Home Telugu Articles శ్రీ రామానుజాచార్యులు జీవన చిత్రం

శ్రీ రామానుజాచార్యులు జీవన చిత్రం

0
SHARE

ఆధ్యాత్మిక ఆకాశoలో వెలిగే సూర్యులలో ముఖ్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు; ఆదిశంకరులు అద్వైత భాస్కరులైతే, మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త, రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్త్వవేత్త.   

శ్రీ రామానుజాచార్యులు సుమారు వేయి సంవత్సరాల క్రితం శ్రీ పేరుంబుదూర్ లో 11వ శతాబ్దం, 1017సంవత్సరంలో కేశవ సోమయాజి, కాంతిమతుల పుత్రుడిగా జన్మించారు. ఆయన గురువు శ్రీ యాదవ ప్రకాశుల వద్ద శిష్యుడిగా చేరి వేదాలు, ఉపనిషత్తులు,శాస్త్రాలు అభ్యసిoచారు. కొన్ని అర్ధ తాత్పర్యాలలో గురు శిష్యులకు భేదాభిప్రాయాలు రావడంతో శ్రీ రామానుజాచార్యులు తనంతట తానే అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆయన `ఆళ్వారుల’ సంప్రదాయం ప్రకారం నాధముని, యమునాచార్యుల బాటను  అనుసరించారు. వారు యాదవ ప్రకాశుల వద్దనుండి వెళ్ళిపోయిన తరువాత గురువు మహాపూర్ణులకు శిష్యులై సన్యాసం స్వీకరించారు. కాంచీపురం వరదరాజస్వామి దేవాలయంలో పూజారిగా ఉంటూ పరబ్రహ్మ తత్వం గురించి బోధిస్తూ ముక్తిమార్గం ప్రవచించేవారు.

శ్రీరంగం

యమునాచార్యుల ద్వారా వైష్ణవ సంప్రదాయాలు వ్యాప్తిలోకి వచ్చినవి. వైష్ణవ భక్తులని `ఆళ్వారులు’ అని పిలుస్తారు, 12మంది  ముఖ్య ఆళ్వారులు- పొయగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమత్తిశై ఆళ్వార్, కులశేఖరాళ్వార్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, పెరియాళ్వార్, తొండరిప్పడియాళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, శ్రీ ఆండాళ్ దేవి.  వీరిలో బ్రాహ్మణేతరులు, ఒక స్త్రీ ఉండడం గమనార్హం.

గ్రంథాలు

భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాలను రచించారు. వారి గ్రంథాలలో అతి ప్రాచుర్యమైనవి `వేదాంత సంగ్రహం’ – వేదాలపై భాష్యం, భగవద్గీతా భాష్యం, బ్రహ్మసూత్రాలపై `శ్రీ భాష్యం’, `వేదాంతసారం’, `వేదాంత దీపిక’, `గద్య త్రయం’ అనబడే  శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం మరియు శ్రీ వైకుoఠ గద్యం.

విశిష్టాద్వైతం

శంకరులు ఆత్మకు పరబ్రహ్మ తత్వానికి భేదoలేదని, ఆ తత్వo జీవకోటిలో భాసించడమే అద్వైతమని తెలిపారు. అయితే శ్రీ రామానుజాచార్యులు, `ద్వైతం’ తో జీవాత్మ పరమాత్మ వేరు అని కొంత కీభవిస్తూనే, జీవాత్మలలో ఉన్న విశ్వజనీనత  కారణంగా, భక్తితో భగవంతుడిని సేవిస్తే, ప్రతి ఆత్మ పరమాత్మ అవగలదని `విశిష్టాద్వైత’ తత్వాన్ని విశదీకరిoచారు. 

విష్ణుభక్తులందరూ వైష్ణవులేనని శ్రీ రామానుజులవారు ఉద్భోధించారు.  ఆసేతు హిమాచలం పర్యటించి, విశిష్టాద్వైత సిద్ధాంతాలతో పాటు కులభేదాలులేని వైష్ణవ వ్యాప్తికి కృషిచేసారు. శ్రీరంగనాథుని దేవాలయo పూజావిధానాలు సంస్కరించి కొన్ని ముఖ్య పద్ధతులు ప్రవేశపెట్టి, అన్ని కులాలవారికి దేవాలయ ప్రవేశం కల్పించారు. శ్రీరంగం, తిరుపతి, కాంచీపురం మరియు ఇతర వైష్ణవాలయాలలో వారు ప్రవేశపెట్టిన ఆచారాలు, పూజావిధానాలే నేటికీ కొనసాగుతున్నాయి. వారి శిష్యులైన శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ అనంతాళ్వార్ మొదలగువారు విశిష్టాద్వైతాన్ని భారతదేశమంతా వ్యాప్తి చేసారు.

నేటి చెన్నైకి సమీపంలో ఉన్న శ్రీ రామానుజులవారి జన్మస్థలం శ్రీ పెరుoబుదూర్లో వారి ఆశ్రమం, దేవాలయం ఉన్నాయి.  

రచన: పి. విశాలాక్షి