Home Views శ్రీ గురవేనమః

శ్రీ గురవేనమః

0
SHARE

గురువు అంటే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింప జేసేవాడు.. గురువు అంటే కేవలం పుస్తకజ్ఞానం అందించేవారొక్కరే కాదు.. విద్యార్థిలో నిబిడీకృతమైన అంతర్గత శక్తిని వెలికితీసి అతన్ని సమాజానికి ఉపయోగపడేవానిగా మలచేవాడే నిజమైన గురువు.

అఖండమండలాకారం
వ్యాప్తంయేనచరాచరం
తత్పదందర్శితంయేన
శ్రీగురువేనమః
అంటుంది వేదం… అంటే… ఈ సృష్టి అంతటా సజీవ నిర్జీవాల్లో సైతం ఎవరు ఉన్నారో… దానిని దర్శింప జేసే గురువుకు నమస్కారం.. అని అర్థం.
కేవలం పుస్తకంను మన మస్తకంలో నింపక ఈ చరాచర జగత్తులో నిబిడీకృతమైన జ్ఞానాన్ని అందించగలిగే శక్తి సామర్ధ్యాలు నిజమైన గురువులసొంతం.

అందుకే… వేదవ్యాసుని కాలం నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వరకూ ఎందరెందరో మహా మహోపాధ్యాయులు ఈదేశంలో విలసిల్లారు. ఒకసారి వారి గూర్చి గమనిస్తే…. వేదం సంక్లిష్టంగా, ఒకే రాశిగా ఉన్నపుడు దానిని ఋగ్వేదం.. యజుర్వేదం..సామవేదం.. అధర్వణవేదం.. అని నాలుగు భాగాలుగా విభజించి అందించారు. అందుకే భగవాన్ వేదవ్యాసులను మనం ఆదిగురువుగా.. వారి జయంతి వ్యాసపౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నాం.

14ఏళ్ళ బాలుడు శ్రీరాముని అసురసంహారిగా తీర్చిదిద్దిన గురువు విశ్వామిత్రుడు. జగన్నాటక సూత్రధారి జనార్ధనునికి విద్యనేర్పిన గురువు సాందీపని మహర్షి. అదేవిధంగా.. ఆదిశంకరులు.. లోకంలో శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని ఘర్షణపడుతున్నప్పుడు శివకేశవులిద్దరికీ అభేదంచెప్పి అద్వైతం ప్రతిపాదించారు. కుక్కమాంసం తినే చందాలునిలో సైతం పరమేశ్వరుని దర్శించి మానవులంతా సమానమే అని చాటిన మహనీయులు ఆదిశంకరులు.

గురువు తనకు అందించిన నారాయణ మంత్రాన్ని తిరుకొట్టియూరు లోని నరసింహ స్వామి ఆలయగోపురం ఎక్కి లోకానికి అంతటికీ అందించారు. ఇలాచేసి నీకు రావాల్సిన పుణ్యాన్ని ఇతరులకు అందించి నీవు పాపం మూటగట్టుకుంటున్నావంటే.. లోకమంతటికీ మేలు జరుగుతున్నప్పుడు నాకు కీడుజరిగినా ఆనందమే అని చాటిన మహనీయులు రామానుజులు. దుష్టుల దునుమాడి దుర్గములపై ధర్మధ్వజం ఎగరేసిన వీరాశివాజీలో కించిత్ గర్వం తొణకిసలాడినపుడు… ఆయనను వ్యాహ్యాళికి తీసుకెళ్లి అడవిలో ఒకరాతిని పగలగొట్టించితే అందులోనుండి ఒక కప్ప బయట పడుతుంది. అపుడు ఆ గురువు ‘ఈ రాజ్యానికీ..ఇందులోని రాళ్లకూ..ఈరాళ్లలోని నీటికీ… ఈనీటిలోని కప్పకూ నీవే రాజువు కదా..’ అంటాడు. అప్పుడు తత్వం బోధపడ్డ శివాజీ గురువు కాళ్లపైబడి రాజ్యాన్ని మొత్తం వదిలి సన్యాసం తీసుకుంటానంటే… నీవు నా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పాలించు అని బోధించిన గురువు సమర్థరామదాసు. రాజ్యాన్ని దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్న నందవంశాన్ని తుడిచిపెట్టడానికి.. యవనులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చంద్రగుప్తుని తీర్చిదిద్దిన గురువు చాణక్యుడు. ఇలా ఎందరెందరో గురువులు దేశానికి తమ మేధస్సును ధారపోశారు.. అటువంటి గురువులు నేడు కావాలి….

– రాంనరేష్