Home Telugu Articles సేవామూర్తులకు సమున్నత గౌరవం

సేవామూర్తులకు సమున్నత గౌరవం

0
SHARE

తొలిసారిగా ‘మట్టిలోని మాణిక్యాల’కు మన్నన లభించింది. త్యాగధనులు, తపోశీలురు, సమాజ శ్రేయస్సు కోసం కఠోర సాధనా మార్గానే్న జీవితంగా మలుచుకున్న పలువురికి ప్రతిష్ఠాత్మక ‘పద్మశ్రీ’ అవార్డులను నరేంద్ర మోదీ ప్రభుత్వం అందజేసింది. కీర్తి కాంక్షకు దూరంగా ‘మానవ సేవే మాధవసేవ’గా భావించి సమర్పణాభావంతో పనిచేస్తున్న వారి సేవల్ని గుర్తించి ఈ ఉన్నత పురస్కారాలను అందచేశారు. వీరి పేర్లను ఏ రాజకీయ పార్టీలు, ఏ నాయకులు సిఫార్సు చేయలేదు. అవార్డుల కోసం వీరెవ్వరూ పైరవీలు చేసుకోలేదు. ప్రచారపు హంగు, ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా, నిరంతరంగా నిబద్ధతతో పనిచేస్తున్న వారిని మోదీ ప్రభుత్వం వెతికి పట్టుకుని సన్మానించింది. పురస్కారాలు, సన్మానాల కోసం ‘ఎంపిక ప్రక్రియ’ చిరకాలంగా పైరవీల ఒరవడిలో కొట్టుకుపోతున్న తీరుకు మోదీ సర్కారు అడ్డుకట్ట వేసింది. నిజమైన సమాజ సేవకులకు గుర్తింపును కలుగచేసి, వారిని గౌరవించే విధానానికి శ్రీకారం చుట్టింది. వీరి సేవలను ఆదర్శంగా తీసుకుని, సమాజం కోసం పనిచేయాలన్న తపన మిగిలిన వారిలో కలిగించేందుకు ప్రభుత్వం కృషిచేయడం అభినందనీయం.

ఈ ఏడాది ‘పద్మ’ పురస్కారాల కోసం 18వేల దరఖాస్తులు అందగా ఏడుగురికి ‘పద్మ విభూషణ్’, ఏడుగురికి ‘పద్మ భూషణ్’, 75 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందచేశారు. గత ప్రభుత్వాల హయాంలో ఈ పురస్కారాల ప్రదానం ‘సంతర్పణ’ మాదిరి జరిగేది. ఇందుకు భిన్నంగా అనేక ఏళ్ల తర్వాత వందకు లోపుగా పద్మ పురస్కారాలను అందించడం ఈసారే జరిగింది. ముఖ్యమైన విషయం ఏమంటే- ‘పద్మశ్రీ’ పొందిన 75 మందిలో 15 మంది గురించి ప్రపంచానికి తెలియదనే చెప్పుకోవాలి. రాజకీయ ఒత్తిడులను పక్కకుపెట్టి, నిబద్ధతతో కూడిన ఆయా వ్యక్తుల సేవాభావన, వారు సాధించిన విజయాలే కొలమానంగా మోదీ ప్రభుత్వం ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇన్నాళ్లూ గుర్తింపు పొందని ఈ ‘అసాధారణ వ్యక్తులు’ భావితరాలకు ప్రేరణ కలిగిస్తారు. వీరి గురించి మనం తెలుసుకోకపోయినా, వీరి సేవలను పది మందికీ చెప్పకపోయినా తప్పుచేసిన వారం అవుతాం.

తెలుగువారైనప్పటికీ చింతకింది మల్లేశం, దారిపల్లి రామయ్యల గురించి మనకు తెలియకపోయినా- ఎక్కడో దిల్లీలోని మోదీ ప్రభుత్వం వీరి ప్రతిభను గుర్తించింది. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన దారిపల్లి రామయ్యను స్థానికులు ముద్దుగా ‘చెట్ల రామయ్య’ అని పిలుస్తూంటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల పెంపకానికి రామయ్య చేస్తున్న కృషి అమోఘం. ఈ ప్రాంతంలో దాదాపు కోటి మొక్కలను నాటడానికి రామయ్య ప్రేరణగా నిలిచాడు. నీడనిచ్చే చెట్లు, పండ్లనిచ్చే చెట్లు, ఔషధ మొక్కలను నాటడంలో, నాటించడంలో 80 ఏళ్ల వయస్సున్న రామయ్య కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. మొక్కలను నాటే ఉద్యమాన్ని ఇతను గత ఏభై ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. రామయ్య చదువుకోలేదు. అయినాసరే స్కూళ్ళకు తిరిగి మొక్కలు నాటాల్సిన ఉద్యమం గురించి బడి పిల్లలకు వివరించే వాడు. వాళ్ళతో మొక్కలు నాటించి వాటిని పెంచేలా చూసేవాడు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణకు హరితవనం’ కార్యక్రమం రామయ్య కృషి ద్వారానే సాధ్యపడింది. చెట్ల రూపంలో ప్రకృతిని ఆరాధిస్తున్న రామయ్యకు జేజేలు.

ఇక, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి చీరలను నేయడంలో విప్లవం సృష్టించినవాడు చింతకింది మల్లేశం. చేనేత చీరలు నేయడానికి ‘అసు’ అనే విధానాన్ని పాటిస్తారు. ఒక మీటర్ దూరంలో అర్థచంద్రాకారంలో చేతిని తిప్పుతూ నూలు అమరుస్తూ చీరలు నేస్తారు. ఒక చీర నేయడానికి దాదాపు తొమ్మిది వేలసార్లు ఇలా చేతులు కదిలించాలి. దీనివల్ల భుజాలు, మోచేతుల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. షార్కీపేట్ గ్రామానికి చెందిన మల్లేశం తన తల్లి పడుతున్న కష్టాలు చూసి బాధపడేవాడు. చీరలు నేయడానికి సులువైన మార్గాలను వెదుకుతూ ఉండేవాడు. మల్లేశానికి సాంకేతిక పరిజ్ఞానం లేదు. విరిగిపోయిన ఇనుప చెక్క ముక్కలతో అనేక ప్రయోగాలు చేశాడు. ఒక దశలో విసుగుచెందిన మల్లేశం చీరలు నేయడం మానేసి బ్రతుకుతెరువుకోసం హైదరాబాద్ వలస వచ్చాడు. 1999 ఫిబ్రవరిలో హైదరాబాద్ బాలానగర్‌లో ఒక కంపెనీలో పనిచేస్తూండగా తను ‘అసు’ పద్ధతికి ఉపయోగపడే ఒక యంత్రం కనపడింది. కొద్దిపాటి మార్పులు, చేర్పులతో దీన్ని తీసుకువెళ్ళి మగ్గానికి బిగించాడు. అద్భుతంగా తక్కువ సమయంలో చీర తయారైంది. పైగా గతంతో పోలిస్తే నాణ్యత కూడా పెరిగింది. గతంలో రోజుకు రెండు చీరలు మాత్రమే నేయగలిగిన చేనేత కార్మికులు ఇప్పుడు రోజుకు ఆరు చీరలు నేయగలుగుతున్నారు. అందరికీ ఆదాయం పెరిగింది. జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన డాక్టర్ భక్తియాదవ్‌కి ఇపుడు 91 ఏళ్లు. ఇండోర్ నుంచి ఎంబిబిఎస్ పట్ట్భద్రులలో ఆమె మొట్టమొదటి మహిళ. గత 68 ఏళ్లుగా రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ వస్తున్నది. కొన్నివేల పురుళ్ళు పోసింది. ఇండోర్ ప్రజలు ఈమెను ముద్దుగా ‘డాక్టర్ దాదీ’ అని పిలుచుకుంటారు. కేరళకు చెందిన 76 ఏళ్ల మీనాక్షి అమ్మ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిప్రదాత. ‘కలరి పయట్టు’అనే యుద్ధ విద్యలో ఆరితేరిన ఆమె వయోభేధం, లింగభేదం లేకుండా అందరికీ తన తెలిసిన ఈ యుద్ధవిద్యలోని మెళకువలను గత 68 ఏళ్లుగా నేర్పుతూ వస్తున్నది. తన ఎనిమిదవ ఏట నుంచే మీనాక్షి ఈ క్రీడను వ్యాప్తిచేస్తూ వస్తున్నది. కోల్‌కతకు చెందిన బిపిన్ గణత్రను అందరూ ‘ఫైర్‌మాన్’గా పిలుస్తూ ఉంటారు. అగ్నిప్రమాదాలను నిరోధించడంలో, అగ్నిప్రమాదాలలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడంలో గత 40 ఏళ్లుగా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ‘స్వచ్ఛంద కార్యకర్త’ బిపిన్ గణత్ర. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఆర్పడానికి వెళ్ళడం అగ్నిమాపక దళ సిబ్బంది విద్యుక్త కర్తవ్యం. బిపిన్‌కు వీటితో సంబంధం లేదు. అగ్నిప్రమాదం జరిగినట్లు తెలియగానే సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సహకరిస్తాడు. ఇప్పటివరకూ కోల్‌కతలో సుమారు వంద అగ్నిప్రమాదాలలో తన సహాయ సహకారాలను స్వచ్ఛందంగా అందించాడు. 59 ఏళ్ల వయస్సున్న బిపిన్ తన 19 ఏటనుంచే సహాయక చర్యలు అందించడంలో నిమగ్నమై ఉన్నాడు. డాక్టర్ సబ్రతోదాస్‌ను అందరూ ‘‘రహదారుల దేవుడి’’గా పిలుస్తారు. 51 ఏళ్ల ఈయన గత కొన్ని దశాబ్దాలుగా జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో గాయపడ్డవారికి చికిత్సలు అందచేస్తూ వస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఈ వైద్యుడు ‘లైఫ్ లైన్ ఫౌండేషన్’ అనే సంస్థను స్థాపించి ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌ల్లోని నాలుగువేల కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల్లో గాయపడ్డ వారికి చికిత్సలందిస్తూ ఎనలేని సేవలు చేస్తున్నారు. 66 ఏళ్ల గిరీశ్ భరద్వాజ్ కర్నాటకలోని పశ్చిమ కనుమలకు చెందిన సామాజిక కార్యకర్త. ఇంజనీరింగ్ పట్ట్భద్రుడైన ఈయన కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లోని అనేక గ్రామాల ప్రజల ఇబ్బందులను చూసి చలించిపోయాడు. హరిద్వార్- రుషీఖేష్‌ల దగ్గర ఉన్న ‘లక్ష్మణ్‌ఝాలా’ తరహాలో గ్రామాలను కలుపుతూ ఊగే వంతెనలను నిర్మించడం మొదలుపెట్టాడు. దీంతో గిరీశ్ భరద్వాజ్‌ను స్థానికులు ‘సేతుబంధు’ అని పిలవడం మొదలుపెట్టారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తక్కువ ఖర్చుతో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ స్థానిక వనరులతో కొండల మీదుగా, నదుల మీదుగా వంతెనలు నిర్మించేవాడు. ఇలా ఇప్పటివరకూ దేశంలోని వివిధ ప్రాంతాలలో వందకు పైగా వంతెనలను నిర్మించిన గిరీశ్‌కు సమున్నత పురస్కారం లభించింది. దుర్భర దారిద్య్రం, సహించరాని కష్టాలు, భరించలేని అవమానాల నుంచి పనె్నండువేల మంది మహిళలను బయటకి తీసుకువచ్చిన ఓ సాహసి- అనూరాధా కొయిరాల. నేపాల్‌కు చెందిన ఆమె సామాజిక ఉద్యమకార్యకారిణి. అభం శుభం తెలియని వేలాది అమాయకపు ఆడ పిల్లలను వేశ్యావృత్తి నుంచి బయటకు తీసుకురావడంలో విజయవంతం అయ్యింది. వేశ్యావృత్తి నుంచి బయటికి వచ్చిన వారికోసం వసతి గృహాలు నిర్వహిస్తోంది.

పశ్చిమ బెంగాల్‌లోని టీ తోటల్లో పనిచేసుకునే ఒక సాధారణ కూలీ కరీముల్ హఖ్. ఆయన ఇప్పుడు ‘అంబులెన్స్ దాదా’ అయ్యాడు. జల్‌పాయ్‌గురి జిల్లాలోని దల్చారి గ్రామానికి చెందిన కరీముల్ తన మోటార్ సైకిల్‌నే అంబులెన్స్‌గా మార్చి మారుమూల గ్రామాల్లో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న రోగులను ఆస్పత్రులకు చేరుస్తున్నాడు. గత 14 ఏళ్లుగా ఇదేపనిలో ఉన్నాడు. కొండల్లో, గుట్టల్లో ఉన్న 20 గ్రామాల ప్రజలకు కరీముల్- ‘నడిచే దైవం’. పూణెలోని దేయా గ్రామానికి చెందిన 88 ఏళ్ల డాక్టర్ మాపుస్‌కర్ ఆ ప్రాంత ప్రజలకు ‘స్వచ్ఛతా దూత’. తన జీవిత కాలాన్ని పరిశుభ్రత కోసం ఖర్చుపెట్టేసిన దేవదూత. ప్రజలెవ్వరూ ఊహించని రోజుల్లో 1960 దశకం నుంచి గ్రామాల్లో బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ ఎన్నో ఇళ్లలో మరుగుదొడ్లు కట్టించిన వ్యక్తి. 1960లోనే తన గ్రామాన్ని బహిరంగ మలవిసర్జన నుంచి విముక్తం చేశాడు. పంజాబ్‌కు చెందిన 51 ఏళ్ల బల్‌బీర్ సింగ్ సీచేవాల్ అపర భగీరథుడు. ఆయన నివసించే ప్రాంతంలో 160 కిలోమీటర్ల కాళీబెన్ నది అదృశ్యమైపోయింది. స్థానిక యువతను ప్రోత్సహించి 160 కిలోమీటర్ల కాళీబెన్ నదిని పునరుజ్జీవితం చేయడంలో సీచేవాల్ నిర్వహించిన పాత్ర అద్భుతం. గుజరాత్‌కు చెందిన జేనాభాయ్ దర్గ్భాయ్ వికలాంకుడు. అయినా పట్టుదల వదలలేదు. కరవు ప్రాంతాల్లోని రైతులను సమీకరించి పెద్దఎత్తున దానిమ్మ తోటల పెంపకం మొదలుపెట్టాడు.

… ఇలా ప్రపంచం ఎరుగని ధీరోధాత్తులను- ‘పద్మ’ పురస్కారాల సందర్భంగా యావత్ జాతికి పరిచయం చేసిన ఘనత మోదీదే. భావితరాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తిత్వాలను మన ముందు నిలబెట్టి, వారి అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యతను మనకు గుర్తుచేశారు. అంకితభావంతో, సేవాతత్పరతతో పనిచేస్తున్న వారిని ప్రపంచం కచ్చితంగా గుర్తిస్తుందని ప్రధాని రుజువు చేశారు. ‘జీవించు- జీవించనువ్వు’ అన్న సిద్ధాంతాన్ని మనందరం ఆచరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. మన జీవన సాఫల్యం జన జీవితంతో ముడిపడి ఉన్నది. ప్రేరణ ఇచ్చే ఈ ‘పద్మశ్రీ’ల మార్గదర్శనంలో నడవాల్సిన బాధ్యత ఇక మనదే.

కామర్సు బాల సుబ్రహ్మణ్యం

ఆంధ్ర భూమి సౌజన్యం తో