విద్యార్థి సమగ్ర వికాసము కోసం విద్యా భారతి, దీని ఆధ్వర్యంలోని శ్రీ సరస్వతీ విద్యా పీఠం పనిచేస్తున్నాయని విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్రం ( తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక) సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ప్రధానమైన అయిదు ఆధారభూత విషయములందు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు గాను… ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అవసరం అని ఆయన సూచించారు. ఇటువంటి శిక్షణలతో ఉపాధ్యాయులు తమ వృత్తిలో మెరుగ్గా రాణిస్తారని ఆయన అభిప్రాయ పడ్డారు.
శ్రీ సరస్వతీ విద్యాపీఠం, తెలంగాణ, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల వర్క్ షాపు నిర్వహించారు. ఆధారభూత విషయములైన అయిదు అంశములలో ఎంపిక చేసిన ఆచార్యులు, మాతాజీ లకు శిక్షణ అందించారు. ఈ కార్యశాల ను క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఉద్ఘాటన కార్యక్రమంలో విద్యాపీఠం తెలంగాణ ప్రాంతం అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.
పంచకోశములను ఉత్తేజ పరిచే ఆధార భూత విషయములకు ప్రాధాన్యం ఉంటుందని ప్రాంత అధ్యక్షులు తిరుపతి రావు అభిప్రాయపడ్డారు. దీనిని గుర్తించే జాతీయ విద్యా విధానంలో వీటిని చేర్చటం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో రూపొందించిన వీడియోలను లింగం సుధాకర్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యశాల లో అయిదు రకముల ఆధార భూత విషయములందు సమగ్రమైన శిక్షణ అందించారు. శారీరక్ నుంచి 21మంది, యోగ నుంచి 20మంది, సంగీతము నుంచి 15, సంస్క్రతము నుంచి 15 మంది, నైతిక విద్య నుంచి 16 మంది …. మొత్తంగా 93 మంది పాల్గొన్నారు. శిక్షకులుగా క్షేత్ర యోగ ప్రముఖ్ సరికొండ కోటమరాజు, క్షేత్ర శారీరక ప్రముఖ్ కొసనం జగదీష్, తదతరులు పాల్గొన్నారు.
కార్యశాల ముగింపు కార్యక్రమానికి విద్యాభారతి దక్షిణ మద్య క్షేత్రం అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వర రావు, ఐఎఎస్ (రిటైర్డ్) విచ్చేశారు. ఆధారభూత విషయములు, శిక్షణ ప్రాధాన్యాన్ని ఆయన వివరించారు. ఇతిహాస సంకలన సమితి వారి మరో వీడియో సెట్ ను ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు.