
పద్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం దురాక్రమణదారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్న కాలమది. ఆ చీకటియుగంలో జన్మించిన రవిదాస్ సుమారు 120 సంవత్సరాలు జీవించారు. తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి ఊపిరి పోశారు. ఆవిధంగా మత, సాంస్కృతిక అణచివేతను ఎదుర్కొనేందుకు ప్రజలను సంసిద్ధులను చేశారు. పండితులు, మహారాజులు, సామాన్యులు, పామరులు అందరూ వారి భక్తులయ్యారు. సంత్ శిరోమణిగా అందరిచే కొనియాడారు. నేటికీ ఉత్తరభారతంలో వారి శిష్యులుగా భక్తి ఉద్యమానికి ప్రచారకులుగా పనిచేస్తున్నవారు ఎందరో వున్నారు.