సేవాభారతి తెలంగాణ ఆధ్వర్యంలో బాలికల సాధికరత కోసం కృషి చేస్తున్న కిషోర వికాస యోజన కార్యక్రమంపై రన్ ఫర్ గర్ల్ చైల్డ్ పేరుతో ఆదివారం హైదారబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో 5K, 10K, 21K రన్‌ను నిర్వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ, అపోలో ఆస్పత్రి సీఈవో సుబ్రహ్మణ్యం, ఇతర ప్రముఖులు జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. 5, 10, 21 కిలోమీటర్ల, మేర మూడు విభాగాల్లో కొనసాగిన ఈ రన్ లో అనేక మంది యువతీ యువకులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు.. మొత్తం గా 1500 పైగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సేవాభారతి నిర్వహకులు మాట్లాడుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కిషోరి వికాస సెంటర్ ద్వారా బాలికలకు చదువును అందిచడం, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఇతర నైపుణ్యాలకు సంబంధించి ఉచిత శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. పాఠశాలల నుంచి చదువు మానేసిన బాలికల కోసం కిషోరి వికాస కేంద్రం ద్వారా వారికి చదువును అందిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ, బస్తీ ప్రాంతాల్లోని ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉంటూన్నారని వారి చదువుల కోసం సేవాభారతి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఆడపిల్లలకు విద్య వైద్యం ఆరోగ్యం మానసిక వికాసం అందించడంలో అందరికీ సామాజిక బాధ్యత కల్పించడానికి సేవాభారతి ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందని వారు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా సేవాభారతి ఆధ్వర్యంలో రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు సేవా భారతి తెలంగాణ ప్రాంత ప్రముఖ్ వాసు, తెలంగాణ సేవా భారతి కార్యదర్శి రామమూర్తి, సహ కార్యదర్శి జయప్రద, కిశోర్ వికాస్ ఇంచార్జ్ కిరణ్మయి, ప్రాయోజకులు డా. సుమలత తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.