Home News సమాజాన్ని చీల్చే పనిలో నిమగ్నమైన మీడియాలోని ఒక వర్గం

సమాజాన్ని చీల్చే పనిలో నిమగ్నమైన మీడియాలోని ఒక వర్గం

0
SHARE

మన దేశాన్ని పరిపాలించిన మొగలులు, ఆంగ్లేయులు, ఆ తరువాత కాంగ్రెసు వారు.. వీరందరిలో ఒక సమానాంశం ఉంది. వీళ్ళందరు తమ పాలనను సజావుగా, సుస్థిరంగా కొనసాగించ డానికి జాతి వ్యవస్థను ఒక ఆయుధంగా ఉపయో గించుకున్నారు. వీళ్ళు అధిక కాలం పరిపాలించ డానికి సమాజాన్ని జాతుల ఆధారంగా విభజించ డానికి పూనుకున్నారు. కాలక్రమేణా దేశంలోని పలు రాష్ట్రాలలో కాంగ్రెసు అధికారం కోల్పోతూ వస్తోంది. అంటే కాంగ్రెసు ముక్త భారతదేశం రూపొందుతోంది. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెసు పార్టీ తిరిగి అధికారం హస్తగతం చేసుకోవ డానికి తామ ఇంతకు ముందు ఉపయోగించిన ‘జాతుల మధ్య వైరం సృష్టించడం’ అనే ఆయుధాన్ని మళ్ళీ తెర పైకి తెచ్చి లబ్ది పొందే ప్రయత్నం ప్రారంభించింది. మనం చింతించవలసిన మరో విషయమేమంటే ‘మీడియా’లోని ఒక వర్గం హిందువులను కులం, జాతుల ఆధారంగా విడగొట్ట డానికి శాయశక్తులా కృషి చేస్తోంది.

గతంలో కూడా ఇలాంటి చర్యలు జరిగేవి. కాని అవి ఎవరికీ తెలియకుండా, లోలోన గుంభనంగా జరిగేవి. కాని ఇప్పుడు ఈ పనులన్నీ బాహాటంగానే చేస్తున్నారు. దేశంలో గొప్ప జర్నలిస్టులు అనుకున్న వారు కూడా ఇలాంటి విషయాలను ఎలక్ట్రానిక్‌ మీడియాలో చెప్పడమే కాకుండా ప్రింట్‌ మీడియాలో కూడా సమాజంలోని వివిధ వర్గాల మధ్య ద్వేషాలు కలిగేటట్లు, ఒకరిపట్ల మరొకరు విశ్వాసం కోల్పోయే విధంగా మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. వీళ్ళ మాటలు, రాతలు చూస్తోంటే ఇవి అప్రయత్నంగా చేసినవి కాదని, ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి ఈ కార్యానికి పూనుకొన్నట్లు స్పష్టమవుతోంది.

ఈ మధ్యే బిహార్‌లో పశుగ్రాసం, ఇతర ఆరు కేసులలో నిందితుడైన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌పై తీర్పు వెలువడింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌తోపాటు మరెందరో దోషులుగా తేలారు. నకిలీ సెక్యులర్‌ మీడియాకు లాలూపై అమితమైన ప్రేమ. వాటి ప్రసారాలను పరిశీలిస్తే ఈ విషయం రాజకీయ పరిజ్ఞానం లేని వారికైనా అర్థమవుతుంది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ గడ్డి కుంభకోణంలో నొక్కేసిన దాన్లో కొంత భాగం లాలూకు వంత పాడే విలేకర్లకు అంది ఉంటుం దనటంలో ఏ మాత్రం అనుమానం లేదు. అలా లబ్ది పొందిన వారు లాలూకు కొమ్ము కాయకుండా ఎలా ఉంటారు? అందుకే 2జి కేసులో రాజా, కనిమొళి నిర్దోషులుగా విడుదల కాగానే ఇక లాలూ కూడా నిర్దోషిగా బయటకు వస్తాడని కథనాలు ప్రసారం చేశారు. లాలూ వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని; బిహార్‌ పాలనలో తన వంశమే ఉండాలని భార్యను, కొడుకులను అందరినీ రాజకీయాలలో దించాడని పత్రికల వారికి తెలుసు. అయినా అమ్ముడుపోయిన విలేకరులు లాలూ ఒక సమాజ సేవకుడు, అతడు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, వెనకబడిన వర్గానికి చెందినవాడు, ఇలా ఎన్ని సాకులు చెప్పవచ్చో అన్ని రకాలుగా అరిచి గీ పెట్టారు. ఇలాంటి విలేకరుల ఆధారంగా కొన్ని టి.వి.ఛానెళ్ళు ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ లాలూ ప్రసాద్‌ నిర్దోషిగా విడుదల అయ్యాడని ప్రసారం చేశాయి. మరొక టి.వి. ప్రసారంలో ఒక యాంకర్‌ ‘అద్వానీ రథయాత్రను అడ్డుకున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు న్యాయం లభిస్తుందా?’ అంటూ చేతులు అటూ ఇటూ ఊపుతూ ప్రశ్నించాడు? దానికి దీనికి సంబంధమేమిటో ఆ యాంకర్‌కే తెలియాలి. పోనీ ఇది ఇంతటితో ఆగిపోతే బాగుండేది. కాని అక్కడ ఆగకుండా శేఖర్‌గుప్త అనే జర్నలిస్టు మరింత ముందుకెళ్ళి లాలూపై వెలువడిన తీర్పుపై వ్యాఖ్యానిస్తూ ‘అతడు వెనుకబడిన తరగతులకు చెందినవాడు కాబట్టి అతడిని శిక్షించారు’ అని వ్యాసం రాశాడు. అంటే వీరు న్యాయస్థానాలను కూడా కించపరచడానికి వెనకాడటం లేదన్నమాట.

రాజ్‌దీప్‌ సర్దేశాయి కూడా ఒక వివాదస్పద జర్నలిస్టే. అతడు మోది ప్రభుత్వాన్ని తూలనాడటానికి అవకాశాలను వెదుకుతుంటాడు. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికైన శాసన సభ్యులు తమ పార్టీ ఆదేశాల ప్రకారం తమ నాయకుడిని ఎన్నుకుంటారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో మొన్న జరిగిన ఎన్నికలలో భాజపా అధికారం చేపట్టింది. జయరాం ఠాకూర్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఈ విషయంగా రాజదీప్‌ సర్దేశాయ్‌ సామాజిక మాధ్యమంలో ట్వీట్‌ చేస్తూ ‘భాజపా ఎక్కువ మంది ముఖ్యమంత్రులను అగ్రవర్ణాల వారినే ఎన్నుకుంటోంది’ అని రాశాడు. వెంట వెంటనే సామాజిక మాధ్యమాల్లో అతడికి జవాబులు వచ్చాయి. భాజపా ముఖ్యమంత్రులలో వెనకబడిన తరగతుల వారు, వనవాసులే కాకుండా అల్ప సంఖ్యాకులు కూడా ఉన్నారని సర్దేశాయికి తెలియజెప్పారు. అంత మేధావి అయిన రాజ్‌దీప్‌ సర్దేశాయికి ఈ విషయం తెలియదని అనుకుంటే అది మన పొరపాటే. ఇలాంటి జర్నలిస్టులు మన దేశంలో మరెంతోమంది ఉన్నారు. వీరందరికి ఒక రాజకీయ అజెండా ఉంది. అదేమిటంటే హిందూ సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చేయడమే. రాబోయే 2019 ఎన్నికలలో కాంగ్రెసు అధికారంలోకి రావాలంటే ఐక్యంగా ఉంటున్న హిందూ సమాజాన్ని ముక్కలుగా చేస్తేనే సాధ్యమవుతుంది. అలాంటి వాతావరణాన్ని తయారు చేయడానికి ఇలాంటి జర్నలిస్టుల ఒక పెద్ద బృందం రంగంలో సక్రియంగా ఉంది.

గుజరాత్‌లో ఈ మధ్య జరిగిన శాసనసభ ఎన్నికలలో మూడు వర్గాల నుండి ఎదిగిన నాయకులతో గుజరాత్‌ దశ, దిశ మారుతుందని ఇలాంటి జర్నలిస్టులున్న ఛానెళ్ళు, పేపర్లు ఊదరగొట్టాయి. ఒకవైపు షెడ్యూల్డు కులాలు, తెగల నాయకుడు, మరోవైపు ఒబిసి నాయకుడు, పటేల్‌ నాయకుడు. ఇక 2019 వరకు ఏ చర్చ జరిగినా ఈ నాయకులే ముందుంటారు. దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలు ఈ నాయకుల ఫోటోలను ముఖచిత్రంగా వేస్తాయి. వీరి ఇంటర్వ్యూలను ప్రచురిస్తాయి. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా వీరి సలహా కూడా తీసుకోవాలంటారు. వీరి సలహాలే ముఖ్యమైనవి అని కూడా అంటారు.

ఆజ్‌తక్‌, ఎన్‌డి టివిలు ఈ విషయంలో ముందు నుంచి నిమగ్నమై ఉన్నాయి. ఇలాంటి ఛానెళ్ళ వలనే జెఎన్‌యులో దేశ ద్రోహులైన విద్యార్థులు మీడియాలో ముందు స్థానం ఆక్రమించారు.

‘ఎకనామిక్‌ టైమ్స్‌’ దినపత్రిక తన వ్యాసంలో ‘కేంద్రంలో మోది అధికారంలో ఉన్న కారణంగా న్యూఢిల్లీలో రోహింగ్యాలు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు’ అని రాసింది. ఏ దేశమైనా శరణార్థులకు గాని, అక్రమ చొరబాటు దారులకు గాని తమ దేశంలో ఉద్యోగాలిచ్చి పోషించదు. ఈ విషయం ఆ పత్రిక వారికి తెలియదనుకుందామా? తెలుసు. కాని ఈ ప్రభుత్వంపై బురద చల్లడమే వారి పని. అందుకే అలాంటివి రాస్తారు. ఈ పత్రికలు నకిలీ లౌకిక ముసుగులో తమ అజెండాను అమలు పరుస్తున్నారు. వీరికి తమ దేశం, చట్టాల కన్న వారి సొంత అజెండాయే ముఖ్యం.

ఇటీవల నటి జయ్‌రా వసీం అసత్య ఆరోపణలతో జైలు పాలైన వికాస్‌ సచ్‌దేవాకు ‘బెయిల్‌’ లభించింది. ఒక సందిగ్ధమైన విషయంలోని ఆరోపణతో ‘మీడియా’ వికాస్‌ను దోషిగా నిరూపించ డానికి శతవిధాల ప్రయత్నించింది. చివరకు నిజం బయట పడింది. వికాస్‌ దోషి కాడని తేలింది. మరి ఇదే మీడియా ‘అతడు దోషి కాడు, జయ్‌రావసీం తప్పుడు అభియోగాలు మోపి అతడిని జైలు పాలు చేసింది’ అని గాని, జాయ్‌రా వసీం వెనక ఏ ఏ శక్తులున్నాయి అనే విషయం గాని ఆరా తీశాయా? అంటే లేదనే చెప్పాలి. ఇంతటి ముఖ్యమైన విషయాన్ని వదిలేసిన మేధావి జర్నలిస్టులు అనుష్క శర్మ పెళ్ళిలో సింధూరం ధరించిందా లేదా అనే విషయంపై మాత్రం గంటలు గంటలు చర్చించడానికి సమయం కేటాయిస్తారు.

జర్నలిస్టుల హక్కులను కాపాడటానికి అంతర రాష్ట్రీయ కమిటి ‘టు ప్రొటెక్ట్‌ జర్నలిస్టు’ (సిపిజె) వారి నివేదిక 21 డిసెంబర్‌న వచ్చింది.

ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రమాద కరమైన మిషన్‌లో పనిచేస్తూ ముగ్గురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఇందులో త్రిపురకు చెందిన జర్నలిస్టులు ఇద్దరు. ఒకరు సుదీప్‌ ధౌమిక్‌, హింసకు గురై మరణించారు. ఇక మూడవ జర్నలిస్టు గౌరీలంకేశ్‌. ఈమె హత్య వెనక మావోయిస్టులు ఉన్నారని, మావోయిస్టులను ఉద్యమ బాట నుండి తప్పుకుని, ప్రధాన జన జీవన స్రవంతిలో కలవడానికి ప్రోత్సహిస్తోన్నదన్న విషయమై ఈమె హత్యకు గురైందని భావిస్తున్నారు.

అసలు ఈ వార్తను మీడియా పట్టించుకోనేలేదు. దినపత్రికలు కాని టివి ఛానెళ్ళు కాని ఈ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ వార్తలు ప్రసారం చేస్తే తమ బండారం బయటకు పడిపోతుందని కావచ్చు. మీడియాకు స్వేచ్ఛ కావాలని కోరుకున్న తామే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు దేశ ప్రజలకు తెలిసిపోతుందని కావచ్చు. మీడియాలోని ఒక వర్గం ప్రయత్నాలే ఇవన్నీ.

– నారద

(జాగృతి సౌజన్యం తో)