Home Rashtriya Swayamsevak Sangh దక్షిణ భారతాన సంఘ సౌధానికి పునాది రాయి శ్రీ దాదారావు పరమార్థ్

దక్షిణ భారతాన సంఘ సౌధానికి పునాది రాయి శ్రీ దాదారావు పరమార్థ్

0
SHARE

తొలి తరం ప్రచారక్ :

దక్షిణ భారత దేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సంఘ కార్యాన్ని ప్రారంభించటానికి విచ్చేసిన మహానుభావుడు శ్రీ దాదారావుజి పరమార్థ్. ఆనాటి మద్రాసు ప్రాంతమంటే ఇప్పటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కలిసి ఉండిన ప్రాంతం. దానికి మద్రాసు (చెన్నై) రాజధాని నగరం. అది పలు భాషల కూడలి. అక్కడ తొలుత సంఘ శాఖ ప్రారంభింపబడి క్రమంక్రమంగా తమిళనాడులో విస్తరించింది. దేశంలో ఏ ప్రాంతంలో అయినా సంఘ కార్యం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చినప్పుడు డాక్టర్జీ మనసులో ఇద్దరు మహనీయులు మేదిలేవారు. ఒకరు ఆప్టేజీ, రెండవ వారు దాదారావుజి.

శ్రీ దాదారావుజి తొలి ప్రచారకుల బృందంలో ఒకరు. ప్రచారక్ అన్నమాటకి పరమార్ధాన్ని, ప్రసిద్ధిని సంతరించి పెట్టిన మహనీయులు. 1925 లో సంఘ స్థాపన తర్వాత నుండి 1932 వరకు ప.పూ డాక్టర్జీకి సన్నిహితులుగా మెలుగుతూ సంఘటన, వ్యక్తి నిర్మాణ కార్యానికి కావలసిన ప్రేరణను పొందారు దాదారావుజి. 1932 లో ఇల్లు వదిలి సంఘ కార్య విస్తరణకు బయలుదేరి మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, డిల్లీ, ఉత్తర ప్రదేశ్ మొదలైన చోట్ల పర్యటించి కొంత సంఘ వాతావరణాన్ని ప్రోది చేశారు. డాక్టర్జీ నిర్దేశం మేరకు 1938లో మద్రాసు చేరుకొని సంఘ కార్యానికి శ్రీకారం చుట్టారు.

అనర్గళ వాక్ప్రవాహం:

శ్రీ దాదారావుజి అసలు పేరు గోవింద సీతారాం పరమార్థ్. వారు 1904లో నాగపూర్లోని ఇత్వారీ వాడలో జన్మించారు. తండ్రి గారి పేరు సీతారాం రఘుపతి పరమార్థ్. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసులో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ఈయన 3 సంవత్సరాల వయసులో ఈయన తల్లి జానకీ బాయి పరమార్థ్ మరణించారు. తండ్రి గోవింద సీతారాంకు డాక్టర్జీతో ఉన్న పరిచయం వల్ల దాదారావు డాక్టర్జీకి సహజంగానే దగ్గరయ్యారు. వారి హృదయం హిందూ జాతీయ విప్లవ భావాలతో నిండి ఉన్న కారణంగా శ్రీ దాదారావు మెట్రిక్ వరకు చదివినా అందులో ఉత్తీర్ణులు కాలేక పోయారు. అయితే ఈయన ఆంగ్ల భాషలో అనర్గళంగా ఉపన్యసించేవారు. ఆ ప్రతిభతోనే మద్రాసు, తమిళనాడు ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసి సంఘం వైపు ఆకర్షించి కార్య విస్తరణకు కృషి చేయగలిగారు.

ప.పూ. డాక్టర్జీతో గాఢమైన అనుబంధం :

శ్రీ దాదారావు పరమార్థ్ బాల్యం నుంచి డాక్టర్జీతో గడిపిన కారణంగా వారితో అనుబంధం ఎక్కువ. డాక్టర్జీ ఎప్పుడు జ్ఞప్తికి వచ్చినా, డాక్టర్జీ జీవితం గురించి ఎక్కడైనా వివరించాల్సి వచ్చినా వారు తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యేవారు. ఒకసారి బరేలీలో జరుగుతున్న సంఘ శిక్షావర్గ రాత్రి కాలాంశంలో డాక్టర్జీ జీవితాన్ని గురించి శ్రీ పరమార్థ్ వివరించవలసి వచ్చింది. 45 నిముషాలలో ముగియవలసిన కాలాంశం గంట పాటు కొనసాగింది. శ్రీ పరమార్థ్ ఎంతో ఉద్విగ్నంగా డాక్టర్జీ జీవిత ఘట్టాల్ని వివరించారు. శిక్షార్దులూ మంత్ర ముగ్దులై విన్నారు. ఆ రాత్రి అప్పటి సహ సర్ కార్యవాహ శ్రీ రాజేంద్ర సింహజీ పక్క మంచంపై శ్రీ పరమార్థ్ శయనించారు. ఒక వేళప్పుడు శ్రీ రజ్జుభయ్యా మేలుకుని చూసేటప్పటికి దాదారావుజి అసహనంగా కదులుతూ కనిపించారు. ఏమైందని శ్రీ రజ్జుభయ్యా ప్రశ్నించగా “ డాక్టర్జీ గుర్తుకొస్తున్నారు. ఒక్కసారిగా ఆ స్మృతులు ఆనకట్ట తెగిపోయిందేమో అన్నట్లుగా ఉంది నా పరిస్థితి. మరొకసారి ఎప్పుడూ రాత్రి పూట డాక్టర్జీని గూర్చి ప్రసంగించమని చెప్పకండి.” అన్నారు దాదారావుజి. డాక్టర్జీతో అంత గాఢమైన అనుబంధం వారిది.

తల్లి భారతి సేవకై ప్రతినబూనాను :

మహాత్మా గాంధీ హత్యా నేరం అకారణంగా సంఘంపై మోపబడి అది సంఘపై నిషేదం విధించడానికి కారణమైంది. ఆ సమయంలో దాదారావుజి మనసు ఆధ్యాత్మికత చింతన వైపుకు మరళింది. వారు రెండు మూడేళ్ళ పాటు పాండిచ్చేరిలోని అరవిందాశ్రమంలో ఉన్నారు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన సంఘం పట్ల శ్రీ పరమార్థ్ కు ఉన్న నిష్ఠ ఏపాటిదో తెలియజేస్తుంది. అరవిందాశ్రమంలో ఉన్న కాలంలో తనతో పాటు ఉన్న సాధకుడొకరు ప్రతిజ్ఞ తీసుకోవలసిందిగా శ్రీ పరమార్థ్ ను కోరినపుడు “ నేను ఒకసారి భాగావాధ్వజము ముందు నిలబడి ప్రతిజ్ఞ చేశాను. అదే మొదటిదీ ఆఖరుదీను. ప్రతిజ్ఞ అనేది ఒకసారే చేస్తాం. ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యం. మరోసారి ప్రతిజ్ఞ తీసుకోడంలో ఔచిత్యమేముంటుంది?” అన్నారు శ్రీ పరమార్థ్.

మరళా సంఘ గంగా ప్రవాహంలోకి :

అయితే శ్రీ అప్పాజీ, శ్రీ ఆప్టేజీల ఆకాంక్షలకు శ్రీ దాదారావుజి ఆకాంక్ష కూడా తోడై పూజ్య గురూజీ అనుమతి కూడా లభించి శ్రీ దాదారావుజి మరళా సంఘ గంగా స్రవంతిలోకి వచ్చారు. అయితే తాను అనుభవమున్న కార్యకర్తే అయినా కూడా కొంత కాలం సంఘ దైనందిన కార్యక్రమాలకు దూరంగా, ప్రచారక్ జీవనం నుండి పక్కకి తప్పుకుని ఉన్న విషయం వారికి తెలుసు గనుక “ కొద్దికాలంగా నేను కార్యరంగం నుండి దూరంగా ఉంటూ వచ్చాను. కాబట్టి కాస్త చిన్న క్షేత్రాలలో పని అప్పగించండి” అని ఆయనే అడిగారు. దాంతో ఆయనకు ఉత్తరప్రదేశ్లోని డెహ్రాడూన్, శహరాన్పూర్ విభాగ్ కార్యం అప్పగించారు.

మాటల తూటాలు :

శ్రీ పరమార్థ్ జి సంఘ కార్యాన్ని గూర్చి సిద్ధాంతాన్ని గూర్చి సూత్ర ప్రాయంగా చెప్పిన విషయాలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. “సంఘస్థాన్ అంటేనే హిందుస్థాన్, సంపూర్ణ హిందుస్థాన్ సంఘస్థాన్” , “ ఇది గతంలో హిందూరాష్ట్రం, ఇప్పుడు హిందూరాష్ట్రం, భవిష్యత్తులో కూడా హిందూరాష్ట్రం”, “ఈ దేశంలో ఒక్క హిందువు మిగిలినప్పటికీ ఇది హిందూ రాష్ట్రంగానే ఉంటుంది.” , “నీకు ఏమి చెయ్యాలి అనేది తెలిస్తే ఎలా చెయ్యాలి అనేది నీకే తెలుస్తుంది.” , “ సంఘంలో ఎంత మంది ఉన్నారు అన్నది అసలు ప్రశ్న కాదు. సంఘం ఎంత మందిలో ఉన్నది అన్నదే అసలు ప్రశ్న” ఇలా ప్రేరణదాయకంగా సాగేవి వారి ప్రసంగాలు.

ఆరిపోయిన అగ్నిజ్వాల :

1963లో పంజాబ్ లోని సోనేపట్ సంఘ శిక్షావర్గ నుండి తిరిగివస్తూ డిల్లీలోని సంఘ కార్యాలయంలో ఆగారు. అక్కడే ఆకస్మికంగా జబ్బుపడ్డారు. జ్వరం బాగా పెరిగిపోయింది. 27, జూన్, 1963 నాడు వారు దివంగతులయ్యారు. వారు తమ జీవన కార్యం కొనసాగిస్తూనే తనువు చాలించారు. అలాంటి సార్ధక జీవనం లభించిన ధన్య జీవి ఆయన. మనము కూడా వారిలా సమర్పిత జీవనాన్ని కొనసాగించడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి.

(నేడు స్వర్గీయ శ్రీ దాదారావు పరమార్ధ్ పుణ్యతిధి)

Source: VSK Andhra