Home Ayodhya అయోధ్యలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ… అస‌త్య ప్ర‌చారాల‌పై స్పందించిన శృంగేరి పీఠం

అయోధ్యలో ప్రాణ‌ప్ర‌తిష్ఠ… అస‌త్య ప్ర‌చారాల‌పై స్పందించిన శృంగేరి పీఠం

0
SHARE

సుమారు ఐదు శతాబ్దాల పోరాటం తర్వాత, పుష్య శుక్ల ద్వాదశి జ‌న‌వ‌రి 22 నాడు పవిత్ర అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి క్షేత్రంలో భగవాన్ శ్రీరాముని కోసం నిర్మించిన ఆలయంలో ప్రాణప్రతిష్ఠ జ‌రుగుతుంది. ఆ మ‌హత్త‌ర‌మైన ఉత్స‌వం కోసం దేశ ప్ర‌జ‌లంతా ఎంతో ఆనందంతో ఎదురుచూస్తున్నారు. కానీ కొద్దిమంది మాత్రం కొన్ని త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తూ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్నారు. పీఠాధిప‌తులకు ఈ కార్యక్రమం పట్ల అభ్యంతరాలు ఉన్నాయంటూ త‌ప్పుడు వార్తల‌ను ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే ఆ వార్త‌లను ఖండిస్తూ శృంగేరి పీఠం వారు స్పందించారు. మన ధర్మాన్ని కించ‌ప‌ర‌చాల‌నుకునే వారు కొందరు సోషల్ మీడియాలో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ, ఫోటోతో ఉన్న ఒక పోస్ట్‌లో ‘అయోధ్య‌లో రాముడి ప్రాణ ప్రతిష్ఠపై అసంతృప్తి వ్యక్తం చేశారు’ అనే అస‌త్య‌పు వార్త‌లను ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ పీఠం ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

శృంగేరి శంకరాచార్యులు అలాంటి సందేశం ఏమీ ఇవ్వలేద‌ని, ఇది కేవలం కొంద‌రు చేస్తున్న తప్పుడు ప్రచార‌మ‌ని స్ప‌ష్టం ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆస్తికులందరూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను విస్మరించాల‌ని, శృంగేరి శారదా పీఠం అధికారిక వెబ్‌సైట్ (www.sringeri.net), అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వచ్చిన వాటిని మాత్రమే అధికారిక ప్రకటనలుగా గుర్తించాలని పేర్కొన్నారు.

మ‌రోవైపు.. ప్రాణప్రతిష్ట వరకూ ఆస్తికులంతా రామ తారక మహామంత్రాన్ని పఠించడంలో నిమగ్నమై ఉండాలని శృంగేరి జగద్గురువుల సందేశాన్ని ఇచ్చారు. అత్యంత పవిత్రమైన, అరుదైన ఈ ప్రాణప్రతిష్ఠలో ప్రతి ఆస్తికుడు తప్పనిసరిగా పాల్గొని భగవాన్ శ్రీరాముని అపరిమితమైన కృపకు పాత్రులు కావాలని ఆయన అన్నారు.

ద్వారకాపీఠం కూడా ఇటువంటి ప్రకటననే విడుదల చేసింది. రామజన్మభూమి అయోధ్యకు సంబంధించి ద్వారకా శారదాపీఠ్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేద‌ని, జగద్గురు శంకరాచార్య జీ మహరాజ్ అనుమతి లేకుండా ఎవరూ ఎలాంటి వార్తాప్రకటన ప్రచారం చేయరాదని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

రామజన్మభూమిని పొందేందుకు రామాలయ ట్రస్ట్, రామజన్మభూమి స‌మితి ద్వారా శంకరాచార్యులు చాలా ప్రయత్నాలు చేశార‌ని మఠం తన ప్రకటనలో పేర్కొంది. సుమారు 500 సంవత్సరాల వివాదం ముగిసింద‌ని, ఇది సనాతన ధర్మ అనుచరులకు సంతోషకరమైన సందర్భ‌మ‌ని, అయోధ్యలో జరగబోయే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాలన్నీ శాస్త్రాలను అనుసరించి నిర్వహించాలని కోరుతున్న‌ట్టు వారు పేర్కొన్నారు.