హనుమాన్ మందిరం కూడలిలో తన ఇద్దరు చిన్నారి తమ్ముడు, చెల్లెలు తో ఈ చలిరాత్రి లో కూడా, తీసుకువెళ్లడానికి ఎవరూ రాకపోయిఉంటే, రేఖ కనీసం కంబళి కూడా లేకుండా వణుకుతూ ఖాళీకడుపుతో రోజులు గడిపేస్తూ ఉండేది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా లోని కిన్వట్ దగ్గర ఒక చిన్న గ్రామం పాటో దా. అక్కడ రేఖ తన తల్లిదండ్రులతో ఉంటూ ఉండేది. పార్ధీ తెగకు చెందిన ఈ కుటుంబం వాళ్ళకి దొంగతనాలు ప్రధాన వృత్తి. దోపిడీలు, లూటీ వారికి చాలా సహజం. పార్దీ లు మాత్రమే కాదు, డో బరీలు, కోల్ హటీ లు, గొందీ ఇలా మహారాష్ట్రలో ఈ తెగలకు చెందిన వారిని సమాజంలో నేరస్థులుగానే పరిగణిస్తారు. అందువల్లనే రేఖ తల్లిదండ్రులు చనిపోయాక వీరిని చేరదీయడానికి ఎవరు ముందుకురాలేదు. కనీసం సమాజం కూడా వీరికి ఏ విధమైన సహాయం చేయడానికి సిద్ధపడలేదు. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. ఒకసారి రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో రేఖ చాంపియన్ గా నిలిచింది. ఫోర్టిజ్ హాస్పిటల్ లో ఉద్యోగం చేస్తున్నది. తన చిన్న తమ్ముడు అర్జున్, పదవతరగతి 85 శాతం మార్కులతో పాసయ్యాడు.
రేఖ, అర్జున్ లాగా 350 మంది పిల్లలు ‘భటకే విముక్త్ వికాస్ పరిషత్ ‘ వారి పాఠశాలలో చదువుకుంటూ, చదువుకుంటూ, ఆటపాటలు, నటన వంటి ఇతర రంగాలలో చాలా రాణిస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా పరిషత్ కార్యకర్తలు ఈ బంజారా జాతుల పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ తో పని చేస్తున్నారు.
సంఘ జ్యేష్ట కార్యకర్త, పూర్వ ప్రచారకులు అయిన గిరీష్ ప్రభునే వ్యయ ప్రయాసలతో ఆగస్టు 23 1993లో నిర్మించిన ఒక గుడిసెలో, 6 గురు పిల్లలతో ఈ వసతి గృహం ప్రారంభమయింది. ప్రజల సహకారంతో పాటు మహదేవ్ గైక్వాడ్, చంద్రకాంత్ గడేకర్,రావు సాహెబ్ కులకర్ణి వంటి కార్యకర్తల శ్రమ ఫలితంగా, ఈ రోజున సంస్థ ఒక పెద్ద వసతి గృహంతోపాటు ఒక చక్కని పాఠశాల నిర్వహిస్తోంది. ఇక్కడ పిల్లలకు చదువుతో పాటు, వృత్తిపరమైన శిక్షణ ఇస్తున్నారు.
మహారాష్ట్ర లోని ఉస్మానబాద్ జిల్లా, తుల్జాపుర్ తాలూకా లో ఉన్న యమగార్ వాడి పేరు దేశం మొత్తంలో ఈ ప్రత్యేక సేవా కార్యక్రమం ద్వారా అందరికీ తెలిసింది. నేరస్తులుగా పరిగణించబడే ఈ పిల్లలకు అండగా సంఘ కార్యకర్తలు నిలిచారు. ఈ ప్రాంతాల్లో హత్యలు, దోపిడీలు వంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు ముందుగా ఈ పార్ధీ, కొలీ సమాజం వాళ్ళని అనుమానించి తీసుకు వెళ్ళేవారు. ఈ రోజున ఇక్కడ 8 కుటుంబాలలో ఉన్న 32 మంది అమ్మాయిలు వివిధ ఆస్పత్రులలో నర్సులుగా పనిచేస్తున్నారు.
పరమేశ్వర్ కాలే , ఇతని తల్లిదండ్రులు కూడా ఇదే పార్ధీ తెగకు చెందిన వారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉన్నచోటునుంచి మారి పోతూ ఉండేవారు. అయితే వాళ్లు ఈ హాస్టల్ కి రాకపోయి ఉంటే చదువు సంగతి అలా ఉంచి, కనీసం ఏ పాఠశాలలోనూ అడుగు పెట్టగలిగే వారే కాదు. కానీ ఈ రోజున వాళ్లు వాళ్ల సమాజంలోని పిల్లలందరూ బాగా చదువుకునేలా, ప్రోత్సహిస్తూ ఈ సంస్థ తరఫున పని చేస్తున్నారు. అయితే ఇదంతా అంత తేలికగా జరగలేదు. రావ్ సాహెబ్ గారి అభిప్రాయంలో అయితే ఇక్కడికి వచ్చే పిల్లలు సంస్కారాలు క్రమశిక్షణ అటుంచి కనీసం రోజు బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు. మాంసాహారం లేకుండా అసలు అన్నం తినడం అనేది వాళ్లకి ఇష్టం ఉండేది కాదు. ఏ కాస్త అవకాశం దొరికినా పారిపోతూ ఉండేవారు. రోజంతా మేకలను తీసుకుని అడవిలో తిరగడం, ఉండేలు తీసుకుని పావురాలను కొట్టి చంపడం చేసే ఆ పిల్లలకు వ్యాయామాలు, యోగ మంత్రాలు నేర్పటం చాలా కష్టంగా ఉండేది. ఈ రోజున వాళ్ళ కోసం ఒక ప్రత్యేక ఏకలవ్య వ్యాయామశాల ఏర్పాటైంది. అక్కడ అందరూ ప్రతి రోజు వ్యాయామం చేస్తున్నారు. ఒక పెద్ద గ్రంధాలయం కూడా ఉన్నది. అక్కడ బ్యాంకు, రైల్వే ఇంకా ఎన్నో పోటీ పరీక్షలకి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయి. వారివారి ఆసక్తులు ప్రకారం పిల్లలు ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి విద్యలలో శిక్షణ పొందుతారు. ఇక్కడ చదువుకునే పిల్లలు తయారుచేసే విజ్ఞాన శాస్త్రం నమూనాలు ప్రతి సంవత్సరం ప్రదర్శనలలో మొదటి బహుమతి పొందుతూ ఉంటాయి.