దేశ రక్షణ భాగంగా సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాడిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన అస్సాం రైఫిల్్స జవాన్ బొంగు బాబురావు (28) బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖోన్సా సరిహద్దు సమీపంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో బాబురావు మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. ఆయన మృతదేహాన్ని గురువారం ప్రత్యేక విమానంలో విశాఖపట్నం తీసుకువచ్చారు. అక్కడి నుంచి అక్కూపల్లి మీదుగా కాశీబుగ్గ నుండి బైక్ ర్యాలీతో ఆయన స్వగ్రామానికి తీసుకువచ్చారు.
బాబురావు మరణంతో స్వస్థలమైన వజ్రపుకొత్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతనితో ఉన్న అనుబంధ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ చాలా మంది స్థానికులు, యువకులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలావుండగా, బాబురావు అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్థానిక ఎస్‌ఐ కునా గోవింద రావు తెలిపారు.
బాబురావు తండ్రి పురుషోత్తం కూడా ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన మూడేండ్ల క్రితం మరణించారు. బాబురావుకు ఇద్దరు సోదరులు. పెద్ద అన్నయ్య ఆర్మీలో పని చేస్తున్నాడు. చిన్న సోదరుడు ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.
బాబురావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. గత నెల చివర్లో విధుల్లోకి చేరి 21 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. తిరిగి విధుల్లోకి చేరిన మూడు రోజులకే అమరవీరుయ్యాడు. దీంతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది.
Source : Hansindia