ప్రభుత్వేతర సేవా సంస్థలు తమ నిధులను ఖర్చు పెడుతున్న తీరును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం జనవరి పదవ తేదీన ఆదేశించడం అత్యద్భుతమైన పరిణామం. దేశంలో దాదాపు ముప్పయి లక్షల ‘ప్రభుత్వేతర సేవా సంస్థలు- నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్- ఎన్‌జిఓలు’- స్వచ్ఛంద సేవా సంస్థలు- వాలంటరీ ఆర్గనైజేషన్స్- వి.ఓలు- ఉన్నాయట! ఈ లక్షల సంస్థలలో కొన్నివేల సంస్థలు సమాజ హితం కోసం పాటుపడుతుండడం నిజం కావచ్చు. కానీ అధికాధిక ఎన్‌జిఓలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాల నుంచి, ప్రజల నుంచి, ఐక్యరాజ్య సమితి వంటి ఆధికారిక సంస్థల నుంచి, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల నుంచి, విదేశీయుల నుంచి వసూలు చేసుకొని బొక్కేస్తుండడం దశాబ్దులుగా కొనసాగుతున్న ప్రహసనం! వసూలు చేసిన మొత్తాలను వెల్లడి చేయకపోవడం ఈ వైపరీత్యానికి కారణం. చక్కటి దోపిడీకి చిక్కులేని మార్గం ఎన్‌జిఓను నడిపించడం. హుందాగా సమాజం నుంచి డబ్బు దండుకోవడానికి అనేక మంది ఎన్‌జిఓలను స్థాపిస్తున్నారన్న ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభు త్వం ఈ ఎన్‌జిఓలపై ని ఘా పెంచడంతో ఇన్నాళ్లుగా అక్రమ ప్రయోజనాలను భోంచేస్తున్న వారు బెంబేలెత్తిపోతున్నారు. జరగరానిదేదో జరిగిపోతున్నట్టు ధ్వనింపచేసే ప్రచారాన్ని చేస్తున్నారు. ఈ ప్రచారపుటార్భాటానికి కేంద్ర ప్రభుత్వం జడుసుకొని యథాతథంగా తమ కలాపాలను జరుపుకోనిస్తుందన్న ఎన్‌జిఓ నిర్వాహకుల భ్రమలు మంగళవారం నాటి ‘సర్వోన్నత’ అదేశంతో బహుశా తొలగిపోయాయి.
కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ కేవలం విదేశాల నుంచి ఈ ఎన్‌జిఓలకు లభిస్తున్న నిధులపై నిఘా పెంచింది. ఫలితంగా విదేశీయుల మద్దతుతో జిహాదీ బీభత్సకాండను, మతం మార్పిడులను కొనసాగిస్తున్న విద్రోహకర బృందాలకు గొప్ప అసౌకర్యం ఏర్పడిపోయింది. ఎన్‌జిఓల ముసుగులో ఈ ‘బృందాలు’ తిన్న ఇంటి గోడలను తవ్వుతున్న ‘గునపాలు’గా మారడం నిరాకరింపజాలని వాస్తవం. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఈ ‘నిఘా’ను విస్తరించాలని ఆదేశించింది. మొత్తం ముప్పయి లక్షల ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్ష- ఆడిటింగ్- చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్‌జిఓల ఆర్థిక కలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను ఇంతవరకూ ఏర్పాటు చేయకపోవడంపై ప్రధాన న్యాయమూర్తి జగ్దీష్ సింగ్ ఖెహార్ , న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేయడం సహజం. దశాబ్దుల పాటు కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు వహించిన నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.
దేశంలో నమోదైన ఈ ముప్పయి లక్షల ఎన్‌జిఓలలో కేవలం మూడు లక్షల ఎన్‌జిఓలు తమ ఆదాయ వ్యయాల లెక్కలను ప్రభుత్వ ఆదాయ వ్యయ విభాగానికి సమర్పిస్తున్నాయట! మిగిలిన సంస్థలు నిధులను దండుకొని భోంచేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన దాదాపు మూడు లక్షల ఎన్‌జిఓలలో నూట ఎనబయి ఆరు మాత్రమే ఇలా వివరాలను- రిటర్న్స్-ను సమర్పించి ఉండడం విస్మయకరం. అంటే దాదాపు మూడు లక్షల సంస్థలు కూడా ఆదాయాన్ని, ఖర్చులను రహస్యంగా ఉంచేశాయి. సమాజానికి మేలు చేయడానికి, సేవ చేయడానికి ఆరంభమైన సంస్థలు నిజానికి సమాజానికి ద్రోహం చేస్తున్నట్టు, జనాన్ని వంచించినట్టు దీని వల్ల ధ్రువపడింది. నల్లధనం విస్తృతంగా చెలామణి కావడానికి ఎన్నికల్లో పోటీ చేయని దాదాపు నాలుగు వందల రాజకీయ పక్షాలు మాధ్యమాలని ఎన్నికల కమిషన్ ఇటీవల నిర్ధారించింది. ఇరవై ఏడు లక్షల ప్రభుత్వేతర సంస్థలు కూడా నల్లధనం చెలామణికి మాధ్యమాలుగా మారిపోయాయన్నది సర్వోన్నత న్యాయాదేశంలో వెల్లడైన వాస్తవం. నల్లడబ్బును చెలామణి చేయడం, స్థిరాస్తి వ్యాపారాలను నిర్వహించడం, జిహాదీలను పోషించి ఉసిగొల్పడం, చైనా వంటి శత్రుదేశాల ప్రతినిధులను మన దేశంలో మేపడం, వారి ద్వారా హింసను పురికొల్పడం, మతం మార్పిడి చేయడం, ప్రత్యక్షంగా పరోక్షంగా దేశ విద్రోహాన్ని ప్రోత్సహించడం వంటి వివిధ దుర్మార్గాలను అనేక ఎన్‌జిఓలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాయి. ఎన్‌జిఓల పేరుతో నిధులను దండుకొని వాటితో సొంతానికి ఇళ్లను కట్టుకోవడం, స్థిరాస్తి వ్యాపారం చేయడం, కంపెనీలలో వాటాలను కొనుగోలు చేయడం వంటి కలాపాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయాయి. ఫలానా ప్రముఖుడు ఫలానా ఎన్‌జిఓను నడుపుతూ హైదరాబాద్‌లోను, ఇతర చోట్ల సొంతానికి భవన సముదాయాలను నిర్మించాడని అనేక సందర్భాల్లో అనేక చోట్ల బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నా రు. ఈ ఆరోపణలు ధ్రువపడాలంటే అన్ని ఎన్‌జిఓల డబ్బు లెక్కలపై తనిఖీ జరగాలి. సమీక్ష జరగాలి.
దేశంలోని పదకొండు వేల ఎన్‌జిఓలు విదేశాల నుంచి నిధులను స్వీకరించడానికి వీలులేదని గత నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. పదివేల సంస్థలు విదేశీయ విరాళాలను స్వీకరించడానికి వీలు లేదని 2014లోనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. భారతీయ జనతాపార్టీ కేంద్ర ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన తరువాత ఇలా మొత్తం దాదాపు ఇరవై ఒక్క వేల పైచిలుకు ఎన్‌జిఓలకు విదేశీయుల నుంచి నిధులు అందడం లేదు. కానీ ఇలా నియంత్రణకు గురైన సంస్థలు స్వదేశీయ విరాళాలు వసూలు చేస్తూనే ఉంటాయి. ఆ నిధుల గుట్టు కూడా సర్వోన్నత న్యాయ నిర్ణయంతో ఇప్పుడు రట్టు కానుంది. రెండేళ్ల క్రితం పదివేల సంస్థలకు విదేశీయ నిధులు రద్దయిన తరువాత ఈ పదకొండువేల సంస్థలు విదేశీయ నిధులను స్వీకరించడానికి వీలున్న కాలవ్యవధి ముగిసిపోయిందట. ‘అనుమతి’ కొనసాగింపు కోసం- లైసెన్స్ రెన్యువల్- ఈ పదకొండు వేల సంస్థలు ఎందుకని దరఖాస్తులను సమర్పించ లేదు? తీగ లాగితే డొంక కదలవచ్చునన్న భయంతోనే ఈ పదకొండు వేల సంస్థలు ‘తేళ్లు కుట్టిన దొంగలు’గా మారాయి కాబోలు. అనుమతి కొనసాగింపు కోసం దరఖాస్తు పెట్టిన పాతిక సంస్థలకు కేంద్రం అనుమతిని నిరాకరించిందట! ఈ సంస్థలు జాతి విద్రోహ కలాపాలకు పాల్పడుతున్నందు వల్లనే అనుమతి మంజూరు కాలేదట. జకీర్ నాయక్ అనే ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకారుడు నడిపిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’ దేశవిదేశాల్లో కోట్లాది రూపాయలను వసూలు చేయడం దేశద్రోహ కలాపాలకు పరాకాష్ఠ..
ముప్పయి లక్షల ఎన్‌జిఓలలో దాదాపు రెండు లక్షల తొంబయి వేల సంస్థలు మాత్రమే వార్షిక ఆదాయ వ్యయ పత్రాలను సమర్పిస్తున్నాయని కేంద్ర నేర పరిశోధక మండలి- సిబిఐ- వారు సుప్రీం కోర్టుకు నివేదించడంతో మంగళవారం నాటి ఆదేశం వెలువడింది. నిబంధనలను ఉల్లంఘించి ఏళ్ల తరబడి ప్రజాధనం బొక్కిన దాదాపు ఇరవై ఏడు లక్షల ఎన్‌జిఓల నిధులపై సమీక్ష ఎందుకు? మొదట ఈ సంస్థలన్నింటినీ రద్దు చేయాలి. వాటిపై న్యాయస్థానాల్లో అభియోగాలు దాఖలు చేయాలి.
(ఆంధ్ర భూమి సౌజన్యం తో)