త్రయంబకేశ్వర్ లోని దక్షిణ ముఖి హనుమాన్ దేవాలయపు మహంతు కల్పవృక్ష గిరి మహారాజ్(70) వారి తోటి మహంత్ సుశీల గిరి మహారాజ్ (35), వారి వాహన డ్రైవర్ నీలేష్ తెల్గడే (30) లు క్రూరంగా హత్య చేయబడ్డారు. ఏప్రిల్ 16 న మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాలోని గడ్ చించులే ఊరిలో అత్యంత పాశవికంగా సాధువులను చంపేశారు. ఈ ఇద్దరు సాధువులు “సంత్ శ్రీ పంచదశ నాన్ అఖాడా, వారణాసి”కి సంబంధించిన వారు. హంతకులను ఆ మర్నాడు అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలు 19 ఏప్రిల్ న సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అప్పుడుకానీ ప్రపంచానికి ఈ దారుణ హత్యల గురించి తెలియలేదు. ఈ వీడియోలు చూస్తే సున్నిత మనస్కులు ఎవరైనా కూడా చలించిపోతారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎక్కడా కొవ్వొత్తుల ర్యాలీలు, పోస్టర్లు ప్రదర్శించే ఉదారవాదులు, వామపక్షాలు, మైనారిటీలు, జె ఎన్ యూ ముఠాలు కనిపించడం లేదు. ఇలాంటి సంఘటనే మరే మతం వారికైనా, మరే సముదాయానికైనా జరిగి ఉంటే ఎలాంటి హంగామా జరిగేదో ఒక్కసారి ఊహించండి. అందులోనూ ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండిఉంటే వీరంతా రెచ్చిపోయేవారు. ఈ సంఘటనలో బాధితులు కాషాయధారులు కాబట్టి వీరి అంతరాత్మ అలా ఎందుకు మేల్కొంటుంది?
ఈ సంఘటనను ఖండించే ప్రతి ఒక్కరు కూడా కొన్ని ముఖ్యమైన నిజానిజాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాల్గర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా కొంకణ, వార్లీ, ఠాకూర్ తెగలకు చెందిన ప్రజలు ఉంటారు. అభివృద్ధికి నోచుకోని ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో క్రిస్టియన్ మిషనరీలు, వామపక్షాలు వారి పనిని సునాయాసంగా పూర్తి గావిస్తున్నాయి. ఈ వామపక్ష, మిషనరీ ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే కొన్ని సంవత్సరాల నుండి మత మార్పిడి చేసుకున్నారో వారు ఇక్కడ కొత్త నియమావళి అమలుచేస్తున్నారు. మీరు హిందువులు కారు వేరే వర్గానికి చెందిన వారు అని స్థానికులకు నూరిపోస్తున్నారు. వారిని మాటిమాటికీ రెచ్చగొడుతున్నారు. బ్రిటిష్ హయాంలో విభజించి పాలించు అనే సూత్రాన్ని అనుసరించి జనాభా లెక్కల్లో గిరిజన తెగల కోసం సర్నాఅనే నూతన నియమావళిని 1871, 1951 మధ్యలో సృష్టించడం జరిగింది. స్వాతంత్రం తరువాత 1951లో దీన్ని తొలగించారు. కానీ వామపక్ష మిషనరీ ముఠాలు `ఆదివాసి’,`మూలవాసీ’ అనే పదాలు సృష్టించి గిరిజన తెగల్లో వేర్పాటువాదం వ్యాప్తిచేస్తున్నారు. దీని కారణంగానే హిందూ మతం నుండి వేరే మతానికి మారిన వారు హిందూ మతాన్ని ద్వేషించసాగారు. గత కొన్ని సంవత్సరాల నుండి పాల్గర్ లోని కొన్ని గిరిజన సముదాయాల్లో కూడా ఇదే ద్వేషభావం ని పెంపొందించారు. ఇటువంటి దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని 1956లో నియోగి కమిటీ రిపోర్టులో మత మార్పిడి నిషేధ చట్టం చేయాలని సూచించారు. కానీ దురదృష్టవశాత్తూ అది కార్య రూపం దాల్చలేదు. దేశాన్ని, సమాజాన్ని ముక్కలు ముక్కలు చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నిజంగానే గిరిజనులు, ఇతరులలో తేడాలు ఏమైనా ఉన్నాయా? మన వేదాలు, పురాణాలు, రామాయణ మహాభారతాల వంటి ఇతిహాసాలలో అడవుల్లో నివసించే గిరిజనులు, పట్టణవాసుల మధ్య సౌహార్ధ్రపూరితమైన మితృత్వమే ఉండేదని వర్ణనలు కనిపిస్తాయి. ఆచార్య వినోభా భావే ఋగ్వేదాన్ని గిరిజనుల గ్రంథంగా భావించేవారు. భారతదేశంలోని బిల్లులు, గోండులు, మాడియా, ప్రధాన్ లాంటి తెగలలో శివుడిని పూజిస్తారు. హిందువుల అలాగే గిరిజనులు కూడా ప్రకృతి ఆరాధకులు ప్రపంచంలో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలైన దేశాల్లో గిరిజనులు, ప్రకృతి ఆరాధకులపై సాగిన మారణకాండ మన దేశంలో జరగలేదు. ఆర్యుల దాడుల లాంటి ఊహాజనిత సంఘటనలు కూడా అసత్యాలు అని తేలిపోయాయి. మరి ఇలాంటి విద్వేషాలు ఎక్కడివి? ఇలాంటి కుతంత్రాలు ఎవరు రచిస్తున్నారు? మనం దీని గురించి తప్పకుండా ఆలోచించాలి. దేశం పట్ల, సమాజం పట్ల గాని జరుగుతున్న దాడిని, నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నించిన సాధువులు, సమాజాసేవకులపై సమాజ వ్యతిరేకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం చూస్తూనే ఉన్నాం. క్రైస్తవ మిషనరీలు, కుహనా సామ్యవాదులు, నక్సలైట్లు కలిసి 2008 ఆగస్టు 23 పవిత్ర కృష్ణాష్టమి రోజు న స్వామి లక్ష్మణానంద సరస్వతిని కిరాతకంగా హత్య చేశారు. ఆయన చేసిన తప్పేమిటి? ఒడిషాలోని కంధమాల్ జిల్లాలో గిరిజనులను మతమార్పిడిని వ్యతిరేకించడమే. ఆ గిరిజనుల్లో స్వదేశం, స్వధర్మం పట్ల నిష్టను పెంచడమే. దీని కారణంగా ఆయన తన ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది. ఇదేవిధంగా స్వామి అసీమానందను కూడా నానా యాతనలు పెట్టారు. ఆశీమానంద గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో గిరిజనులను సామాజికంగా ధార్మికంగా చైతన్య పరిచారు. ఆయన కారణంగా మతం మారిన అనేక మంది గిరిజనులు హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. అందుకని ఆయనపైనా కుట్రపూరితమైన ఆరోపణలు చేశారు. ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. ఇదేవిధంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని సనాతన్ రక్షాదళ్ కు చెందిన సూర్యాచార్య కృష్ణ దేవానంద్ గిరి మహారాజ్ పై కూడా దాడి జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా చరిత్రను తిరగేస్తే ఈ సంఘటనల వెనుక భయంకరమైన కుట్ర కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా రెండు సంఘటనల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి పాల్ఘార్ జిల్లాలోని థేరొందా అనే గ్రామంలో అప్పటి థానే, ముంబై, రాయగఢ్ విభాగ్ సంఘ ప్రచారక్ స్వర్గీయ దాము అన్నా టోక్ కర్ చొరవ మేరకు 1956 లో `హిందూ సేవా సంఘం’ స్థాపించబడింది. గిరిజనులలో ఉన్న సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ పని ప్రారంభించింది. దామూఅన్న చూపిన సహానుభూతి, సంవేదన మూలంగా గిరిజనులు ఆయన చేసే కార్యక్రమాల వైపు ఆకర్షితులు కావడం మొదలు పెట్టారు. తమ పాచికలు పారని కారణంగా వామపక్ష, మిషనరీ గుండాలు ఆయనను చంపాలని ఎత్తుగడ వేశారు. 1980వ సంవత్సరంలో ఒక రాత్రి ఆయన పై దాడికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు దామూఅన్నా ఆ రోజు వేరేచోట బస చేశారు. సేవా సంఘం కార్యకర్త వామన్ రావు సహస్ర బుద్ధే, వారి భార్య ఆ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ వామపక్ష, మిషనరీల దురాగతాలకు రెండవ ఉదాహరణ మాధవరావు కానేను చంపడానికి తలాసరిలోని విశ్వహిందూ పరిషత్ వనవాసీ కేంద్రంపై చేసిన దాడి. 1967లో దామూఅన్న చెప్పడంవల్ల మాధవరావు మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దులో ఉన్న పాల్ఘార్ జిల్లాలోని తలాసరి తాలూకా లో కేంద్రాన్ని స్థాపించారు. ఈ కేంద్రం ద్వారా విద్య, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, వృక్షాలను పెంచడం లాంటి కార్యక్రమాలు నడిచేవి. 14 ఆగస్టు 1991 మధ్యాహ్న సమయంలో లో ఆయన్ను హతమార్చాలని ఉద్దేశంతో ఏడు నుంచి ఎనిమిది వందల గుండాలు కేంద్రంపై దాడి చేశారు. ఆ సమయంలో మాధవరావుజీ కళ్యాణ్ లో ఉండడం చేత బతికిపోయారు. కానీ ఆ సమయంలో కేంద్రంలో ఉన్న మహాదేవ్ జోషి, వారి భార్య వసుధ జోషి తీవ్రంగా గాయపడ్డారు. భగవంతుని దయవల్ల ప్రాణాలతో బయటపడ్డారు.
ఏప్రిల్ 16న ఇద్దరు సాధువులు, వారి వాహన డ్రైవర్ ల అమానుష హత్య వెనుక ఈ క్రూర, విద్వేషపూరిత ధోరణే కనిపిస్తుంది. తమ గురువుగారి అంత్యక్రియలకు హాజరుకావడం కోసం ఇద్దరు సాధువులు గుజరాత్ లోని సిల్వాసా వెళుతున్నారు. దారి తప్పి కాసా పోలీస్ పోస్ట్ లో ఉన్న గడచిచలే గ్రామానికి వెళ్ళే మార్గంపట్టారు. దారిలో నరహంతక మూక వారిపై దాడి చేసింది. దగ్గరలో ఉన్న అటవీశాఖ పోస్ట్ లోని గార్డ్ ఒకరు సాధువులకు ఆశ్రయం ఇచ్చాడు. పోలీసులకు ఫోన్ చేశాడు. గ్రామం నుంచి పోలీస్ పోస్ట్ 40 కి.మీ దూరంలో ఉంది. పోలీసులు అక్కడకి చేరుకోవడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. కానీ ఈ వ్యవధిలో హింసాత్మక మూకలు సాధువులపై దాడి ఎందుకు చేయలేదు? పోలీసులు వచ్చిన తరువాత జరిగిన దాడిలో వృద్ధుడైన సాధువు భయంతో పోలీసు చెయ్యి పట్టుకుంటే ఆ పోలీసు ఆయన చేయి విడిపించుకుని హంతక మూకలకు అప్పజెప్పడం వీడియోలో స్పష్టంగా ఉంది. దీనినిబట్టి ఇది యోజనబద్ధమైన దాడి అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కాషాయధారులైన సన్యాసులను చంపమని ఎవరో ఈ మూకలను రెచ్చగొట్టారా అనే సందేహాలు వస్తున్నాయి. హంతక మూకలను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడం, అవసరమైతే కాళ్ళను గురిపెట్టి తుపాకి కాల్చడం వంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది ప్రశ్న. పోస్ట్ మార్టం కోసం సాధువుల పార్ధివ దేహాలను అత్యంత దారుణమైన, అవమానకరమైన రీతిలో తీసుకువెళ్లడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. హృదయవిదారకమైన ఈ సంఘట ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
– వివేకానంద నరతాం
రచయిత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్