తనది మొత్తం సమాజానికి చెందిన పనిగానే ఆర్ ఎస్ ఎస్ మొదటి నుంచి భావించింది తప్ప కేవలం ఒక సంస్థగా మాత్రమే మిగిలిపోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదు. అందుకనే 1949నాటి లిఖితపూర్వక రాజ్యాంగం కూడా స్వయంసేవకులు రాజకీయాలలోకి వెళ్ళేందుకు, ఏదైనా పార్టీలో చేరి పనిచేసేందుకు పూర్తి స్వేచ్చ కలిగిఉంటారని స్పష్టం చేసింది. జనసంఘ్ పార్టీ ఏర్పడటానికి ముందే ఈ రాజ్యాంగం రూపొందింది. జనసంఘ్ ఏర్పడినతరువాత అనేకమంది స్వయంసేవకులు, ప్రచారక్ లు అందులో పనిచేస్తున్నప్పుడు కూడా సంఘ దృక్పధం మారలేదు. సంఘ రాజ్యాంగంలో ఎలాంటి మార్పు రాలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచుకున్నందువల్ల దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టుకువచ్చాయి. సంఘ ఒక సామాజిక సంస్థ కాబట్టి సమాజానికి చెందిన అన్ని రంగాలను స్పృశిస్తుంది. జాతీయ దృక్పధంతో పనిచేసే స్వయంసేవకులు తమ ఆసక్తి మేరకు రాజకీయాలతోపాటు ఏ రంగంలోనైనా పనిచేయవచ్చును. కొద్దిమంది స్వయంసేవకులు రాజకీయ రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి ఆర్ ఎస్ ఎస్ రాజకీయ సంస్థ అనడం సరికాదు.
ఒక రాజకీయ పార్టీ ఒక ఆలోచన, సిద్దాంతానికి చెందినదై ఉంటుంది. కాబట్టి సహజంగానే మరో ఆలోచన, సిద్ధాంతం కలిగిన మరో పార్టీ కూడా ఉంటుంది. సంఘం మొత్తం సమాజాన్ని గురించి ఆలోచిస్తుంది. ఆర్ ఎస్ ఎస్, హిందూ సమాజం రెండూ వేరువేరు కావు. అలాంటప్పుడు మొత్తం సమాజానికి చెందినది కేవలం ఒక భాగానికి మాత్రమే ఎలా పరిమితమవుతుంది?
1925లో సంఘాన్ని స్థాపించిన తరువాత డా. హెడ్గేవార్ సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా 1930లో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. అందులో పాల్గొనడానికి ముందే ఆర్ ఎస్ ఎస్ లో తన బాధ్యతలను డా. పరంజపేకు అప్పచెప్పారు. స్వయంసేవకులు వ్యక్తిగత హోదాలోనే సత్యాగ్రహంలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఏడాది కఠిన కారాగార శిక్ష అనుభవించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆర్ ఎస్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయవలసిందిగా హోమ్ మంత్రి సర్దార్ పటేల్ సలహా ఇచ్చారు. కానీ శ్రీ గురుజీ ఆ సలహాను గౌరవపూర్వకంగానే తిరస్కరించారు. ఎందుకంటే సంఘ ఒక రాజకీయ పార్టీ కాదని, మొత్తం సమాజం కోసం పనిచేసే సంస్థ అని స్పష్టంచేశారు.
కొన్ని సంవత్సరాల తరువాత డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ జాతీయ దృక్పధంతో పనిచేసే రాజకీయ పార్టీ అవసరం దేశంలో ఎంతో ఉందని, కనుక సంఘ ఈ లోటును భర్తీ చేయాలని శ్రీ గురుజీతో ప్రస్తావించారు. అప్పుడు గురుజీ ఆ దిశగా ప్రయత్నించమని, సంఘ అవసరమైన సహాయం అందిస్తుందని చెప్పారు. అలా సంఘం మొత్తం సమాజానికి చెందిన కార్యానికే కట్టుబడి ఉంది.
1977 ఎమర్జెన్సీ కాలంలో దేశవ్యాప్తంగా జనతా పార్టీ ఘనవిజయం సాధించడానికి స్వయంసేవకులు ఎంతో కృషి చేశారు. అనేక పార్టీలు కలిసి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. జనతాపార్టీలో విలీనమైపోయి అధికారాన్ని పంచుకునే అవకాశం వచ్చినప్పటికి అప్పటి సర్ సంఘచాలక్ శ్రీ. బాలసాహెబ్ దేవరస్ అలాంటి ఆలోచన ఏది లేదని స్పష్టం చేశారు. దేశంలో ప్రత్యేకమైన, విపత్కర పరిస్థితులు ఉండడం వల్లనే సంఘ ఎన్నికల్లో పాలుపంచుకుందని, ఆ అవసరం తీరింది కనుక సమాజ కార్యం పైనే దృష్టి పెడుతుందని తేల్చిచెప్పారు.
ఈ విషయమంతా స్పష్టంగా అర్ధం కావాలంటే ఆర్ ఎస్ ఎస్ ‘సమాజంలో ఒక ముక్క’ కాకుండా, ‘మొత్తం సమాజపు’ సంస్థ ఎలా అయిందో తెలుసుకోవాలి.
2018లో అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు నాగపూర్ లో జరిగాయి. సర్ కార్యవాహ ఆహ్వానం మేరకు జ్యేష్ట స్వయంసేవక్ ఏం. జి వైద్య (ఆయన తన 8 ఏట నుంచి స్వయంసేవక్) ఒక రోజు సమావేశాల్లో పాల్గొన్నారు. అప్పటికి ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సర్ సంఘచాలక్ మోహన్ జీ భగవత్ ఆయనను సత్కరించారు. అప్పుడు మాట్లాడుతూ శ్రీ వైద్య “సంఘాన్ని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు. అలాగే కేవలం ద్విముఖ(బైనరీ) ధోరణి కలిగిన పాశ్చాత్య ఆలోచనా పద్దతి ద్వారా సంఘాన్ని అసలు అర్ధం చేసుకోలేము. సంఘాన్ని ఏకాత్మ దృష్టి కలిగిన భారతీయ ధోరణి ద్వారానే అర్ధం చేసుకోగలం’’అని అన్నారు.
చరాచర జగత్తు అంతటా నిండిఉన్న ఆత్మ తత్వాన్ని గురించి ఈశావాస్య ఉపనిషత్ లోని ఐదవ మంత్రం ఇలా చెపుతుంది –
తదేజతి తన్నేజతి తద్దూరే తద్వంతికే
తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః
అంటే ఆత్మ కదులుతుంది, కదలదు. దగ్గరగా ఉంటుంది, దూరంగానూ ఉంటుంది. అది అన్నింటి లోపలా ఉంటుంది, బయటా ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా, అన్వయానికి కుదరని విషయంలా అనిపిస్తుంది. కానీ అది నిజం.
సంఘానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.
సమాజం చాలా క్లిష్టమైనది. అందులో రకరకాల వ్యక్తులు, వర్గాలు ఉంటాయి. మొత్తం సమాజం కోసం పని చేస్తుంది కాబట్టి సంఘ అన్ని అంశాలను, రంగాలను స్పృశిస్తుంది. అన్ని రకాల పనుల్లో స్వయంసేవక్ పాలుపంచుకుంటాడు. అంతమాత్రాన సంఘం కేవలం ఒక పనికి, ఒక రంగానికి పరిమితమైపోదు. అది వీటన్నిటికంటే మించినది. `మొత్తం’ సమాజానికి చెందినది.
పురుషసూక్తం ఇలా చెపుతుంది –
స భూమిమ్ విశ్వతోవృత్వాత్యాతిష్ఠద్దాశంగులమ్
అంటే మొత్తం భూమి, విశ్వంలో నిండినా అది చిన్నగానే ఉంటుంది.
అణువును విడగొట్టలేమని ఒకప్పుడు శాస్త్రవేత్తలు అనుకున్నారు. కానీ ఆ తరువాత అణువును విడగొట్టవచ్చని, అందులో న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అని మూడు పరమాణువులు ఉంటాయని తేల్చారు. ఆ తరువాతి కాలంలో మరింత ముందుకు వెళ్ళి ఈ మూడు పరమాణువులే కాక అణువులో మరెన్నో పరమాణువులు ఉంటాయని తెలుసుకున్నారు. అంతేకాదు అవి కేవలం పరమాణువులు మాత్రమే కాదని వాటికి తరంగ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. తరంగ లక్షణాలే కాక అణువు గుణాలు కూడా ఉన్నాయని ఇంకా కొంతకాలానికి తెలుసుకున్నారు. ఇలా అణువు ద్వంద్వ ప్రకృతిని గుర్తించారు. చివరికి హైసన్ బర్గ్ అనే శాస్త్రవేత్త అణువు స్థితిని, వేగాన్ని ఒకేసారి తెలుసుకోవడం సాధ్యపడదనే అనిశ్చితి సూత్రాన్ని ప్రతిపాదించాడు. “ఇదే విషయాన్ని ఈశావాస్య ఉపనిషత్ వివరించింది. ఇది అర్ధమైతే భారతీయ ఏకాత్మ దృష్టి తెలుస్తుంది. అప్పుడు సంఘ అర్ధమవుతుంది’’ అని ఏం. జి వైద్య వివరించారు.
సంఘం మొత్తం సమాజం కోసం పనిచేస్తుంది కనుక, రాజకీయాలు సమాజంలో భాగం కనుక కొందరు స్వయంసేవకులు ఆ రంగంలో పనిచేస్తూ కనిపిస్తారు. కానీ రాజకీయాలు మాత్రమే స్వయంసేవకుల లక్ష్యం కాదు. ప్రస్తుతం ప్రజాస్వామ్య పండుగ అనదగిన సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు చెప్పేందుకు స్వయంసేవకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే జాతీయ అంశాలను ప్రజల దృష్టికి తీసుకువస్తారు. అంతేకానీ ఎలాంటి స్వార్ధ, స్థానిక ప్రయోజనాల కోసం పనిచేయరు.
స్వయంసేవకులు ఒక పార్టీకి మద్దతు తెలుపరాదని సంఘ రాజ్యాంగం చెప్పదు. కానీ 90శాతం స్వయంసేవకులు ఒక రాజకీయ పార్టీ గురించి కాకుండా జాతీయ అంశాలను మాత్రమే ప్రజల ముందు ప్రస్తావించడానికి ప్రయత్నిస్తారని గమనిస్తే మనకు అర్ధమవుతుంది. ఇలా ఎన్నికలు, రాజకీయాల గురించి మాట్లాడినా, పనిచేసినా సంఘ రాజకీయ పార్టీ కాదు. అలాగే ఏ ఒక్క రాజకీయ పార్టీలో భాగమూ కాదు. అది మొత్తం సమాజానికి చెందిన సంస్థ.
ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే భారతీయ ఏకాత్మ దృష్టి ఉండాలి. ఈశావాస్య ఉపనిషత్ అర్ధం కావాలి.
- డా. మన్మోహన్ వైద్య, సహ సర్ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్