పత్రికా ప్రకటన
అయోధ్య రామజన్మభూమిలో భవ్య రామమందిర నిర్మాణం కోసం శిలాపూజ 1989లోనే జరిగినా అనేక రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టించడం, కోర్ట్ లలో విచారణ సుదీర్ఘకాలంపాటు సాగడంతో మందిర నిర్మాణం ప్రారంభం కాలేదని, ఇప్పుడు 31 సంవత్సరాల తరువాత గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఆగస్ట్ 5న భూమిపూజతో ఆ కార్యం ప్రారంభమవుతుందని విశ్వహిందూ పరిషత్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ ఆలోక్ కుమార్ అన్నారు. రాగల మూడేళ్లలో భవ్య మందిర నిర్మాణం పూర్తవుతుందని, రామభక్తులు తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుంటారని ఆయన తెలియజేశారు. లక్నోలో జరిగిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశంలో మరొక దేవాలయం నిర్మించడం కోసం మాత్రమే ఇంతటి ప్రయత్నం కాదని, `రామరాజ్యాన్ని’ గురించి ప్రపంచానికి తెలియజేయడం కోసమేనని ఆయన అన్నారు. రామరాజ్య స్థాపన కేవలం ప్రభుత్వాలవల్ల మాత్రమే జరగదని, సమాజంలోని అన్ని వర్గాలవారు అందుకు కృషి చేయాలని అన్నారు.
రామరాజ్యంలో పేదరికం, అనారోగ్యం లేవు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించగలిగిననాడే రామరాజ్యం సాకారమవుతుంది. ప్రతిఒక్కరికీ కూడు, గుడ్డ, గూడు, విద్య అందాలి. కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిఒక్కరూ పరమాత్మను తెలుసుకునే విధంగా ఉన్నతిని సాధించాలి.
ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తున్న విశ్వహిందూ పరిషత్ దేశంలో లక్షకు పైగా ఏకల్ విద్యాలయాలను(ఏకోపాధ్యాయ పాఠశాలలు) ప్రారంభించిందని, వీటిద్వారా సంస్కారం, పరిశుభ్రతతోపాటు స్వావలంబన సాధించే విధంగా తీర్చిదిద్దుతోందని ఆలోక్ కుమార్ అన్నారు.
ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, తెగలకు సంబంధించిన వారికి మెరుగైన విద్య, ఆరోగ్య, ఉపాధి అవకాశాలు అందించడానికి విశ్వహిందూ పరిషత్ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తోంది. ఆ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజలకు చేరే విధంగా చూస్తున్నది.
అరణ్యవాసకాలంలో శ్రీ రామచంద్రుడు తీవ్రవాదులైన రాక్షసులు, విషపూరితమైన విదేశీ సంస్కృతి ఎంతటి ఉత్పాతాన్ని సృష్టిస్తున్నాయో గ్రహించాడు. అందుకనే లోకకంటకులైన రాక్షసులను సంపూర్ణంగా తుడిచివేస్తానని (`నిశచర హీన కరహు మహి’) ప్రతిజ్ఞ చేశాడు. దేశాన్ని తీవ్రవాద శక్తుల నుంచి రక్షించి సజ్జన శక్తిని మరింత బలోపేతం చేయడం కోసమే వి హిం ప పనిచేస్తోందని ఆయన అన్నారు.
అలాగే మానవ విలువలను, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించే సంప్రదాయ కుటుంబ వ్యవస్థను పటిష్టపరచడానికి కూడా వి హిం ప కృషి చేస్తుంది. దీని వల్ల ఒంటరితనం, దానివల్ల కలిగే మానసిక ఒత్తిడుల నుంచి చాలామంది విముక్తులవుతారు.
గో సంరక్షణ, గో సంతతి అభివృద్ధి కోసం కూడా వి హిం ప కృషి చేస్తోంది. గో పాలకులు, వ్యవసాయదారులకు శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది.
14ఏళ్ల తన వనవాస కాలంలో మర్యాదా పురుషోత్తముడైన రాముడు సామాజిక సమరసత కోసం ప్రయత్నించాడని వి.హిం.ప కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆలోక్ కుమార్ అన్నారు. కాలినడకన అనేక ప్రాంతాలు తిరుగుతూ వివిధ వర్గాల ప్రజానీకాన్ని కలిసి వారికి ఫ్రేమాభిమానాలను పంచాడని ఆయన అన్నారు. రాముని మార్గంలోనే నడవడానికి, సామాజిక సమరసత సాధించడానికి వి హిం ప కూడా ప్రయత్నిస్తోందని తెలియజేశారు. అహల్యలు, శబరిలు, నిషాదరాజులను కలుపుకుని సమాజంలో స్నేహం, ప్రేమ భావాన్ని పెంపొందించడానికి, హెచ్చుతగ్గులను తుడిచివేయడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు.
ప్రపంచానికి శాంతి, సంతోషాలను అందించగలిగే ఆత్మనిర్భర భారత్ ను నిర్మించడంలో కృతకృత్యులమవుతామనే విశ్వాసం ఉందని ఆలోక్ కుమార్ అన్నారు.
– రిషీ కపూర్, విశ్వహిందూ పరిషత్, లక్నో