మత మార్పిడులను నిరోధించడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు, దళితుల దరి చేరి హైందవ సనాతన ధర్మం గొప్పతనంపై చైతన్యం తీసుకురావడం ఒక్కటే మార్గమని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఉద్బోధించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖ అనుబంధ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు పివిఆర్‌కె ప్రసాద్ నేతృత్వంలో టిటిడి సహకారంతో జరిగిన ధార్మిక సదస్సులో పాల్గొన్న పలువురు మఠ, పీఠాధిపతులు హైందవ ధర్మ పరిరక్షణకు, మత మార్పిడుల నిరోధానికి చేపట్టాల్సిన అంశాలపై ఏకవాక్య మార్గాన్ని ప్రబోధించారు.
- మత మార్పిడుల నిరోధానికి అదే దారి
- ధార్మిక సదస్సు ఏకవాక్య తీర్మానం
- పరమత ప్రచారానికి అప్పుడే అడ్డుకట్ట
- కంచి జయేంద్ర స్వామి ఉద్బోధ
- యువత ధార్మిక చిన్తవైపు మళ్ళాలి
- విశ్వంజీ మహారాజ్ హితువు
- ధర్మరక్షణలో ప్రభుత్వాలదే కీలక పాత్ర
- త్రిదండి చినజీయర్ అభిప్రాయం
హైందవ సనాతన ధర్మం వేదాల నుంచి వచ్చిందని, ఇలాంటి ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని 4వ సనాతన ధార్మిక సదస్సులో మఠాధిపతులు, పీఠాధిపతులు ఆకాంక్షించారు. రాష్ట్ర దేవాదాయశాఖకు చెందిన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఆధ్వర్యంలో టిటిడి సహకారంతో తిరుమలలోని ఆస్థాన మండంలో సోమవారం ఉదయం సనాతన ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 63మంది మఠ,పీఠాధిపతులు ఈ సమావేశానికి విచ్చేశారు. ఈసందర్భంగా వారు తమతమ ప్రాంతాల్లో హిందూ ధర్మ పరిరక్షణకు, ప్రజా చైతన్యానికి, సామాజిక సేవలపై చేపడుతున్న కార్యక్రమాలను సవివరంగా తెలియజేశారు. ముందుగా శ్రీవారి ఆలయ తిరుమల జీయర్ స్వామి గోవిందరామానుజ చిన్నజీయర్ స్వామి మంగళాశాసనాలతో సదస్సు ప్రారంభమైంది. వేదాలు భారతీయ జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని, ప్రశాంతమైన, నీతివంతమైన జీవనం సాగించేందుకు దోహదపడుతుందని స్వామీజీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి వేదాలను, సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోవాలి:పివిఆర్ ప్రసాద్
అతి పవిత్రమైన హైందవ సనాతన ధర్మాలపై అన్యమతస్థులు చేస్తున్న దుష్ప్రచార దాడిని అడ్డుకోవడానికి యావత్ హైందవ సమాజం సంఘటితమై కార్యోన్ముఖులు కావాల్సిన అవసరం ఉందని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు అధ్యక్షులు పివిఆర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. మారుమూల గ్రామాల్లో ధర్మప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో సనాతన ధర్మ ప్రచారం విస్తృతం చేయాలన్నారు. ఇందుకోసం మఠాధిపతులు, పీఠాధిపతులు ఏకతాటిపైకి వచ్చి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని అభ్యర్ధించారు. గ్రామ స్థాయిలో ఉత్సాహ వంతులైనవారికి 400మందికి శిక్షణ ఇచ్చి హిందూ ధర్మ ప్రచారకులుగా తీర్చిదిద్దినట్లు వివరించారు. హైందవ సనాతన ధర్మ గొప్పతనంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు వీరు కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. హిందూ ధర్మప్రచారకులు గ్రామాల్లో పర్యటించి మత మార్పిడులు జరగకుండా అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు విద్య, ధార్మిక అంశాలు, భజనలపై శిక్షణ ఇస్తున్నామని, తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు.
ధర్మప్రచార కార్యక్రమాలు మరింత విస్తృతం: చదలవాడ
టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ సనాతన ధర్మప్రచారానికి టిటిడి రాజీలేని విధానాలతో విస్తృతంగా ధర్మప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోందని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఉద్ఘాటించారు. తిరుమల దివ్యక్షేత్రానికి విచ్చేసే భక్తులకే కాకుండా, ఈ క్షేత్రానికి రాలేకపోతున్న మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా స్వామివారి దర్శనం కల్పించేందుకు టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా అన్నిప్రాంతాల్లో సంచరించడానికి వీలుగా సంచార రథాలు, వివిధ ప్రాంతాల్లో కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న హైంధవుల కోరికమేరకు అనేక దేశాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం ప్రారంభించిన గోపూజకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.టిటిడి ఇఓ సాంబశివరావు మాట్లాడుతూ ధర్మప్రచారానికి ఆలయాలే కేంద్ర బిందువులని, దీనిని గుర్తించి మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు దర్శనం, బస, అన్నప్రసాదం తదితర వసతులతోపాటు ధర్మప్రచారం, ఉచిత విద్య, వైద్యం, గోసంరక్షణ, వేదపరిరక్షణ, ఆలయాల నిర్మాణం ప్రాధామ్యాలుగా ముందుకు వెడుతున్నామని ఇ ఒ వివరించారు. వేదాల పరిరక్షణకోసం వేద విశ్వవిద్యాలయాన్ని, 7 వేద పాఠశాలలను నిర్వహిస్తున్నామన్నారు. 1280 మంది వేదపారాయణదారులు, 280 మంది దివ్యప్రబంధ పారాయణదారులు ప్రతి జిల్లాలోను ముఖ్యమైన ఆలయాల్లో పారాయణం చేస్తున్నట్లు తెలిపారు. టిటిడి ప్రాజెక్టులు భజనలు, రథయాత్రలు, మెట్లోత్సవాల ద్వారా ధర్మప్రచారం చేస్తున్నాయని, ఆధ్యాత్మిక ప్రచురణలు, సప్తగిరి మాసపత్రిక, శ్రీ వేంకటేశ్వరభక్తి చానల్ కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అన్నారు. ఆధ్యాత్మిక చానళ్లలో ఎస్వీబిసి మొదటి స్థానంలో ఉందని, ఇటీవల తమిళ చానల్ కూడా ప్రారంభించామన్నారు. సదస్సుకు విచ్చేసిన మఠాధిపతులు, పీఠాధిపతులు ఫలప్రదమైన చర్చలు జరిపి ఆచరణీయమైన సూచనలు ఇవ్వాలని ఇ ఓ సాంబశివరావు కోరారు.
వెనుకబడిన ప్రాంతాల భక్తులకోసం ‘దివ్యదర్శనం’
సదస్సులో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి జిఎస్‌వి ప్రసాద్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో భక్తుల కోసం ఈ ఏడాది జనవరి 2న దివ్యదర్శనం పేరుతో ప్రత్యేక దర్శన కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ రూపొందించిందని వెల్లడించారు. ఈ ఏడాదిలోగా 1.30 లక్షల మందికి ముఖ్య ఆలయాల్లో స్వామి దర్శనం కల్పించాలన్నది తమ లక్ష్యమన్నారు. కాశీ, ప్రయాగ, కేదార్‌నాథ్, బద్రీనాధ్ వంటి పవిత్రపుణ్య క్షేత్రాల్లో కూడా వీరికి దర్శనభాగ్యం కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అనంతరం దేవాదాయశాఖ కమిషనర్ వైవి అనురాధ కూడా హిందూ ధర్మ పరిరక్షణపై ఉపన్యసించారు. అనంతరం పుస్తకావిష్కరణ సమరసత సేవా ఫౌండేషన్ వారు 2015 డిసెంబర్ 2న తిరుమలలో టిటిడి, రాష్ట్ర దేవాదాయశాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఏర్పాటు చేసిన ధార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికను పుస్తక రూపంలో ఆవిష్కరించారు.
మత మార్పిడులను నిరోధించడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు, దళితుల దరి చేరి హైందవ సనాతన ధర్మం గొప్పతనంపై చైతన్యం తీసుకురావడం ఒక్కటే మార్గమని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఉద్బోధించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖ అనుబంధ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు పివిఆర్‌కె ప్రసాద్ నేతృత్వంలో టిటిడి సహకారంతో జరిగిన ధార్మిక సదస్సులో పాల్గొన్న పలువురు మఠ, పీఠాధిపతులు హైందవ ధర్మ పరిరక్షణకు, మత మార్పిడుల నిరోధానికి చేపట్టాల్సిన అంశాలపై ఏకవాక్య మార్గాన్ని ప్రబోధించారు.
దళితవాడల వనవాసాల స్థానాలకు స్వయంగా మఠ, పీఠాధిపతులు ధార్మిక పరిరక్షకులు వెళ్ళి హైందవ ధర్మ పరిరక్షణ గొప్పతనాన్ని చాటితే ఎంతమంది అన్యమతస్తులు ప్రలోభ పరచినా పరమతాలవైపు కనె్నత్తి చూడరని స్పష్టం చేశారు.శివస్వామి మాట్లాడుతూ తమ పీఠం తరపున దళితవాడల్లో 155 దేవాలయాలను నిర్మించామని చెప్పారు. టిటిడి సంస్థలో అన్యమతస్తులు పనిచేస్తూ హైందవులు స్వామివారిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలతో సమర్పిస్తున్న కానుకలతో జీతాలు పొందుతున్నారని అలాంటి వారిలో కూడా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
శంకరానంద స్వామి మాట్లాడుతూ ధార్మిక సంస్థలో భక్తులు సమర్పిస్తున్న నిధులు సక్రమ మార్గంలో వినియోగమయ్యేలా నిఘా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. గౌడ మఠం పీఠాధిపతి మునిమహరాజ్ మాట్లాడుతూ హైందవ ధర్మంలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం వల్లే అన్యమతస్తుల ప్రలోభాలకు గురవుతున్నారని, అలాంటి వారిని హైందవ ధర్మం పట్ల చైతన్య పరచాలని అన్నారు. పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యాశంకర భారతి మాట్లాడుతూ తమ మఠం చేపడుతున్న హైందవ ధర్మ పరిరక్షణ గురించి తెలిపారు.
శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి మాట్లాడుతూ తాత్కాలిక అవసరాలకు లోబడి వందల మంది అన్యమతాల వైపు మొగ్గు చూపుతున్నారని అలాంటి వారి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత హైందవ ధర్మ పరిరక్షకులపై ఉందన్నారు. ప్రైవేట్ వ్యక్తులు సక్రమంగా నిర్వహించలేని దేవాలయాలను గుర్తించి దేవాదాయ శాఖ, టిటిడి ఆర్థిక సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ దర్శిని అనే కార్యక్రమం ఏర్పాటు చేసి హైందవ సంస్థలు చేపడుతున్న సేవ కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
చిన్మయానంద స్వామి మాట్లాడుతూ యువతను హైందవ ధార్మిక కార్యక్రమాలవైపు ప్రోత్సహించాలన్నారు. విశ్వంజీ మహరాజ్ మాట్లాడుతూ రాజకీయం, సినిమాల వైపు వెడుతున్న సమాజాన్ని ధార్మిక చింతనవైపు మళ్ళించే మార్గాలను అనే్వషించాలన్నారు.
కమలానంద భారతీ స్వామి మాట్లాడుతూ హైందవ ఆచార వ్యవహారాలు, హైందవ ధర్మ మహత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సత్యానంద భారతీ, రంగనాథ మహాదేశికర్ , త్రిదండి రామానుజ జియ్యర్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణలో ప్రభుత్వాల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. చతుర్వేద స్వామి మాట్లాడుతూ ముక్కోటి దేవతలకు నిలయంగావున్న గోమాత సంరక్షణ, గోవధ నిషేధంపై ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.
అహోబిల రామానుజ జియ్యర్ మాట్లాడుతూ హైంధవ పరిరక్షణకు లీగల్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోని ప్రధాన హైందవ దేవాలయాలు ఒక్కో జిల్లాను దత్తత తీసుకుని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆర్ష విద్యాపీఠం పీఠాధిపతి ప్రణవాత్మకానంద సరస్వతి మాట్లాడుతూ పీఠాధిపతులు పరమత ప్రచారం జరగకుండా దళితవాడల్లో ప్రవాసం చేయాలన్నారు. శుక బ్రహ్మాశ్రమం పీఠాధిపతి విద్యాప్రకాశానందగిరి మాట్లాడుతూ సనాతన భారతీయతను బోధించే అంశాలను విద్యార్థి దశ నుంచే బోధించేలా పాఠ్యాంశాలను తయారు చేయాలన్నారు. ప్రతి ఇంటికి ధర్మప్రచార సాహిత్యాలను అందించాలన్నారు.
సత్యాత్మ తీర్థస్వామిజీ మాట్లాడుతూ గ్రామాలను మఠ,పీఠాధిపతులు దత్తత తీసుకుని ధర్మప్రచారం చేయాలన్నారు. మంత్రాలయ సుబుదేంద్రతీర్థ స్వామిజీ మాట్లాడుతూ ప్రతి హైందవ దేవాలయంలో గోపూజ నిర్వహించాలన్నారు. శ్రీశక్తి పీఠం మాత రమ్యయోగిని మాట్లాడుతూ ధర్మానికి ప్రతీకలైన మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. ఆచార వ్యవహారాలను సరళీకృతం చేయాలన్నారు. స్వామి విరజానంద మాట్లాడుతూ ఆపదలు ఎదురైనప్పడు స్వామీజీలే రక్షణ కల్పించాలన్నారు. అష్టలక్ష్మీ పీఠం పీఠాధిపతి దండిస్వామి మాట్లాడుతూ ఇతర మతస్థుల చర్యలను ఖండించే విధంగా ఎప్పటికప్పుడు చర్చా గోష్టులు జరగాలన్నారు.
(ఆంధ్రభూమి సౌజన్యంతో)