Home Telugu Articles శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒక దార్శనీక దేశభక్తుడు – దిశానిర్దేశం చేసిన నాయకుడు  

శ్యామాప్రసాద్ ముఖర్జీ ఒక దార్శనీక దేశభక్తుడు – దిశానిర్దేశం చేసిన నాయకుడు  

0
SHARE

జూన్ -23 శ్యామాప్రసాద్ ముఖర్జీ బ‌లిదాన్ దివ‌స్

ఖండిత భారతదేశపు అఖండత్వం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు  డాక్టర్ శ్యామాప్రసాద్  ముఖర్జీ జయంతి నేడు( july 06). స్వతంత్ర భారత రాజకీయాకాశంలో సిద్ధాంత రహిత రాజకీయాలు, స్వార్థ , పదవీ వ్యామోహం వాదాల కారుమబ్బులు కమ్ముకున్న ఆ తొలి దినాలలో ఒక మెరుపు మెరిసి మాయమైంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే ఆ మెరుపు వెలుగు క్షణ కాలమే కావచ్చు. కానీ  గాఢాంధకార  భవిష్యత్తులో మునిగి వున్న భారత ప్రజానీకానికి ఆమాత్రం వెలుగు చాలు…’భారతీయ జన సంఘం’ అనే వాస్తవమైన సైద్ధాంతిక రాజకీయ పథాన్ని కనుగొనడానికి స్వతంత్ర భారత రాజకీయాలకు ఒక నూతన దిశను, నూతన లక్ష్యాన్ని ప్రసాదించిన ఆ మెరుపే స్వర్గీయ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. శ్యామాప్రసాద్ ముఖర్జీ భారతమాత కన్న మహా సంతానంలో ఒకరు. వారి జీవితంలో ప్రతిక్షణం, శరీరంలో ప్రతి కణం మాతృభూమి సేవకే సమర్పితం అయ్యాయి.1901 జూలై 7వ తేదీన అసుతోష్ ముఖర్జీ ,రాణి జోగ్మయాదేవి పుణ్య దంపతులకు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మించారు. తన తండ్రి అసుతోష్ ముఖర్జీ నుంచి అనేక గొప్ప గుణాలు పుణికి పుచ్చుకున్నారు. వాటిలో అతి ప్రముఖ గుణం అసుతోష్ ముఖర్జీ యొక్క ప్రఘాడమైన , రాజీలేని జాతీయ భావన, ఆయన నిర్భయమైన మనస్తత్వం. శ్యామాప్రసాద్ కు భగవంతుడు ఇచ్చిన మరో వరం అసామాన్యమైన అతడి మేధాశక్తి. అతడి తెలివితేటలు, గ్రహణశక్తి చూసి పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం విస్మయం చెందుతూ ఉండేవారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే శ్యాంప్రసాద్ ఎఫ్.ఏ, బి.ఏ విద్యార్థులకు బోధించే పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేస్తుండేవాడు.అతి చిన్న వయసు నుంచి శ్యామాప్రసాద్ ఆదర్శవాదిగా రూపుదిద్దుకోసాగాడు.’నేను గొప్ప వ్యక్తిని కావాలి. నాకు ధనం వద్దు’ ఒక పుస్తకంలో శ్యామాప్రసాద్ రాసిన మాట అతడి ఆదర్శవాది ఆలోచనలకు తార్కాణం. ఆ విధంగా రూపొందిన ఆదర్శవాదం చిట్టచివరి క్షణం వరకు నిలిచింది . ఆ ఆదర్శవాదమే అతడినొక మహనీయ వ్యక్తిగా రూపొందించింది.1919లో ఇంటర్ పూర్తి ,1921లో బి ఏ ఆనర్స్ పట్టా ప్రధమ శ్రేణిలో 1923లో ఎం ఏ పరీక్షల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.1924లో హైకోర్టు న్యాయవాదిగా తన వృత్తిని మొదలు పెట్టారు . కానీ 1924 మే నెలలో తండ్రి హఠాత్తుగా స్వర్గస్తులైనారు. అసుతోష్ ముఖర్జీ మరణం బెంగాల్ కు తీరనిలోటు అయింది. తండ్రి మరణం కారణంగా ఖాళీ అయిన కలకత్తా విశ్వవిద్యాలయం సిండికేట్ స్థానంలో ముఖర్జీ  నియుక్తులయ్యారు. విశ్వవిద్యాలయాన్ని స్వదేశీ సూత్రాలపై తీర్చిదిద్దేందుకు తండ్రి అసుతోష్ ముఖర్జీ సాగించిన కృషి భారం ఇప్పుడు పూర్తిగా శ్యాం ప్రసాద్ భుజస్కంధాలపై పడింది.అప్పటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. ఆ తరువాత 15 సంవత్సరాల పాటు విద్యా రంగమే ఆయన సర్వస్వం అయింది.

1934లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులు కావడం మరో పెద్ద మలుపురాయి. అప్పటికి వారి వయసు 33 సంవత్సరాలు మాత్రమే. దేశంలోనే అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ గా నియమితులైనది శ్యామాప్రసాద్ జీ.1936 లో కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం లో మాట్లాడుతూ ” భౌతిక సుఖాలే లక్ష్యంగా మనుషులను యంత్రాలుగా మార్చి పని చేయించే విధానాల ద్వారా ఏ జాతి గొప్పదనాన్ని సాధించలేదు. పాశ్చాత్యుల నైపుణ్యం ,విజ్ఞానం  నుండి శక్తిని సంపాదించుకునే విధంగా మన సంస్కృతి , నాగరికతలతో విద్యావిధానాన్ని అనుసంధానం చేయడమే మన ఆదర్శం కావాలి” అని ఆ సమయంలో ఆయన పిలుపునిచ్చారు. 1938లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరంలో బెనారస్ విశ్వవిద్యాలయం కూడా ఆయనకు గౌరవ డాక్టరేట్ పట్టా ఇచ్చి సత్కరించింది. శ్యామాప్రసాద్ ముఖర్జీ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అయ్యారు.1937 లో జరిగిన ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. బెంగాల్ రాష్ట్రం తీవ్రమైన క్షామం బారిన పడిన సమయం లో . సుమారు 30 లక్షల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. బెంగాల్ ప్రజల ఆకలి కేకలు శ్యామాప్రసాద్ హృదయాన్ని కదిలించి వేశాయి. వెంటనే “బెంగాల్ సహాయ సమితి” అనే సంస్థను ఏర్పాటు చేసి పెద్దఎత్తున సేవ కార్యక్రమాలు చేశారు.తన కళ్ళ ముందే నాయకుల ద్రోహం కారణంగా మాతృభూమి ముక్కలవుతుంటే చూడలేకపోయారయన. తాను చేయగలిగిందేమీలేదని ఆయనకు తెలుసు. అయినా చిట్ట చివరి క్షణం వరకు విభజనను ఆపేందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు.

1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించింది. జాతీయ ప్రభుత్వం లో కాంగ్రెసేతరులను కూడా చేర్చుకోవడం జరిగినది  ఫలితంగా స్వాతంత్ర్యాoనంతరం ఏర్పడిన మొదటి జాతీయ ప్రభుత్వం లో 14 మంది మంత్రులలో ఏడుగురు కాంగ్రెసేతరులు కూడా ఉన్నారు. వారిలో శ్యాంప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్, జాన్ మత్తయ్ , బలదేవ్ సింగ్, భా భా, కె. సి నియోగి, షణ్ముగం శెట్టి ఉన్నారు. నూతన మంత్రివర్గంలో శ్యామాప్రసాద్ కు పరిశ్రమల శాఖ అప్పగించబడింది. నిజానికి విద్యాశాఖ ఆయన హృదయానికి అతి ప్రియమైనది. విద్యారంగం నుంచే ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన విద్యామంత్రిగా నియమింపబడి ఉంటే ఆ రంగంలో తనకు గల అపార అనుభవంతో విద్యారంగాన్ని అతి యోగ్యంగా ఆయన తీర్చిదిద్దగలిగి ఉండేవారు. అయినా రెండున్నర సంవత్సరాలు పరిశ్రమల మంత్రిగా ఉన్న సమయంలో తన సామర్థ్యాన్ని శ్యాంప్రసాద్ నిరూపించుకున్నారు . చిత్తరంజన్ రైలు ఇంజన్ కర్మాగారం,సింద్రీ ఎరువుల కర్మాగారం, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే మూడు భారీ పరిశ్రమలు నేతృత్వంలో రూపొందినవే. “ఫ్యాక్టరీలో తయారైన మొట్టమొదటి మూడవ తరగతి రైలు పెట్టె సాధారణ భారతీయ రైలు ప్రయాణికుడికి ఎంత మేరకు సౌకర్యంగా ఉంటుందన్న విషయం తెలుసుకునేందుకు నేను స్వయంగా ఆ పెట్టెలు ప్రయాణం చేశాను” అని ఆయన అన్న మాటలు అతిశయోక్తి కాదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన తదుపరి మరణించే వరకు ఎక్కువగా ఆయన ఆ మూడవ తరగతి పెట్టెలోనే ప్రయాణించే వారు.మొదట్లో శ్యాంప్రసాద్ మనసులో రూపుదిద్దుకున్న ఆర్థిక, పారిశ్రామిక విధానమే ఆ తదుపరి దీనదయాళ్ ఉపాధ్యాయ వంటి మేధావుల చేతుల్లో మెరుగు  దిద్దుకుని భారతీయ జన సంఘానికి, ఆ తరువాత భారతీయ జనతాపార్టీ కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయింది.

దేశ భవిష్యత్తు కోసం ఆయన తీవ్రం గా ఆలోచించే వారు , విభజన కష్టాలను ఎదుర్కొన్న భారతదేశం లో మొదటి ప్రధానమంత్రి తీసుకునే అనాలోచిత నిర్ణయాలను శ్యాంప్రసాద్ నిశితంగా విమర్శించే వారు . నెహ్రూ మహాశయునికి విమర్శలను ఓర్చుకునే తత్వం ఉండేది కాదు అందుకే 1950 ఏప్రిల్ 1వ తేదీన తన మంత్రి పదవికి రాజీనామా లేఖను నెహ్రూ కు పంపారు. వెనకా ముందూ చూడకుండా నెహ్రూ ఆ రాజీనామాను ఆమోదించారు. అయితే శ్యాంప్రసాద్ మంత్రివర్గాన్ని వీడి వెళ్ళడం పటేల్ తదితర సహచరులకు ఏ మాత్రం ఇష్టంలేదు.శ్యామాప్రసాద్ రాజీనామా సమర్పించిన వారం రోజులకు ఏప్రిల్ 8, 1950 నాడు నెహ్రూ- లియాఖత్ ఆలీఖాన్ లు ఒప్పందంపై సంతకాలు చేశారు 1950 ఆగస్టు 1 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విధంగా రాసింది.”నెహ్రూ – లియాఖత్ ఒప్పందం కొనసాగుతున్న హిందూ శరణార్థుల వెల్లువను నిరోధించడంలో విఫలమైంది ” అని పేర్కొంది.

మంత్రివర్గం నుంచి బయటకు వచ్చే సమయానికి ఆయన ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీకి చెందకపోయినప్పటికీ రాజకీయ వర్గాల్లో ఆయన ఖ్యాతి ఉన్నత స్థానంలో ఉంది. నెహ్రూకు ధీటైన ప్రతిపక్ష నాయకుడు ఆయనే అని దాదాపు అన్ని ప్రతిపక్షాలు భావించే సాగాయి. అయితే శ్యామాప్రసాద్ వీటిన్నింటితో తృప్తిపడలేదు. తాను నమ్మిన ఆశయాలు, ఆదర్శాలకు అనుగుణమైన ఒక జాతీయ రాజకీయ పక్షం ఉండాలని ఆయన తీవ్రంగా ఆలోచించసాగారు.ఆరోజున దేశంలో దాదాపు ఇదే విషయాన్ని గురించి చాలా తీవ్రంగా తర్జనభర్జన పడుతున్న సంస్థ మరొకటి ఉంది. అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. హిందూ సమాజంలోని కుల, మత, వర్గ విభేదాలను దూరంచేసి, సంఘటితమైన, శక్తివంతమైన హిందూ సమాజాన్ని నిర్మించాలని, అటువంటి హిందూ సమాజమే భారతదేశ వైభవానికి, ఉన్నతికి ఆధారమని విశ్వసిస్తున్న సంస్థ అది.

శ్యాంప్రసాద్ నూతన రాజకీయ పక్షాన్ని రూపొందించే  ప్రయత్నంలో ఉన్నారు. రూపొందబోయే ఆ రాజకీయ పక్షం కాంగ్రెస్ సంస్కృతికి పూర్తి దూరంగా ఉండాలని ఆయన భావించారు.ఆయన దృష్టి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మీదకు మళ్లింది. సంఘ్ తో శ్యామాప్రసాద్ కు శబ్దం ముందు నుండి పరిచయం ఉంది. సంఘ సిద్ధాంతం, దాని దేశభక్తి, స్వదేశ, స్వధర్మ నిష్టలు ఆయనను ఎంతగానో ఆకర్షించాయి.”మేఘావృతమైన దేశాకాశంలో మెరుపు తీగలు మీరు” అని లాహోర్లో ఒక ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సంఘాన్ని ప్రశంసించారాయన. సంఘ అధినేత శ్రీ గురూజీ తో శ్యామాప్రసాద్ సమావేశమయ్యారు. నూతన రాజకీయ పక్షానికి సంఘం పరోక్ష సహకారాన్ని అందించడానికి శ్రీ గురూజీ అంగీకరించారు. అయితే సంఘం మాత్రం స్వతంత్ర సంస్థగా జాతీయ పునర్నిర్మాణ కార్యాన్ని యధాతథంగా కొనసాగిస్తుందని శ్రీ గురూజీ సృష్టం చేశారు.

1951 జనవరి నుంచి నూతన రాజకీయ పక్షాన్ని ప్రారంభించేందుకు శ్యామాప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు.”1951 అక్టోబర్ 21 భారతీయ జనసంఘ్ పార్టీ ప్రారంభం”. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ఆజాద్ హింద్ పౌజ్ ను కూడా అక్టోబర్ 21 నాడే ప్రారంభించిన విషయాన్ని శ్యాంప్రసాద్ గుర్తు చేశారు. మాతృభూమి సేవలో అజాద్ హింద్ ఫౌజ్ సాగించిన పోరాటాన్ని భారతీయ జనసంఘ్ కొనసాగిస్తుందని ఆయన అన్నారు.”జనసంఘ్ ను నేను కాలరాచి పారేస్తాను” అన్న నెహ్రూ బెదిరింపును ప్రస్తావించి ” ఈ కాలరాచే మనస్తత్వాన్ని నేను కాలరాచి తీరుతాను” శ్యామాప్రసాద్ సవాల్ విసిరారు. 1952 ఎన్నికల్లో మూడు పార్లమెంటు స్థానాలు, 33 అసెంబ్లీలు గెలిచారు.  ” పార్లమెంటు సింహం” అని శ్యామాప్రసాద్ ప్రఖ్యాతిగాంచారు. పార్లమెంటు సభ్యులు, దేశ ప్రజలు కూడా ఆయనలో ‘ భావిభారత ప్రధాని’ ని దర్శించేవారు. ‘సర్దార్ పటేల్ వారసత్వం శ్యాంప్రసాద్ కు సంప్రాప్తించింది’ అన్న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక వ్యాఖ్య శ్యాంప్రసాద్ కు నిజమైన గౌరవం.

కాశ్మీర్ సమస్య గురించి పార్లమెంట్ లో మాట్లాడుతూ ” కాశ్మీరీ ప్రజలు మొదట భారతీయులు, తరువాత కాశ్మీరీలా ? లేక మొదట కాశ్మీరీలు తర్వాత భారతీయులా ? లేక మొదటిగా చివరిగా కూడా కాశ్మీరీలే తప్ప భారతీయులు కాదా! నిర్ణయించవలసిన అతి ముఖ్యమైన విషయం అది” అని సమస్య తీవ్రతను సభ్యుల ముందు పెట్టారు.పార్లమెంటులో శ్యామాప్రసాద్ చేసే ప్రసంగాలు అద్భుతంగా, ఎంతో ఆసక్తిదాయకంగా,ఆలోచనాత్మకంగా, ప్రేరణప్రదంగా ఉండేవి. సభ్యులు పూర్తి నిశ్శబ్దంతో, శ్రద్ధతో ఆయన ప్రసంగాలను వినేవారు. ఆయన ప్రసంగాలు గురించి ప్రశంసిస్తూ అప్పటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులలో ఒకరు, జనసత్తా హిందీ దినపత్రిక సంపాదకులు అయిన ప్రొఫెసర్ ఇంద్ర విద్య వాచస్పతి ఒకసారి తన సహజమైన హాస్య ధోరణిలో తన పత్రికలో ఇలా రాశారు. పార్లమెంట్ భవనంలోని రెస్టారెంట్లు, కాఫీ షాపుల యజమానులందరూ తీవ్రంగా ద్వేషించే ఒకే ఒక వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, ఎందుకంటే, ఆయన మాట్లాడుతున్నంత సేపు సభ్యులందరూ సభలోనే కూర్చుంటారు తప్ప, కాఫీ షాపులకేసి, రెస్టారెంట్లకేసి రారని ఆయన రాసిన మాటలు శ్యామాప్రసాద్ పార్లమెంటరీ సామర్థ్యానికి ప్రశంసలు మాత్రమే.

భారతదేశ చరిత్రలో కాశ్మీర్ రాష్ట్రానిదొక విషాదగాథ. ఆ విషాద గాధ లోని అనేక అధ్యాయాలలో భారతీయ జనసంఘ్, శ్యామాప్రసాద్ ముఖర్జీలది కూడా ఒక అధ్యాయం. మామూలు అధ్యాయం కాదు. అత్యంత ప్రముఖమైన అధ్యాయం. భారతీయ జనసంఘ్ దేశ సమైక్యత కోసం నిలిచిన పార్టీ. కాశ్మీర్ విషయంలో భారతీయ జనసంఘ్ ఆవిర్భవించిన రోజు నుంచి ఈరోజు వరకు ( ప్రస్తుతం భారతీయ జనసంఘ్ లేదు. అయితే అదే ప్రేరణతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ జనసంఘ్ కు మరో రూపం మాత్రమే).దేశ విభజన సమయంలో కాశ్మీర్ పాకిస్తాన్ లో విలీనం కావాలని జిన్నా ఆశించాడు. అయితే కాశ్మీర్ సంస్థానానికి అధిపతి అయిన మహారాజా హరిసింగ్ తరతరాల కాశ్మీర్ వారసత్వాన్ని, చరిత్రను దృష్టిలో పెట్టుకొని అది భారతదేశంలో భాగంగా ఉండటమే ఉచితమని భావించాడు.1947 అక్టోబర్ లో ఆ సంస్థానాన్ని భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేస్తూ విలీన పత్రాలపై సంతకాలు చేశాడు. 1947 అక్టోబర్ 22న పాకిస్తాన్ సైన్యాలు కాశ్మీర్ సరిహద్దులోని గిరిజనులను తీసుకొని కాశ్మీర్ రాష్ట్రంపై దురాక్రమణ ప్రారంభించాయి. ఈ పరిస్థితులలో సర్దార్ పటేల్, శ్యామాప్రసాద్ తదితరులు ఒత్తిడి మేరకు భారత సైన్యాన్ని కాశ్మీర్ కు పంపించడానికి నెహ్రూ అంగీకరించారు. దాదాపు సంవత్సరానికి పైగా ప్రయత్నం తర్వాత చాలావరకు పాక్ సేనలను కాశ్మీర్ నుంచి భారత సైన్యం తిప్పికొట్టగలిగింది. అయితే 1949 జనవరి ఒకటినాడు హఠాత్తుగా ప్రధాని నెహ్రూ భారత సైన్యానికి కాల్పుల విరమణకు ఆదేశం ఇవ్వడంతో 1/ 3 వంతు కాశ్మీర్ భూభాగం పాకిస్తాన్ చేతుల్లో ఉండిపోయింది.భారతదేశం దానిని ‘ఆక్రమిత కాశ్మీర్’ అని పిలువసాగింది. పాకిస్తాన్ మాత్రం అది ‘ఆజాద్ కాశ్మీర్’ అని ప్రకటించింది. ఒకపక్క కాశ్మీర్లో భారత వ్యతిరేక,జమ్మూ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ షేక్ అబ్దుల్లా మరోప్రక్క నెహ్రూతో సన్నిహితంగా వ్యవహరిస్తూ, కేంద్ర ప్రభుత్వం తనకుకూలంగా వ్యవహరించేటట్టు ప్రయత్నాలు చేయసాగాడు.ఆ ప్రయత్నాలలో నుంచి పుట్టుకొచ్చినదే కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ మన రాజ్యాంగంలో చొప్పించబడ్డ 370 వ అధికరణ. కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించమని షేక్ అబ్దుల్లా రాజ్యాంగ సంఘానికి అధ్యక్షుడైనా డా.బి.ఆర్.అంబేద్కర్ కోరినప్పుడు అంబేద్కర్ ఆ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు.చివరికి నెహ్రూ ఒత్తిడి కారణంగా రాజ్యాంగంలో కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ 370 వ అధికరణ చేర్చబడింది.షేక్ అబ్దుల్లాకు 370 వ అధికరణం అతడి భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఒక లైసెన్స్ అయుంది.ఇక శ్యామాప్రసాద్ ముందు తెరిచి ఉన్న ఏకైక మార్గం భారతీయ జనసంఘ్ ద్వారా ఉద్యమించడమే.1952 జూన్ 14 న జరిగిన కార్యవర్గ సమావేశాలలో జనసంఘ్ కాశ్మీర్ పరిస్థితిపై తీర్మానం ఆమోదించింది.1952 జూన్ 26 వ తేదీన పార్లమెంటు లో శ్యాంప్రసాద్ కాశ్మీర్ సమస్యపై ప్రసంగించారు. ప్రత్యేక జెండా ,ప్రత్యేక ప్రధానమంత్రి,370వ అధికరణ ,ప్రత్యేక రాజ్యాంగం వగైరా అంశాలపై ఆయన ఆ ప్రసంగంలో ఉల్లేఖించారు. 1952 జూన్ 29 తేదీ నాడు దేశవ్యాప్తంగా కాశ్మీర్ దినాన్ని జరుపవలసిందిగా జనసంఘ్ పిలుపునిచ్చింది.పార్లమెంటులో శ్యామాప్రసాద్ చేసిన గొప్ప ప్రసంగాలలో 1952 ఆగస్టు 2 నాడు ప్రివెంటివ్ డిటెక్షన్ చట్టం పైన చేసిన ప్రసంగం రాజకీయ నాయకుడు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు రాబోయే తరానికి గురించి ఆలోచిస్తాడు అంటారు పెద్దలు. శ్యామాప్రసాద్ భావితరాల గురించి ఆలోచించారు. ఆయన ప్రతి విషయంలోనూ జాతీయ దృష్టి కోణమే. 1952 మే 21వ తేదీన తొలిసారిగా తొలి పార్లమెంటులో చేసిన ప్రసంగంలోనే ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో సంభవించిన తీవ్రక్షామం గురించి ప్రస్తావించారు. 1953 ఫిబ్రవరి 14 నాడు పార్లమెంటు లో ప్రసంగిస్తూ కాశ్మీర్ సమస్యను గురుంచి నిర్మలహృదయంతో ఆలోచించమని ప్రభుత్వ నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. జమ్మూలో ప్రజల పై పెరుగుతున్న ఘోరమైన అణచివేత చర్యలకు వ్యతిరేకంగాను, సమావేశం, భావ ప్రకటన వగైరా తమ ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించుకునేందుకు దేశవ్యాప్తంగా 1953 మార్చి 5న ‘జమ్మూ- కాశ్మీర్ దినం ‘నిర్వహించాలని పిలుపునిచ్చారు.జమ్మూలో పోలీసుల కాల్పులలో మరణించిన దేశభక్తుల చితాభస్మాన్ని మరునాడు ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమజ్జన చేయడం జరుగుతుందని సభలో ప్రకటించబడింది. అయితే మరునాడు హఠాత్తుగా ప్రభుత్వం తిరిగి నిషేధం విధించింది. స్వయంగా జమ్మూ కి వెళ్లి సత్యాగ్రహంలో పాల్గొనాలని శ్యామాప్రసాద్ నిర్ణయించుకున్నారు. పర్మిట్ కు సంబంధించిన వివరణలు కోరుతూ రక్షణ మంత్రికి లేఖ రాశారు. మంత్రి నుండి సమాధానం ఏమి రాలేదు.

జమ్మూ బయలుదేరేముందు ఎందుకో తన వయోవృద్ధ మాతృమూర్తిని దర్శించి రావాలని ఆయనకు కోరిక కలిగింది. బహుశా అది భగవత్ సంకల్పం ఆయు ఉండవచ్చు.1953 మే 8 వ తేదీన ఉదయం 6.30 నిమిషాలకు శ్యామాప్రసాద్ జమ్మూ యాత్ర ప్రారంభమైంది. బయలుదేరేముందు తాను ప్రభుత్వం నుంచి పర్మిట్ తీసుకోకపోవడానికి కారణం వివరిస్తూ శ్యామాప్రసాద్ ” భారతదేశంలో జమ్మూ – కాశ్మీర్ విలీనం నూటికి నూరు శాతం సంపూర్ణమని నెహ్రూ పదే పదే ప్రకటిస్తున్నారు. అయినా భారత ప్రభుత్వం నుంచి పర్మిట్ పొందితే గాని ఎవరూ ఆ రాష్ట్రంలోకి ప్రవేశించరాదనడం ఆశ్చర్యకరం” అని వ్యాఖ్యానించారు. 1953 మే 11వ తేదీన శ్యామాప్రసాద్ అరెస్టు.శ్యామాప్రసాద్ అరెస్టు వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీలోనూ ఇతర చోట్ల ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. “జమ్మూ చలో” నినాదంతో సత్యాగ్రహులు పెద్ద సంఖ్యలో పర్మిట్లు లేకుండా జమ్మూ వైపు బయలుదేరారు.1953 మే 12న శ్రీనగర్ జైలుకు చేర్చి, అక్కడి నుండి దాల్ సరస్సు సమీపంలోని కొండవాలులో ఉన్న ఒక అతిథి గృహానికి శ్యామాప్రసాద్ ను తరలించిన నాటి నుంచి జూన్ 23న ఆయన అంతిమ శ్వాస విడిచే వరకూ గడిచిన భారత రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైనవిగా చెప్పక తప్పదు.

శ్యామాప్రసాద్ హఠాన్మరణం అనేక అనుమానాలకు దారితీసింది. కాశ్మీర్ భూభాగంపై తన అరెస్టును గురించి వ్యాఖ్యానిస్తూ ‘ఇది కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పన్నిన కుట్ర’ అన్న శ్యాంప్రసాద్ వ్యాఖ్య దగ్గరనుంచి మొదలుపెట్టి ప్రభుత్వ విచారణకు నెహ్రూ తిరస్కరించడం వరకు అనేక అంశాలు శ్యాంప్రసాద్ మరణం సహజమైనది కాదని, ఆయనను వైద్యపరంగా చంపబడ్డారని(Medical Murder) అనుమానాన్ని దృఢ పరిచాయి.శ్యామాప్రసాద్ మరణం జాతికి ఆశనిపాతం అయుంది. ఆ వార్త విని జాతీయ యావత్తు క్షణం నిర్ఘాంతపోయింది. మరుక్షణం తల్లడిల్లిపోయింది. శోకసముద్రంలో మునిగిపోయింది.దేశమంతటా సంతాప ప్రకటన ప్రారంభమైంది.  ” మాతృభూమి సేవలో నిజమైన యోధుడిగా శ్యామాప్రసాద్ కాశ్మీర్ విలీనం కోసం సాగిన పోరాటంలో అగ్రభాగాన నిలిచి బలిదానం చేశారు”. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమే అయితే బలిదానం అయ్యారో దానిని భారతీయ జనతా పార్టీ , నరేంద్ర మోడీ ప్రభుత్వం  370 వ అధికరణను తొలగించి, వారికి ఘనమైన నివాళి అర్పించింది.