రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. గురుపూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షిణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే సంఘం భగవాధ్వజాన్ని గురువుగా ఎందుకు స్వీకరించిందన్న ప్రశ్న ఉదయిస్తుంది.?
గురుదక్షిణ :
సంఘము తన ప్రతి శాఖలో వ్యాసపూర్ణిమ /గురుపూర్ణిమ రోజున గురుపూజ, కార్యక్రమాన్ని నిర్వహించే యోజన చేస్తుంది. ఇందుకు రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది-ప్రాచీన భారత దేశానికి సంబంధించిన గురు – శిష్య పరంపరను కొనసాగించుట. శిక్షణ పూర్తి చేసుకొన్న శిష్యులందరు సాదరంగా, కృతజ్ఞతాపూర్వకంగా యథాశక్తితో గురు దక్షిణ సమర్పిస్తారు. దీనిలో ధనరాశే కాకుండా కృతజ్ఞతా భావన నిండిఉంటుంది. గురుపూజా కార్యక్రమాన్ని చాలా నిష్ఠతో చేస్తారు.
గురుపూజా కార్యక్రమం కూడా శాఖా కార్యక్రమం వలే ఏదైనా గది లేదా సభా మందిరంలో భగవాధ్వజం ఎగురవేయడంతో ప్రారంభమవుతుంది. కానీ ఆ రోజు కేవలం ధ్వజపూజ, బౌద్దిక్ కార్యక్రమం మాత్రమే ఉంటుంది. పూజించే ధ్వజం దగ్గర దూప, దీపాలు పెట్టి అక్కడ సంఘ సంస్థాపకులైన డాక్టర్ హెడ్గేవార్, రెండో సర్ సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ (గురూజీ), భారతమాత చిత్రపటాలను ఉంచుతారు. ధ్వజానికి పూజ చేయడానికి వాటి దగ్గర పుష్పాలనుంచుతారు.
కార్యక్రమ సూచన అందరికి ఇస్తారు. ఒక్కసారి శాఖకు వచ్చిన స్వయంసేవకున్ని కూడా గురుపూజలో తప్పకుండ ఉండేలా చూస్తారు. క్రొత్త స్వయం సేవకులను ఈ సంఘటనములో కలుపుటకు చేసే ఈ పని ఎంతో మహత్వపూర్ణమైనది.
గురుదక్షిణ కార్యక్రమం చాలా నిష్టతో కూడి ఉంటుంది. గురువు పట్ల శ్రద్ధ, కృతజ్ఞత లాంటి ఆధ్యాత్మికత నిండిన వాతావరణం ఏర్పడుతుంది. ఇది కొత్త స్వయంసేవకుల పైన ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ సందర్భంగా స్వయం సేవకులు దేశభక్తి గీతాలు సామూహికంగా పాడుతారు.
ఈ కార్యక్రమములో ప్రత్యేకంగా ఆహ్వానించబడిన విశిష్ట వ్యక్తి లేదా సంఘ పెద్దఅధికారి ఉపన్యాసం స్వయం సేవకులనుద్ధేశించి ఉంటుంది. శాఖ ఉన్న ప్రాంతములోని డాక్టర్లు, లాయర్లు, లెక్షరర్లు, సైన్యములో పదవీ విరమణ పొందిన పెద్ద అధికార్లు లేదా మరెవరైనా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని ముఖ్యవక్తగా ఈ గురుదక్షిణ కార్యక్రమానికి రావాలని సంఘం కోరుకొంటుంది. ఇలా రాష్ట్రీయ స్వయం సేవకసంఘంతో ఇతరులను కలుపుట ద్వారా వారి మద్దత్తు సంఘానికి లభిస్తుంది. ఇప్పటి వరకున్న అనుభవమేమనగా, గురుదక్షిణ కార్యక్రమం రోజు ముఖ్యవక్తగా మొదటిసారి వచ్చిన వ్యక్తి ఎంత ప్రభావితం చేయబడతాడంటే, ఆయన స్వయం సేవకుడు కానప్పటికిని, ఆయన జీవనపర్యంతం సంఘాన్ని ప్రశంసించే వ్యక్తిగా, మిత్రునిగా ఉంటాడు.
రోజువారి శాఖా కార్యక్రమం వలె ఈ గురుదక్షిణ కార్యక్రమం కూడా ప్రార్థనతో ముగుస్తుంది. ఈ గురుదక్షిణ పద్దతి సంఘం ప్రారంభదినములలోనే చేశారు. దీనికి రెండు ముఖ్య ఉద్దేశ్యాలున్నాయి. మొదటిది-సమాజాన్ని సంఘటితం చేయుట, ఈ సంఘటితం ద్వారా కేవలం సంఘం లోపలనే సంఘం నడపడానికి కావలసిన ధన వ్యవస్థను ఏర్పరచుకొనుట. రెండవది-సంఘానికి సర్వోన్నతమైన గురువు భగవధ్వజమనే భావాన్ని స్థాపనచేయుట.
కాలాంతరములో రోజూ నియమిత రూపములో శాఖకురాని స్వయం సేవకులను కూడా కనీసం ఒకసారి సంఘానికి కలుపాలనే ఉద్ధేశ్యముతో గురుదక్షిణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. వీరు సంవత్సరంలో కనీసం ఒకసారైనా అందరిని పరస్పరం కలువగలరు. కాలానుగుణంగా అనేక మంది స్వయంసేవకులు విభిన్న క్షేత్రాలలో సమాజాన్ని సంఘటితం చేయుటలో దేశమంతటా వ్యాపించి ఉన్నారు. అటువంటి స్వయం సేవకులకు సంఘకార్యాలయము గాని లేదా మరేదైన సభామందిరములో గురుదక్షిణ కార్యక్రమం ప్రత్యేకంగా చేయవలసి ఉంటుంది. ఇందులో రోజు నియమిత రూపంలో శాఖకు రాని స్వయం సేవకులు ఎక్కువగా ఉంటారు. ప్రభుత్వాధికారులకు, విలేకరులకు, వైద్యవృత్తి సంబంధిత విశిష్ట వృత్తులవారికి గురుదక్షిణ కొరకు వీలును బట్టి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయాలి. సంవత్సరంలో ఒకసారి మాత్రమే గురుదక్షిణ చేస్తారు. సాధారణంగా నెలలో గురుదక్షిణ కొరకు ఒకసారి లేదా రెండుసార్లు తేదీలను ఏర్పాటు చేస్తారు. శాఖ, దానికి సంబంధించిన ఇతర క్షేత్రాలవారి సౌలభ్యం కొరకు ఈ కార్యక్రమ తేదీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రీయ స్వయంసేవక్సం సంఘ్‌లో కార్యకర్తలు ఎన్నడు కూడ ఈ పరంపరను ఉల్లంఘించరు. ఇది అన్నిటికన్న ఉన్నతమైనది, పునీతమైన కార్యక్రమమని వారు భావిస్తారు. (అరుణ్ ఆనంద్ –సంఘం గురించి తెలుసుకోండి. డిల్లీ – ప్రచురణ – 2017,పేజీ 41-51)
భగవాధ్వజమే గురువుగా ఎందుకు ? :
అడ్వాన్స్ కలర్ థెరపీ (రంగులచికిత్స) ప్రకారం కాషాయన్ని సమృద్ధికి, ఆనందానికి ప్రతీకగా గౌరవిస్తారు. ఈ రంగు కండ్లకు శాంతినివ్వడమే కాకుండా, మానసిక సంతులనాన్ని కలిగించడంతో బాటు క్రోధాన్ని నియంత్రించి సంతోషాన్ని పెంచుతుంది.
జ్యోతీష్యములో కాషాయము బృహస్పతి గ్రహం రంగు. ఇది జ్ఞానాన్నిపెంచి ఆధ్యాత్మికతను ప్రసరింపచేస్తుంది. కాషాయం పవిత్రమైన రంగు. ఇది ఎన్నో యుగాల నుండి మన ధార్మిక కార్యకలాపాలలో, సాధుసంతుల వేశధారణలో ఇమిడి ఉంది. మన పూర్వీకులు భగవాధ్వజం ముందు శిరస్సు వంచి నమస్కరించారు. సూర్యునిలో ఉన్న అగ్ని, వైదిక యజ్ఞములో సమిధలద్వారా వెలుబడే అగ్ని రంగు కూడా కాషాయపు రంగే.
భారతవర్షములో విదేశీ ఆక్రమణదారులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధాలన్నీ ఈ భగవాధ్వజం ఛాయలోనే జరిగాయి. ఈ కాషాయం ప్రకృతితో కూడా పెనవేసుకొంది. సూర్యోదయం, సూర్యాస్తమయాలలో ప్రకృతి పునర్జన్మించినట్లు భావన కలుగుతుంది. సూర్యుని ఎరుపు రంగు నకారాత్మక తత్వాలను కడిగివేస్తుంది.
ప్రాచీన ఇతిహాసం:
లంకా నగరం పైన రావణునితో చేసిన యుద్ధంలో భగవాన్ రాముడు రఘువంశపు ధ్వజమైన కాషాయపు నీడలో చేసాడు. స్కందపురాణం ప్రకారం రఘువంశపు ధ్వజం పైన మూడు రేఖలు ఉంటాయి. దానిపైన వారి కులదేవత అయిన సూర్యుని చిత్రం ముద్రించి ఉంటుంది. దాని వెనక భాగం ఎరుపు రంగులో ఉంటుంది. (ధ్వజ మనుష్యు శీర్షం రామాయణ్ యుద్ధ కాండ- 100.14). యుద్ధభూమికి వెళ్ళే సమయములో యోధులు తమ చేతులతో స్వయంగా రథంపైన ధ్వజాన్ని అలంకరిస్తారు. మహాభారత కాలంలో అర్జునుడు తన రథం “నందిఘోష్ “చుట్టు తిరిగి ,కవచాన్ని ధరించిన తరువాత తన చిహ్నమైన కపి ధ్వజాన్ని రథంపై ఎగురవేసేవాడు. అర్జునుని ధ్వజంపైన భగవాన్ హనుమంతుని చిత్రం ముద్రించి ఉండేది.
మొగలులకు వ్యతిరేకంగా భగవాధ్వజం :
మహారాణా ప్రతాప్ హల్దీ ఘాటీ యుద్ధములో ఈ భగవాధ్వజాన్ని ఉపయోగించాడు. 17 వ శతాబ్దములో బికనీర్ రాజ్యం రాజపతాకం కూడా కాషాయం, ఎరుపు రంగులో ఉండేది. దానిపైన గ్రద్ద ఆకారం ముద్రించి ఉంది. ఈ గ్రద్ద దేవీ దుర్గామాతకు ప్రతీక. జోద్ పూర్ రాజ్యం ధ్వజం ఐదు రంగులు కలిసి ఉండేదట. దీనిలో కాషాయం, గులాబీ, తెలుపు, ఎరుపు , పసుపు రంగులు ఉండేవి. నాగపూర్ బోంస్లే రాజులు కూడా ఈ భగవాధ్వజాన్ని ఉపయోగించారు. మహారాజు ఛత్రపతి శివాజీ కూడా ఈ భగవాధ్వాజాన్ని ఉపయోగించాడు. అలాగే ఝాన్సీ మహారాణీ లక్ష్మీబాయీ కూడా యుద్ధంలో ఈ భగవాధ్వజాన్ని ఉపయోగించింది.
బ్రిటిష్ కాలంతో భారతదేశంలో భగవాధ్వజం :
మిస్ మైక్లియోడ్ గారికి సోదరి నివేదిత 5 ఫిబ్రవరి 1905 రోజున ఒక ఉత్తరం ఇలా వ్రాసింది “మేము జాతీయ జెండాకు రూపకల్పన చేయవలసి ఉంది. దానిపైన ఓ వజ్రాయుధ ముద్ర ఉండాలి. కాని ఒక జెండా తయారు చేసాము. మా అజ్ఞానం వలన చైనా దేశపు జెండాను ఆదర్శముగా చేసికొని నల్లని రంగును ఎన్నుకొన్నాము. నల్లని రంగును భారత దేశములో ఇష్టపడరు. కావున తర్వాత తయారు చేసే జెండాలో సిందూరపు , పచ్చని రంగు ఉంటుంది”. (ప్రవాజ్యుల ఆత్మప్రాణము – సోదరి నివేదిత, రామకృష్ణ వివేకానందులు-1961, పేజీ 189)
1905లో సోదరి నివేదిత ఇంద్రుని మజ్రాయుధమున్న ఒక ధ్వజాన్ని తయారు చేసింది. దీని రంగు ఎరుపు, పచ్చ రంగు కలిగి ఉంది. 1906లో కలకత్తా నగరంలో కాంగ్రేస్ పార్టీ మహాసభలలో సోదరి నివేదిత తయారుచేసిన జెండాను ప్రదర్శించారు. ఆ మహాసభలకు దాదాబాయీ నౌరోజీ అధ్యక్షత వహించారు. సోదరి నివేదిత తయారు చేసిన జెండా చతురస్రాకారంగా ఉండి ఎరుపురంగుతో నిండి ఉంది. దాని చుట్టు 108 జ్యోతులున్నాయి. పచ్చని రంగులో వజ్రాయుధము, కుడివైపు ‘వందే’ అని ఎడమ వైపు ‘మాతరం ‘అని ముద్రించబడి ఉంది.
భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా భగవాధ్వజాన్ని ఉపయోగించుట :
జాతీయ జెండా మితి 1931లో తన రిపోర్టు ఇచ్చింది. 2 ఏప్రిల్ 1931లో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు కరాచీలో జరిగాయి. దానిలో ఓ ప్రస్తావన చేసారు. ఏడుగురు సభ్యుల సమితి సిద్ధముగానున్న జెండా పైన ఉత్పన్నమవుతున్న సమస్యలకు జవాబు వెతుకుతూనే కాంగ్రెస్ పక్షాన ప్రస్తావించబడిన కొత్త జెండా పైన తమ అభిప్రాయాలను తెలిపే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించారు. అన్ని రుజువులతో 31 జులై 1931 వరకు రిపోర్టు ఇవ్వాలని కమిటీకి అధికారాలను అప్పగించారు. ఆ సమితిలోని సభ్యులు 1.సర్దార్ వల్లబ్బాయి పటేల్, 2.మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్, 3.మాస్టర్ తారా సింహ్, 4. పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, 5.ఆచార్య డి.బి.కాలేల్కర్, 6.డాక్టర్ ఎన్.ఎస్.హార్దికర్, 7.డాక్టర్ బి,పట్టాభి సీతరామయ్య, (సమన్వయ కర్త)
దీని తర్వాత వెంటనే సమితి ద్వారా కింద తెలిపిన ప్రశ్నలు తయారు చేసింది. వీటిని అన్ని ప్రాంతాలకు పంపిణి చేసారు.
1. మీ ప్రాంత ప్రజల సమూహము లేక సముదాయము దగ్గర జాతీయజెండా రూపకల్పన గూర్చి ఏమైనా సమాచారం ఉందా? ఉన్నచో మీ అభిప్రాయాలను సమితి దృష్టికి తీసుకురండి.
2. జెండాను ప్రజామోదం చేయడానికి మీ దగ్గర ఏమైనా సలహాలు, సూచనలున్నవా?
3. ప్రస్తుతమున్న జెండా రూపంలో ఏమైనా అనుచితమైనవి గానీ లేక లోటుపాట్లు గానీ కనిపిస్తే వాటిపట్ల శ్రద్ధ కనబర్చగలరని కోరుతున్నాము.
రిపోర్టు సారము :
జాతీయ జెండాకు ఏ రంగు ఉపయుక్తముగా ఉంటుందో సమితి నిర్ణయం చేయవలసి ఉంటుంది. మన ఆలోచనా ఏమిటనగా జెండా గొప్పగా, కళాత్మకముగా. నియమాలు కలిగి, సాంప్రదాయకముగా ఉండాలి. అందరి ఏకాభిప్రాయము ఏమనగా మన జాతీయజెండా ఒకే రంగు కలిగి ఉండాలి. ఒకవేళ ఒకే రంగైతే ఎక్కువ మంది భారతీయులు స్వీకరించేదై ఉండాలి.అది ప్రాచీన సనాతన పరంపరతో మిళితమై ఉండాలి. అది కేసరి లేదా కాషాయం రంగు మాత్రమే అవుతుంది. జెండా రంగు కాషాయమే ఉండాలని అనుభవపూరకంగా చెప్పారు. జెండాతో బాటు లోపలి యంత్రము రంగు ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. దీనికోసం సర్వసమ్మతితో చెరఖా(రాట్నము)ను ప్రస్తావించారు. దీనికి బదులుగా ఇతర యంత్రాలైన నాగలి, కమలంపువ్వు, మొదలైన వాటిపైన చర్చ జరిగింది. కాని రాట్నానికే అంతిమ ముద్ర వేశారు. ఎందుకనగా వాస్తవానికి స్వాతంత్ర పోరాట సమయంలో రాట్నమే మహత్వపూర్ణమైన ఆయుధమైంది. దీని స్థానాన్ని మరే ఇతర యంత్రము తీసుకోలేదు. మనమిప్పుడు రాట్నము రంగును నిర్ణయించాలి. మొత్తానికి సమితి రాట్నము రంగు నీలిరంగులో ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందుచేత మనం జాతీయజెండా కేసరి రంగులో ఉండాలని కోరుకొంటాము. అలాగే దానికి ఎడమ వైపు, రాట్నము పై అంచు వరకు నీలిరంగు ఉండాలి. ఝండాను ఎగురవేయడానికి పొడవు వెడల్పుల నిష్పత్తి 3*2లో ఉండాలి.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘము – భగవాధ్వజము :
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం, స్వయంసేవకులు ఏ వ్యక్తిని గాని లేదా ఏ గ్రంథాన్ని గాని కాకుండా భగవాధ్వజాన్ని మాత్రమే తమ మార్గదర్శకుడిగా గురువుగా గౌరవిస్తారు. ఎప్పుడైతే డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రవచించారో అప్పుడే చాలామంది స్వయంసేవకులు సంఘాన్ని స్థాపించినందుకు డాక్టర్జీనే సంఘటన గురువుగా ఉంటారని ఊహించారు. ఎందుకనగా వారందరికి డాక్టర్ హెడ్గేవార్ వ్యక్తిత్వము అత్యంత ఆదరణీయము, ప్రేరణదాయకము కూడా. ఇది ఒత్తిడిగల కోరికే అయినప్పటికి డాక్టర్ హెడ్గేవార్ హిందూ సంస్కృతి, జ్ఞానము, త్యాగము, సన్యాసానికి ప్రతీక అయిన భగవాధ్వజాన్ని(కాషాయపు ధ్వజం) గురువు రూపములో ప్రతిష్ఠించడానికి నిర్ణయించారు. హిందూ పంచాంగము ప్రకారము ప్రతి సంవత్సరము వ్యాసపూర్ణిమ (గురు పూర్ణిమ) రోజున సంఘస్థానములో ఒకచోట చేరి స్వయంసేవకులందరు భగవాధ్వజానికి నియమపూర్వకంగా పూజచేస్తారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రతి సంవత్సరము నిర్వహించాలని యోజన చేసిన ఆరు ఉత్సవాలలో గురుపూజా ఎన్ని విధాలుగా చూసినా మహత్వపూర్ణమైనదే.
సంఘము స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత 1928 లో గురుపూజా యోజన చేసారు. అప్పటినుండి ఈ పరంపర నిర్విఘ్నంగా నడుస్తున్నది. భగవాధ్వజము స్థానము సంఘములో సర్వోన్నతము చేయబడింది. ధ్వజప్రతిష్ఠ సర్ సంఘచాలక్ (సంఘ ప్రముఖ్) కంటే ఉన్నతమైనది.
కాషాయపు జెండాకు అంత ఉన్నతమైన స్థానమెందుకిచ్చారు? ఈ ప్రశ్న చాలామంది మనసుల్లో మొదట ఉత్పన్నమవుతుంది. భారతదేశము ఇతర దేశాలలో ఇలాంటి ధార్మిక, ఆధ్యాత్మిక ఏకీకరణలు ఎన్నో జరిగాయి. వాటన్నింటిలో స్థాపకున్నే గురువుగా భావించి, అతనిని పూజించే పరంపర కొనసాగింది. భక్తి ఉద్యమములో ఈనాటికి కూడా ఏ వ్యక్తినైనను గురువుగా స్వీకరించడములో ఎలాంటి అడ్డంకులు లేవు. ఇలాంటి ప్రాచుర్యములో ఉన్న ఆనవాయితీని కాదని డాక్టర్ హెడ్గేవార్ తన స్థానములో భగవాధ్వజాన్ని గురువుగా గౌరవించాలని చేసిన ఆలోచన ప్రపంచములోని సమకాలీన చరిత్రలోనే అద్భుతమైనది, మొదటిది కూడా. ఏ సంఘటన అయితే విశ్వములోనే అన్నిటికన్న ఉన్నతమైన స్వయంసేవకుల సంఘటనగా తయారైందో దాని సర్వోన్నతమైన పదవి ఒక ధ్వజానికి లభించడం ఆలోచించవలసిన విషయం. సంఘము గొప్ప నాయకులందరు ఈ విషయము మీద ధ్వజం గొప్పతనాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నించేవారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం పరిశీలకుడు హెచ్.వీ.శేశాద్రి ప్రకారము ” భగవాధ్వజము శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతి పరంపరలో శ్రద్ధాపూర్వకమైన ప్రతీకగా ఉంది. ఎప్పుడైతే డాక్టర్ హెడ్గేవార్ సంఘాన్ని ప్రారంభించాడో అప్పటినుండి ఆయన ఈ ధ్వజాన్ని స్వయం సేవకుల ముందు సమస్త జాతీయ ఆదర్శాల కంటే ఉన్నతమైన ప్రతీకగా చెప్పినాడు. ఆ తర్వాత వ్యాసపూర్ణిమ రోజు ధ్వజాన్ని గురువు రూపంలో పూజించే పరంపరను ఆరంభించాడు “.
అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ (ABVP), భారతీయ మజ్దూర్ సంఘ్(BMS), వనవాసీ కళ్యాణాశ్రమం (VKA), భారతీయ కిసాన్ సంఘ్ (BKS), విశ్వహిందూ పరిషద్(VHP) లాంటి ఎన్నో సంస్థలు ఈ భగవాధ్వజాన్ని స్వీకరించాయి. ఈ విధంగా దేశమంతటా సంఘశాఖలన్నింటిలో ప్రత్యేకాకారం కలిగిన భగవాధ్వజాన్ని ప్రతిదినము ఎగురవేస్తుంటారు. సంఘము ద్వారా ప్రేరణ పొందిన ఎన్నో సంస్థలు తమ సార్వజనిక ఉత్సవాలలో కాషాయపు జెండాను ఎగరవేయడం చాలా ధశాబ్దాలనుండి వస్తున్నది. ఈ కాషాయపు రంగు జాతీయ ప్రతీక రూపములో భారత దేశంలోని కోట్లాదిమంది మనస్సుల్లో విశిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకొంది.
శేశాద్రి గారు ఈ విషయములో చర్చిస్తూ రాష్ట్రీయ స్వయం సేవకసంఘం కార్మికుల మధ్య పని చేస్తూ కాషాయధ్వజం నాయకత్వం పైన జనసమ్మతిని తెలుపుట ఎంతో కొనియాడదగినది. ఎందుకనగా ఈ కార్మిక క్షేత్రములో దీర్ఘకాలము ప్రపంచమంతటా సామ్యవాద ఆందోళన దాని ఎర్రజెండా ప్రభావం చాలా ఉంది. భారతీయ మజ్దూర్ సంఘ్ తమ కార్మికుల చేత విశ్వ కళ్యాణానికి ప్రతీక అయిన కాషాయధ్వజాన్ని స్వీకరించేలా చేసింది. ఎన్నో సంవత్సరాల సంఘర్షణ తరువాత శ్రామిక ఐక్యతకోసం భారతీయ మజ్దూర్ సంఘ్ తమ విభిన్న కార్యక్రమాలతో కాషాయధ్వజాన్ని గొప్పగా ఎగరవేసే స్థాయికి చేరుకొంది. ఎప్పుడైతే 1981 మార్చిలో భారతీయ మజ్దూర్ సంఘ్ తమ ఆరవ జాతీయ మహాసభలను సామ్యవాదపు ప్రభావమున్న కలకత్తా నగరపు వీధులకుండా పెద్ద ఊరేగింపు నిర్వహించిందో, అప్పుడే ఎర్రజండా పట్టిన వేలమంది కార్మికుల చేతులలో కాషాయపు జెండా చూసి పుర ప్రజలు ఆశ్చర్యచకితులైయ్యారు. కలకత్తా నగరపు ప్రముఖ పత్రికలన్నీ ఆ సమయములో కార్మికులలో వచ్చిన ఈ కొత్త కాషాయపు అనుభూతిని కొనియాడినవి.
సంఘ మహారాష్ట్ర ప్రాంతపు కార్యవాహ (కార్యదర్శి) ఎన్.హెచ్.పాల్కర్ గారు భగవాధ్వజం పైన ఒక మనసును రంజింపచేసే పుస్తకం వ్రాసారు. మరాఠీ భాషలో వ్రాసిన ఈ పుస్తకం 1958లో ముద్రణ అయింది. తరువాత ఇది హిందీలోకి అనువాదం అయింది. 76పేజీల ఈ పుస్తకం ప్రకారం సనాతన ధర్మములో వైదికకాలంనుండి భగవాధ్వజం ఎగురవేసే ఆచారం ఉంది. పాల్కర్ ప్రకారం “వైదిక సాహిత్యములో వర్ణింపబడిన” అరుణకేతువు “అనే కాషాయపు జెండా హిందూ జీవనశైలిలో ఎల్లప్పుడు ప్రతిష్ఠాత్మకమైన స్థితిని పొందింది. ఈ ధ్వజము హిందువులను అన్ని కాలాలలో విదేశీ ఆక్రమణల నుండి పోరాడుటకు, విజయము పొందుటకు ప్రేరణ ఇస్తూ వచ్చింది. ఇది హిందువులలో జాతీయతను రక్షించడానికి ,పోరాటపటిమను జాగృతము చేయడానికి చక్కగా ఉపయోగపడుతూ వస్తుంది.” పాల్కర్ గారు భగవాధ్వజానికి జాతీయచరిత్రను సిద్ధింపచేయుటకు ఎన్నో చారిత్రక సంఘటనలను ఉల్లేఖించారు. వాటిలో కొన్ని ఘటనలు ఈవిధంగా ఉన్నవి.
సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ హిందూధర్మాన్ని రక్షించడానికి వేలమంది సిక్కు వీరుల సేనకు నేతృత్వము వహించాడు. అప్పుడు ఆయన కాషాయపు ధ్వజాన్నే ఉపయోగించాడు. ఈ ధ్వజం హిందువులలో కలిగిన పునఃజాగరణకు ప్రతీక. ఈ జెండా ప్రేరణతో మహారాణా రంజిత్ సింగ్ పరిపాలనాకాలములో సిక్కు సైనికులు అఫ్ఘనిస్తాన్ రాజ్యము కాబూల్ వరకు విజయం సాధించారు. ఆ సమయంలో సేనాపతి హరిసింహ్ నల్వా సైనికులకు నేతృత్వము వహించాడు.
పాల్కర్ ఇంకా ఈ విధంగా వ్రాసాడు. ఎప్పుడైతే రాజస్థాన్ పైన మొగలుల ఆక్రమణ జరిగిందో అప్పుడు రాణా సంగ్రామ్ సింహ్ మహారాణా ప్రతాప్ నాయకత్వములో విదేశీఆక్రమణదారులను ఆపుటకు రాజపుత్రవీరులు భగవాధ్వజము ప్రేరణ తీసికొని చారిత్రక యుధ్ధమే చేసారు. ఛత్రపతి శివాజీ వారి మిత్రులు కూడా మొగల్ రాజుల పరిపాలన నుండి విముక్తి పొంది హిందూ రాజ్య స్థాపన చేయుటకు భగవాధ్వజం నీడలోనే నిర్ణయాత్మకమైన యుద్ధాలను చేసారు.
పాల్కర్ గారు మొగల్ ఆక్రమణదారుల దాడులను విఫలము చేయుటకు దక్షిణ భారతదేశములో విజయనగరరాజుల సేన చేసిన ప్రతిఘటనలో భగవాధ్వజం నేర్పిన శౌర్యము బలిదానాల ప్రేరణను కూడ ఉల్లేఖించారు. మధ్యకాలంలో ప్రసిద్ధి పొందిన భక్తి ఉద్యమంలో గాని, హిందూధర్మంలోని లోటుపాట్లను సరిచేసి పునః జాగృతం చేయడంలో గాని, భగవాధ్వజం లేదా సాధువులు ధరించే కాషాయపు రంగే ప్రధానమైన భూమిక పోషించింది. భారతదేశపు అనేక మఠాలపైన, మందిరాలపైన భగవాధ్వజాన్ని శౌర్యానికి, త్యాగానికి ప్రతీకగా భావించి ఎగురవేస్తారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామంలో ఈ కాషాయపు జెండా ఛాయలోనే విప్లవకారులు ఏకత్రితమైయ్యారు. పాల్కర్ గారు పుస్తకము ముగింపులో “భగవాధ్వజం సంపూర్ణ చరిత్రను అధ్యయనం చేయగా స్పష్టమైన విషయమేమనగా హిందూ సమాజాన్ని వేరుచేయడం సాధ్యము కాదని, ఈ ధ్వజము హిందూ సమాజానికి, హిందూ రాజ్యానికి సహజసిద్ధమైన ప్రతీక”. అని వ్రాసారు.
సంఘశాఖల్లోగాని, శిక్షణా శిబిరాలలో గాని భగవాధ్వజం గొప్పతనం పై ఉపన్యాసం ఇచ్చే సమయంలో పాల్కర్ గారు తన పుస్తకములో ఉల్లేఖించిన ముఖ్యవిషయాలనే స్వయం సేవకులకు చెప్పుతారు. రచయిత సంక్షిప్తంగా హిందూ దేశము, హిందూ సమాజము, హిందూ సంస్కృతి, హిందూ జీవన విధానము, హిందూ దర్శనము మొదలైన వాటిలో కూడా భగవాధ్వజం పెనవేసుకున్నట్లు చూసారు. ఈ ధ్వజం త్యాగము, బలిదానము, శౌర్యము, దేశభక్తి, మొదలైన వాటికి ఎల్లప్పుడు ప్రేరణ ఇస్తుంది. ఈ ధ్వజము హిందూ సమాజపు నిరంతర సంఘర్షణకు, విజయలక్ష్మీలకు సాక్షీగా ఉంది.
హిందూ సంస్కృతి, హిందూ దేశము అనే భావాన్ని భగవాధ్వజం లేకుండా హిందూ ధర్మాన్ని ఊహించ లేము. (ధర్మ శబ్దము హిందూ పండితుల ప్రకారము నిర్వచించబడింది. ధర్మమనగా జీవన విధానము. ఇది ఆచారవ్యవహారాలు,కర్మకాండల వరకే పరిమితం కాదు). సంస్కృతి దేశము జీవన విధానము. హిందూ సంస్కృతి మన దేశపు జీవన విధానము. భగవాధ్వజమే హిందూ సంస్కృతి ప్రతీక. పాల్కర్ ఇచ్చిన సాక్ష్యాలు అత్యంత మహత్వపూర్ణమైనవి. భగవాధ్వజానికి శాసనపరమైన గౌరవమిచ్చారా లేదా అనేదానిపై ఆధారపడి ఉండదు. ఈ కారణంగానే ఇప్పుడు కూడ సామాజిక, రాజకీయ ఏకీకరణ జరిగినప్పుడు గాని, జాతి ఉపజాతులకు కూడా భగవాధ్వజం ఆదరణీయమైనది.
ఇది హిందూ సమాజపు ఆకాంక్షలకు ప్రతీక. దానిలో ఆ ఆకాంక్షలను సాకారం చేయడానికి సమాజాన్ని ప్రేరితము చేసే శక్తి కూడ ఉంది. ఈ శక్తి మనకు కనిపించనప్పటికి సంఘటితమై హిందూ సమాజంలో ఆ శక్తిని తప్పకుండా మనం చూడగలం.
భగవాధ్వజాన్ని గురువు రూపములో ప్రతిష్ఠించడం వెనక సంఘం దార్శనికత ఏమనగా ఏ వ్యక్తినైనా గురువుగా ప్రకటించినప్పుడు ముందే ఆయనలో కొన్ని బలహీనతలుండి ఉండవచ్చు లేదా కాలాంతరములో ఆయనలోని సద్గుణాలు తగ్గిపోవచ్చు. కాని ధ్వజం మాత్రం నిర్ధిష్టముగా శ్రేష్ఠగుణాలను అందిస్తుంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముఖ్యముగా మూడు కారణాలచేత భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించింది.
1. ధ్వజంతో బాటు చరిత్ర కూడ జోడింపబడిఉంది.ఈ చరిత్ర ఎవరినైనా ఏకం చేసి వికసింపచేయుటకు సహాయపడుతుంది.
2. భగవాధ్వజంలో సంఘ స్థాపనకు మూలాధారమైన సాంస్కృతిక జాతీయవాదపు ఆలోచనా ధార ఎక్కువగా ప్రతిబింబిస్తుంది.
3. వ్యక్తి స్థానంలో సాంస్కృతిక జాతీయవాదానికి ప్రతీక అయిన భగవాధ్వజానికి సర్వోన్నత స్థానమిచ్చారు.
ఎందుకనగా సంఘము సఫలము కావాలంటే వ్యక్తి కేంద్రిత సంగఠన జరగకూడదు.ఈ ఆలోచన చాలా సఫలమైంది. ఫలితంగా గత 95 సంవత్సరాల సంఘ జీవనకాలంలో విభిన్న క్షేత్రాలలో సంఘటన చాలా విస్తరించింది. సంఘములో సర్వోన్నత పదవి తీసికొన్నను ఎలాంటి వివాదాలు రాలేదు. ఇలాంటి సంఘటనలో భావిఅధికారపు అగ్రనాయకత్వము కొరకు ఎలాంటి పోటీలు లేకపోవడం ఆశ్చర్యజనకము. చాలా పరిమితులను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ హెడ్గేవార్ భగవాధ్వజాన్ని గురువుగా స్వీకరించాలని నిర్ణయించారు.
సంఘ సర్వోన్నత అధికారి (సర్ సంఘచాలక్) నుండి మొదలుకొని స్వయం సేవకులందరు భగవాధ్వజానికి సాదరపూర్వకంగా నమస్కరిస్తారు. సంఘము అనేక శాఖలలో సంవత్సరమంతా ప్రతిదినమూ ఎగరవేసే భగవాధ్వజం ధశాబ్దాలనుండి సాంస్కృతిక జాతీయవాదానికి ప్రేరణ ఇస్తుంది.ఈ కారణంగానే సంఘ స్వయంసేవకులు లోతైన ఆలోచనాధారను కలిగి ఉంటారు.
సేకరణ: రత్నలక్ష్మీనారాయణ రెడ్డి