రాంతి వెలుగు

సంఘటిత శక్తిలో సంక్రాంతి వెలుగు

0
SHARE

తెలుగునాట సంక్రాంతి సంబరాలు చిరకాలం నుంచి ఎరుకే. ‘సంక్రాంతి’ అంటే సరైన, చక్కటి మార్పు అని అర్థం. చీకటి రాత్రులు తగ్గుతూ, పగటి వెలుతురు సమయం పెరిగే మంచి వాతావరణ మార్పు సంక్రాంతితో శుభారంభమవుతుంది. జీవకోటికి ప్రాణదాత సూర్యభగవానుడు. సూర్యుని రథానికున్నది ఒక చక్రమే. ఇక, రహదారి ఆధారం లేని అంతరిక్షం. రథసారథి కాళ్లు లేని అనూరుడు. అయినా సరే, సూర్యగమనం అవిశ్రాంతంగా సాగుతూ లోకహితం కలిగిస్తున్నది. ఇవి సాహితీవేత్తల చమత్కారాలే అయినప్పటికీ మంచి మార్పు రావాలంటే నిరంతరం ప్రయత్నం కావాలని చాటుతున్నది.

ప్రకృతితో మమేకమవుతూ జీవనయాత్ర సాగించడం మన దేశ సంస్కృతి విశిష్టత. భారతీ యుల ప్రకృతి ఆరాధనను పామరత్వమంటూ ఎగతాళి చేసిన ప్రపంచ మానవాళి నేడు వాస్తవాన్ని గుర్తించి ప్రకృతి పరిరక్షణకై మన జాతితో నడిచేం దుకు ప్రయత్నిస్తున్నది. వేప, తులసి, అశ్వత్థ, మారేడు వంటి అనేక వృక్షాలకు దైవత్వాన్ని ఆపాదించి పూజిస్తూ ఆ వృక్షాల ఆవశ్యకతను మన ఆచారాల ద్వారా పూర్వికులు మన మదిలో నాటారు. జీవకోటికి ప్రాణాధారమైన నదీమతల్లులను ఆరాధించటం అలవాటుగా మార్చారు. సకల జీవజాలానికి ఆధార మైన నేలతల్లిని ఆరాధించడం నేర్పారు.

‘నదుల స్వచ్ఛత’ను కాపాడాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలకు గుర్తుచేస్తూ సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ‌సాగించిన ‘ర్యాలీ ఫర్‌ ‌రివర్స్’, ‌భూసారాన్ని కాపాడు కోవాలంటూ సాగిన ‘సేవ్‌ ‌ది సాయిల్‌’ ఉద్యమాలు ప్రపంచ ప్రజల మన్ననలను పొందాయి. మన దేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘నమామి గంగే’ పథకం గంగానది స్వచ్ఛతను సాధించి, ప్రపంచం చేపట్టిన మొదటి 10 ప్రాజెక్టులలో 4వ స్థానాన్ని సాధించింది.

భూసారాన్ని నాశనం చేయని పద్ధతులనే భారతీయులు అనుసరించారు. విస్తరాకులలో భోజనం చేయడం, మట్టిపాత్రలు ఉపయోగించడం, ఆరోగ్యదాయక లోహపాత్రలను వాడటం అనాదిగా మన పద్ధతి. పాశ్చాత్య పోకడలతో నేడు ‘యూజ్‌ అం‌డ్‌ ‌త్రో’ పేరిట ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు పెరిగి జీవకోటికి ముప్పుగా మారుతున్నాయి. నేడు ప్రపంచ మానవాళి తిరిగి పర్యావరణ హిత, మనవైన పద్ధతుల్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నది.

సంక్రాంతి కూడా మనం జరుపుకునే అన్ని పండుగల లాగే ప్రకృతి ఆరాధనతో కూడుకున్నదే. ఈ సందర్భంగా రైతు సోదరులు ధాన్యపు కంకులను అందంగా అల్లి ఇళ్ల ముందు వేలాడగట్టి పక్షులకు ఆహారంగా సమర్పిస్తారు. తమ ముంగిటికి వచ్చే గంగిరెద్దులను సత్కరిస్తారు. సంక్రాంతి మరునాడు జరుపుకునే పశువుల పండుగ నాడు పశువులను కడిగి, కొమ్ములను రంగులతో అలంకరిస్తారు. శ్రమ కలిగించే పనుల్ని ఆనాడు పశువులతో చేయించరు. సంక్రాంతి పశుపక్ష్యాదుల పట్ల మనిషిలో ప్రేమను నిర్మితం చేస్తుంది.

వ్యవసాయంలో తోడు నిలిచే కమ్మరి, కుమ్మరి, వడ్రంగి తదితర వృత్తుల వారందరికీ ధాన్యాన్ని, పిండివంటలను పంచి పెడతారు. సంపదను తమ తోటివారందరికీ కొంతైనా పంచిపెట్టి వారి ఆనందా నికీ కారణమవుతారు. స్వర్గస్తులైన తమ పెద్దలకు సంక్రాంతి వేళ తర్పణాలు విడిచి కృతజ్ఞత చాటు కుంటారు. రేపటి తరంలో పెద్దల పట్ల శ్రద్ధను కలిగించే చక్కటి ఆచారమిది. కానీ నేటి సమాజంలో విపరీతంగా పెరుగుతున్న వృద్ధాశ్రమాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఆ పెద్దలు మన ప్రగతి కోసం అనుక్షణం తపించి, అందుకోసం అహరహం ప్రయత్నించారు. వారే మన ప్రగతికి మార్గదర్శకులు. ఇక సంక్రాంతి వేళ నిర్వహించుకునే ఎడ్ల పందేలు, గాలిపటాలు, గొబ్బెమ్మలతో ఆటపాటలు మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.

దేశ వ్యవహారాలలో కూడా ‘సంక్రాంతి’ భావన వ్యక్తమవుతున్నది. స్వాతంత్య్ర అమృతోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్న తరుణంలో ‘ఇంటింటా త్రివర్ణపతాకం’ కార్యక్రమంలో భాగంగా కోట్లాది గృహాలపై జాతీయజెండాలు ఎగురవేయటం శుభసూచకం. లక్షలాది వీరుల ప్రాణత్యాగాలు, బలి దానాల ఫలింగా స్వతంత్ర భారత స్వప్నం సఫల మైంది. వారి త్యాగాలను స్మరిస్తూ భవ్యభారత నిర్మాణం కోసం నిరంతర సాధన చేయాలి. ప్రపంచ మానవాళికి సరైన దారి చూపగల ఆశాదీపంగా భారత్‌ను ప్రపంచ దేశాలు నేడు గుర్తిస్తున్నాయి. శాంతి సౌభాగ్యాలతో విలసిల్లే శక్తిశాలి భారత్‌ ‌వల్ల మాత్రమే ఇది సాధ్యం అని మనం దృఢంగా విశ్వసించాలి. రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధంలో రష్యా అణుప్రయోగం జరపకుండా చూడటం భారతదేశ దౌత్యనీతి వలన సాధ్యమైందని (సెంట్రల్‌ ఇం‌టెలిజెన్స్ ఏజెన్సీ) సీఐఏ అధిపతి కూడా ఇటీవల వెల్లడించారు.

అంతేకాదు, దేశవ్యాప్తంగా నేడు చక్కటి మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యుత్‌ ‌వెలుగులకు నోచుకోని 18 వేల గ్రామాలకు విద్యుత్‌ను అందించటం ఆనందాన్నిచ్చే విషయం. శాస్త్రవేత్తలు రెట్టించిన ఉత్సాహంతో ‘కరోనా’ వ్యాక్సి న్‌ను అతి తక్కువ సమయంలోనే తయారుచేయటం, దేశ ప్రజలందరికీ ప్రభుత్వం ఉచితంగా అందించ డమే కాదు, ప్రపంచ దేశాలకు కూడా సరఫరా చేయడం భారతీయులు ఎంతో గర్వించదగ్గ విషయం. మన రక్షణ రంగం స్వావలంబన వైపు అడుగులు వేస్తూ శక్తిశాలి భారత్‌గా దేశాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాలు ముమ్మరం చేయడం మనందరికీ గర్వకారణం. కశ్మీర్‌ను తీవ్రవాదుల అడ్డాగా, వేర్పాటు వాదుల స్వర్గధామంగా మార్చిన ‘370’ అధికరణం తొలగిపోయి 70 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అక్కడ ప్రగతి, శాంతిసౌభాగ్యాలు విలసిల్లడం మరో మంచి మార్పునకు సంకేతం. ఈశాన్య భారత రాష్ట్రాలలో పెంచి పోషించిన వేర్పాటువాద శక్తులు వెనక్కి తగ్గి జాతీయభావ తరంగాలు పోటెత్తాయి. తమిళనాడులో ద్రవిడ కజగం పలచబడి జాతీయభావ వీచికలు మరోసారి ఉధృతం కావడం మంచి మార్పునకు సంకేతం కాక మరేమిటి?

నేటి యువతరం కేవలం ఉద్యోగాల వేటకే పరిమితం కాలేదు. భారత్‌ ‌గర్వించదగ్గ ఎన్నో ఆవిష్కరణలకు స్టార్టప్‌ల ద్వారా నాంది పలికారు. ఇది కూడా ఒక గొప్ప మార్పునకు సంకేతమే. రాజకీయ రుగ్మతతో, సంకుచిత ఆలోచనలతో ‘అగ్నివీర్‌’ ‌నియామకాలను కొందరు రాజకీయం చేస్తూ హింసకు పాల్పడినప్పటికీ కశ్మీర్‌లో సైతం ‘అగ్నిపథ్‌’ ‌పథకానికి లక్షలాది యువత దరఖాస్తు చేయడం, దేశ రక్షణకు ముందుకు రావడం మరో సంతోషించ దగ్గ మంచి పరిణామం.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా మన ముందు తరాలు చేసిన తప్పులతో మన మూలాలకే ముప్పు ఏర్పడిన తరుణంలో ఆ తప్పుల్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ నేడు భారత జాతీయత దృఢంగా వేళ్లూనుకుంటున్నది. ‘భగవంతుడు వివిధ దేశాలను సృష్టించినప్పుడు ప్రతి దేశం తెలియజెప్పవలసిన, ప్రచారం చేయవలసిన సందేశాన్ని కూడా నిర్ధారించారు. పురాతన ఈజిప్ట్‌కు మతమే సందేశం. స్వచ్ఛత ప్యారిస్‌ ‌సందేశం. శాస్త్రవిజ్ఞానం చాల్దియా (బాబిలోనియా, గ్రీస్‌ ‌ప్రాంతంలోనిది) సందేశం. రోమ్‌కు న్యాయశాస్త్రం సందేశం. ఈ దేశాలన్నిటిలో మొదటగా పుట్టిన భారత్‌కు ఆయన అప్పగించిన సందేశం ‘ధర్మం’. ఈ పదానికి ఇతర ప్రపంచ భాషల్లో సరైన పదం లేదు. భారత్‌ అం‌టే ఏమిటి అనేది ఈ ఒక్క పదమే చెపుతుంది. అదే భారత జాతీయత.

ధార్మిక చైతన్యం ద్వారానే దేశాభివృద్ధి పరుగులు పెడుతుందని విజ్ఞుల ఆలోచన. ప్రతి ప్రాంతాన్ని దైవధామంగా భావిస్తూ, ప్రతి జీవిలో పరమాత్ముని దర్శిస్తూ ముందుకు సాగడానికి ఆదిశంకరులు, రామానుజాచార్యులు, స్వామి దయానంద సరస్వతి, గౌతమబుద్ధుడు, నారాయణగురు, స్వామి వివేకానంద వంటివారు ఎనలేని కృషి చేశారు. ఆ దారిలో మరలా అడుగులు పడుతున్న సూచనగా కాశీ కారిడార్‌, ఉజ్జయిని మహాకాల్‌, ‌చార్‌ధామ్‌ ‌క్షేత్రాల నవీకరణ చెప్పవచ్చు. అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా సాగుతుండటం మన కళ్లారా చూస్తున్నాం. ప్రతి ప్రాంతాన్ని కలుపుతూ నిర్మితమవు తున్న జాతీయ రహదారులు ప్రజలందరినీ ఒక్కటి చేస్తూ, పర్యాటక రంగ అభివృద్ధికి మరింత దోహదం చేస్తున్నాయి. మనందరికీ ఆహారాన్ని అందిస్తున్న రైతన్నలకు ఎరువులు సకాలంలో దొరకాలి, ఆరుకాలం కష్టించి వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం సాగే ప్రయత్నాలు మరింత వేగంగా జరగాలి. ‘రైతేరాజు’ అనేది కేవలం నినాదానికే పరిమితం కాకూడదు. అది సాకారం కావల్సిన తరుణమిది.

 నూతన జాతీయ విద్యావిధానంలో లోటును సరిచేసేందుకు యత్నించడం ఆనందదాయకం. దేశంలో మంచి మార్పు కోసం మొదలైన అడుగులు మరింత వేగంగా సాగాలంటే భారతీయులందరూ సంఘటితం కావాలి. మనందరి స్వావలంబనతో విశ్వశాంతికి దారి చూపగల ‘శ్రేష్టభారత్‌’ ‌నిర్మాణం సాకారమవటం తథ్యం.

– పుట్టా శేషు, ప్రాంత బౌద్ధిక్‌ ‌ప్రముఖ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, ఆం‌ధప్రదేశ్‌

జాగృతి సౌజ‌న్యంతో…