Home News నూపుర్ శ‌ర్మ‌పై చ‌ర్యలు తీసుకోవ‌ద్దు… రాష్ట్రాల‌కు సుప్రీకోర్టు ఆదేశం

నూపుర్ శ‌ర్మ‌పై చ‌ర్యలు తీసుకోవ‌ద్దు… రాష్ట్రాల‌కు సుప్రీకోర్టు ఆదేశం

0
SHARE

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. మహమ్మద్ ప్రవక్త పై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లలో ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకూడ‌ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జులై 1 నాటి ఉత్తర్వుల్లో కోర్టు సూచించిన విధంగా ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఎలా పొందవచ్చనే మార్గాలను అన్వేషించేందుకు శర్మపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లలోని ప్రతివాదులకు సుప్రీం కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఈ కేసులన్నింటినీ కలిపి ఢిల్లీకి బదిలీ చేయాలంటూ నూపుర్ శ‌ర్మ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేయగా, న్యాయస్థానం అందుకు తిరస్కరించింది. దీంతో పిటిషన్ ను ఉపసంహరించుకున్న ఆమె.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను ఉపసంహరించుకున్న పిటిషన్ ను పునరుద్ధరించాలని, తనపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్‌ల‌ను ఏక‌తాటిపైకి తీసుకురావాల‌ని, అలాగే ధర్మాసనం తనపై చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఆమె సోమ‌వారం(18.07.2022) మరో పిటిషన్ దాఖలు చేశారు.

సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ ద్వారా నూపుర్ శ‌ర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం విచారించింది. శర్మ ప్రాణాలకు ముప్పు ఉందని సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమెను హతమార్చేందుకు దేశ స‌రిహ‌ద్దు దాటి వ‌చ్చిన ఒక పాకిస్తాన్ జాతీయుడిని స‌రిహ‌ద్దు భ‌ద్ర‌తా ద‌ళం(BSF) అదుపులోకి తీసుకున్న‌ట్టు ఇటీవలి వార్త‌ను కూడా అతను మ‌ణింద‌ర్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకోచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ నూపుర్ శ‌ర్మ పిటిషన్ పై తమ స్పందన తెలియజేయాలంటూ ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, జమ్మూకశ్మీర్, అస్సాం రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 10లోగా ఈ నోటీసులకు సమాధానమివ్వాలంటూ స‌ద‌రు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదేశించింది. నోటిసుల‌కు విధించిన నిర్దేశిత గ‌డువులోగా నూపుర్ శ‌ర్మ‌పై ఎలాంటి నిర్భంద‌పూరిత‌మైన చ‌ర్యలు చేప‌ట్ట‌రాద‌ని సంబంధిత రాష్ట్రాల‌ను ఆదేశించింది. కేసుల నుంచి ఉపశమనం కోసం నూపుర్ శ‌ర్మ ప్ర‌తీ కోర్టుకూ తిరగాలని తాము కోరుకోవట్లేదని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కేసు తదుపరి విచారణను స‌ర్వోన్న‌తి న్యాయ‌స్థానం ఆగ‌స్టు 10కి వాయిదా వేసింది.