వినాయకుడి నిమజ్జనాలు హుస్సేన్ సాగర్ (వినాయక్ సాగర్)లో చేయొచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి నిమజ్జనాలను నిషేదిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ కోరగా హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. వినాయకుడి నిమజ్జనాలను హుస్సేన్ సాగర్‌లో అనుమతించాలని నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టు హుస్సేన్ సాగర్ (వినాయక్ సాగర్)లో గణేష్ నిమజ్జనానికి అనుమతులు ఇవ్వడంతో భాగ్యనగరంలో సంబరాలు జరిగాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచారు. భక్తుల మనోభావాలను గౌరవించి అనుమతులు ఇచ్చిన సుప్రీం కోర్టుకు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే హుస్సేన్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వానికి చివరి సారి అవకాశం ఇస్తున్నామని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.