అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ నేడు లోక్ సభలో ప్రకటించారు. మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ పేరు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అని సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రధాని వెల్లడించారు.
నేడు లోక్ సభ శూన్య గంటకు ముందే ప్రసంగించిన ప్రధాని ఈ ప్రకటన చేశారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం రామమందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేశామని, అలాగే కోర్ట్ ఆదేశాల మేరకు అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం విడిగా 5 ఎకరాల భూమిని కేటాయించడానికి ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిందని కూడా ఆయన వెల్లడించారు. ఈ భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్ కు అప్పగించడం జరుగుతుందని అన్నారు. రామజన్మభూమిగా పరిగణిస్తున్న 67.703 ఎకరాల భూమిని ప్రభుత్వం నిర్మాణ ట్రస్ట్ కు అప్పగిస్తుందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో మందిర నిర్మాణం పూర్తవుతుందని ప్రధాని ప్రకటించారు. అయోధ్య విషయమై 2019 నవంబర్ 9న తీర్పు వెలువడినప్పుడు చాలా ఆనందించానని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
మందిర నిర్మాణం కోసం వెంటనే ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానపు ఆదేశాలను అనుసరించి నేడు సమావేశమైన కేబినెట్ శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
అయోధ్య విషయమై సర్వోన్నత న్యాయస్థానపు తీర్పును హుందాగా స్వీకరించిన దేశ ప్రజలందరికీ ప్రధాని ఈ సందర్భంగా మరోసారి ధన్యవాదాలు తెలిపారు. మతపరమైన తేడాలు లేకుండా మనమంతా ఒక కుటుంబ సభ్యులమని, ఈ ధోరణిలోనే ప్రభుత్వం కూడా `సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ అనే సూత్రంతో పనిచేస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. ట్రస్ట్ ఏర్పాటును కూడా అంతా ఆమోదిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.