Home News అరిషడ్వర్గాలను తెగనరికే  ఖడ్గం… అన్నమయ్య సంకీర్తనా సాహిత్యం

అరిషడ్వర్గాలను తెగనరికే  ఖడ్గం… అన్నమయ్య సంకీర్తనా సాహిత్యం

0
SHARE

 –బుధ్ధిరాజు రాజేశ్వరి

పదకవితాపితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. ముప్పదిరెండు వేలకు మించిన సంకీర్తనాకుసుమాలతో ఆ శ్రీనివాసుని అర్చించి, ఆ దేవుని అనంత లీలలను కొనియాడి, పాడి తరించిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య.  అతని సారస్వతం తెలుగు జాతి సంస్కృతీ సంపద. రసజ్ఞలోకానికి ఆ సారస్వత కళ అంగరంగవైభవం.

అన్నమయ్య క్రోధి నామ సంవత్సర  వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో (మే 9, 1408) ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని రాజంపేట మండలంలో తాళ్ళపాక గ్రామంలో నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు జన్మించారు.  ఎన్నో యేండ్లగా సంతానం లేని ఆ దంపతులు తిరుమలలోని ఆపద మొక్కుల వానికి ముడుపు కట్టుకుంటే భక్తాభీష్టాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తూ  అరిషడ్వర్గాలను తెగనరికే  తన ఖడ్గమైన ‘నందకం’ అంశని వారికి పుత్రుడిగా ప్రసాదించాడు ఆ శ్రీమన్నారాయణుడు.

అన్నమయ్యది విష్ణు భక్తి పరాయణులైన నందవరీకస్మార్త కుటుంబం. తండ్రి అన్ని శాస్త్రాలలో ఆరితేరిన పండితుడు. తల్లి మహా విష్ణుభక్తురాలు, సంగీతజ్ఞాని. ఏక సంతాగ్రాహి అయిన అన్నమయ్య వారి పెంపకంలో చిరు ప్రాయంలోనే సంగీత, సాహిత్య, శాస్త్ర సారాలను గ్రహించి, 8 వ యేటనే హరి సంకీర్తనలను రచించాడు. నూనూగు మీసాల 16  ఏళ్ల వయసులో విష్ణు సాక్షాత్కారమై , భక్తి పారవశ్యంలో, భావావేశంలో పదాలు పాడుతూ, చిందులుతొక్కుతున్న కొడుకుని ఒకనాడు దర్భలు పట్టుకురమ్మని తండ్రి అడవికి పంపించాడు. దర్భలు కోస్తూ వేలు కోసుకున్న క్షణంలో భవబంధాలన్నీ అశాశ్వతమని, విష్ణు భక్తికి అవరోధాలు అని గ్రహించి, ‘ గోవింద,గోవింద’ అని గానం చేసుకుంటూ తిరుమలకు వెళుతున్న భక్త బృందంతో కలిసి తిరుమల చేరాడు.

దేవదేవుని దర్శనార్థం ఏడుకొండలు ఎక్కుతున్న అన్నమయ్య మోకాలు పర్వతం ఎక్కలేక ఆకలి,దప్పికలతో అలసటతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ చిన్నారి బాలుని రక్షించడానికి  అమ్మలగన్నయమ్మ ఆ అలమేలు మంగమ్మ సాక్షాత్కరించి ప్రసాదం పెట్టి ,  చెప్పులు వేసుకుని కొండ ఎక్కరాదని బాలునికి చెప్పి అంతర్థానమయింది. ఆ తల్లిని దర్శించిన ఆనందంలో ఆశువుగా జగన్మాతను కొనియాడుతూ ‘ శ్రీ వేంకటేశ్వర శతకం ‘ రచించాడు.

తిరుమల చేరి శ్రీనివాసుని దర్శించి పరవశుడై ‘పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా ‘ అని కీర్తించాడు.  నిత్యం తన సంకీర్తనలతో ఆ స్వామిని కొలుస్తూన్న అన్నమయ్యను అర్చకులు చేరదీశారు. అతని అకుంఠిత విష్ణు భక్తిని గ్రహించిన   ఘనవిష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యకు భగవదాజ్ఞను తెలిపి శంఖ  చక్రములతో శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారముగా పంచ సంస్కారములను నిర్వహించాడు.

అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి రమ్మని బ్రతిమాలారు. గురువాజ్ఞపై తాళ్ళపాకకు తిరిగి వచ్చాడు. అతనికి తిమ్మక్క, అక్కమ్మ అనే పడతులతో వివాహం చేశారు. అన్నమయ్య ఒకమారు తన ఇద్దరు భార్యలతో తిరుమలకు వెళ్ళి స్వామిని దర్శించారు. ఆ సమయంలోనే స్వామికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు.

అలా ఆ స్వామిని నిత్యం ఆరాధిస్తూ కొన్ని వేల సంకీర్తనలను చేశారు. అన్నమయ్య సంకీర్తనా వైభవం గురించి తెలుసుకున్న సాళ్వ నరసింహరాయలు అనే రాజు అతని ఆస్థానానికి అన్నమయ్యను ఆహ్వానించి, తనపై సంకీర్తనలను రచించమని ఆజ్ఞాపించాడు.  ఆ హరి నామకీర్తన చేసిన నోటితో మానవులను స్తుతించలేనని చెప్తే, ఆగ్రహించి అన్నమయ్యను చెరశాలలో బంధించాడు.  “ఫాలనేత్రాల ప్రభల” అంటూ తనను రక్షింపమని లక్ష్మీ నారసింహుడిని వేడుకున్నాడు. ఆర్తజనపరాయణుడైన ఆ స్వామి అన్నమయ్యను బంధించిన  సంకెళ్ళను జాలువార్చి , చెరసాల తలుపులను తెరిపించాడు. ఈ అద్భుతాన్ని చూసి , తన తప్పు తెలుసుకున్న రాజు అన్నమయ్యను క్షమాపణ వేడుకొన్నాడు.

జీవిత పరమార్థం ఆ స్వామి సన్నిధికి చేరడమే అని గ్రహించి అన్నమయ్య తన భార్యలతో కలిసి దక్షిణభారతదేశంలో తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆనాడు సమాజంలో ఉన్న అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపేలా అనేక సంకీర్తనలను చేశాడు. ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’ అనే సంకీర్తన ఆ నేపధ్యంలో రచించినదే.  తిరుమలకు తిరిగి వచ్చి మరులంకు అనే అగ్రహారంలో నివసిస్తూ తన శేష జీవితాన్ని ఆ వేంకటేశ్వరుని నిత్య ఆరాధనలో గడిపాడు.

తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార రచనలు, ఆధ్యాత్మ పదాలు ఇలా ఎన్నో రకాల రచనలను చేశాడు.  సంగీత జగత్తుకి ‘కీర్తన ‘ రూపాన్ని పరిచయం చేసిన ఘనత అన్నమయ్యదే. లయబద్ధంగా రాసిన సాహిత్యానికి పల్లవి, చరణం అనే భాగాలను ఏర్పరచి ‘కీర్తన’ అనే కొత్త  ఒరవడిని సృష్టించాడు.  దక్షిణ భారతంలో భజన సంప్రదాయనికి ఆయనే ఆద్యుడు. ఆయన సమకాలీనులైన ‘పురందరదాసు’ ఆయనను తిరుమలలో దర్శించి, అన్నమయ్యను ఆ  శ్రీనివాసుని అవతారంగా భావించారు. ఆ తరువాతి కాలంలో ప్రఖ్యాతులైన త్యాగరాజ, క్షేత్రయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారులందరికీ అన్నమయ్య మార్గదర్శకులు.

అన్నమయ్య జీవితవిశేషాలు వారి మనవడు తాళ్ళపాక చిన్నన్న గారు వ్రాసిన ‘అన్నమాచార్య చరితము’ అనే ద్విపదకావ్యం ద్వారా మనకు లభ్యమయ్యాయి.  వారు రచించిన 32 వేల కీర్తనలలో మనకు 12000 మాత్రమే రాగిరేకులపై వ్రాయబడి తిరుమల స్వామి వారి గర్భగుడి సమీపంలో పొందుపరచబడి ఉన్నాయి.  దురదృష్టవశాత్తూ ఈ కీర్తనలు మనకు స్వరసమేతంగా లభించలేదు. సంకీర్తనా లక్షణం అనే లక్షణ గ్రంథం, మంజరీ ద్విపద లో ‘శృంగార మంజరి’ అనే కావ్యం, 12 శతకాలు, ద్విపద రామయణం లాంటి ఎన్నో గ్రంథాలను వారు రచించారు, కానీ వాటిలో మనకి లభ్యమైనవి మాత్రం రాగిరేకులపై వ్రాయబడిన 12000 కీర్తనలు మాత్రమే. వారి కీర్తనలు వ్యావహారిక పలుకుబడులతో, సామెతలతో, జాతీయాలతో, సూక్తులతో అచ్చ తెలుగు నుడికారాలతో నిండివుంటాయి.  ఆనాటి సాంఘిక జీవనాన్ని ప్రతిబింబింబిస్తాయి.

అవతార పురుషుడు, కారణ జన్ముడైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు 95 ఏళ్ళ పరిపూర్ణ జీవనాన్ని శ్రీమన్నారాయణుడి పాదారవిందములకు సంకీర్తనా రూపంలో సమర్పించి, దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503)  విష్ణు కైంకర్యం పొందారు.

నేటికీ తిరుమలలో స్వామి వారి ఏకాంతసేవ సమయంలో ప్రతి దినం అన్నమాచార్యులవారి వంశం వారు ఆయన రచించిన ఒక కీర్తనను పాడే సంప్రదాయం కొనసాగుతోంది.

తాత్విక దృష్టితో, వైరాగ్య చింతనతో భగవంతుని దివ్యలీలలను, మహిమలను కీర్తిస్తూ, అజ్ఞానాన్ని తొలగించి, ధర్మాన్ని నిలబెట్టేది భక్తి ఒక్కటే అని ప్రబోధించిన అన్నమయ్య ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయులు, మార్గదర్శకులు.

  • మే 23 అన్నమయ్య 616వ జయంతి (తిథి ప్రకారం)