భైంసా ఘటన విషయంలో చర్యలు తీసుకోవడంలోనూ, బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి ప్రజ్ఞా పరాండే ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞా పరాండే మాట్లాడారు. ఈ సందర్భంగా.. భైంసా ఘటన నేపథ్యంలో బాధిత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేదా నష్టపరిహారం అందని విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది చాలా బాధాకరమైన పరిణామం. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. పిల్లలు భయాందోళనలకు గురై మానసికంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపుచేయాల్సిన పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకోవడానికి 24 గంటల సమయం పట్టినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఇక వారికి మన వ్యవస్థ మీద ఉండే విశ్వాసం మీరు అర్ధం చేసుకోవచ్చు” అని ప్రజ్ఞా వివరించారు.
రానున్న పరీక్షల సమయాన్ని గురించి ప్రస్తావించిన ఆమె .. “వారి పరీక్షలు ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాయి. ఇళ్ల దాహనంలో పిల్లలు తమ పుస్తకాలు, సర్టిఫికెట్లు కూడా కోల్పోయారు. కొందరు ఏదో విధంగా తమ బంధువు ఇండ్లలో ఉండి పరీక్షలకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇది చాలా భయంకరమైన పరిణామం” అనిఅన్నారు. నిజానిర్ధారణ కమిటీ పరిశీలనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు, విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ వసతిగృహల్లో కూడా వసతి కల్పించని అంశాలను గుర్తించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక కలెక్టర్, సంబంధిత విద్య, వైద్య శాఖ అధికారులు తక్షణమే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజ్ఞా పరాండే కోరారు.
Home
News భైంసా బాధితుల పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత: ఎన్.సీ.పీ.సీ.ఆర్. సభ్యురాలు ప్రజ్ఞా పరాండే