నేడు మాధవ సదాశివ గోళ్వాల్కార్ (గురూజీ) జయంతి..
నేను, దేశం కోరేది యువతీ యువకులను మాత్రమే అని యువతకు పిలుపు ఇచ్చింది శ్రీ మాధవ సదాశివ గోళ్వాల్కర్. దేశంకోసం దేహాన్ని కూడా పట్టించుకోకుండా అనుపమానమైన వ్యక్తిత్వంతో జాతికి జాగృతి గీతం పాడిన మహామనస్వి, యశస్వి, జాతికోసం అహరహం తపించిన తపస్వి శ్రీ గురూజీ 1906 నాగపూర్‌లో జన్మించారు.
కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో 1930లో ఆచార్యునిగా వృత్తిని ప్రారంభించిన గోళ్వాల్కర్ విద్వత్తును ఆదర్శపూర్ణమైన ఆత్మీయతను, నిరాడంబరత్వ జీవితాన్ని చూడగలిగిన విద్యార్థులు వారిని ‘గురూజీ’అని సంబోధించేవారు. అదే పిలుపు ఆయనకు నేటికీ నిలిచింది. వారు లబ్ధప్రతిష్టులు. 1940లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పరమపదించారు. వారి ఆదేశంతో, స్వయంప్రేరణతో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ చాలక్ బాధ్యతలను 35వ ఏటనే చేపట్టారు. నాటినుంచి 33 సంవత్సరాలపాటు జాతి పునర్నిర్మాణ యజ్ఞంలో జీవిత పర్యంతం తనను తాను సమర్పించుకున్నారు.
జాతీయ చైతన్యం, అనుశాసనం సమర్పణాభావంతో దినదినాభివృద్ధి చెందుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పట్ల కాంగ్రెస్ పార్టీకి కక్షగా ఉండేది. అందుకే 1947లో మీరట్ సభలో ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. ఈ దశలోనే మహాత్మాగాంధీ హత్య జరిగింది. దీనిని సాకుగా తీసుకుని ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించింది. గురూజీని, కార్యకర్తలను అరెస్టు చేయించింది. వాస్తవానికి అప్పటికి ఆర్‌ఎస్‌ఎస్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలిస్తే ప్రభుత్వంపై ఎంతైనా తిరగబడి వుండేది. కాని గురూజీ జాతికోసం ప్రతి స్వయంసేవకుడు బాధలు పడినా పర్వాలేదు. జాతి బాధపడకూడదు అన్న సందేశంతో శాంతింపజేశారు. ఆ విధంగా గురూజీ అహింసామూర్తియై అహింసావ్రత శక్తిని నిరూపించారు. కడకు ప్రభుత్వం దిగివచ్చి 1949 మే 19వ తేదీన ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధాన్ని తొలగించి శ్రీ గురూజీని, స్వయం సేవకులను విడిచిపెట్టింది. ద్విగుణీకృత శక్తితో విడుదలైన తరువాత గురూజీ దేశమంతటా పర్యటించారు. ఉపన్యాస శక్తితో కార్యకర్తలను సమీకరించగలిగారు. నెహ్రూ తర్వాత అంతటి స్థాయిలో ప్రజలను ఆకర్షించగల నాయకుడు గురూజీ అని నాడు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వ్రాసింది. ఒక పక్క సంఘానికి ప్రభుత్వం ద్రోహంచేసినా జాతికోసం అన్యాయాన్ని కడుపులో దాచుకొన్న గురూజీ జాతికి ద్రోహం జరుగుతూ ఉంటే మాత్రం సహించలేకపోయారు. అంతటి గంభీర వ్యక్తిత్వం ఆయనది. మన దేశ భూభాగాలను కబళించడానికి చైనా దుష్టసంకల్పంతో ఉన్నదని 1950లోనే హెచ్చరించిన మహాద్రష్ట గురూజీ, నాటి ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితమే 1962లో చైనా దురాక్రమణ. అప్పటికి గాని ఏలినవారికి గురూజీ హెచ్చరికలు గుర్తుకురాలేదు సరికదా చైనా ఆక్రమించిన భూభాగంపై గడ్డి పోచ కూడా మొలవదు అని నెహ్రూ అన్నారు. మాతృదేశాన్ని మట్టిగడ్డగా భావిస్తూ అంత చులకనగా చూడడాన్ని సహించలేకపోయిన గురూజీ జాతి ఏ జన్మలో చేసుకున్న పాపం ఫలితంగా తప్ప ఇటువంటి నాయకత్వం మనకు లభించదు అని ఆక్రోశించారు.
పాకిస్తాన్ భారత భూభాగంపై దాడికి పాల్పడినప్పుడు నాటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్ర్తీ గురూజీని పిలిపించుకుని ఆయనతో చర్చించారు. అప్పుడు గురూజీ లక్షలాది స్వయం సేవకులను జాగృతపరచి భారత వీర జవానులకు ఆత్మస్థయిర్యాన్ని ఇచ్చారు. నేడు దేశంలో ఒక విచిత్రమైన స్థితి ఉంది. సత్యము భావాత్మకమైన హిందూ రాష్ట్రీయతను ఒక మత తత్వంగా ప్రతిక్రియాత్మకంగా, సంకుచితంగా భావించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిలో రాజకీయ మేధావులు ఉన్నారు. భారతీయ జీవనం అత్యంత ప్రాచీనమైనదనీ, మనకొక సమగ్ర జీవనతత్వం కలదనీ, దానినుంచి సమానధర్మాలు గల ఒక సాంస్కృతిక వారసత్వం ఉద్భవించిందని వీరు అనుకోరు. ఏ మతానికి చెందినా ఈ దేశంలో ఉన్నవారు సువిశాల పుణ్యభూమిలో తాదాత్మ్యం చెందాలనీ దేశ సేవకు అంకితంకావాలని గురూజీ పిలుపునిచ్చారు.
రుషి తుల్యుడు, మహామనస్వి గురూజీ 1973 జూన్ అయిదవ తేదీన పరమపదించారు. మాతృదేశాన్ని అరవిందునిలో ఆదిశక్తిగా, జగజ్జననిగా పూజించారు. స్వామి వివేకానందుడి వలే జాతికి వైతాళికుడైనారు. జాతికోసం జన్మాంతం కృషిచేసిన ధన్యజీవి గురూజీ!
ఆంద్రభూమి సౌజన్యంతో…..