Home News ‘ఉమ్మడి పౌరస్మృతి’కి ఇది ముందడుగు?

‘ఉమ్మడి పౌరస్మృతి’కి ఇది ముందడుగు?

0
SHARE

ఒక తల్లికి ఇద్దరు కొడుకులున్నారు. అందులో ఒకడి వయసు 20 ఏళ్లు. వాడు అమాయకుడు. లోకం పోకడ తెలియనివాడు. తల్లిదండ్రులు ఇంట్లో పెట్టిన నియమాలకు అనుగుణంగా జీవించేవాడు. రెండవ వాడికి పదేళ్లు, కాన్వెంట్లో చదువుకుంటున్నాడు. ఇతనిపై ఇంటివాళ్ల ప్రభావం కన్నా బయటవాళ్ల ప్రభావం ఎక్కువ. ఎప్పుడూ షరతులు పెడుతుంటాడు. మారాం చేస్తాడు. ఏది ఇచ్చినా సంతృప్తి చెందడు. ఒకటి ఇస్తే ఇంకోటి కావాలని ఏడుస్తాడు. ఇతనిపై తల్లిదండ్రులకు గారాబం ఎక్కువ. ఓరోజు వాళ్ల అమ్మ జొన్న రొట్టెలు తయారుచేస్తున్నది. నాలుగు రొట్టెలు చేసింది. ఇద్దరికీ సమానంగా పంచింది. ఎందుకంటే చిన్నవాడు తిండిలో సమానంగా పోటీపడతాడు. పనిలో మాత్రం ‘నేను చిన్నవాడ్ని’ అని తప్పించుకుంటాడు. పోనీ పెద్దవాడు చేయగలిగినంత పని చేయకున్నా పదేళ్లపిల్లవాడు ఏ పని చేయాలో అవి చేయొచ్చుగా అంటే ‘నేను చిన్నవాడ్ని అని నన్ను ఏడిపిస్తారా.. బ్లాక్‌మెయిల్ చేస్తారా’ అంటాడు.

సరిగా ఈ దేశంలో మైనార్టీ-మెజార్టీ రాజకీయాలు ఇలానే ఉన్నాయి. ప్రతి విషయాన్ని సున్నితంగా, బలహీనంగా చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేసే విధానం భారత రాజకీయాల్లో వందేళ్లకుపైగా నడుస్తోంది. ఈ క్రమంలో మూడురోజుల క్రితం సుప్రీం కోర్టు ముస్లిం సమాజంలోని భార్యాభర్తల సంబంధాలపై ఓ చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ‘ట్రిపుల్ తలాక్’ సంప్రదాయానికి ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు గొడ్డలిపెట్టులాంటిది. జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్ 120 పుటల మెజార్టీ తీర్పు ఇస్తూ- భర్త ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ తలాక్ అని భార్యను వదిలించుకోవడం స్ర్తి సమానత్వం, స్వేచ్ఛకు విఘాతం, విశ్వాసాల పేరుతో ఈ అమానుష చర్యను అంగీకరించడం కుదరదు అని పేర్కొన్నారు. జస్టిస్ ఖేహర్, జస్టిస్ నజీర్ ఇది రాజ్యాంగ విరుద్ధం కాకున్నా, మహిళలపై వివక్షాపూరితం.. ఆరు నెలల్లో కేంద్రం చట్టం చేయాలి.. అప్పటివరకు తలాక్ చెల్లదని 275 పుటల్లో ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నారు.

ఓసారి- ముమ్మారు తలాక్ చెప్పి భార్యను వదిలేసిన మహమ్మద్ ప్రవక్త అనుయాయి ఒకడు తన వద్దకు వస్తే దీనిపై ఆయన తీవ్రంగా స్పందించాడు. ఇది దేవుని ఆదేశాలతో ఆడుకోవడమే. తిరిగి భార్య వద్దకు వెళ్లాలని ఆదేశించాడు. విచారణలో భాగంగా ఓ న్యాయవాది ఈ విషయం పేర్కొన్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది.

వైవాహిక జీవితానికి ఖురాన్‌లో కూడా ప్రాధాన్యం ఉంది. దంపతుల మధ్య భేదాభిఫ్రాయాలు వచ్చినపుడు రాజీకి, మధ్యవర్తిత్వానికి అవకాశం ఉంది. కాని షరియత్ లా ప్రకారం ఇలాంటి రాజీకి ద్వారాలు మూసుకుపోయాయి. 1937లో బ్రిటిష్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రాజ్యాంగంలో షరియత్ చట్టం ముందుకు వచ్చింది. అప్పటి ముస్లింలీగ్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల వల్ల అమల్లోకి వచ్చింది. అప్పటినుండి ఇక్కడి కొందరు ముస్లిం నాయకులు తమకు తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా భావించడం మొదలుపెట్టారు. ఆఖరుకు వీళ్ల ఛాందసం ఎంతవరకు వెళ్లిందంటే ఖురాన్‌లో చెప్పని విషయాలను కూడా అమలు పరచాలనే దాకా వెళ్లింది.

రాజ్యాంగం కన్నా ఇస్లామిక్ షరియత్ చట్టమే గొప్పదని ముస్లిం పర్సనల్ లాబోర్డు వాదిస్తోంది. తలాక్ కేసులో వాళ్లు సమర్పించిన అఫిడవిట్‌లో కూడా ‘స్ర్తిలకన్నా పురుషులకే ఏదైనా నిర్ణయం చేయగల శక్తి ఎక్కువ వుంటుందని’ పేర్కొన్నారు. అంటే పరోక్షంగా భర్త భార్యను వదలడం పెద్ద సమస్య కాదని, అది నిర్ణయించే శక్తి పురుషునికే వుంటుందని వారి వాదన. ఉత్తరఖండ్‌లోని కాశీపూర్‌కు చెందిన సాయిరా భాను 2001లో రిజ్వాన్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది. ఓసారి అకస్మాత్తుగా 10 అక్టోబర్ 2015 ఆమెకు ఓ లేఖలో ‘తలాఖ్’ అంటూ మూడుసార్లు రాయడంతో ఆమె సుప్రీంకోర్టు తలుపుతట్టింది. రాజస్తాన్ జైపూర్‌కు చెందిన అఫ్రీన్ రహమాన్‌కు 2014లో ఇండోర్ న్యాయవాది అఫ్సర్ అలీతో వివాహం జరిగింది. 2014 జనవరిలో ఇద్దరు సాక్షులతో తలాక్‌నామా రాసి స్పీడ్‌పోస్టులో పంపించాడు. ఆమె కూడా కోర్టుకు వెళ్లింది. గతంలో ట్రిపుల్ తలాక్‌కు చట్టబద్ధత లేదని షమీమ్ ఆరా వర్సస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో తీర్పువచ్చింది. దీనికంతా కారణం ముస్లిం పర్సనల్ లా అమలు చట్టం 1937 చేసిన తర్వాత ఖురాన్‌కు వ్యతిరేకంగా ఉన్నదేదీ చెల్లుబాటుకాదు. ఇప్పుడు కూడా రాజ్యాంగంలోని సెక్షన్ 142 ఫ్రకారం న్యాయమూర్తులకున్న అధికారం మేరకు ఈ తీర్పువచ్చింది.

ట్రిపుల్ తలాక్ ఒకప్పుడు పెద్ద రాజకీయ దుమారం రేపింది. 1932లో మహ్మద్ అహ్మద్‌ఖాన్ అనే న్యాయవాది షాహబానోను పెళ్లాడాడు. వారికి 14 ఏళ్ల సంసారంలో ఐదుమంది సంతానం కలిగారు. అతను మరో యువతిని పెళ్లాడి 1975లో షాహబనోను ఇంటినుండి వెళ్లగొట్టాడు. 1978లో తలాక్ చెప్పి ఇస్తానన్న రు.200 భరణం కూడా ఇవ్వలేదు. దీనితో బాధిత మహిళ 62 ఏళ్ల వయసులో 1978 ఏప్రిల్‌లో కోర్టుకు ఎక్కింది. తాను ఇప్పటికే తలాక్ చెప్పినందువల్ల ‘ఇద్దత్’ కాలానికే భరణం చెల్లిస్తానన్నాడు అహ్మద్‌ఖాన్. షాహబనోకు నెలకు 25 రూపాయల భరణం చెల్లించాలని మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పగా, తర్వాత మధ్యప్రదేశ్ ఓహైకోర్టు దీనిని రు.179కు పెంచింది. విడిపోయిన భార్యకు ఆర్థిక సంబంధాలతోపాటు ఏ సంబంధం ఉండదని, ఇది మత విశ్వాసమని ఖాన్ వాదిస్తే దానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు జమాతే ఉలేమా హింద్‌లు అండగా నిలబడ్డాయి. ఆ తర్వత 1985లో ఏప్రిల్ 23న అతని పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిఆర్‌పిసిలోని సెక్షన్ 125 కింద నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది.

1984లో రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం వాదుల సంతుష్టీకరణ కోసం ముస్లిం మహిళా రక్షణ చట్టం 1986ను ఆమోదించి సుప్రీంకోర్టు తీర్పును నిలువరించింది. దాంతో బాధిత మహిళకు తీరని అన్యాయం జరిగింది. ఈ సంతుష్టీకరణ విధానమే ఈ రోజుకూ ఈ దేశంలో కొందరు ముస్లిం నాయకులు మేం ప్రత్యేకం అంటున్నారు. లేకపోతే పవిత్ర ఖురాన్‌కు వ్యతిరేకమైన తలాక్‌ను సమర్ధించడం ఎంతవరకు సబబు? 90 శాతం జనాభా వున్న 19 ముస్లిం దేశాలు తలాక్‌ను రద్దు చేస్తే ఇది ఎందుకు కొనసాగుతోంది? ఆఖరుకు పాకిస్తాన్ లాంటి మతతత్వ దేశంలో కూడా 1961లోనే దీన్ని రద్దు చేసారు. మరి భారత్‌లో మాత్రమే ఈ వ్యవస్థ ఎందుకు?

ముస్లిం లీగ్ లాటి పార్టీలు ముందునుంచీ ‘మేం ప్రత్యేకం’ అనే భావన కలిగి వుండేవి. తమ చట్టాల్లో, మత వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ముఖ్యంగా మెజారిటీ ప్రజల జోక్యంవద్దని వారి వాదన. అది స్వాతంత్య్రం తర్వాత కూడా అలాగే కొనసాగింది. మెజార్టీ ప్రజల కన్నా మేం వేరుగా జీవించాలన్న భావనను కాంగ్రెస్, కమ్యూనిస్టు, సూడో సెక్యులర్ పార్టీలు కలిగించాయి. దేశంలోని అసలు సిసలైన లౌకిక వాదం వదిలిపెట్టి కుహనా లౌకిక వాద సంతుష్టీకరణ విధానం ముందుకు తెచ్చాయి. లేకపోతే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అన్ని పార్టీలు ఒకలా స్పందిస్తే ‘మతం మత్తుమందు’ అని ప్రబోధించే కమ్యూనిస్టుల స్పందన విచిత్రంగా వుంది. ‘ఒక మతంలోనే కాకుండా అన్ని పర్సనల్ చట్టాల్లో ప్రభుత్వం సంస్కరణలు తీసుకురావాలి’ అంటు సిపిఐ కార్యదర్శి డి.రాజా చెప్పడం గమనార్హం. ఇప్పటికే హిందూ మారేజ్ యాక్ట్ మన రాజ్యాంగంలోనే ఉన్న సంగతి ఓ పార్టీ జాతీయ కార్యదర్శికి తెలియకపోవడం విడ్డూరం.

‘ఒకే దేశం- ఒకే చట్టం’ కోసం పూర్వం భాజపా రూపమైన జనసంఘ్ స్థాపకులు డా.శ్యామ్‌ప్రసాద్ తన ప్రాణమే బలిపెట్టాడు. భారతదేశంలో విలీనమైన సంస్థానాల్లో మూడు సంస్థానాలు బెట్టు చేసాయి. అది ఉత్తరంలో కాశ్మీర్, పశ్చిమంలో జునాగఢ్, దక్షిణంలో హైదరాబాద్. సర్దార్ వల్లభాయ్‌పటేల్ కృషితో జునాగఢ్, హైదరాబాద్ భారతదేశంలో విలీనం కాగా, కాశ్మీర్ మాత్రం నెహ్రూ అపరిమిత కృషివల్ల రావణకాష్టంలా కాలుతునే వుంది. అక్కడి 370 అధికరణం వల్ల రెండు చట్టాలున్నాయి. ఏ భారతీయుడైనా దేశంలోని ఏ కుగ్రామంలోనైనా భూమి కొనవచ్చు. కానీ కాశ్మీర్‌లో ఏ భారతీయ పొరునికీ భూమి కొనే హక్కు లేదు. కారణం అక్కడి నాయకత్వం ఈ 60 ఏళ్లలో పాకిస్తాన్‌ను బూచిగా చూపిస్తూ తమ ప్రత్యేకతను చాటుతున్నారు.

దేశంలోని ప్రజలందరికీ సమానమైన చట్టాలు వుండాల్సిన అవసరం వాదించేవారిని మతతత్వ వాదులుగా ముద్రవేస్తారు. చివరకు మతాన్ని విశ్వసించేది లేదనే కమ్యూనిస్టులు మైనార్టీలకు అనుకూలంగా వాదిస్తారు.

భారత రాజ్యాంగం ప్రకారం కామన్ సివిల్ కోడ్, కామన్ క్రిమినల్ కోడ్‌లున్నాయి. కానీ షరియత్‌కు అనుసరించే వారు కామన్ సివిల్‌కోడ్ ప్రకారం నడుచకోరు. ఈ దేశంలో కామన్ క్రిమినల్ కోడ్ మాత్రమే అందరికీ వర్తిస్తుంది. ‘రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య దేశంలో వేర్వేరు చట్టాలని అమలు పరచడం ఏమిటని’ విశ్లేషకుల ప్రశ్న. కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అవుతుంది. ఆ దేశంలోని రాజ్యాంగమే వారికి ఫైనల్. ఇటీవల అక్కడి ‘ప్రతిపౌరుడు-ఒకే చట్టం’ అన్న విధానం వ్యతిరేకించిన వాళ్లను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించేసరికి వెనక్కి తగ్గారు.

మరి మన దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ‘అందరం ఒక్కటే’ అన్న జాతీయ స్వభావం కలిగించలేకపోయాం. ‘మేం ప్రత్యేకం’ అన్న భావన నుండి జాతీయ జనజీవన స్రవంతిలోకి కలుపలేకపోతున్నాం. భారతదేశంలో గొప్ప ఇస్లామిక్ సిద్ధాంతాలను ప్రబోధించిన సూఫీమార్గం ప్రబోధాలు ఈరోజు కనుమరుగవుతున్నాయి. దారాషికో లాంటి అసలు సిసలైన జాతీయ ఇస్లాం వాదుల బోధనలు అనుసరించకుండా ఔరంగజేబు సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తులను కొన్ని రాజకీయపార్టీలు తయారుచేస్తున్నాయి. హజ్రత్ నిజాముద్దీన్, ఖాజా గరీబన్నవాజ్ లాంటి శాంతి కాముకులను వదిలిపెట్టి డా.జాకీర్‌నాయక్ లాంటి మతవాదులకు దిగ్విజయ్‌సింగ్ లాంటివారు వత్తాసు పలుకుతున్నారు. ఒక్కరోజూ కూడా రాజ్యసభలో నిరసన ఎదుర్కోని మాజీ ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ సాహెబ్ పదవి నుంచి దిగిపోతూ ఈ దేశ మెజార్టీ ప్రజలను అనుమానంగా మాట్లాడాడు. అందరూ సమానమే అన్న రాజ్యాంగ భావనను దుర్బలత్వ, సున్నితత్వ రాజకీయాలకు ఎరవేసి మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారం అనుభవించారు. ఈ దేశం సొత్తులో మొదటి కబళం (ముద్ద) ముస్లింలదే అని తెంపరితనంతో నాటి ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్ ప్రకటించగలిగారంటే ఆశ్చర్యపడడం తప్ప ఏమీ చేయలేం.

ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పుతో కళ్లు తెరిచి ఈ దేశ రాజకీయ నాయకులు మేధావులు, సంస్థలు ఒకేదేశం ఒకే ప్రజ అన్న రాజ్యాంగ స్పూర్తికి మద్దతిస్తే చరిత్రలో హీనులు కాకుండా మిగిలిపోతారు. లేకపోతే వెయ్యేళ్లయినా మతవాద ఓట్ల ‘పోలరింగ్’ జరుగుతునే వుంటుంది. ‘మక్కాలో మహ్మద్ ప్రవక్త కాలంలో మొదటి మసీదు నిర్మించబడింది. ఆ తర్వాత రెండవ మసీదు భారత భూభాగంలో కేరళ మలబారు ప్రాంతంలో ఓ హిందూ రాజు కృషివల్ల ఏర్పడింది. భారతీయ ముస్లింలు అక్కడకు హజ్ యాత్ర చేస్తే ఉత్తమం’ అని ప్రముఖ ఇస్లాం చారిత్రక పరిశోధక పండితుడు తారేఖ్ ఫతే చెప్పిన మాటలపై చర్చ జరగాలి. భారతీయ ఇస్లాం సోదర భావంతో హిందు సమాజం ఇతర మతాలతో కలిసి ముందడుగు వేస్తే మనదేశ అభివృద్ధి సాధ్యపడుతుంది. లేదంటే సుప్రీం కోర్టు తీర్పులను ఆదర్శంగా తీసుకుని అందరూ సమానమన్న భావన సమాజంలో నిర్మించాలి. ఏది ఏమైనా ఈ తీర్పు భారతదేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’కి ముందడుగుగానే విశే్లషకులు చెప్తున్నారు.

-డా. పి భాస్కరయోగి సెల్: 99120 70125

(ఆంధ్రభూమి సౌజన్యం తో)