Home News శంకరం – లోక వశంకరం

శంకరం – లోక వశంకరం

0
SHARE

హిందుత్వను, భారతీయతను తీవ్రంగా ద్వేషించే ద్రవిడ కజగం నాయకుడు కె.వీరమణి ‘నాకు కంచి మఠంతో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అయినా ఆయన (జయేంద్ర) మరణానికి నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను’ అన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకోవడం అంటే ఇదే. భారతీయత, దానిని ఆశ్రయించుకుని ఉన్న ఆధ్యాత్మిక చింతన, ధార్మిక దృష్టి, తాత్వికతలను రక్షించుకుంటేనే భారతదేశం మిగులుతుంది. దీనిని గుర్తించడమే, ఆచరించడమే జయేంద్ర సరస్వతి స్వామికి మనమంతా ఇచ్చే నిజమైన నివాళి.

భారతీయ సనాతన ధర్మంలో సన్యాసాశ్రమానికి ఉన్న స్థానం మహోన్నతమైనది. సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో, వారి కాషాయ ధారణలో సాక్షాత్తు భగవంతుడి రూపాన్నీ భగవదంశనూ దర్శించుకుంటూ ఉంటుంది భారతీయ సమాజం. విదేశీ దాడుల సమయంలో, వెయ్యేళ్ల పాటు విదేశీ పాలన పెట్టిన ఆరళ్లలో, అది సృష్టించిన సంక్షోభాల సమయంలో సాధుసంతులు నిర్వహించిన పాత్ర సమున్నతమైనది. అలాంటి వారి బోధనలు అలాంటి సంక్షుభిత సమయంలో సాక్షాత్తు భగవద్గీత వాక్యాలై జాతిని జాగృతం చేశాయి. భగవంతుడిని ధ్యానించడమే సన్యాసాశ్రమ పరమ ధర్మమని నమ్మినవారూ ఉన్నారు. దానితో పాటు సమాజంతో సాధుసంతుల బంధం విడదీయ లేనిదనీ, సన్యాసాశ్రమం అంటే ముక్కు మూసుకుని మోక్షాన్ని కాంక్షించడం ఒక్కటే కాదని నమ్మినవారు, అలాంటి సామాజిక బాధ్యతను ఆచరించి చూపించిన వారు కూడా మన చరిత్రలో ఉన్నారు. కఠోర దీక్షతో ధర్మాన్ని ఆచరించడం ఒక ఎత్తు. ధర్మానికి ఆలంబనగా ఉండే సమాజంలో ధర్మనిరతిని నిలబెట్టడం మరొక ఎత్తు. ఈ రెండూ అవసరమని హిందూదేశ చరిత్ర ఘోషిస్తున్నది. అద్వైత సిద్ధాంతకర్త శంకర భగవత్పాదుల జీవితం, తత్వం ఇదే చెబుతుంది. ఇటీవల శివైక్యం చెందిన పూజ్య జయేంద్ర సరస్వతి స్వామి ఆ మహనీయుడి పరంపరలోనివారు, ఆది శంకరుల అడుగుజాడలను అనుసరించినవారు కూడా.

కామాక్షి అమ్మవారి సన్నిధిలోని కంచి కామకోటి పీఠం అధిపతి జయేంద్ర సరస్వతి కొన్ని రోజుల క్రితమే బృందావన ప్రవేశం చేశారు. ఈ మఠాన్ని ఆదిశంకరులే స్థాపించారని విశ్వశసిస్తారు. తొలి పీఠాధిపతి కూడా ఆయనేననీ, వారి తరువాత సురేశ్వరాచార్యుల వారు పీఠాధిపత్యం స్వీకరించారనీ కూడా చెబుతారు. అంత ఘన చరిత్ర కలిగిన మఠం కంచి కామకోటి మఠం.

అద్భుతం

సనాతన ధర్మాన్నీ, వైదిక ధర్మాన్నీ కొన్ని శక్తులు సంక్షోభం దిశగా నెట్టుకు వెళుతున్న కాలంలో ఆదిశంకరులు ఆవిర్భవించారు. దేశ నలుమూలలా మఠాలను స్థాపించి, ఈ పుణ్యభూమి సమగ్రతకు, ఐక్యతకు అంకురార్పణ చేసినవారు ఆదిశంకరులే. సాంస్కృతిక ఐక్యత భౌగోళికంగా కూడా ప్రతిబింబించాలన్న ఊహ ఒక అద్భుతం. అదొక మహోన్నత దృష్టికి నిదర్శనం. కానీ భౌగోళికంగా ఉన్న అనైక్యత ఆసరాగా భారతీయ సమాజానికి నిరంతరం సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఇలాంటి సంక్షుభిత సమయాలు చరిత్రలో పునరావృతమవుతూనే ఉన్నాయి. ఆయా సమయాలలో విద్యారణ్యులు, సమర్థ రామదాస స్వామి వంటివారు ఎందరో చూపిన చొరవ, ప్రదర్శించిన దూరదృష్టి అద్భుతమనిపిస్తాయి. మనకాలంలో అలాంటి దృష్టినీ, చొరవను చూపిన ధార్మికునిగా జయేంద్ర సరస్వతి స్వామి (1935-2018) కనిపిస్తారు. ఇంకా, స్వామి శ్రద్ధానందలోని జాతీయవాద దృష్టినీ, స్వామి వివేకానందుడు ప్రవచించిన మానవసేవే మాధవ సేవ అనే మాటలోని తాత్వికతా సారాన్నీ గ్రహించిన వారుగా జయేంద్ర అగుపిస్తారు.

హిందుత్వానికి గాయాలు

కంచి పీఠం 68వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వాముల దృక్పథం వేరు. ఆయన కాలం వేరు. ఆయన అహరహం సనాతన పంథాలో సన్యాసాశ్రమ ధర్మాన్ని ఆచరించారు. ఆ జీవితాన్ని గడిపారు. ఆయన ‘నడిచే దేవుడు’. ‘మహా స్వామి’ అని వారిని సంభావిస్తారు. ఆ బిరుదుకు తగ్గట్టే కాలి నడకన దేశాటన చేశారు. ధర్మాన్ని ఆచరించడమే పరమ కర్తవ్యంగా ఆయన భావించారు. నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో గడిచిన జీవితం వారిది. కానీ ఆయన వారసుడు జయేంద్ర చూసిన భారతీయ సమాజానికీ, అందులోనూ హిందూ సమాజానికి సంక్రమించిన సమస్యలు మరింత తీవ్రంగా అనిపిస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే, ముస్లింల ఏలుబడిలో గాని, ఆంగ్లేయుల పాలనలో గాని భారతీయ ధర్మానికి తగలని గాయాలు కూడా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో తగిలాయి. ఇప్పటికీ తగులుతూనే ఉన్నాయి.

కంచి మఠం కార్యకలాపాలు సాగిస్తున్న తమిళనాడులోనే అత్యంత వినాశకర పరిణామాలు సంభవించాయి. ‘దేవుడిని నమ్మినవాడు మూర్ఖుడు’ అని రాసిన శిలాఫలకంతో కూడిన ద్రవిడ ఉద్యమ నాయకుని విగ్రహం కంచి మఠం ఎదురుగానే నిలబెట్టారు. ఆర్ష ధర్మానికి మాధ్యమంగా కనిపించే సంస్కృతమంటే ద్రవిడ ఉద్యమం మండిపడేది. భాషను కూడా రాజకీయానికి ఉపయోగించుకున్న సందర్భం. తమిళ భాషకు ఉన్న పురాతన ఖ్యాతిని ఎవరూ శంకించలేరు. అందులో వచ్చిన సాహిత్యం అందరికీ శిరోధార్యమే. కానీ తమిళ భాష కోణం నుంచి మనోభావాలను, హిందీ, సంస్కృత భాషలను, ఉత్తర భారతదేశం మీద దండెత్తిన వారి ఉద్దేశం ఆ భాష పురాతన పార్శ్వాన్ని గౌరవించడం కాదు. భాషను అడ్డం పెట్టుకుని విభజన రాజకీయాలు నడపడమే. అలాంటి సమయంలో చంద్రశేఖరేంద్ర మౌనంగా ఉండిపోయారు. కానీ కరుణానిధి వంటి వారికి జయేంద్ర దీటుగా సమాధానం ఇచ్చారు. ‘నాకు సంస్కృతం పితృభాష, తమిళం మాతృభాష’ అని ప్రకటించారు. హిందూ దేవతా విగ్రహాలను అపవిత్రం చేయడం, వాటి పట్ల అపచారాలకు పాల్పడడం వంటి చర్యలు నిత్యకృత్యమైన కాలాన్ని జయేంద్ర చూశారు. ఇది ధర్మానికీ, ధర్మావలంబికులకూ సంకట స్థితి. అలాంటి కాలంలో సన్యాసాశ్రమం స్వీకరించిన నిజమైన ఒక ఆధ్యాత్మికవేత్త నిర్వర్తించవలసి ఉన్న కర్తవ్యాన్ని జయేంద్ర నిర్వర్తించారు.

ఆధునిక రామానుజులు

‘ఆయన (జయేంద్ర) ఆధునిక కాలపు రామానుజులు. అనేక సంస్థలను స్థాపించారు. సమాజంలో వెనుకబడిపోయిన అనేక మందికి అక్షరజ్ఞానం అందించడంలో సహాయపడ్డారు. కంచి మఠం పూర్వపు అధిపతులు పెట్టిన సంప్రదాయాలను జయేంద్ర ఉల్లంఘించారని కొందరు చెబుతూ ఉంటారు. కానీ ప్రజలకు చేరువ కావడానికే ఆయన మఠం వీడి వచ్చేవారు. దీనిని పలువురు అపార్థం చేసుకున్నారు’ అంటారు ప్రముఖ న్యాయవాది వి.రాఘవాచారి. ‘అపార్థం’ చేసుకోవడమనే మాట నిజం. పరమాచార్య లేదా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నిరంతరం దైవధ్యానంలోనే ఉండేవారు. ఆయన జనం దగ్గరకు వచ్చి నాలుగు మాటలు చెప్పడం అరుదు.

కానీ దేశకాల పరిస్థితులు మున్నెన్నడూ లేని రీతిలో విషమించాయి. భారతీయ వ్యతిరేక శక్తులు, భారతదేశ వ్యతిరేక శక్తులు అసాధారణమైన రీతిలో బలం పుంజుకున్నాయి. దేశీయుల క్షుద్ర రాజకీయం, అన్యమతాల కుట్ర రాజకీయం, ఓట్లే పరమావధిగా, లౌకికవాదం మాటున వేళ్లూనుకున్న విద్రోహం పరాకాష్టకు చేరుకున్నాయి. వీటన్నిటి లక్ష్యం హిందూత్వమే. ఎన్నో చారిత్రక కారణాలతో ప్రధాన స్రవంతి హిందూ ధర్మానికి దూరంగా ఉండిపోయిన వర్గాలను సమాజం నుంచి పూర్తిగా వేరు చేయడానికి జరిగే కుట్రలు పరాకాష్టకు చేరుకున్న కాలం మనం చూస్తున్నాం. భారతీయుడనని సగర్వంగా చెప్పుకోలేని దుస్థితి. హిందువుల హక్కులకు తప్ప మిగిలిన అన్ని వర్గాల హక్కులకు కావలసినంత రక్షణ ఉంది. ఇలాంటి కాలంలో ఒక పద్ధతి ప్రకారం హిందువుల మధ్య ఐక్యతను సాధించడానికి తన వంతు పాత్రను ప్రతిభావంతంగా నిర్వహించినవారు జయేంద్ర. కలవాయి వెంకట్‌జి అనే ప్రముఖుడు ఏమన్నారో చూడండి – ‘ఆయన (జయేంద్ర) హిందూ సంప్రదాయాలను సంస్కరించారు. క్రైస్తవ మత ప్రచారానికి అడ్డుకట్టు వేశారు. మఠంలో జానపద కళకు ఆశ్రయం కల్పించారు. కానీ సనాతన ధర్మ ప్రబోధమే జీవితధ్యేయంగా గడిపారు’.

సన్యాసాశ్రమ ధర్మం, సామాజిక బాధ్యత ఆయన రెండు కళ్లు. భారతదేశ వైవిధ్యం అంటే హిందూ జీవన విధానంలోని వైవిధ్యమే. దీనిని కాపాడుకోవడ మంటే భారతదేశ వైవిధ్యాన్ని కాపాడుకోవడమే. దానిని గుర్తించారు కనుకనే ఇలాంటి పంథాను జయేంద్ర అనుసరించారు. అందుకు ఆయన మీద విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమని నమ్మిన వారు చేసేవి.

ఏకత్వ ప్రయత్నం

భారతీయ సమాజాన్ని విచ్చిన్నం చేసే కుట్ర దళితులను దూరం చేయడం దగ్గర ఆరంభమవు తోంది. దీనిని గుర్తించిన సాధుసంతులు ఎక్కువ మందే ఉన్నారు. మరింత ఆధునిక దృష్టితో, ఈ సమస్యను పరిష్కరించే ధ్యేయంతో జయేంద్ర కదిలారు. సామాజిక వెనుకబాటు నుంచి, అవిద్య నుంచి దళితులను విముక్తం చేయడం ద్వారా భారతీయ సమాజంలో ఏకత్వం సాధించాలన్నదే జయేంద్ర ఆశయం. అయితే ఆయన ప్రధానంగా ఆధ్యాత్మికవేత్త. కాబట్టి ఆయన ఆ కోణం నుంచి ఎక్కువ చూస్తారు. పరిష్కారం వెతుకుతారు.

ఇటీవల కేరళలో అన్ని కులాల నుంచి, ముఖ్యంగా బడుగు వర్గాల నుంచి హిందూ ఆలయాలకు పూజారులను నియమించిన సంఘటన పత్రికలలో ప్రముఖంగా వచ్చింది. అలాంటి ప్రయత్నం జయేంద్ర అప్పటికే చేశారు. జన జాగరణ, జన కల్యాణ్‌ అనే పథకాలు దళితులను పూర్తిగా ప్రధాన స్రవంతి హిందూ సమాజంలోకి తీసుకు వచ్చేందుకు ఆయన ఆరంభించినవే. మైలాపూర్‌ కపాలేశ్వర ఆలయ ధర్మకర్తల మండలిలో జయేంద్ర దళితులకు చోటు కల్పించారు. దేశ కాల మాన పరిస్థితులను బట్టి మఠాన్ని వీడి వచ్చి అన్ని వర్గాలతో మాట్లాడడం, కనీవినీ ఎరుగని రీతిలో దళిత వాడలకు వెళ్లడం జయేంద్ర చేయగలిగారు.

అహం బ్రహ్మస్మి అంటుంది ధర్మం. నేనే బ్రహ్మను అని అర్థం. అంటే జీవాత్మ పరమాత్మ వేర్వేరు కాదు. జీవులంతా పూజనీయులే. కాబట్టే తాను అందరిలోను దైవాన్ని చూస్తానని జయేంద్ర వివరించారు. ఆదిశంకరులు, వారి అద్వైతం చెప్పేది ఇదే. జీవాత్మ పరమాత్మ వేర్వేరు కాదు. దానిని ఆచరించడానికీ, అందరికీ అర్థమయ్యేటట్టు చేయడానికి యత్నించిన జయేంద్ర స్మరణీయులు.

అయోధ్య రామమందిర ఉద్యమం ఆధునిక కాలంలో హిందూ పునరుజ్జీవన ఉద్యమంగా చెప్పవచ్చు. హిందువులను ఏకం చేయడంలో ఆ ఉద్యమం నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైనది. కానీ సమస్య పరిష్కారం అంత సులభం కాదు. అలా అని అపరిషృతంగా ఉంచడం కూడా ప్రమాదం. దీనిని గమనించిన వారిలో అగ్రగణ్యులు జయేంద్ర. ఎన్‌డిఎ అధికారంలో ఉండగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మందిరం సమస్య విషయంలో హిందువులకు, ముస్లింలకు మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి జయేంద్ర ముందుకు వచ్చారు. ఆ వివాదంలో ప్రధాన శిబిరాలు విశ్వహిందూ పరిషత్‌, అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డులకు ఆయన అనేక లేఖలు రాసి చర్చలకు తీసుకురాగలిగారు. ఆ సమస్య అప్పుడు పరిష్కారం కాకపోవచ్చు. కానీ ఆయన కృషి ప్రత్యేకమైనది. ఆయన మధ్యవర్తిత్వాన్ని ముస్లింలు స్వాగతించిన విషయం ఇక్కడ గమనార్హం.

నిజానికి హిందుత్వను, భారతీయతను తీవ్రంగా ద్వేషించే ద్రవిడ సిద్ధాంతానికి చెందిన వారు కూడా జయేంద్ర సరస్వతిని ప్రశంసించడం కనిపిస్తుంది. ‘నాకు కంచి మఠంతో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అయినా ఆయన (జయేంద్ర) మరణానికి నేను సంతాపం వ్యక్తం చేస్తున్నాను’ అన్నారు ద్రవిడ కజగం నాయకుడు కె.వీరమణి. ప్రజల హృదయాలను గెలుచుకోవడం అంటే ఇదే. భారతీయత, దానిని ఆశ్రయించుకుని ఉన్న ఆధ్యాత్మిక చింతన, ధార్మిక దృష్టి, తాత్వికతలను రక్షించుకుంటేనే భారతదేశం మిగులుతుంది. అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నవి కూడా. వాటిని కాపాడుకుంటేనే మనవైన విలువలు మిగులుతాయి. మన సంస్కృతి నిలుస్తుంది. మన గతంతో మన బంధం కొనసాగుతుంది. దీనిని గుర్తించడమే, ఆచరించడమే జయేంద్ర సరస్వతి స్వామికి మనమంతా ఇచ్చే నిజమైన నివాళి.

పూర్వాశ్రమం

జయేంద్ర పూర్వాశ్రమం గురించి రెండు మాటలు – ఆయన జూలై 18, 1935లో తమిళనాడులో జన్మించారు. తిరువారూర్‌ వారి స్వస్థలం. 19వ ఏట 1954లో కంచి మఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. మార్చి 22, 1994న మఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కంచి మఠం 69వ పీఠాధిపతి. పరివ్రాజకత్వం అంటే తన సమాజం సంక్షోభంలో ఉన్నా పట్టించుకోకుండా పలాయన వాదాన్ని ఆశ్రయించడం కాదని మనసా, వాచా నమ్మిన విశిష్ట సాధుసంతులలో అగ్రగణ్యులు జయేంద్ర సరస్వతి.

జనం మధ్యకు

6వ శతాబ్దానికి చెందిన నందనార్‌ అనే భక్తుడి మీద జయేంద్ర అపారమైన గౌరవం కలిగి ఉండేవారు. నందనార్‌ చర్మకారుడు. చెప్పులు కుట్టేవాడు. కానీ చిదంబరంలోని నటరాజస్వామికి పరమభక్తుడు. తరువాత ఆయన ముక్తిని పొందాడని కూడా విశ్వసిస్తారు. నందనార్‌కు ఆలయం నిర్మించాలని జయేంద్ర ఆకాంక్షించారు. అయితే దేవుడు, ఆధ్యాత్మిక చింతనతోనే ఉపేక్షితులను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం సాధ్యపడేది కాదు. అది గుర్తించిన వారు కాబట్టే దళితులకు పాఠశాలలు ఏర్పాటు చేశారు. తను జనం మధ్యకు ఎందుకు వచ్చారో కూడా ఆయనే వివరించారు.

ఓం శాంతిః శాంతిః శాంతిః

– జి.నారాయణరావు

(జాగృతి సౌజన్యం తో)