Home Rashtriya Swayamsevak Sangh జల ప్రళయానికి జడవని స్వయంసేవకులు…ఆపన్నుల సేవకు సర్వదా సిద్ధం

జల ప్రళయానికి జడవని స్వయంసేవకులు…ఆపన్నుల సేవకు సర్వదా సిద్ధం

0
SHARE

– విజయలక్ష్మి సింహ్

కేదార్ ఘాట్ జల ప్రళయాన్ని ఎవరూ ఇంకా మర్చిపోయి ఉండరు. జీవితాన్ని ఇచ్చే నీరు ఇలా ఉప్పెనగా మారి ప్రళయాన్ని సృష్టించింది. శవాల దుర్గంధం మధ్య, అసహాయ స్థితిలో  తీర్థ యాత్రికులు  అలకనంద ఒడ్డున మౌనంగా కన్నీరు కార్చిన దృశ్యాలను మన ఇళ్ళల్లోని టీవీలలో, ఛానళ్ల లో మనమందరం చూసాము. అయితే అక్కడే మానవత్వానికి రూపంగా నిలిచిన వారిని మనమెవరం గమనించి ఉండం.  వారే…కఠిన జల ప్రళయంలో, పై నుండి కురుస్తున్న వర్షాలకు బురదగా మారిన మురికి రోడ్ల మీద, ప్రాణాంతక మైన పరిస్థితులలో యాత్రీకులను అక్కున చేర్చుకుని  పగలూ రాత్రీ సేవా కార్యంలో నిమగ్నమైన స్వయం సేవక్ లు.  కేదార్ నాథ్ లో మొదటి హెలిపాడ్ ను నిర్మించటం దగ్గర నుండి, ఈ ఆపదలో అనాధలుగా మారిన చిన్న పిల్లల చదువు ఏర్పాట్ల వరకూ ఇంకా ఈనాటికీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవ చేస్తూనే ఉంది. 

మనలో ఎవరు యోగేంద్ర, బ్రజ్ మోహన్ బిస్త్ ల పేర్లు విని ఉండరు. ఈ ఇద్దరు స్వయంసేవకులు వాయు సేన,  సైనిక దళాలు రాకముందే ప్రైవేట్ హెలికాప్టర్లలో కేదార్ నాధ్ చేరుకొని యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రారంభించారు.  2013 సంవత్సరం జూన్ 16, 17 లలో కురిసిన భారీ  వర్షం మొత్తం  లోయని  అస్తవ్యస్తం చేసింది.  సహాయ హెలికాప్టర్ దిగడానికి తగిన హెలిపాడ్ కూడా లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ  ఇద్దరు యువకులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా, పారాచూట్ సహాయంతో దిగి మొట్టమొదటి  హెలిపాడ్ ను నిర్మించారు. ఆ తర్వాత రాయ్ బాడ, కేదార్ నాథ్ మందిర్ వెనకాల ఉన్న అడవుల దగ్గర కూడా సైన్యం సహకారంతో హెలిపాడ్ కు  నిర్మించారు.  వెనువెంటనే గౌరీకుండ్, ఘోడ పహాడ్, రామ్ బాడా,  ప్రాంతాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించడం ప్రారంభించారు.  అక్కడక్కడ వీళ్ళు దాదాపు 50 అడుగుల ఎత్తు నుండి తాడు సహాయంతో క్రిందకి దిగి యాత్రికులను బయటకు లాగవలసి వచ్చింది. అంటే యోగేంద్ర, బ్రిజ్ మోహన్ లు ఇద్దరూ  ఎంతో శిక్షణ పొందిన సైనికులు  చేయగలిగే అన్ని పనులను చేశారన్నమాట.  యాత్రికులను రక్షించటం అనే ప్రధాన ఉద్దేశంతో ఎంతో సాహసం చేశారు. 

పినకిల్ ఏవియేషన్ కంపెనీ ఉద్యోగులు, వారి కంపెనీ వారు కష్టమని వారించినా వినకుండా ఈ ఇద్దరు స్వయం సేవకులు  ప్రజలను రక్షించడం కోసం చేసిన ప్రయత్నాలకు తోడుగా నిలిచారు.  ఈ విషయంలో వాళ్ళు తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి పనిచేశారు.

ఇక గణేష్ ఆగొడాది మరొక అద్భుతమైన గాధ. ఇతను ఒక గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తిని రక్షించడం కోసం తన భుజాల మీద కూర్చోపెట్టుకుని మేజాగవ్ నుండి మనేరీ వరకు ఆరు కిలోమీటర్ల దూరం కాలినడకన వచ్చాడు. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఈ కేదార్ నాథ్ లోయలో చూసినవారంతా ఇప్పటికీ చెప్పుకుంటారు.  

ఈ ఆపద సమయంలో ఎంతో మంది యాత్రికులకు అండగా స్వయం సేవకులు  నిలిచారు. వీరు మనేరి సేవా ఆశ్రమం, చంబా లోయ లోని దిఖేల్  గ్రామం  ఊహి మఠ్ దగ్గరలో ఉన్న  బడాడ్ వరకు 68 గ్రామాలలో పునరావాస ఏర్పాట్లు చేసి, భోజనంతోపాటు బట్టలు ఇతర నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. కేవలం  మనెరీ లోనే  పదివేల మంది యాత్రీకులు భోజనాలు చేశారు. దిఖోల్ అనే గ్రామంలో  20 వేల మంది వ్యక్తులకు సహాయ సామాగ్రి పంపిణీ జరిగింది. చమేలి లోని సరస్వతి శిశు మందిర్ లోనూ, మనెరిలోని      సేవాశ్రంలోనూ  చాలా రోజులపాటు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగాయి. యాత్రికులతోపాటు సైన్యంలోని    జవాన్ లు కూడా ఇక్కడ భోజనాలు చేశారు. 

వరద బీభత్సం తగ్గుముఖం పట్టగానే మిగతా సహాయక సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఆపేసాయి.  ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు కూడా మందగించాయి.  కానీ ‘ఉత్తరాఖండ్ దైవీయ ఆపదా సమితి  ‘ ద్వారా సంఘం నిర్వహించిన సేవా కార్యక్రమాలు అన్నీ నిరంతరం కొనసాగాయి. 

గౌరీకుండ్, రామ్ బాడా,  సోనార్ చట్టీ  సోన్ ప్రయాగలతో సహా మొత్తం కేదార్ ఘాట్ లో వినాశనం నెలకొంది.  స్థానిక ప్రజలు తమ ఇళ్ళు వాకిళ్ళుతో పాటు ఉపాధిని కోల్పోయారు.  జీవించడానికి ఏవిధమైన ఆసరా మిగలలేదు.  అప్పుడే సమితి అప్పుడు మొదలుపెట్టిన పునరావాస కార్యక్రమాలను ఇంకా చేస్తూనే ఉంది.  సమితి సంఘటన కార్యదర్శి రాజేష్ ఆ కార్యక్రమాల వివరాలు తెలిపారు.  జలప్రళయం లో అనాధలైన 6 నుండి 12 సంవత్సరాలు వయస్సు గల 200 మంది పిల్లల కోసం నేత్ వాడా, లక్షేశ్వర్,  కోటి కాలనీ, గుప్త కాశీలో 4 హాస్టళ్లను నడిపిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలలో విద్యుత్తు సరఫరా పునరుద్ధరించబడ లేదు. ఈ  గ్రామాల వారికి సోలార్ లాంప్ లు అందించారు. ఈ గ్రామాలలోని 100 మంది పిల్లలకు వారి వారి చదువులు కొనసాగించడానికి వీలుగా నెలకి వెయ్యి రూపాయల చొప్పున స్కాలర్ షిప్ కూడా ఇస్తున్నారు.  ఇంకా ఎనిమిది గ్రామాలలో వైద్య శాలలు కూడా నిర్వహించబడుతున్నాయి.  పూర్తిగా నాశనం అయిపోయిన గ్రామాలలోని వితంతువులు, నిరుద్యోగ యువత కోసం కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు కూడా నిర్వహిస్తున్నారు.  ఇంతేకాక పిల్లల చదువుల కోసం ప్రాథమిక స్థాయిలో 4 శిశు మందిరాలు, 48 బాల సంస్కార కేంద్రాలు కూడా ఇక్కడ లోయలో నడుపుతున్నారు.  నారాయణ కోటి లో 30 పడకల హాస్పిటల్ కూడా తయారైంది.  విపత్తులో  నష్టపోయిన కుటుంబాలకు దాదాపు ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. కొంతకాలానికే అందరూ ఆ భయంకర జల ప్రళయాన్ని మరిచిపోయారు.  కానీ సమితి ద్వారా స్వయం సేవకులు ఇప్పటికీ పునరావాస పనులలో నిమగ్నమయ్యే ఉన్నారు.