సంవత్సరాలకు మన పెద్దలు పేర్లు పెట్టడం వెనుక ఎంత నిగూఢత ఉందో కడచిన నాలుగు సంవత్సరాలలో చవిచూసిన అనుభవాలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. ‘వికారి’ (2019) తన పేరుకు తగినట్లే ప్రకృతి, మానవ జీవితాలకు సంబంధించి సకల వికారాలను విస్తృతస్థాయిలో ప్రదర్శించింది. ఆ ఏడాది చరమాంకంలో కరోనా (కొవిడ్-19) మహమ్మారి లోకాన్ని ఆవరించింది. ‘శార్వరి’ (2020) అంటే చీకటి. కొవిడ్ విజృంభించి జనజీవనాన్ని అంధకారమయం చేసింది. వ్యవస్థలు కుదేలైపోయాయి. ఉపాధికి గండి పడింది. మానవ సంబంధాలు బీటలు వారాయి. ఒక్క మాటలో… బతుకులే తలకిందులయ్యాయి. ‘ప్లవ’ (2021) అంటే దాటడం అని, ప్రతికూల పరిస్థితులను అధిగమించి శుభాన్ని/ శోభను తెస్తుందని అర్థం. ఆ ప్రకారమే ఆ ఏడాది వీడ్కోలు తీసుకుంటూ సాధారణ జనజీవనాన్ని చిగురింప చేసి కొంత ఊరటనిచ్చింది. అనంత కాలవాహినిలో కలుస్తున్న ప్రస్తుత ‘శుభకృత్’ (2022) మానవ మనుగడను గాడిన పడేసి కొవిడ్ పూర్వ పరిస్థితులకు బాటలు వేసింది. రాబోతున్న ‘శోభకృత్’ సకల మానవాళికి సుఖసంతోషాలనిస్తుందని అభిలషిస్తూ స్వాగతం పలుకుదాం.
సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన పుణ్య కాలం వసంత రుతువుకు మొదటి రోజు. అదే ఉగాది పర్వదినం. ‘యుగాది’ అనే పదానికి ‘ఉగాది’ అపభ్రంశ రూపమని భాషావేత్తల మాట. సంవత్స రానికి ఆది కనుక ‘సంవత్సరాది’ అని అంటారు.
‘ఋతూనాం ముఖో వసంతః:’అన్న ఉపనిషద్ వాక్యాన్ని బట్టి రుతువులన్నిటిలో వసంతానిదే అగ్రస్థానం. దానిని బట్టి ఆరంభ పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం విశదమవుతుంది. ‘సత్పురుషులు లోకంలో వసంత రుతువులా సంచరిస్తూ, శోభిస్తారు’ అని శంకరభగవత్పాదులు (వివేకా చూడామణి) అభిభాషిం చారు. ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్లే కాలచక్రం ఆవృతిలో ముప్పయ్ ఏడవది ‘శోభకృత్’ నామ వత్సరంలో జనజీవనం శోభాయమానంగా ఉంటుందని అర్థాన్ని స్తోంది.
‘చైత్ర మాసి జోద్బ్రహ్మ ససర్జ ప్రథమేహిని
శుక్ల పక్షే సమగ్రంతు సదా సూర్యోదయే సతి’
విధాత చైత్ర శుద్ధ పాడ్యమిని సృష్టి ఆరంభానికి సుముహూర్తంగా ఎంచుకున్నాడని పేర్కొన్నాడు ‘నిర్ణయసింధు’ కర్త. తెలుగు ఉగాది నాడు సృష్టి ఆరంభమైందని దాని అర్థం. అందుకే ఆ రోజు శిరస్నానం చేసి ఆధ్యాత్మిక చింతనతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని ‘ధర్మసింధు’ చెబుతోంది. సకల చరాచర జీవరాశికి మూల కారకుడైన బ్రహ్మ, సృష్టి అనే మహత్కార్యాన్ని ప్రారంభించిన రోజును అత్యంత వైభవంగా జరుపుకోవాలనే ఆకాంక్ష కూడా ఉగాదికి నాంది అయిందని పెద్దలు చెబుతారు. ఈ తిథి నాడే సూర్యుడు లంకానగరంలో ఉదయించాడని భాస్కరా చార్యులు తమ ‘సిద్ధాంత శిరోమణి’లో ప్రస్తావించారు. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారం ధరించి సోమకుడిని పరిమార్చి వేదాలను రక్షించినరోజు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు ఉగాదేనట. చైత్ర శుద్ధ పాడ్యమి నాటికి ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందని, కృష్ణావతారం ముగిసిన నాడే కలి ప్రవేశించి నందున ఉగాదిని జరుపుకోవడం ఆచారంగా మారిందని చెబుతారు.
మన పండుగలు సాధారణంగా ఏదో ఒక దైవంతో ముడిపడి ఉంటే, ఉగాది మాత్రం ప్రకృతి సంబంధితమైంది. ఆ రోజున ప్రత్యేక పూజలంటూ లేకపోయినా కొత్తగా చేపట్టిన పనులు ఏడాది అంతా దివ్యంగా సాగుతాయని విశ్వసిస్తారు. అలా ఇష్టదేవతను అర్చిస్తారు.
‘ఋతూనాం కుసుమాకరః’ అన్నారు మహాకవి కాళిదాసు. రుతు రాజైన వసంతానికి స్వాగతం పలుకుతూ ఉగాది నుంచి తొమ్మిది రోజుల పాటు పూజలు (వసంత నవరాత్రులు) చేసే ఆచారం ఉంది. రెడ్డి రాజులు, విజయనగరం రాజుల కాలంలో తెలుగుగడ్డపై ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేవని చరిత్ర చెబుతోంది. ఇవీ వర్తమానంలో ఆలయాలకే పరిమితమయ్యాయి. ఈ పర్వదినం నాడు శ్రేయోభిలాషులను, వృత్తి ప్రదాతలను, అధికారులను కలిసి అభినందించుకోవడం, కృత్ఞతలు చెప్పు కోవడం ఆచారం. అయితే పాశ్చాత్య సంస్కృతి వెల్లువెత్తిన నేపథ్యంలో ఆంగ్ల సంవత్సర ఆరంభానికి ఉన్న విలువ ‘ఉగాది’కి దక్కడం లేదనే ఆవేదనా ఉంది.
వసంత నవరాత్రులు
చైత్ర శుక్ల పాడ్యమి నాడు వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో శక్తిస్వరూపిణి లలితా పరమేశ్వరిని ఆరాధించాలని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ నవరాత్రుల చివరినాడు శ్రీరామచంద్రుడు జన్మించాడని, ఈ కాలంలో విష్ణువు లేదా దుర్గతో పాటు శ్రీరాముడు, హనుమను ఆరాధిస్తే మంచిదని పురాణాలు పేర్కొంటున్నాయి. రామలక్ష్మణులు నవరాత్రులలో అమ్మవారిని అర్చించారని చెబుతారు.
జీవితానుభవ ప్రతీకలు షడ్రుచులు…
జీవితమంటే కేవలం సంతోషానందాలే కాదు. కష్టనష్టాలు, అనేక అనుభవాలు, అనుభూతుల మిశ్రమం. అవి ఉంటేనే జీవితానికి అర్థం, పరమార్థం అని ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు చెబుతున్నాయి.ఈ ఆరు రుచులు మనిషి మనుగడలోని ఆటుపోట్లు/ఎత్తుపల్లాలకు ప్రతీకలు. తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు అనే ఆరు రుచులు జీవితంలోని సంతోషం, బాధ, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. ఏడాది పొడవున అనుభవంలోకి వచ్చే మంచి చెడులు, సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఇస్తున్నాయి.
‘శతాయర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణమ్’
వేప పూత పచ్చడిని ఆరగించడమే సకల అరిష్టాలకు సరైన విరుగుడు’ అని శాస్త్రవచనం. పరగడుపున ఈ ప్రసాదాన్ని సేవించడం, పదిమందితో పంచాంగ శ్రవణం.. అనేవి ఉగాది నాటి ప్రత్యేకతలు.
‘సృష్టిని ప్రారంభించిన బ్రహ్మను మొదటగా, తరువాత షోడశోపచారాలతో ఇష్ట దేవతారాధన చేసి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. దీనివల్ల సర్వ అరిష్టాలు, గ్రహదోషాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు, సమస్త ఇబ్బందులు తొలగి దీర్ఘాయుష్షు, వజ్రకాయం లభిస్తాయని పూర్యాచార్యులు పేర్కొన్నారు.
‘త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’.. అనే (మధుమాసంలో పుట్టినటువంటి, శోక బాధలను దరిచేరకుండా చేసే ఓ నింబ కుసుమమా నన్ను ఎల్లప్పుడూ శోకరహితుడుగా చేయి) శ్లోకం పఠిస్తూ ఉగాది ప్రసాదాన్ని స్వీకరించా లంటారు.
పంచాంగ పఠనం
కాలం భగవత్ స్వరూపమైతే దాని నడకను వివరించడమే పంచాంగ పఠన ఉద్దేశమని, ఉగాది నాడు పంచాంగం వినాలని పెద్దలు చెబుతారు. ఏడాది పొడవున ఆచరించే శ్రౌతస్మార్తాది కర్మలన్నిటి కాలవిశేషాలను తెలియచెప్పేది ‘పంచాంగం’ కనుక దానిని అర్చించి, భగవత్ సన్నిధి (ఆలయాలలో)లో వినిపించాలని పెద్దలు చెబుతారు. పంచాంగం అంటే కేవలం తిథులు, వర్జ్యాల లాంటి నమ్మకాలు కావు. అప్రమత్తం చేయడం కూడా. కొన్ని తిథులను దుష్టమైనవిగా భావిస్తూ భయపడాలని కాదు. ఏడాది పొడవున ఎదురుకాగల పరిస్థితులు, సమస్యలను అంచనావేసి, వాటిని అధిగమించేందుకు అనుసరించవలసిన విధానాలు, పట్టువిడుపుల గురించి ముందుగానే హెచ్చరించడం లాంటిది. పంచాంగ శ్రవణం అనేది రాజపూజ్యాల సూచనలకు పొంగిపోయి, అవమానాల సమాచారంతో కుంగిపోవాలని కాదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వాటిని అధిగమించేందుకు మనోస్థయిర్యం, ధైర్యాన్ని కలిగించడమే పంచాంగ పఠనంలోని అంతరార్థం. రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాల గురించి ఏడాది తొలినాడే అవగాహన కలిగి ఉండడం వల్ల రాబోయే కష్టసుఖాలు, సుఖదుఃఖాలకు మానసికంగా సిద్ధపడతారని అంతరార్థం.
క్రీ.శ. 505లో వరహమిహిరుడు, పంచాంగానికి మూలమైన కాల సిద్ధాంతాలు గల గ్రంథాన్ని ప్రతిపాదించారు. మొత్తం అష్టాదశ సిద్ధాంతాలకు గాను అయిదింటిని తన గ్రంథంలో ప్రతిపాదించి, దానిని ఉగాది నాడే జగతికి అంకితం చేశారట. అయిదు సిద్ధాంతాలలో సూర్య సిద్ధాంతం అత్యంత ప్రాచీనమైనదని స్పష్టం చేశారు. పురాణాల ప్రకారం, త్రేతాయుగంలో రావణపత్ని మండోదరి తండ్రి మయాసురుడు ఆదిత్యుని అనుగ్రహంతో సూర్యసిద్ధాంత కాలశాస్త్ర గ్రంథాన్ని రాశారు. భాస్కరాది నవగ్రహ సంచారం, గ్రహణ సాధన, తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు, నక్షత్ర గ్రహస్ఫు టాదులను గణిత రూపంలో తెలిపిన అతి ప్రాచీన గ్రంథంగా దీనిని పరిగణిస్తున్నారు.
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదింటి కలయికే ‘పంచాంగం’. వీటిని దేవతా స్వరూపాలుగా సంభావించి నిత్యం స్మరించుకోవడం కాలదేవతాశక్తిని ఆరాధించడమేనని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు. ‘శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం/గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం/ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం/నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్’ (పంచాంగ శ్రవణం వలన సంపదలు కలిగి సద్గుణాలు అలవడతాయి.శత్రువులు నశిస్తారు. చెడు కలలు తొలగిపోతాయి. గంగాస్నాన, గోదాన ఫలితం లభిస్తుంది. ఆయుష్షు పెరుగుతుంది. సంతానం కలుగుతుంది.అంటే వంశాభివృద్ధి సంప్రాప్తిస్తుంది) అని ‘పంచాంగం’ శ్రవణం విశిష్టతను శ్లాఘించారు.
తెలుగువారి పంచాంగాలు చాంద్రమానం ఆధారంగా రూపొందుతాయి (చాంద్రమానం అంటే చంద్రుడి గమనమని భావం). మనం అమావాస్య నుంచి అమావాస్యను మాసంగా లెక్కిస్తే, ఉత్తరాది వారు పౌర్ణమి నుంచి పౌర్ణమిని నెలగా పరిగణిస్తారు.
ధర్మకుంభోత్సవం
స్థోమతను బట్టి పంచలోహ కుంభాన్ని కానీ కొత్త మట్టికుండను కాని రంగులతో అలంకరించి అర్చించి దానమివ్వడం ఉగాది నాటి మరో పక్రియ. దీనివల్ల మనోవాంఛలు నెరవేరతాయని విశ్వాసం. దీనిని ధర్మకుంభోత్సవం లేదా పూర్ణకుంభోత్సవం అంటారు. ‘ధర్మఘట దానం, ప్రపాదానం’ అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా పురోహితులకు గాని, ఆలయాలకు కాని దీనిని సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాలలోని గ్రామాలలో పితృదేవతల తృప్తికోసం, గ్రామదేవతలను శాంతపరిచేందుకు భూతబలి కోసం ‘కుంభం పోసే’ ఆనవాయితీ ఉంది. అలాగే వేసవి కాలమంతా కొనసాగేలా చలివేంద్రాలు ప్రారంభి స్తారు. దీనికారణంగా పితృదేవతలు సంతుష్టులై సుఖశాంతులు ప్రసాదిస్తారని విశ్వాసం. అలా అవకాశం లేని వారు ఆ కాలమంతా రోజుకు ఒక జలకలాశాన్ని దానమివ్వడం ఉత్తమమని పెద్దలు చెబుతారు.
తిరుమలేశుడి ఆస్థానోత్సవం
తిరుమలలోని శ్రీనివాసుడికి నిర్వహించే ప్రధాన ఉత్సవాలలో ‘ఉగాది ఆస్థానం’ ఒకటి. ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ఉగాది నుంచే ప్రారంభమవుతాయి.ఆ రోజు సాయంవేళలో భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మాడవీథుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యమంగళరూపంతో దర్శనం అనుగ్రహిస్తారు. ‘నిత్యోత్సవం’గా వ్యవహరించే ఇది నలభయ్ రోజుల పాటు..అంటే వైశాఖ శుద్ధ దశమి వరకు కొనసాగుతుంది.
కవి సమ్మేళనాలు
ఉగాది అనగానే పంచాంగ శ్రవణాలతో పాటు కవి సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పెద్ద ముచ్చట. ఎందరో ప్రసిద్ధ కవులు ఆ ‘సమ్మేళనాల’లో వసంత రుత••శోభను ఆహ్లాదంగా, వైభవోపేతంగా ఆవిష్కరించేవారు. కేవలం తమ కవితా ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా తమ కవితలలో సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి సూచనలు చేస్తూ, సమసమాజ, ఆదర్శ సమాజ కాంక్షను వ్యక్తీకరించేవారు.
‘శ్రీ శోభకృత్’ అంటే ప్రతి గడప శోభాయమానంగా విలసిల్లాలని కోరుకునేది.
‘శోభనే వత్సరౌ సర్వ సస్యానా మతివృద్ధాయః
నృనాణాం స్నేహమన్యోన్యం ప్రజానాంచ పరస్పరం’(ఈ ఏడాది ‘శోభకృత్’లో ధనధాన్య సమృద్ధి, సుభిక్షము, క్షేమారాగ్యాలు కలుగుతాయి. ప్రజలు సుఖంగా జీవిస్తారు. భూమి నానా విధాల ఉత్సవాలతో ప్రకాశిస్తుంది. అందరూ అభివృద్ధిని పొందుతారు, పాడిపంటలు, పశువులు వృద్ధిచెందుతాయి) అని పంచాంగ కర్తలు పేర్కొంటున్నారు. వారి వాక్కు మేరకే విశిష్ట, విశేష శుభఫలితాలు ఇవ్వాలని కోరుతూ ‘శోభకృత్’కు స్వాగతాంజలి.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్
జాగృతి సౌజన్యంతో…