అయోధ్యలో రామమందిర నిర్మాణం, సోమనాధ్ లో దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా వేరువేరు విషయాలు. అయినా అయోధ్యా విషయంపై త్వరితంగా నిర్ణయం తీసుకోవడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించిన తరుణంలో 1948నాటి సోమనాధ మందిర చర్చ గుర్తుకు వచ్చింది. సోమనాధ మందిరాన్ని కూడా ముస్లిం దురాక్రమణదారులు ఒకప్పుడు ధ్వంసం చేశారు.
ఈ చర్చ కె ఎం మున్షీ, నెహ్రూల మధ్య జరిగింది. డా. మున్షీ తన `పిలిగ్రిమేజ్ టు ఫ్రీడం’ అనే పుస్తకంలో ఈ సంభాషణను పేర్కొన్నారు. అది ఇలా సాగింది –
మున్షీ ఇలా వ్రాసారు –
“డిసెంబర్, 1922లో నేను ఆ కూలిన దేవాలయాన్ని చూడటానికి వెళ్ళాను. అది పూర్తిగా శిధిలమై ఉంది. అయినా ఆ దేవాలయపు పునాదులు మాత్రం కదలలేదు. మన అవమానానికి, కృతఘ్నతకు గుర్తుగా నిలిచి ఉంది. ఆ దేవాలయపు సభా మండపంలో పెచ్చులూడిపోయిన గచ్చు మీద నడుస్తుంటే నాకు ఎంతో బాధ కలిగింది’’.
“అక్టోబర్, 1947 లో జునాగఢ్ ను విలీనం చేసుకునేందుకు భారత సైన్యాన్ని పంపాలంటూ సర్ షా నవాజ్ భుట్టో నుంచి టెలిఫోన్ సందేశం వచ్చింది. అప్పుడు నేను సర్దార్ టు పాటు ఉన్నాను. ఆ వార్తా నాకు చెప్పిన సర్దార్ `జయ సోమనాధ్’ అన్నారు.’’
సోమనాధ దేవాలయ పునర్నిర్మాణానికి అప్పటి భారత హోమ్ మంత్రి సర్దార్ పటేల్ పూనుకుంటే, మరో కేంద్ర మంత్రి కె ఎం మున్షి ఆ పనిని పర్యవేక్షిస్తే, అప్పటి భారత రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ భావ్యమైన మందిరానికి ప్రారంభోత్సవం చేశారు. అయితే ఈ మందిర పునర్నిర్మాణానికి వ్యతిరేకత కూడా వచ్చింది.
కె ఎం మున్షి ఇలా వ్రాసారు –
`నవంబర్, 1947లో సర్దార్ ఆ దేవాలయాన్ని చూడటానికి వెళ్లారు. అప్పుడే జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఇలా ప్రకటించారు -“నూతన సంవత్సర శుభ సమయంలో సోమనాధ మందిర పునర్నిర్మాణం జరగాలని నిర్ణయించాము. ఈ పవిత్ర కార్యంలో సౌరాష్ట్ర ప్రజలంతా తమ శాయశక్తులా సహకరించాలని కోరుతున్నాను.’’
“సోమనాధ దేవాలయం కేవలం ఒక ప్రాచీన కట్టడం కాదు. అది భారతీయుల శ్రద్ధాకేంద్రం. దానిని పునర్నిర్మాణం ఒక జాతీయ కార్యం.’’అని కె.ఎం. మున్షి భావించారు. కానీ `నాకు సోమనాధ పునర్నిర్మాణం నచ్చలేదు. అది హిందూవాదాన్ని పునర్ స్థాపించడమే అవుతుంది’’అని నెహ్రూ తెలిపిన అభ్యంతరాన్ని కూడా మున్షి తన పుస్తకంలో పేర్కొన్నారు.
భారత్ గురించిన రెండు వేరువేరు ఆలోచనలు, ధోరణులు పటేల్, నెహ్రూల భేదాభిప్రాయంలో మనకు కనిపిస్తాయి. నెహ్రూ భారత్ కు వ్యతిరేకం కాకపోయినా ఆయన ఆలోచనలు పాశ్చాత్య ధోరణిలో సాగేవి. అదే భారత్ గురించి పటేల్ ఆలోచనలు ఇక్కడి ప్రాచీన ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం సాగేవి.
నెహ్రూకు వ్రాసిన ఒక లేఖలో మున్షి ఇలా అన్నారు –
“సోమనాధ పునర్నిర్మాణ ఆలోచన గురించి సర్దార్ పటేల్ చెప్పినప్పుడు గాంధీజీ అందుకు తన అంగీకారం తెలుపుతూనే, పునర్నిర్మాణం కోసం నిధులు మాత్రం ప్రజల నుంచి మాత్రమే రావాలని అన్నారు. దానితో ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చుపెట్టాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పారు.’’
మున్షి ఇంకా ఇలా వ్రాసారు –
“కేబినెట్ సమావేశాల్లో మీరు నా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు సోమనాధ్ అంటే ఇష్టపడేవాడు అంటూ ప్రస్తావించారు. మీరు అలా చేయడం నాకు ఏమి ఇబ్బంది అనిపించలేదు. పైగా సంతోషం కలిగింది. నా ఆలోచనలుగానీ, కార్యకలాపాలుగానీ ఏవీ దాచిపెట్టుకోవాలని నేను అనుకొను. ముఖ్యంగా ఇన్ని నెలలుగా నాలో విశ్వాసం ఉంచిన మీ దగ్గర అలా చేయాలనుకొను. అనేక సంస్థలు ప్రారంభించడానికి, నిలబడటానికి నేను దోహదం చేశాను. ఇప్పుడు ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా సోమనాధ్ ను తీర్చిదిద్దే పనిలో పాలుపంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం.’’
“నిన్న మీరు `హిందువాదాన్ని పునర్ స్థాపితం’చేసే ఆలోచన గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఏమిటో నాకు తెలుసు. మీ అభిప్రాయాలను నేను ఎప్పుడు మన్నిస్తాను. అలాగే మీరూ చేస్తారని ఆశిస్తాను. హిందూత్వంలో కొన్ని విషయాలను మార్చడం కోసం నేను కూడా కొన్ని ఆచారాలను ప్రశ్నించాను, ధిక్కరించాను. ఆధునిక పరిస్థితులకు తగినట్లుగా భారత్ ను తీర్చిదిద్దడానికి అది అవసరమని నేను భావించాను.’’
“అయితే భవిష్యత్తు గురించి ఇలా ఆలోచించే, పనిచేసే శక్తి గతం నుంచి వస్తుందని నేను అనుకుంటాను. భగవద్గీతను కాదనే స్వాతంత్ర్యం నాకు వద్దు. అలాగే ఈ దేశ ప్రజాజీవనానికి మూలాధారమైన దేవాలయ వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే స్వాతంత్ర్యం కూడా నాకు వద్దు.’’
మున్షి వ్రాసిన ఉత్తరానికి ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వి.పి. మీనన్ ఇలా సమాధానం వ్రాసారు –
“మీరు వ్రాసిన అద్భుతమైన ఉత్తరం చూశాను. మీరు అందులో వ్యక్తపరచిన ఆలోచనలు, భావాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వాటికోసం జీవించడానికి, అవసరమైతే మరణించడానికి నేను సిద్ధం.’’
విగ్రహ ప్రతిష్ట జరపాల్సిన సమయం వచ్చేసరికి మున్షి అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ను కలిశారు. `కార్యక్రమానికి అవసరమని అనుకుంటే తప్పకుండా రావాలి’ అని తెలిపారు.
మున్షి ఇంకా ఇలా అంటారు – ప్రధాని ఏమనుకున్నా తాను కార్యక్రమానికి వస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే నన్ను మసీదుకో, చర్చ్ కొ పిలిస్తే కూడా ఇలాగే వెళతానని ఆయన స్పష్టం చేశారు. విగ్రహాప్రతిష్టకు రాజేంద్ర ప్రసాద్ హాజరవుతారని తెలిసినవెంటనే నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించారు. హామీ ఇచ్చినట్లుగానే రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఆ మర్నాడు అన్నీ పత్రికల్లోనూ వచ్చిందికానీ ప్రభుత్వ ప్రచార సాధనాలు మాత్రం రిపోర్ట్ చేయలేదు.’’
విచిత్రమేమిటంటే విశాల దృక్పధానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు గుర్తుగా నిలిచిన నెహ్రూ రాష్ట్రపతి ఉపన్యాసంపై ఇలాంటి నిషేధాన్ని పాటించకుండా చూడవలసింది.
ఇలా అనేక అడ్డంకులు, వ్యతిరేకత మధ్య సోమనాధ దేవాలయ పునర్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రపంచం మొత్తం నుంచి భక్తులు వస్తుంటారు. అయితే నెహ్రూ మార్క్ భారత్ ను సమర్ధించే, ఆ తరహా ఆలోచనలకు మద్దతునిచ్చే పాలకులు 60 ఏళ్లపాటు దేశాన్ని పాలించడంవల్ల ఇవే భావాలు మీడియా, విద్యా రంగాల్లో వ్యాపించాయి. అందుకనే నేడు రామజన్మభూమి గురించి ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
అయినా సర్దార్ పటేల్, మున్షిలు విశ్వసించిన `భారత సమిష్టి చేతన’ద్వారా ప్రకటితమైన ఈ దేశపు ఆధ్యాత్మిక సంప్రదాయం పట్ల కోట్లాది భారతీయుల నమ్మకం, నిష్ట ఎక్కడికి పోవు. గాంధీజీ, డా. రాధాకృష్ణన్, డా. రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవ్య, మొదలైన వారంతా ఈ సంప్రదాయాన్ని అనుసరించినవారే.
మున్షి, నెహ్రూల మధ్య సంవాదం మున్షి వ్రాసిన `పిలిగ్రిమేజ్ టు ఫ్రీడం’ (పేజీ 559 నుండి 566)చూడవచ్చును.