Home News హిందువులపై దాడులు పట్టని లౌకికవాదులు

హిందువులపై దాడులు పట్టని లౌకికవాదులు

0
SHARE

1947 ఆగస్టు 15 నాటికి ముందు భారతదేశం బ్రిటన్ దేశస్తుల కబంధ హస్తాల్లో బంధింపబడింది. భారతీయులను తమ కట్టుబానిసలుగా భావిస్తూ మన సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ సర్వసంపదను బ్రిటిష్ పాలకులు వారి దేశానికి తరలించుకుపోతుండేవారు. భారతదేశంలోని భూభాగాలను క్రైస్తవ మత ప్రార్ధనా మందిరాల ఆస్తులుగా మార్చుకునేవారు. విద్య, వైద్యం ద్వారా సేవలందిస్తున్నట్టు మన ప్రజలకు భ్రమ కలిగిస్తూ విద్యాలయాల్లో, వైద్యశాలల్లో సైతం చర్చ్‌లు ఏర్పాటుచేసి వాటి ద్వారా మత మార్పిడులు చేసేవారు. వారి ఆధిపత్యానికి అడ్డంకులు లేకుండా నిరంతరం కొనసాగడానికి, రాజ్యాధికారాన్ని మన దేశంలో శాశ్వతం చేసుకునేందుకు మతం పేరిట హిందువులకు, ముస్లింలకు మధ్య విభేదాలు సృష్టించారు. ఒకరిపై ఒకరికి ద్వేషజ్వాలలను రగిలిస్తూ పెద్దరికం నడిపేవారు.

గోమాంస భక్షకులైన బ్రిటన్‌వారు గోవులను వధించేందుకు వధశాలల నిర్వహణ బాధ్యతలను ఇస్లాం మతస్తులకు అప్పగించారు. బ్రిటిష్‌వారితో పాటు ఇస్లాం మతస్తులు గోమాంస భక్షణ చేస్తుండేవారు. మత ప్రాతిపదికన దేశ విభజన జరిగినా, దూరదృష్టిలేని ఆనాటి పెద్దలు ఇస్లాం మతస్తులను భారత్‌లో కొనసాగించిన కారణంగా ఇక్కడ వుండిపోయిన ఇస్లాం మతస్తులు వారి ఉనికిని, ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించారు. బ్రిటిష్ పాలన నాటి ప్రవృత్తి కొనసాగింపుగా గోవులను వధించడం, వధశాలలను నడపడాన్ని ముస్లింలు తమ హక్కుగా భావించారు.

గోవధ నిషేధంపై కొన్ని నిబంధనలను మన రాజ్యాంగంలో పొందుపరిచినా అవి ఎందుకూ కొరగాకుండా పోయాయి. సృష్టి ప్రారంభం నుండే గోవును తల్లిగా, దేవతగా ఆరాధించి పూజించే సనాతన ధర్మావలంబులైన హిందువులు శతాబ్దాల తరబడి గోరక్షణకై పోరాటాలు చేస్తూనే ఉన్నారు. విదేశీ భావజాలాన్ని, సిద్ధాంతాలను నమ్మిన మూర్ఖులు, అమ్ముడుపోయిన స్వార్ధపరులైన కొంతమంది హిందూ మేధావులు, రాజకీయంగా లబ్ధి పొందాలని సెక్యులర్ పేరుతో చెలామణి అయ్యే నాయకులు గోమాంస భక్షణ నిమ్నవర్గాల హక్కుగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దళితులను భారతీయ సంస్కృతి నుండి వేరుచేసి హిందూ సమాజాన్ని నిర్వీర్యం చేయడమే వారి దృఢ సంకల్పం.

కొందరు హిందుత్వ వాదులు గోరక్షణ పేరుతో ముస్లింలపైనా, దళితులపైనా దాడులు చేస్తున్నారని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కొందరు ప్రతిపక్ష నాయకులు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు నిలదీయడం లేదు? గోవధ నిషేధం అమలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంది. గోరక్షణ పేరుతో దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత కాదా? అది వారి పరిధిలో లేదా? ప్రజా సమస్యలను పక్కనపెట్టి అవాస్తవాలతో హిందూయేతరులు మాత్రమే ఈ దేశ వాసులని, వారికి ఏదో అన్యాయం జరుగుతున్నట్టు మిగతావారి సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టి పార్లమెంటు సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు.

గోరక్షణ పేరుతో ముస్లింలపైన, దళితులపైన దాడులు చేస్తున్నారని గగ్గోలుపెట్టే వామపక్షాలకు, కాంగ్రెస్ వారికి పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో హిందువుల ఆస్తుల దహనకాండలు, స్ర్తిలపైన, పిల్లలపైన జరుగుతున్న అమానుష దాడులు కనిపించడం లేదా? కేరళ రాజధానిలో హిందువుల పై అకృత్యాలు, కర్నాటకలో హిందువులను హత్య చేస్తున్న దృశ్యాలు కనిపించడం లేదా? ఈ విషయంలో కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ వాదులకు నోళ్లు ఎందుకు మూగవోయాయి. పలు రాష్ట్రాల్లో హిందువులపై దాడులు చేస్తున్నవారు, హత్యలు చేస్తున్నవారు వామపక్ష, కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేనివారా? నిందితులు వీరు కాకుంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దుకు నిలదీయరు? పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించరు?

కాశ్మీర్ వేర్పాటువాదులను అరెస్టు చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించడానికి బదులు- అవినీతికి అధిపతి అయిన బిహార్ మాజీ సిఎం లాలూ యాదవ్ కుటుంబ పార్టీ ఆర్‌జెడికి గుడ్‌బై చెప్పిన నితీశ్‌కుమార్‌ను ఆడిపోసుకోవడం వీరి దిగజారుడుతనం కాదా? కాశ్మీర్ ఆటంకవాదులతో కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ఆలింగనాలు చేసుకుని ఎందుకు మంతనాలు జరిపాడో పార్లమెంటు ద్వారా ప్రజలకు ఎందుకు తెలియజేయరు?

ఒకవైపు డోక్లామ్ వద్ద చైనా సైన్యం చొరబాటు జరుగుతున్న సమయంలో మరోవైపు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఏ హోదాలో చైనా రాయబారి కార్యాలయానికి వెళ్లాడు. ఆయన ఏమి మాట్లాడాడో దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులకు లేదా? దేశ రక్షణలో నిరంతరం పోరాడుతూ తీవ్రవాదుల తూటాలకు బలవుతున్న భారత సైనికులను అవమానించిన సందీప్ దీక్షిత్ (దిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ కుమారుడు) కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదా? చాలా రాష్ట్రాల్లో పాలనకు దూరమై, పార్లమెంటులో ప్రతిపక్ష హోదాను కూడా సాధించని కాంగ్రెస్ నేతలు ఇకనైనా అవాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రజా సమస్యలపై స్పందించాలి. ప్రజలకు దగ్గర కావడం తమ ముందున్న సవాలుగా కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి.

-బలుసా జగతయ్య

(ఆంధ్రభూమి సౌజన్యం తో)