Home News చ‌దువు, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌తోనే స‌మాజాభివృద్ధి అని నిరూపించిన సంత్ గాడ్గే బాబా

చ‌దువు, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌తోనే స‌మాజాభివృద్ధి అని నిరూపించిన సంత్ గాడ్గే బాబా

0
SHARE

సంత్ గాడ్గేబాబా గౌతమ బుద్ధునివలె భార్యా, పిల్లలను, ఇంటిని 29వ ఏట వదిలి పెట్టారు. ఒక చేతిలో చీపురుతో మురికి వాడలను శుభ్రం చేయటం (బాహ్యశుద్ధి), శ్రావ్యమైన గొంతుకతో “గోపాల, గోపాల దేవకీ నందన గోపాల….” భజనగీతాలను ఆలపిస్తూ, సమాజంలోని దురాచారాలను తొలగిస్తూ (సమాజపు అంతశ్శుద్ధి), నిరంతరం 51 సంవ‌త్స‌రాలు ఆయన తిరిగాడు. ఆయన కాషాయ బట్టలు వేసు కోలేదు. ధరించింది చిరిగిపోయిన బట్టలు. రోజల్లా శ్రమించేవారు. అనంతరమే బిక్ష అడిగేవారు. ఏ చెట్టు క్రిందనో నిద్రపోయేవారు. పేద, దళితుల ఉన్నతి విద్య ద్వారానే సాధ్యమని నమ్మిన వారు. అలా తిరుగుతూనే 31 పాఠశాలలు, 15 వసతి గృహాలు, ఒక బాలికల పాఠశాల, గోశాల, ధర్మ సత్రములు మొత్తం 60 నెలకొల్పారు.

సామాజిక స్వచ్ఛతా ఉద్యమకర్త విద్యాదాత సంత్ గాడ్గేబాబా 23 ఫిబ్రవరి, 1876న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో షేణగావ్ గ్రామంలో రజక కుటుంబంలో గాడ్గేబాబా జన్మించారు. తల్లిదండ్రులు సక్కుబాయి, ఝింగరాజి పెట్టినపేరు ‘డేబూజీ’. వారి పూర్వీకులు స్థితిమంతులు. 1884లో రింగరాజు మరణించాడు. తల్లినుండి లభించిన సంస్కారం, శ్రావ్యంగా పాడడం. తండ్రి మరణానంతరం డేబూ తన తల్లితోపాటు మేనమామ హంబీరరావు ఇంటికి చేరారు. ఆయన పెద్ద రైతు. డేబూలో దయాభావం మెండుగా ఉండేది. ఒకసారి ఇంటివద్దకు బిక్షాటన చేస్తూ కొందరు అంధులు వచ్చారు. వారిని చూసి డేబూ మనసు కరిగింది. తోటి మిత్రులతో కలిసి చుట్టుప్రక్కల ఉన్న అంధులందరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాడు. దీనిపై గ్రామంలో పెద్దగొడవే జరిగింది. “నీ కొడుకు డేబూ అంటరానివారితో కలిసి మెలిసి తిరుగుతున్నాడని,” గ్రామస్థులు ఇంటికివచ్చి గొడవ చేశారు. డేబూ జంకలేదు. ఎంతో ధైర్యంగా “అంధులు కూడా మనుష్యులు కాదా?” అని ప్రశ్నించాడు. వయస్సు పెరుగుతున్నకొద్దీ, లోకజ్ఞానం వస్తున్న కొద్దీ, చుట్టుప్రక్కల ఉన్న దళితవాడల్లో ఉన్న ప్రజల సమస్యలు అర్థంకాసాగాయి. తన మిత్రులతో కలిసి ఒక భజనబృందాన్ని ఏర్పాటుచేసి చుట్టుప్రక్కల గ్రామాల్లో భజనలు నిర్వహిస్తూ ఉండేవాడు. అందరూ ఉత్సాహంగా పాల్గొనేవారు. పగలు పశువులను కాయడం, రాత్రి భజనలు. సంత్ కుకారాం అభంగాలను డేబూ చాలా శ్రావ్యంగా పాడేవాడు.

కొండంత ధైర్యం – ఆ ఊళ్ళో షావుకారు అప్పు ఇచ్చి దానిపై చక్రవడ్డీపై చక్రవడ్డీ వేసేవాడు. అప్పు ఎవరైనా చెల్లించినా రశీదు ఇవ్వకుండా తిరిగి అప్పు చెల్లించాలంటూ భూమిని, పంటను స్వాధీనం చేసుకునేవాడు. కానీ డేబూ ధైర్యంగా నిలబడి ఆ షావుకారుకు బుద్ధిచెప్పడంతో గ్రామస్థులందరికీ ధైర్యం వచ్చింది.

గృహత్యాగం – డేబూ నివసిస్తున్న గ్రామం ప్రక్కనే ఋణమోచన్ అనే పుణ్యక్షేత్రం పూర్ణానది ప్రక్కనే ఉండేది. ప్రతి ఆదివారం ఉదయమే నదిలో స్నానంచేసి అక్కడగల ముద్గలేశ్వరునికి అభిషేకం చేసేవాడు. ఆ దేవాలయ ప్రాంగణంలో డేబూజీకి ఎన్నో ఆలోచనలు రేకెత్తేవి. ఈ సృష్టి రహస్యం ఏమిటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ దురాచారాలేమిటి? ఇటువంటి ఆలోచనలతో సతమతమౌతుండేవాడు.
సంత్ నామ్ దేవ్, చోకామేళా వంటి నిర్గుణ భక్తుల ఆలోచనల ప్రభావం డేబూపై పడింది. భజనల
సందర్భంగా దళితవాడలలో తిరుగుతున్నప్పుడు దళితవాడలలో ఉన్న అంటరానితనం, ఆకలి, రోగాలు, మురికి, అవిద్య, మూఢాచారాలు ఇవన్నీ డేబూ దృష్టికి వచ్చాయి. ఈ సమస్యలనుండి ఈ పేదప్రజలను విముక్తం చేయాలని, దానికోసమే జీవించాలని నిశ్చయించుకున్నాడు. 1905 ఫిబ్రవరి 5న, తన 29వ ఏట కుటుంబాన్ని వదిలి పేదప్రజల ఉన్నతికోసం అవసరమైన సాధనచేయడానికి బయటకు వచ్చేసాడు.

పది సూత్రాలు ప్రచారం:
పగలంతా పరిశుభ్రత, రాత్రయితే భక్తి కీర్తన. ఇది డేబూ నిత్య కార్య‌చ‌ర‌ణ‌. ఋణమోచన్ క్షేత్రంలో తొలి కీర్తన పాడాడు. దేవాలయం మెట్లను శుభ్రంచేశాడు. పూర్ణానదిలో భక్తులు స్నానం చేయటం కోసం ఒక శాశ్వత స్నానఘట్టాన్ని భక్తుల శ్రమసేవతో నిర్మించాడు. తన తొలి సంకీర్తనల్లో భాగంగా ఆయన 10 సూత్రాలను చెప్పారు. 1) అప్పులుచేసి తీర్ధయాత్ర లకు వెళ్ళవద్దు. 2) ఆవులను, ఎద్దులను ప్రేమగా చూసుకోండి. 3) మీ పిల్లలను తప్పనిసరిగాచదివించండి. 4) దేవుడిపేరుతో మేకలను, కోళ్లను బలిఇవ్వడం మానెయ్యండి. 5) మీ తల్లిదండ్రులను సేవించండి. 6) పెళ్ళిళ్ళల్లో కట్నాలకు దూరంగా ఉండండి. 7) ఆకలిగొన్నవారికి రొట్టెలు పెట్టండి. 8) అంటరానితనాన్ని వ‌దిలివేయండి. 9)మద్యాన్ని సేవించకండి. 10) దేవుడిని కీర్తించటం ఎప్పుడూ మర్చిపోకండి. ఇవి ఆయన బోధనలు.

గ్రామ, గ్రామాన పర్యటన, బోధనలు:
మురికివాడలతో ఉన్న దళితవాడలకు వెళ్ళి వీధులను డేబూ స్వయంగా శుభ్రంచేసేవాడు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ వీధులను మీఇంటి చుట్టుప్రక్కలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి,” అంటూ తన పాటలతో ప్రజలకు నచ్చచెప్పేవాడు. కొన్నిచోట్ల మొక్కలను స్వయంగా నాటేవాడు. ఇలా డేబూను ప్రజలు ‘గాడ్గేబాబా’గా ఆప్యాయంగా పిలవటం ప్రారంభించారు. స్వచ్ఛతా ఉద్యమాన్ని విజయవంతంగా చేపట్టిన మొదటివ్యక్తి గాడ్గేబాబా.

అంటరానివారికి తొలి ధర్మశాల:
మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాలలో పండరి పురం, ఆనంది, నాసిక్ వంటి తీర్థక్షేత్రాలకు దళితులు కూడా పెద్దసంఖ్యలో వెళుతుండేవారు. వీరు అంటరాని వారు కనుక ఏ సత్రంలోను వీరికి ప్రవేశం వుండేదికాదు. ఒకప్రక్క పేదరికం. నిలువ నీడలేని పరిస్థితి. ఈ స్థితి చూసి సంత్ గాడ్గేబాబా ఈ పండరీపురంలో దళితుల కోసం సత్రం నిర్మాణం చేపట్టారు. నిత్యాన్నదాన సత్రం ఏర్పరిచాడు. దళితవాడల్లో బావులను తవ్వించారు.

దళితులను విద్యావంతులను చేయటానికి పాఠశాల భవనాలు, వసతి గృహాల నిర్మాణం చేపట్టారు. వారు స్వయంగా ఉదయంనుండి రాత్రివరకు కూలి పని చేసేవారు. దానితో దళిత యువకుల్లో ప్రేరణ కలిగేది. ఆడ, మగ అందరూ శ్రమదానం చేసేవారు. కొందరు ఇతర కులాలవారు సైతం వీటికి కావలసిన ఖాళీస్థలాలను ఇచ్చేవారు. కొన్నిచోట్ల ‘గోశాలలు’ కూడా ప్రారంభమయ్యాయి. తరువాత కాలంలో కుష్టురోగులకు ఆశ్రమాలు, చిన్నచిన్న ఆస్పత్రులు కూడా ప్రారంభ మయ్యాయి.

పండరీపురం ధర్మశాల కట్టినతరువాత నాసిక్, అలందీ, దేహూ, అకుల్ మొదలైన అనేక పుణ్యక్షేత్రాలలో గాడ్గేబాబా ధర్మశాలలను కట్టించారు. ముంబయిలోని పార్శీట్రస్టు కట్టించిన జేజే హాస్పటల్ కు వచ్చేపోయే పేదరోగులు, వారి బంధువులూ వసతిలేక చెట్లకింద, రోడ్లమీద ఎక్కడెక్కడో కాలం గడుపుతుండేవారు. ఎండలో, వానలో, చలిలో వారు పడుతున్న బాధలు చూసి ఆసుపత్రి పక్కనేఉన్న ఖాళీస్థలంలో ధర్మశాల కట్టితే బాగుంటుందని బాబా ఆలోచించారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి బి.జీ. ఖేర్ అండగా నిలిచారు. మూడంతస్తుల ధర్మశాల భవనం నిర్మాణమయింది. వృద్ధులయినవారికోసం వృద్ధాశ్రమాల గురించి ఆలోచించి ప్రారంభించారు.

చదువుద్వారానే నిమ్నకులాల ప్రగతి
సంత్ గాడ్గేబాబా స్వయంగా దళిత కుటుంబంలో జన్మించకపోయినా దళితప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపట్ల, సమస్యలపట్ల ఎంతో ఆవేదన ఉండేది. 1923నాటికి డా॥ అంబేడ్కర్ దళితుల ఉన్నతికోసం ఉద్యమించకముందే సంత్ గాడ్గేబాబా పండరిపూర్లోని గోపాల్ పురా రోడ్డులో ఛోకామేళా సత్రం నిర్మించి స్థానిక దళితులకు అప్పజెప్పారు. ఈ సత్రం నిర్మాణానికి 11లక్షల రూపాయలు ఖర్చు అయింది. అంతపెద్ద మొత్తం ఆ రోజుల్లో వసూలు- చేయటం అంటే నేడు మన ఊహకు అందే విషయం కాదు. ఈ అపూర్వమైన పనిని సంత్ గాడ్గేబాబా చేసి చూపించారు.

కేవలం ప్రవచనాలకే పరిమితం కాకుండా స్వయంగా 31విద్యాసంస్థలను, 15వసతిగృహాలను, ఒక బాలికా పాఠశాలను, ఒక ఉన్నత కళాశాలను, ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థలన్నీ ఇప్పటికీ ఎంతో చక్కగా నడుస్తున్నాయి. అంతేకాదు రైయత్ విద్యాసంస్థలు (కర్మవీర భావురావు పాటిల్ నిర్వహిస్తున్న) పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ (డా॥ అంబేడ్కర్ ప్రారంభించిన), డా॥ పంజాబ్రావ్ నడుపుతున్న విద్యా సంస్థలకు భూరి విరాళాలను అందజేశారు. 1952, ఫిబ్రవరి 8న, గాడ్గే మిషన్ అనే ట్రస్టును ఏర్పాటుచేసి, అప్పటికి ఆయన నడుపుతున్న 60కి పైగా విద్యాసంస్థలను ఒకగొడుగుకిందకి తీసుకువచ్చారు. వీటిలో తన కుటుంబసభ్యులెవరికి స్థానం కల్పించలేదు.

సంత్ గాడ్గేబాబా జన్మతః రజకుడు. వీరిది అంటరాని కులం కాదు. అయినప్పటికి వీరిని ఎవరైనా “మీ కులం ఏమిటి?” అని అడిగితే ‘మహార్, అనో ‘మాతంగ’ అనో లేదా ‘చర్మకారుడనో’ చెపుతుండేవారు. దాంతో ఇతర కులాలవారు ఈయనను అవమానిస్తుండేవారు. కొట్టిన సందర్భాలు అనేకం. అయిన ప్పటికి ఎదురుతిరగటమో, ఆగ్రహం వ్యక్తంచేయటమో గాడ్గేబాబా చేసేవారు కాదు. కేవలం నమస్కారంతో ప్రత్త్యుత్తరం చేసేవారు. తన సరళ స్వభావంతోను, తన పాటలద్వారానూ అన్ని కులాల ప్రజలలో, ప్రత్యేకం గా దళితులలో సామాజిక స్పృహను, ప్రేరణ కలిగించిన వారి నైపుణ్యం అమోఘం. మహారాష్ట్ర అంతటా గ్రామ గ్రామానా వారికి వేలాదిమంది అనుచరులు తయారయ్యారు. వారు ఏమి చదువుకోలేదు. ‘జ్ఞానము’, ‘చదువు’ ప్రాముఖ్యతను సామాన్యప్రజలకు, పేద ప్రజలకు అర్థమయ్యేభాషలో నచ్చచెప్పేవారు. “మీ పిల్లలను చదివించండి. కొత్త బట్టలు కొనుక్కోవద్దు, పాతబట్టలు, చిరిగిన బట్టలు ధరించినా ఫరవాలేదు. ఇంటిలో కంచాలను అమ్మండి. దోసిట్లోనే అన్నం తినండి. డబ్బుని ఆ విధంగా ఆదాచేయండి. డబ్బుతో పిల్లలను చదివించండి.” ఇలా వారి బోధనలు సాగుతుండేవి. వారు ఎవరింట్లోను నిదురించేవారుకాదు. ఏ చెట్టుక్రిందనో నిదురించేవారు. ఎవరిని బిక్షం అడిగేవారు కాదు, ఉదయం నుండి సాయంత్రం వరకు కూలిపనిచేసి అప్పుడు బిక్ష అడిగేవారు. వారిని చూసి అన్ని కులాలవారు ప్రత్యేకంగా దళిత వర్గాల ప్రజలు వారు చేస్తున్న పనులకు అండగా నిలిచారు.

అహింసా, గోసంరక్షణ:
జంతువులను బలి ఇవ్వడాన్ని సంత్ గాడ్గేబాబా తీవ్రంగా వ్యతిరేకించారు. ఎక్కడ బలులు ఇస్తున్నా అక్కడకు వెళ్ళి వాళ్ళకు నచ్చచెప్పేవారు. కొందరు ఎంతో మూర్ఖంగా బలిఇవ్వడాన్ని మానేవారు కాదు. రకరకాల పద్ధతుల్లో నచ్చచెప్పి బలులు మాన్పించేవారు. ముసలిఆవులను, ఎద్దులను రైతులు మేపలేకపోతే అవసరమైతే వాటికి గోరక్షణ కేంద్రాలను ఏర్పర్చాలని గాడ్గేబాబా చెప్పేవారు. మూర్తిజాపూర్లోని ఒక భూస్వామి 56 ఎకరాల స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఆ గ్రామం సాత్పూరా పర్వత శ్రేణుల్లో నాగర్వాడి గ్రామంలో ఉంది. అది ఎడారివంటి ప్రాంతం. ఉన్న ఒకబావిలోని నీరు విషపూరితమైనది. గాడ్గేబాబా స్వయంగా బావిలోకి దిగి నీటిలోని అట్టడు గునవున్న విషపు మొక్కలను తొలగించి శుభ్రంచేశారు. ఆ నీటిని మొత్తం బయటకు తోడేసారు. బావిలో తిరిగిమంచినీరు వచ్చాయి. బాబా స్వయంగా తాను నీళ్ళును త్రాగి ఈ నీళ్ళు మంచినీళ్ళే అని అందరికి చూపించారు. దాంతో అక్కడ ఎక్కువ ఆవులు, ఎద్దులతో గోశాల ప్రారంభమైంది.

రుచి ఎరుగని ఋషి:
బాబా కాకముందు డేబూ మాంసాహారం తినేవారు. బాబా అయిన తరువాత వారు మాంసాహారాన్ని తినటం మానివేశారు. సాధువుగా మారినప్పటినుండి కేవలం ఉల్లిపాయముక్క ప‌చ్చ‌డిలతో కూడిన రెండు జొన్న రొట్టెలే తినేవారు. మహారాష్ట్రలో అత్యంత పేదవారి ఆహారం అది. దానిని ‘ఝంకాభంకర్’ అని పిలుస్తారు. అది తప్ప జీవితాంతం ఏరకమైన, రుచికరమైన ఆహారం తినలేదు. పేదవారికోసం అనేక అన్నదానకార్యక్రమాలు నిర్వహించారు. ధనవంతులను ప్రోత్సహించి అన్న సంతర్పణలో మిఠాయిలను వడ్డించేవారు.

పండిత మాలవ్యాతో సంబంధం:

గాడ్గేబాబా సంకీర్తనకోసం కాశీ వెళ్ళారు. వారి రాకను తెలుసుకుని పండిత మదనమోహన మాలవ్య స్వయంగావచ్చి గాడ్గేబాబాను కలిసి తాను ప్రారంభించిన హిందూ విశ్వవిద్యాలయాన్ని చూడడానికి రావలసిందిగా గాడ్గేబాబాను ఆహ్వానించారు. హిందూ విశ్వ విద్యాలయాన్ని చూసి గాడ్గేబాబా ఎంతో ఆనందించారు. ఆరోజు సాయంత్రం గంగానది ఒడ్డున సంకీర్తన ఏర్పాటయ్యింది. సంకీర్తనలో గాడ్గేబాబా “మీరు కాశీకివచ్చి విశ్వనాధునితోపాటు మాలవీయ స్థాపించిన విశ్వవిద్యాలయాన్నికూడా చూడాలి. నిజమైన విశ్వనాథుడు ఈయనే. ఎందుకంటే దేశం నలుమూలలనుండి వేలాదిమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు” అని మాలవ్యపట్ల తనకుగల గౌరవాన్ని ప్రదర్శించారు.

మెహర్బాబాతో కలిసి కుష్ఠురోగుల సేవలో:

ఆనాడు మెహర్బాబా ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వేలసంఖ్యలో వారికి భక్తులు అనుయాయులు ఉన్నారు. మహారాష్ట్రలో కుష్టురోగుల సంఖ్యకూడా ఎక్కువే. వారు పడుతున్న కష్టాలను చూసి గాడ్గేబాబా చలించిపోయారు. రోడ్డు ప్రక్కన కనబడిన అనేకమంది కుష్ఠురోగులను గుర్తించి వారికి స్వయంగా స్నానం చేయించి ఆప్యాయంగా ఆహారం పెట్టి వారిని తనకు తెలిసిన కుష్ఠురోగుల ఆశ్రమంలో బాబా చేర్పించేవారు. ఈ సేవలో మెహర్బాబాతో కలిసి గాడ్గేబాబా అనేకమంది కుష్ఠురోగులను సేవించారు.

గాంధీజీ తో …
బొంబాయి ముఖ్యమంత్రి జి.జి.భేర్ ఏదో ఒక సందర్భంలో మహాత్మాగాంధీకి గాడ్గేబాబా గురించి వివరించి చెప్పగా, గాంధీజీకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఇటువంటి అలౌకిక వ్యక్తిత్వం గల్గిన వ్యక్తిని ప్రత్యక్షంగా దర్శించాలని గాంధీజీ అనుకున్నారు. వార్ధా సమీపగ్రామాలలో తిరుగుతూ గాడ్గేబాబా గాంధీజీ నివసిస్తున్న ఆశ్రమం దగ్గరకు వచ్చారు. గాడ్గేబాబా వచ్చారని తెలియటమే ఆలస్యంగా చుట్టుప్రక్కల గ్రామాలనుండి వందలాదిమంది గుమిగూడినారు. ఆ జనసమూహాన్ని చూస్తూనే ఆయనపట్ల ప్రజలకుగల భక్తిశ్రద్ధలు ఎంత గాఢమైనవో గాంధీజీకి అర్థమైంది. గాడ్గేబాబా ఆశ్రమంలోకి ప్రవేశించగా, వారు కూర్చొనడానికి గాంధీజీ ఒక ఆసనం చూపించారు. గాడ్గేబాబా దానిపై కూర్చొన కుండా, నేలపైనే కూర్చున్నారు.
గాంధీజీ అడిగారు- “బాబా, మీరు ఇన్నిన్ని విరాళాలు సేకరించారు గదా! ఇప్పుడు మీ ఆస్తులు సముదాయం ఎంత ఉంటుంది?”. బాబా తన రెండు చేతులు ఎత్తి ఒక చేతిలో బిక్షాపాత్ర, రెండవ చేతిలో చేతికఱ్ఱ. “ఇవే నా ఆస్తులు”. ఆ మాటలు విని గాంధీజీ చకితులైనారు. పండరిపురంలోను, మిగిలిన చోట్లా బాబా నెలకొల్పిన ధర్మశాలల గురించి అడిగిన ప్రశ్నలకు బాబా జవాబిచ్చారు. గాంధీజీ కోరిక మేరకు కొంతసేపు భజనకీర్తనలు పాడి వినిపించారు. ఆపై గాంధీజీకి నమస్కరించి పర్భణీ వైపుగా తన పని నిమిత్తంగా సాగిపోయారు.

మహారాష్ట్రలో దురాచారాల నిర్మూలన ప్రచారకర్తగా:

మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీఖేర్, గాడ్గేబాబాను దుర్వ్యసనాల నిర్మూలనకి ప్రచారకర్తగా నియమించారు. వారికి ఒక వాహనాన్నికూడా కేటాయించారు. బాబా నిర్వహించిన ప్రచారం, సంకీర్తనలవల్ల అనేక వేలమంది త్రాగుడు మానివేశారు.

సంత్ గాడ్గేబాబాతో డా|| అంబేడ్కర్ :

డా॥ అంబేడ్కర్‌ కు సాధుసంతులపట్ల పెద్దగా శ్రద్ధలేదు. కాని గాడ్గేబాబా ప్రవచిస్తున్న కీర్తనలను అనేక సందర్భాలలో స్వయంగా శ్రోతలలో ఉండి విన్నారు. డా॥ అంబేడ్కర్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో పర్యటనకు వచ్చారు. ఆరోజు 14 జులై, 1949, బాబా ఆరోగ్యం బాగులేకపోయినా వారు ఒపిక తెచ్చుకుని డాక్యుమెంట్లను తెప్పించారు. పండరీపురం లోని తాను నిర్వహిస్తున్న చోకామేళా ధర్మశాలను షెడ్యూల్డు కులాల విద్యార్థులకు వసతిగృహంగా డా॥ అంబేడ్కర్ కు అందజేశారు. డాక్యుమెంట్లపై బాబా వేలిముద్రలు వేశారు. బాబా మాట్లాడుతూ “బాబా సాహెబ్, ‘కబీర్ ఏమిచెప్పాడో తెలుసుగా?….’ జీవితం క్షణికం. ఇవ్వాల్టి పని రేపటికి వాయిదా వేయవద్దు. ధర్మశాలను మీకు అప్పచెప్పాలని ఎప్పటినుంచో మనసులో ఉంది. ఇన్నాళ్ళకి ఇది నెరవేరింది. 1956లో గాడ్గేబాబా బొంబాయి జె. జె. ఆసుపత్రి, – ధర్మశాల నిర్మాణంలో తలమునకలై ఉన్నారు. అంబేడ్కర్ తనను కలవటానికి రానున్నారని తెలిసి తానే అంబేడ్కర్ ఉంటున్న కొలాబా ప్రాంతానికి వెళ్ళాడు. అంబేడ్కర్ మాట్లాడుతూ “హిందూసమాజంలో అంటరానితనం అనాదిగా వస్తున్నది. ఇది పోయేలా లేదు. నేను హిందువుగా పుట్టినా హిందువుగా చావను, ఏమతంలో సమానత్వం ఉంటుందో ఆ మతాన్ని – స్వీకరిస్తానని నేను 1935లో ప్రకటించాను. రాజ్యాంగాన్ని వ్రాసేపని పూర్తయింది. నేను మతం మారాలి. ఏ మతంలోకి వెళితే బాగుంటుందో సలహా ఇవ్వండి” అని అన్నారు. దీనిపై సంత్ గాడ్గేబాబా స్పందిస్తూ, “అంబేడ్కర్, నేను చదువులేనివాడిని, నాకు ఈ మతాలగురించి ఏమితెలుస్తుంది? అయితే ఒకమాట. మొత్తం నిమ్నకులాల జనమంతా మీ ఒక్కరివెనుక ఉన్నారు. మీరు ఏదిచెపితే అది చేస్తారు. కాబట్టి వారిని సరియైన మార్గంలో నడిపించండి, మీ చర్య దేశానికి, సంస్కృతికి నష్టం కల్గించరా”దని సలహా ఇచ్చారు.
1956 విజయదశమి రోజున డా॥ అంబేడ్కర్ బౌద్ధధర్మాన్ని స్వీకరించారు. “నేను గాడ్గేబాబాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఈ గడ్డలో జన్మించిన బౌద్ధధర్మాన్ని స్వీకరించాను, విదేశీమతాన్ని స్వీకరించ లేదు” అని డా॥ అంబేడ్కర్ వివరించారు.

గోవులను సేవించే సరైన పద్ధతి : ‘సజ్జనులారా! నాదొక ప్రార్ధన ఉంది. ఇతరులకు సలహా ఇవ్వడానికి, వారిని ఒప్పించడానికీ ముందుగా మీరు మీ ఇళ్లలో అవును పెట్టుకొని పోషించండి. మీరు ఆ పనిచేస్తే కసాయివాళ్ల చేతులనుండి ఆవులను రక్షించాలని ఉద్బోధచేస్తూ దేశమంతా తిరిగే పని తప్పుతుంది. ఒకవేళ అవసరమైతే, ఆ పని నేను చేస్తాను” అని చెప్పేవారు.

గాడ్గేబాబా ఆఖరి కీర్తన:
1956 నవంబరు నాటికి బాబా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాంద్ర పోలీసులైన్సులో తాము చేస్తున్న సత్యనారాయణపూజకు వచ్చి కీర్తన పాడవలసిందిగా బాబాను కోరారు. అక్కడికి బాంద్రానుంచే కాక చుట్టు ప్రక్కలనుండి వేలాదిమంది జనం తరలివచ్చారు. అనారోగ్యం కారణంగా మౌనంగా ఉందామనుకున్నా గాడ్గేబాబా ఆ జనాలను చూసి కీర్తనను అందుకున్నారు. గోపాలా, గోపాలా, దేవకీ నందన గోపాలా..తుకారం మహారాజ్ కీర్తనలతో ప్రారంభించి, బాబా కీర్తనలు చాలాసేపు పాడారు. “మీ అందరి సమక్షంలో భజన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీరంతా నన్ను కలిసారు, చూశారు, మాట్లాడారు, ఇదే ఆఖరు కావచ్చు. నాకు ఆఖరి పిలుపు వినిపిస్తుంది. చావు నా ముందు ఉంది. మీ అందరి దర్శనం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే నా ఆఖరి కీర్తన. మీ అందరికీ నా ధన్యవాదాలు,” అంటూ ముగించారు. ఆ తరువాత ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 20 నవంబరు 1956 రాత్రి గాడ్గేబాబా దీర్ఘనిద్రలోకి జారుకున్నారు.

ఒక చిన్న గ్రామంలో వెనుకబడిన కుటుంబంలోజన్మించిన ఒక బాలుడు అసాధారణ వ్యక్తిగా రూపొందడం ఆసక్తిదాయకమైన విషయం. ఆయన జీవితంలో మొదటి సగం ఈ సమాజాన్ని, ప్రపంచాన్నీ పరీక్షించి, అర్థం చేసుకోవటంలో గడవగా, రెండవ సగమంతా సమాజంలోని దోషాలను తొలగించే కృషిలో నిమగ్నమై గడిచింది.