Home News 8 వేల మందితో బాలికల వికాసం కోసం సేవా భారతి ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’  

8 వేల మందితో బాలికల వికాసం కోసం సేవా భారతి ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’  

0
SHARE
సేవాభారతి ఆధ్వర్యంలోని కిశోరీ వికాస్ కేంద్ర ఏర్పాటు చేసిన ‘రన్ ఫర్ గర్ల్ చైల్డ్’ (బాలికల వికాసం కోసం పరుగు) కార్యక్రమంగా జనవరి 20 ఆదివారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. బాలికల వికాసమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ పరుగు కార్యక్రమంలో 8 వేల మందికి పైగా క్రీడాకారులు, సామజిక కార్యకర్తలు పాల్గొన్నారు. 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 21 కిలోమీటర్ల విభాగాల్లో సాగిన ఈ పరుగులో తెలంగాణ వ్యాప్తంగా 50 ఐటీ కంపనీలకు చెందిన ఉద్యోగులతో పాటు 400 మంది వివిధ సైనిక విభాగాలను చెందిన జవాన్లు కూడా పాల్గొన్నారు.
మొదట 21 కిలోమీటర్ల పరుగు విభాగాన్ని సికిందరాబాద్ ఏవోసీ కమాండెంట్ బ్రిగేడియర్ జేజెస్ బిందెర్ మరియు కామన్వెల్త్ జిమ్నాస్టిక్ విభాగం స్వర్ణపతక విజేత మేఘనారెడ్డి ప్రారంభించారు. 10 కిలోమీటర్ల పరుగుని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మరియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అప్పారావు ప్రారంభించారు. 5కిలోమీటర్ల పెరుగుని కేంద్ర నీటిపారుదల శాఖ సహాయకమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రారంభించారు. అంతేకాకుండా మంత్రి స్వయంగా ఈ పరుగు విభాగంలో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
అనంతరం జరిగిన బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలికల సంరక్షణ, సంక్షేమం, వికాసం కోసం ‘సేవా భారతి’ యొక్క కృషిని కొనియాడారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను గురించి వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ‘భేటీ బచావ్ – భేటీ పడావ్’ పథకాన్ని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ కొడుకులతో సమానంగా బాలికలకు కూడా మెరుగైన విద్య అందించాలని కోరారు.
కార్యక్రమంలో సేవాభారతి ప్రధాన కార్యదర్శి ప్రభల రామ్మూర్తి మాట్లాడుతూ రానున్న 2 సంవత్సరాలలో 10 వేలమంది బాలికలకు సాధికారత, వికాసం కల్పించడంతో పాటు జంటనగరాల్లో 500 కిశోర వికాస కేంద్రాలను ఏర్పాటు చేసే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు.