ఆగస్ట్ 5 వరలక్ష్మీ వ్రతం
దారిద్య్రం నుంచి ధనం వైపునకు, అజ్ఞాన తిమిరం నుంచి సుజ్ఞానం దిశగా నడిపించే దివ్య తేజోమూర్తి శ్రీమహాలక్ష్మిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. ధనం అంటే కేవలం డబ్బే కాదు. ఆరోగ్యం, ఆయుస్సు, అభయం, ధైర్యం, స్థయిర్యం, విజయం, వీర్యం, శౌర్యం, సాహసం, విద్య వివేకాలు, కీర్తిప్రతిష్ఠలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, పుత్రపౌత్రాదులు… ఇలా అన్నీ సంపదే.ఈ సమస్త సంపదలకు మూలం, వాటికి అధినేత్రి శ్రీమహాలక్ష్మి. అష్టలక్ష్ముల తత్త్వమే అది. లక్ష్మీనారాయణులది అవిభాజ్య బంధం. ఈ ఆదిదంపతులను అర్చించడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని, ప్రత్యేకించి లక్ష్మీదేవి వైకుంఠంలో ‘మోక్షలక్ష్మి’గా ఉంటారని, చతుర్విధ పురుషార్థాలకు ఆమె చతుర్భుజాలు ప్రతీకలని చెబుతారు.
శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసంలో (చంద్రుడు శ్రవణా నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల శ్రావణ మాసం అంటారు) విష్ణుపత్నిని భక్తిశ్రద్ధతో కొలిచేవారికి వారికి ఆమె కొంగుబంగారమే. సిరిసంపదలకు సకల సౌభాగ్యాలకు,శుభకార్యాలకు ఆవాసం శ్రావణ మాసం. సంప్రదాయాలు పాటించే ప్రతి ఇంటి గడప పసుపు కుంకుమలతో, గుమ్మాలు మామిడి తోరణా లతో, ముంగిళ్లు రంగవల్లులతో శోభాయమానంగా కనిపిస్తాయి. అలాంటి ఇంటిలో ‘సిరి’దేవి ఘల్లుఘల్లు మనే అందెల సవ్వడితో అడుగిడుతుందని విశ్వాసం.
తెలుగు నెలల్లో ఏ మాసంలోనూ లేనన్ని పండుగలు శ్రావణంలో కనిపిస్తాయి. ముత్తయిదు వులు ఆచరించే వ్రతాలు, నోములు ఈ మాసంలోనే ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్య మాసమనీ అంటారు. ఈ నెలలో తొలి మంగళవారం ఆచరించేది మంగళగౌరి వ్రతం. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించాలని ‘వ్రతరత్నాకరం’ చెబుతోంది. అవకాశం లేనివారు ఈ మాసంలోనే ఇతర శుక్రవారాలు వ్రతం ఆచరించ వచ్చని ప్రత్యామ్నాయం సూచించారు పెద్దలు. సౌమంగల్యం, సత్సంతానాభివృద్ధి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. కొత్తగా వివాహమైన వారు దీర్ఘ సౌభాగ్యం కోసం, అవివాహితలు ఉత్తములు భర్తలుగా రావాలని, వివాహితలు తమ వైవాహిక జీవితం సవ్యంగా సాగాలని మంగళగౌరి వ్రతాని్న ఆచరిస్తారు. ఆషాఢంలో పుట్టినింట ఉండే నవ వధువులు శ్రావణం ప్రవేశించాక, మొదటి మంగళ వారం నోము అక్కడే జరుపుకుని మెట్టినింటికి బయలుదేరి, ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుపు కోవడం ఆనవాయితి.
వర్ణభేదాలకు అతీతంగా సర్వులూ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చని సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. ‘లోకంలో పరమపావనమైన వ్రతం ఏది?’ అన్న జగన్మాత పార్వతీదేవికి మహాదేవుడు దీనిని ఉపదేశించారని, ఆమె మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతం ఆచరించి నవరత్న ఖచితమైన లంకానగరాన్ని సంపదగా పొందిందని పురాణవాక్కు. పేద, గొప్పా, చిన్నా, పెద్దా తేడా లేకుండా శక్తిమేరకు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఇక్కడ పూజకు,వ్రతానికి వ్యత్యాసాన్ని చెబుతారు. ‘వరలక్ష్మిని ఒక్కసారి పూజించడమే కాదు…జీవితాంతం ఆచరిస్తూనే ఉంటాను’ అని తొలి పూజ నాడు చేసే ప్రమాణం కారణంగానే వరలక్ష్మీ ‘పూజ’ వరలక్ష్మీ ‘వ్రతం’గా మారిందని చెబుతారు.
ఈ వ్రత ఆవిర్భావానికి సంబంధించిన ఒక గాథ ప్రకారం…. మగధదేశంలోని కుండిన నగరానికి చెందిన చారుమతి అనే ముత్తయిదువుకు లక్ష్మీదేవి కలలో కనిపించి, శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ పూజ చేసుకోవాలని సూచించింది. అయితే తనతో పాటు ఇతరులతోనూ ఈ పూజ చేయించాలనే భావనతో చారుమతి తోటి ముత్తయిదువులతో కలసి శ్రద్ధాభక్తులతో పూజ నిర్వహించి, ఆత్మప్రదక్షిణకు ఉపక్రమించింది. మూడు ప్రదక్షిణలకుగాను వారికి వరుసగా, బంగారు గజ్జెలు, హస్తకంకణాలు, సర్వాభరణాలు లభించా యట. అడగకుండానే ఐశ్వర్యాన్ని ప్రసాదించిన ‘అమ్మ’ను నిరంతరం పూజించాలన్న ఆకాంక్షే ‘వ్రతం’గా మారిందని అంటారు. మహిళలు ఈ మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దీర్గ్ఘసుమంగళీయోగం, అష్టైశ్వరాలు లభిస్తాయని విశ్వసిస్తారు.
సర్వసంపదలకు, సర్వసౌభాగ్యహేతువైన ఈ వ్రతం అమ్మవారి ధ్యాన ఆవాహనలతో ప్రారంభమై షోడశోపచారపూజ, అంగపూజ, అష్టోత్తరశత (సహస్ర) నామాలతో కొనసాగి, వ్రతకథతో పరి సమాప్తమవుతుంది. వ్రతకర్తలు ముత్తయిదువలకు…
‘ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ!
ఇందిరా తారికా ద్వాభ్యామ్ ఇందిరాయై నమో నమః’ (తోటి ముత్తయిదువా! ఈ వ్రత పరిసమాప్తితో మనిద్దరం లక్ష్ములమే. మనందరిలోనూ, మన చేతి తోరాల్లోనూ లక్ష్మి ఉందని గ్రహించాను. లక్ష్మీ స్వరూపిణీవై దీనిని స్వీకరించు) అని వాయనం ఇస్తారు.
సర్వం లక్ష్మీనివాసం
‘ఇందుగలడందులేడని సందేహం వలదు’ అని చక్రధారి గురించి పోతనామాత్యుడు ప్రహ్లాదుడితో పలికించడం చక్రవాసినికీ వర్తిస్తుంది. విష్ణువు జగత్తంతా వ్యాపించినట్లే లక్ష్మీదేవి సర్వవ్యాపితమై లోకజననిగా పేరు పొందింది. లక్ష్మీ కేవలం ధన రూపంలోనే కాదు- ప్రకృతిలో, మానవ నడవడిలో, వస్తువులలో… ఇక్కడ అక్కడిని కాదు… మంగళకర మైన ప్రతిచోట నెలవై ఉంటుంది. తామరలు, ఏనుగులు, గుర్రాలు, గోవులు, తులసి, పూలు పండ్లతో కూడిన ఉద్యానవనాలు, హరితవనాలు, దీపకాంతులు, శుచిశుభ్రత కల ప్రదేశాలు, సదాచార పరాయణత, హరిహర్చాన, వేదఘోష, కలిగిన దానితో తృప్తిపడుతూ నిశ్చింతగా ఉండే
లోగిళ్లు, సౌమ్యం ధర్మగుణాలు, విద్యావేత్తలు, విద్వాంసులు, పెద్దలు సన్మాన సత్కారాలు అందుకొనే ప్రదేశాలు, క్రమశిక్షణ, సమయపాలన ..ఇలా ఎన్నో విశిష్టతలు కలవన్నీ శ్రీదేవి నిలయాలేనట. వాటిలో ఆధ్యాత్మికతతో పాటు సామాజిక కోణం, మానవ మనుగడకు అవసరమైన, ఆచరించదగిన అంశాలు, సూచనలు ఇమిడి ఉన్నాయి.
త్రిమాతలు లక్ష్మీ, సరస్వతి, పార్వతి..సంపద, వాక్కు, మంగళానికి అధిష్ఠానదేవతలు. ఈ ముగ్గురు విడదీయలేని శక్తులుగా ఉంటారు. కనుకనే, వాణీ పార్వతుల అధీనంలోని అంశాలు లక్ష్మీదేవిలో ఉమ్మ డిగా కనిపిస్తాయని మహర్షుల ఉపదేశం.
————-
నాగదేవతా రక్షమాం!
ఆగస్ట్ 2 నాగ/గరుడ పంచమి
నాగులకు సంబంధించిన పండుగను ఏడాదిలో అనేకసార్లు జరుపుకుంటారని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. తెలుగునాట మాత్రం శ్రావణ శుద్ధ పంచమి (నాగ పంచమి), కార్తిక శుద్ధ చవితి (నాగుల చవితి)ని ప్రధానంగా జరుపు కుంటారు. హరి పానుపు, హరుడి ఆభరణమైన సర్పాన్ని పూజించడం హైందవ సంప్రదాయం. నాగులు దేవీదేవలతో సమానంగా పూజలు అందు కుంటున్నాయి. అందుకు నేపథ్యాన్ని పరిశీలిస్తే… శ్రీహరి పానుపు ఆదిశేషుడు. అమృతం కోసం క్షీరసాగర మథనవేళ సర్పరాజు వాసుకి కవ్వపు తాడుగా సహకరించాడు. ‘అహి’ అనే నాగరాజు ఇంద్రునితో పోరాడి పరాజయం పొందినా, ఆయనతో తలపడిన ఖ్యాతిని పొందాడు. త్రేత, ద్వాపర యుగాలలో లక్ష్మణ, బలరాములు శేషాంశ సంభూతులు. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆవాసం శేషాద్రి. ఇలా దేవతలతో అవినాభావ సంబంధం కలిగి ఉండడం వల్ల కూడా పూజార్హత పొందాయని చెబుతారు. శ్రావణ శుద్ధ పంచమి నాడు విధాత శేషునికి మొదటిసారిగా ప్రసాదం ఇవ్వడం వల్ల నాగులను పూజించే పర్వదినంగా వ్యవహారంలోకి వచ్చిందని వరాహపురాణం చెబుతోంది.
నాగపంచమి నాడు శిరస్నానం చేసి, వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగపడగలను భక్తులు అభిషేకిస్తారు. సర్ప విగ్రహాలను పూజించి పాలు, కొబ్బరి, అన్నం, పేలాలు, పరమాన్నం నైవేద్యంగా పెడతారు. బాలబాలికలు రెండు ఎండు కొబ్బరి చిప్పలను అలంకరించి, వాటికి రంధ్రాలు వేసి, రెండు దారాలు కట్టి తిప్పడం కొన్ని ప్రాంతాలలో ఉంది. గ్రామాలలో వేపచెట్టు మొదట్లోనో, అశ్వత్థ (రావి) వృక్షం మొదట్లోనే ప్రతిష్ఠితమైన నాగవిగ్రహాలు కనిపిస్తాయి. ఈ తిథిని నాగప్రతిష్ఠకు అనువైనదిగా భావిస్తారు.
పెళ్లి కావలసిన యువతులు, కుజదోష కారణంగా వివాహాలకు జాప్యమవుతున్న వారు, గర్భధారణలో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు ఈ పండుగను జరుపుకుంటే సాంత్వన చిక్కుతుందని, నాగపంచమి నాడు సర్పాలను పూజించిన వారికి సర్పభయం ఉండదని విశ్వాసం.
పాముల వల్ల ఎంత అపాయమో అంతకుమించి మేలు జరుగుతుందనేందుకు అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రావణ మాసంలో వర్షాలకు పుట్టలు, బొరియల నుంచి వెలుపలికి వచ్చే పాములు జనాన్ని బాధిస్తాయి కనుక వాటిని ప్రసన్నం చేసుకు నేందుకు నాగపూజకు వర్షాకాలంలో ప్రాధాన్యం ఇచ్చిఉంటారని పాత్రికేయ ప్రముఖుడు, రచయిత తిరుమల రామచంద్ర అభిప్రాయపడ్డారు. పాములు పంటలను అభివృద్ధి పరుస్తాయని, కనుక పంటలకు అధిదేవతని పూర్వికులు విశ్వసించేవారు. నాగ దేవతలు సంతానాన్ని అనుగ్రహిస్తాయనీ నమ్మకం. మొహంజదారో శిథిలాలలో దొరికిన నాగ చిత్రాలున్న ముద్రికలు నమ్మకాలను చాటి చెబుతున్నాయి.
————-
వినతా సుతా వందనం!
నాగపంచమిని వైష్ణవులు ‘గరుడ పంచమి’గా జరుపుకుంటారు. వినతాసుతుడు గరుడుడు మాతృభక్తి పరాయణుడు. తల్లి దాస్యాన్ని తొలగించేందుకు ఇంద్రునితోనే పోరాడి అమృతాన్ని సాధించాడు. కారణాంతరాల వల్ల సవతితల్లి, నాగమాత కద్రువకు దాసిగా మారిన వినతకు దాని నుంచి విముక్తి కలిగించాలనుకుంటాడు.అయితే తనకు అమృతం తెచ్చిస్తే దాస్య ఇముక్తి కల్పిస్తానన్న కద్రువ సుతుల షరతుపై అమరావతిపై దండెత్తి సుధా భాండాన్ని సాధించాడు. ఆ అమృత భాండాన్ని తెచ్చిన రోజే ‘గరుడ పంచమి’. ‘వేదాత్మా విహగేశ్వర’ అన్నట్లు మూర్తీభవించిన వేదాలే గరుడుడని ఆధ్యాత్మికవేత్తలు అభివర్ణిస్తారు. విష్ణువుకు ధ్వజాధిదేవత. ఆయనకు మిక్కిలి అనుంగు సేవకుడు. మానవులు తమ ముఖాదిరూపాలను అద్దంలో చూసుకుంటున్నట్లే శ్రీహరి తన స్వరూపాన్ని గరుడునిలో చూసుకుంటాడట. అంటే ఎంత ఆంతరంగికుడో అర్థమవుతుంది. తిరుమ లేశుని వాహనసేవల్లో ‘గరుడ సేవ’ అత్యంత ప్రధాన మైనదిగా వర్ణిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంలోనే కాక ప్రతి మాసం పౌర్ణమి నాటి గరుడోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరువుతారు.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్
జాగృతి సౌజన్యంతో…