Home News మూఢనమ్మకాలు, మూర్ఖ ఆచారాలు, భేదభావాలను పెకిలించిన బుద్ధుడు

మూఢనమ్మకాలు, మూర్ఖ ఆచారాలు, భేదభావాలను పెకిలించిన బుద్ధుడు

0
SHARE


జీవన పరిచయం
మహాత్మా బుద్ధుని జననం సుమారు 2500 సం. క్రితం (క్రీ.పూ. 563)-హైందవ పంచాంగం ప్రకారం వైశాఖ పూర్ణిమ రోజున లుంబిని వనంలో జరిగింది. తండ్రి పేరు శుద్దోధనుడు, తల్లి పేరు మాయ.

బుద్ధుడు తల్లి గర్భంలో ఉన్నపుడే రాజపరివారానికి సుఖసంతోషాలు సమృద్ధి కలగడం ప్రారంభం అయింది కాబట్టి అతనికి సిద్ధార్ధుడు అని పేరు పెట్టారు.

శుద్ధోధన మహారాజు రాజకుమారుని నామకరణోత్సవం ఏర్పాటు చేసి ఎనిమిది మంది విద్వాంసులను ఆహ్వానించి బాలుని భవిష్యత్తు గురించి అడిగినప్పుడు వారంతా ముక్తకంఠంతో ‘ఈ బాలుడు మహాయోగి అవుతాడని’ చెప్పారు.

బుద్ధ భగవానుని పెళ్లి యశోధరతో జరిగింది. బుద్ధునికి రాజ్యం, భార్యాపిల్లలు,పరివారం మొదలైనవన్నీ  యోగసాధనకు అడ్డంకిగా తోచాయి. 30 ఏళ్ళ వయసు రాగానే అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక రాత్రి రాజభోగాలు అన్నీ వదిలి అడవికి వెళ్ళిపోయాడు.

జనన, మరణాల వెనుక ఉన్న రహస్యం తెలుసుకునేవరకు కపిలవస్తు నగరంలో అడుగుపెట్టనని ప్రతిజ్ఞ చేసాడు. 6 సంవత్సరాల కఠోర సాధన తర్వాత గయ (ప్రస్తుత బీహార్ లో ఉంది) లో ఒక రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది.

సిద్ధార్ధుడు బోధ పూర్వక జ్ఞానోదయం పొందిన కారణంగా ‘బుద్ధ భగవానుని’గా పిలవబడడం జరిగింది.

తన తొలి ఉపదేశం కోసం వారణాసి దగ్గరగా ఉన్న సారనాథ్ ను ఎన్నుకున్నాడు.

బుద్ధ భగవానుడు 44 ఏళ్ళ వయసు వచ్చేవరకు ఉపదేశాలు ఇస్తూ దేశాటనం చేసాడు.

బుద్ధ భగవానుడు సమాజహితం కోసం చేసిన పనులు
ఎన్నో ఏళ్లుగా సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలు, మూర్ఖ ఆచారాలు, భేదభావాలు అన్నింటిని పెకిలించివేశాడు.

స్వర్గం, నరకం అనే భావనతో ముడిపడి ఉన్న ఆచారవ్యవహారాలను అతను వదిలివేసి ధర్మశాస్త్రాల ప్రకారం ప్రతి ప్రాణి, అందరూ జాతివర్గ భేదాలు లేకుండా స్త్రీలతో సహా అందరూ సమాన అధికారం కలిగి ఉన్నారని చెప్పాడు.

వ్యర్థమైన ఆడంబరాలు లేకుండా సాధనా మార్గం ద్వారా దుఃఖం నుండి ముక్తి పొందే సరళమైన నూతన విధానాన్ని లోకానికి చూపెట్టాడు. కొద్దికాలంలోనే బౌద్ధ మతం భారతదేశం అంతటా వ్యాపించడమే కాకుండా సరిహద్దుల్లో ఉన్న నేపాల్, టిబెట్,  చైనా, వియత్నాం, జపాన్, మంగోలియా, శ్రీలంక, కొరియా, జావా, సుమత్రా దీవులు, ఇలా అంతటా వ్యాపించింది.

విశ్వంలో ఉన్న సర్వమానవాళికి సుఖశాంతులతో జీవనం కొనసాగించడానికి కొత్త మార్గాన్ని చూపెట్టాడు. ఆ హిందూ సమాజం కూడా బుద్ధుడికి  దశావతారాలలో స్థానం కల్పించి, గౌరవించింది.

భారతీయ ధర్మశాస్త్రాలు, దర్శనాల అధ్యయనం, కళ, సాహిత్యము, సృజన,విద్యా రంగాలలో కొత్త పుంతలు తొక్కాయి. అదే సమయంలో తక్షశిల, నలంద,విక్రమశిల, ఔదంపురి మగధ లలో విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి పొందాయి.

సాంస్కృతిక ఉద్ధానం ఒక కొత్త యుగంలో అడుగుపెట్టింది. బుద్ధుని విచారాలతో పాటు గ్రంథరచన, విగ్రహనిర్మాణం, స్థూప నిర్మాణం, మఠాల స్థాపన, గుహాలయాల నిర్మాణం వాటిలో భారీ విగ్రహాల నిర్మాణం దేశమంతా జరిగింది..

బుద్ధుడు ఈ ప్రపంచంలో ఏదీ సుస్థిరమయినది కాదని అన్నీ నాశనం అయ్యేవే అని, ప్రతిప్రాణి అనగా ఉత్తమ,మధ్యమ,నీచ, అనే భేదం లేకుండా అన్ని నశింపబడతాయని బోధించాడు.

బుద్ధుడు స్వయంగా తన సంకల్పాన్ని స్పష్టంచేశారు

జరామరణాషార్థ ప్రవిష్టో౽స్మి తపోవనం

అనగా ‘నేను అడవిలోకి వెళ్లి సాధన చేయడానికి కారణం వృద్ధాప్యం, మరణం వల్ల కలిగే దుఃఖాన్ని నశింపజేయడమే’.

బుద్ధ భగవానుని సర్వత్యాగమయ, తపోమయ జీవనం అలాగే అతని కరుణామయ భాషణ ప్రభావం  ఎంత అద్భుతంగా ఉందంటే దేశంలోని పెద్ద పెద్ద సామ్రాట్ లు కోసలదేశాధిపతి ప్రసేనజిత్తు, మగధ సామ్రాట్ అజాతశత్రు, సామ్రాట్ అశోకుడు,  ప్రతాపవంతుడైన హుణ రాజు కనిష్కుడు, సామ్రాట్ హర్షవర్ధనుడు మొదలైనవారు బౌద్ధధర్మాన్ని స్వీకరించి తమ రాజ్యమంతటా బౌద్ధధర్మాన్ని చాటిచెప్పేలా కృషిచేశారు.

బుద్ధుడు ప్రాచీన వైదిక మతంలోని కాలక్రమేణ చోటుచేసుకున్న అనాచారాలను ప్రశ్నించాడు.  ఆయన  కొత్తగా ఏ మతాన్ని సృష్టించలేదు. బౌద్ధం హిందూ మతపు నవీనరూపం మాత్రమే.

శ్రీ రాంధారిసింహ్ దినకర్ కుల వ్యవస్థపై  బుద్దుడు విసిరిన సవాలు గురించి ఇలా రాసారు, కుల వ్యవస్థపై  బుద్ధుడు విసిరిన సవాలు దేశంలో ఒక మహా ఉద్యమాన్ని లేవనెత్తింది. అది గాంధీగారి వరకు కొనసాగింది’.

బుద్ధుడు మనిషి గౌరవాన్ని పెంచడం కోసం ఈవిధంగా అన్నారు..’మనిషి కి గౌరవం, పూజనీయత కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల కలుగదు. ఉచ్ఛ నీచాలు మనిషి పుట్టుక మీద కాకుండా అతని కర్మల మీద ఆధారపడి ఉంటాయి.’

బుద్ధుడు చాతుర్వర్ణాలకు, స్త్రీలకు మతాచారాలపై సమాన అధికారం ఇచ్చారు.

కులవ్యవస్థను ధిక్కరించి, చాతుర్వర్ణధర్మాలను కాదని బుద్దుడు నిర్గుణవాదాన్ని బాగా ప్రచారం చేశారు. మానవతా వాదాన్ని ప్రజలందరికీ అలవాటు చేశారు.

బుద్ధునికి యుద్ధం, హింస, అతివాదం అసలు నచ్చేవి కాదు.

మనుషులందరి అవయవాలు ఒకేరీతిన ఉండడం వల్ల వారిని ఆకారం, పుట్టుక, రంగును బట్టి కులభేదాలు నిర్ణయించలేం కానీ వారి కర్మలను బట్టి మనిషి జాతిని నిర్ణయించవచ్చు. ఒకరు గోపోషణ ద్వారా జీవిస్తూ ఉంటే పుట్టుకతో బ్రాహ్మణుడైనా అతడిని కర్షకుడిగానే భావించాలి. అలాగే పుట్టుకతో బ్రాహ్మణుడైనా శిల్పాలు చెక్కుతూ జీవిస్తూ ఉంటే శిల్పి గానే భావించాలి” అని బుద్ధుడు బోధించారు.

బుద్ధ భగవానుడు తన జీవితంలో ఎప్పుడూ పుట్టుక ఆధారంగా కుల వర్ణ భేదాలను అంగీకరించలేదు.

బుద్ధ భగవానుని ప్రకారం:న హి వైరేన వైశ్చరాని సమ్మంతీఘ కుదాచనం౹

(ఈ ప్రపంచంలో వైరం ఎపుడూ వైరంతో శాంతించదు. వైరం ఎపుడూ మైత్రితోనే శాంతిస్తుంది. ఇదే సనాతన ధర్మం.)

పవిత్ర స్థలాలు:
బౌద్ధ మతం ప్రకారం 4 ప్రదేశాలను పవిత్రమైనవిగా భావిస్తారు.

  1. కపిలవస్తు- బుద్ధుని జన్మస్థలం
  2. బుద్ధ గయ- బుద్ధునికి జ్ఞానోదయం అయిన చోటు
  3. సారనాథ్- బుద్ధుడు మొదటి ప్రవచనం ఇచ్చిన చోటు
  4. కుషినగరం- బుద్ధుడు మహానిర్యాణం చెందిన చోటు

80 ఏళ్ల వయసులో కుషినగరం లో తన చివరి ఉపదేశం ఇచ్చాడు. అక్కడే ఒక చెట్టు కింద మహానిర్యాణం చెందాడు.

మూలం: ‘భారత్ కీ సంత్ పరంపర ఔర్ సామాజిక్ సమరసత’
రచయిత: డా. కృష్ణ గోపాల్

మే 23 – మ‌హాత్మా బుద్ధ జ‌యంతి (తిథి ప్రకారం)