ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఇకలేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం కేవలం సంగీత ప్రియులకు మాత్రమే కాదు.. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు.. తెలుగు భాషకు కూడా తీరని లోటు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అయితే మంగళవారం సిరివెన్నెల ఆరోగ్యం మరింత విషమించడంతో సాయంత్రం కన్నుమూసినట్టు తెలుస్తుంది.
మే 20, 1955న విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో డాక్టర్ సి.వి.యోగి, సుబ్బలక్ష్మి గార్లకి సిరివెన్నెల జన్మించారు. అనకాపల్లిలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. కాకినాడలో ఇంటర్మీడియన్ పూర్తి చేశారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్‌లో బి.ఏ పూర్తి చేశారు. ఎం.ఏ చేస్తుండగా, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కె.విశ్వనాథ్.. `సిరివెన్నెల` సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు. అలా 1986లో సిరివెన్నెల సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. కానీ తొలి చిత్రం `సిరివెన్నెల`నే ఆ తర్వాత తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.
మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో మూడు వేలకుపైగా పాటలు రాశారు. వేటూరి శిష్యుడిగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న సిరివెన్నెల ఎంతో మంది నూతన రచయితలకు దిశానిర్ధేశం చేశారు.సిరివెన్నెల సినీ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ `2019లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దాదాపు 11 నంది అవార్డులు అందుకున్నారు.
సంతాపం తెలిపిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
సిరివెన్నెల సీతారామ శాస్త్రీ గారి మృతి పల్ల ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత సంఘచాలక్ మాననీయ బూర్ల దక్షిణమూర్తి గారు సంతాపాన్ని ప్రకటించారు. “సిరివెన్నెల ఒక వినూత్న సాహితీ మూర్తి, “చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని..’’ వంటి ఎన్నో గీతాల ద్వారా ప్రతి అక్షరానికి ప్రాణం పోసి, తన చైతన్య ప్రణవ నాదం తో రచయితగా, కవిగా, గాయకుడుగా సినీ, సాహితీ రంగాల్లో చెరగని ముద్ర వేశారు. మూడు వేలకు పైగా పాటలు రాసిన, సీతారామశాస్త్రి గారు సినీ సాహిత్యానికి చేసిన సేవలకుగానూ `2019 లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది మరియు దాదాపు 11 నంది అవార్డులు అందుకున్నారు.” అని పేర్కొన్నారు.
“2013వ సంవత్సరం భాగ్యనగర్ నిజాం కళాశాల ప్రాంగణంలో జరిగిన ‘ఘోష్ తరంగ్’ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీతారామశాస్త్రి గారు చిరస్మరణీయులు, వారి మరణం సాహిత్య రంగంలో తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని పరమేశ్వరుడిని ప్రార్ధిస్తున్నాను. సీతారామశాస్త్రి గారి కుటుంబ సభ్యులందరికి ఆత్మస్తైర్యాన్ని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఈశ్వరుని కృప, ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుచున్నాను.” అని పేర్కొన్నారు.